సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో జరిగిన సమగ్ర ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 03 OCT 2020 7:32PM by PIB Hyderabad

కోవిడ్ మహమ్మారి ప్రపంచ వైద్య సిబ్బంది దృష్టి సమగ్ర ఆరోగ్య సంరక్షణపై కేంద్రీకరించేలా చేసిందని, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు విభిన్న వైద్య విధానాల్లోని  బలాన్ని గరిష్ఠంగా ఉపయోగించుకోవడంపై శ్రద్ధ తీసుకుంటున్నారని న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ సమగ్ర ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రపంచంలోని భిన్న దేశాలకు చెందిన నిపుణులు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వెబినార్ లో మాట్లాడిన వారిలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఎలీసా ఎపెల్, హార్వర్డ్ కు చెందిన డాక్టర్ పీటల్ వేన్, లాటిన్ అమెరికాకు చెందిన డాక్టర్ సుసన్ బాయర్ వూ, హార్డర్డ్ కు చెందిన ప్రొఫెసర్ విక్రమ్ పటేల్, ఇతరులు ఉన్నారు.

ఇంతవరకు ఇతర వైద్యవిధానాల మీద అనుమానాలు వ్యక్తం చేసే అల్లోపతి వైద్య వృత్తి నిపుణులు కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఆయుర్వేద, హోమియో వైద్య విధానాల్లోని రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రతీ ఒక్క ప్రతికూలతకు ఏదో ఒక స్వభావం ఉంటుందన్న కోణం తీసుకుంటే ఈ మహమ్మారి అన్ని వైద్య విధానాలను ఒక చోటకి చేర్చి అన్నింటి సహాయంతో గరిష్ఠ ప్రయోజనం పొందే ఒక కేంద్రీయ స్థానం వైద్య నిపుణులు కనుగొనేలా చేసిందని ఆయన చెప్పారు. 

వాస్తవానికి కోవిడ్ యుగం కన్నా ముందే యోగాసనాలు, ప్రకృతి వైద్యంలో ఉన్న జీవనశైలి మార్పులు ఆచరించినట్టయితే మధుమేహ రోగులు నిత్యం తీసుకునే ఇన్సులిన్ శాతం, నోటి ద్వారా తీసుకునే ఔషధాలు తగ్గించవచ్చునని ఆధారాలతో సహా నిరూపణ అయిందని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ కొన్ని వర్గాల్లో కొన్ని రకాలైన అనుమానాలున్నాయని, కోవిడ్ సవాలు ఆ అనుమానాలను కూడా పటాపంచలు చేసిందని మంత్రి అన్నారు.

20వ శతాబ్ది ప్రథమార్ధంలో భారతదేశంలో అంటువ్యాధులు అధికంగా ఉండేవని, వైద్యేతర ఆచరణల్లో పరిశుభ్రత ఆ రోజుల్లో ప్రిస్క్రిప్షన్ లో భాగంగా ఉండేదని డాక్టర్ జితేంద్రసింగ్ తెలిపారు. తదుపరి దశలో దాన్ని ఎవరైనా మర్చిపోయి ఉంటే సామాజిక దూరంతో, చేతులు తరచు కడుక్కోవడంతో కలిపి ఆ ఆచరణను కోవిడ్ పునరుద్ధరించిందని, ప్రపంచం యావత్తు ప్రస్తుతం దాన్ని ఆచరిస్తున్నదని ఆయన అన్నారు. 

శ్రీ నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారతీయ వైద్య విధానాల విలువలకు అమిత ప్రాచుర్యం కల్పించారన్న విషయం డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. శ్రీ మోదీయే అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రతిపాదించి ఏకగ్రీవ ఆమోదం సాధించారని, ఈ రోజున ప్రపంచంలోని ప్రతీ ఒక్క ఇల్లు యోగా ఆచరిస్తున్నదని ఆయన అన్నారు. 

భారతీయ వైద్య విధానాల ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది కూడా శ్రీ మోదీయేనని ఆయన చెప్పారు.

***
 



(Release ID: 1661540) Visitor Counter : 147