ప్రధాన మంత్రి కార్యాలయం

వస్త్ర సంప్రదాయాలపై ఐసిసిఆర్ నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్ లో ప్రధాన మంత్రి ప్రసంగం

ఆలోచనలు, ఉత్తమ విధానాల మార్పిడికి

ఈ వెబినార్ కొత్త బాటలు వేస్తుంది:
ప్రధాన మంత్రి

Posted On: 03 OCT 2020 6:59PM by PIB Hyderabad

వస్త్ర సంప్రదాయాలమీద ఈరోజు ఐసిసిఆర్  నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్ నుద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

“నేత సంబంధాలు: వస్త్ర ప్రదాయాలు”  అనే అంశం మీద వివిధ దేశాల వారు పాల్గొనేలా కృషి చేసి ఈ అంతర్జాతీయ వెబినార్ నిర్వహించిన భారత సాంస్కృతిక సంబంధాల మండలిని, ఉత్తరప్రదేశ్  ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ను ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు.  జౌళి రంగంలోమన చరిత్ర, వైవిధ్యం, అద్భుతమైన అవకాశాలు చూదవచ్చునన్నారు.

భారత వస్త్రరంగం సంపాదించుకున్న ఘనమైన గత చరిత్ర గురించి ప్రధాని మాట్లాడారు. సహజసిద్ధమైన వర్ణాలతో  ఉండే మన నూలు, పట్టు బట్టలకున్న సుదీర్ఘమైన ఘన చరిత్రను ఆయన గుర్తు చేశారు. మన వస్త్రాలలో వైవిధ్యాన్ని, సుసంపన్నతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి సమాజంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ అక్కడి ప్రజల దుస్తులకొక ప్రత్యేక సంప్రదాయం ఉంటుందన్నారు. అదే విధంగా గిరిజన సమూహాలలో ఉండే సుసంపన్నమైన దుస్తుల సంప్రదాయాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశపు వస్త్ర సంప్రదాయాలన్నిటిలోనూ వర్ణాలు, ఉత్తేజకరమైన చురుకుదనం, సూక్ష్మమైన నైపుణ్యం కలిసి ఉంటాయన్నారు.

జౌళి రంగం ఎప్పుడూ అనేక అవకాశాలను తెచ్చిపెడుతూనే ఉంటుందన్నారు. భారతదేశంలోపల స్థానికంగా పెద్ద ఎత్తున  ఉపాధి కల్పించే రంగంగా జౌళి రంగానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు.  అంతర్జాతీయంగా వర్తకాన్ని, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయటంలో భారత వస్త్ర పరిశ్రమకు ప్రత్యేకత ఉందన్నారు. అంతర్జాతీయంగా భారతీయ వస్త్రాలకు ఎంతో గొప్ప విలువ ఉందని ఇతర సంస్కృతులలోని నైపుణ్యాలను, ఆచారాలను, హస్తకళలను కూడా భారత్ ఇనుమడింపజేసుకున్నదని ప్రధాని అన్నారు.

గాంధీజీ 150వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటైందన్నారు. వస్త్ర రంగానికి, సామాజిక సాధికారతకు మధ్య బలమైన, సన్నిహితమైన సంబంధం ఉందని మహాత్మా గాంధీ గుర్తించారని ప్రధాని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన చరఖాను భారత స్వాతంత్ర్యోద్యమానికి చిహ్నంగా మార్చగలిగారన్నారు. ఆ చరఖా మనందరినీ ఒక జాతిగా నేత నేసిందని అభివర్ణించారు.

ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధ భారత్ నిర్మాణానికి జౌళి రంగం కీలకంగా మారుతుందని ప్రధాని ఆకాంక్షించారు. పట్టు పరిశ్రమలో ఆధునికత, ఆర్థిక సాయం ద్వారా ఈ రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమీకృతం చేయటం మీద ప్రభుత్వం దృష్టిసారిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తుల తయారీ దిశలో మన చేనేత కార్మికులకు సహాయపడేలా మనం అంతర్జాతీయ ఆచరణావిధానాలను, మన అత్యుత్తమ విధానాలను కలబోయటం అలవరచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆలోచనల పరస్పర మార్పిడి. ఉత్తమ విధానాలను పంచుకోవటం ద్వారా సరికొత్త సహకారానికి బాటలు వేసుకోవాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా వస్త్ర రంగంలో ఎక్కువమంది మహిళలు ఉన్నారని ప్రధాని గుర్తు చేశారు. అందుకే ఈ రంగం చురుగ్గా ఉండేకొద్దీ అది మహిళల సాధికరతకు సాయపడుతుందన్నారు. సవాళ్లతో కూడిన ఈ సంక్షోభ సమయానికి తగినట్టు మనం సిద్ధం కావాలన్నారు. మన వస్త్ర సంప్రదాయాలు వైవిధ్యం, అనుసరణీయత, స్వయం సమృద్ధం, నైపుణ్యం, నవకల్పనలు లాంటి శక్తిమంతమైన సూత్రాలను ఇముడ్చుకున్నాయని, ఇవన్నీ ఇప్పుడు మరింత సమకాలీనతను పొందాయని చెప్పారు. ఆలోచనలు పంచుకోవటం ద్వారా వస్త్ర రంగం మరింత చురుగ్గా దూసుకుపోవటానికి ఈ వెబినార్ ఉపయోగపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. 

***



(Release ID: 1661484) Visitor Counter : 195