ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సండే సంవాద్-4 సంద‌ర్భంగా సామాజిక మాధ్య‌మాలను ఉప‌యోగిస్తున్న వారితో మాట్లాడిన డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

“ 400-500 మిలియ‌న్ కోవిడ్ -19 వాక్సిన్‌డోస్‌ల‌ను అందుకుని , ఉప‌యోగించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్ధంచేస్తోంది”

“2021 జూలై నాటికి 20-25 కోట్ల మందికి వాక్సిన్ వేయించాల‌న్న‌ది ల‌క్ష్యం”

“ప్రాధాన్య‌త‌నివ్వ‌వ‌ల‌సిన గ్రూప్‌ల‌కుసంబంధించిన వివ‌రాలను అక్టోబ‌ర్ నెలాఖ‌రుకు పంపాల్సిందిగా రాష్ట్రాల‌కు సూచించ‌డం జ‌రిగింది”

“కోవిడ్ -19 ఇమ్యునైజేష‌న్ విష‌యంలో ఫ్రంట్‌లైన్ ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్యత‌”

“ వాక్సిన్ సేక‌ర‌ణ కేంద్రీకృత ప‌ద్ధ‌తిలో జ‌ర‌గుతుంది. ప్ర‌తి క‌న్‌సైన్‌మెంట్‌ను రియ‌ల్‌టైమ్ ప‌ద్ధ‌తిలో ట్రాక్ చేయ‌డం జ‌రుగుతుంది”

“ భార‌తీయ వాక్సిన్ త‌యారీదారుల‌కు ప్ర‌భుత్వం నుంచి పూర్తి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం జ‌రుగుతుంది”

“ కోవిడ్ -19 కు సంబంధించి హ్యూమ‌న్‌ఛాలెంజ్ ట్ర‌య‌ల్స్‌లోకి అడుగుపెట్టే విష‌యం ఇండియా ఆలోచించ‌డం లేదు”

“ వాక్సిన్‌ను అంద‌రికీ అందుబాటులో ఉంచేందుకు ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లూ తీసుకునేందుకు క‌ట్టుబ‌డి ఉంది”

Posted On: 04 OCT 2020 2:26PM by PIB Hyderabad

సండే సంవాద్ ‌నాలుగ‌వ ఎపిసోడ్ సంద‌ర్భంగా సామాజిక మాధ్య‌మాల‌ను వాడుతున్న వారు వేసిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ స‌మాధాన‌మిచ్చారు. ఈ ఎపిసోడ్‌లో ప్ర‌శ్న‌లు వేయాల‌నుకున్న‌ వారి మ‌న‌సులో ప్ర‌ధానంగా కోవిడ్ వాక్సిన్‌కు సంబంధించిన అంశ‌మే ప్ర‌ముఖంగా ఉన్న‌ట్టు కనిపిస్తోంది. వారి ప్ర‌శ్న‌ల‌న్నింటికీ మంత్రి ఓపికగా స‌మాధాన‌మిచ్చారు. అలాగే కోవిడ్ చికిత్స‌లో ప్లాస్మా థెర‌పీ ఉప‌యోగం,కోవిడ్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో 2025 నాటికి టిబి నిర్మూల‌న‌, దేశంలో పాఠ‌శాల‌ల పునఃప్రారంభం వంటి అంశాల‌పై ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు.
  వాక్సిన్ పంపిణీ ప్రాధాన్య‌త‌ల‌పై అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూ,డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ ప్ర‌స్తుతం ఒక ఫార్మెట్‌ను రూపొందిస్తున్న‌ద‌ని, దీని ప్ర‌కారం వాక్సిన్ అందుకునేందుకు  ప్రాధాన్య‌త గ‌ల జ‌నాభా గ్రూపుల గురించి రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు జాబితాను స‌మ‌ర్పిస్తాయ‌ని అన్నారు. ప్ర‌త్యేకించి కోవిడ్ 19 ని అదుపుచేయ‌డంలో ప‌నిచేస్తున్న ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌లు వంటి వారికి సంబంధించి ప్రాధాన్య‌తా జాబితా రూపుదిద్దు కుంటుందని అ‌న్నారు. ఫ్రంట్‌లైన్ హెల్త్ వ‌ర్క‌ర్ల జాబితాలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు వైద్యులు, న‌ర్సులు, పారామెడిక‌ల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, ఆశా వ‌ర్క‌ర్లు, స‌ర్వైలెన్స్ అధికారులు, ఇంకా కోవిడ్ పేషెంట్ల గుర్తింపు, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, చికిత్స ప్ర‌క్రియ‌లో ప‌నిచేస్తున్న వివిధ వ‌ర్గాల వారు ఉంటారు. ఇందుకు  సంబంధించిన ప్ర‌క్రియ‌ను అక్టోబ‌ర్ చివ‌రి నాటికి పూర్తి చేస్తారు. కోల్డ్‌చైన్ స‌దుపాయాలు, బ్లాక్ స్థాయివ‌ర‌కు వాక్సిన్ ను తీసుకువెళ్లేందుకు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల విష‌యంలో కేంద్రం రాష్ట్రాల‌కు త‌గిన విధంగా మార్గ‌నిర్దేశం చేస్తోంద‌‌ని మంత్రి చెప్పారు.

2021 జూలై నాటికి సుమారు  20 నుంచి 25 కోట్ల‌మందికి  400-500 మిలియ‌న్ డోసుల వాక్సిన్‌ను ఉ ప‌యోగించేందుకు అవ‌స‌ర‌మైన మాన‌వ‌వన‌రుల నిర్మాణం, శిక్ష‌ణ‌, ప‌ర్య‌వేక్ష‌ణ కుకేంద్ర ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించే క్ర‌మంలో ప్ర‌జ‌ల రోగ‌నిరోధ‌క శ‌క్తికి సంబంధించిన స‌మాచారాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.
నీతి ఆయోగ్ స‌భ్యుడు (హెల్త్‌) శ్రీ వి.కె. పౌల్ అధ్య‌క్ష‌త‌న గ‌ల ఉన్న‌త‌స్థాయి క‌మిటీ ఈ మొత్తం ప్ర‌క్రియ‌ను రూపొందిస్తున్న‌ద‌ని మంత్రి తెలిపారు. వాక్సిన్‌సేక‌ర‌ణ అనేది కేంద్రీకృతంగా జ‌రుగుతుంద‌ని, ప్ర‌తి క‌న్‌సైన్‌మెంట్‌ను గుర్తించి అది అత్య‌వ‌స‌ర‌మైన వారికి చేరేంత‌వ‌ర‌కు రియ‌ల్ టైమ్ ట్రాకింగ్ ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. ఈ క‌మిటీలు దేశంలో వివిధ వాక్సిన్‌ల అందుబాటు కాలాల గురించి తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని అన్నారు.  వాక్సిన్ త‌యారీదారుల నుంచి గ‌రిష్ఠ మొత్తంలో వాక్సిన్ డోసులు పొందేందుకు హామీ తీసుకోవ‌డం, స‌ర‌ఫ‌రా చెయిన్ మేనేజ్‌మెంట్‌, హై రిస్కు గ్రూపుల‌కు ప్రాధాన్య‌త వంటి అంశాల‌పై ఈ క‌మిటీ ప‌నిచేస్తున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. ఈ ప‌ని సాగుతున్న‌ద‌ని , వాక్సిన్ వ‌చ్చేనాటికి ఇమ్యునైజేష‌న్ కార్య‌క్ర‌మం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనసాగేలా చూసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి తెలిపారు.
  పంజాబ్‌లో కొంద‌రు పుకార్లు వ్యాపించే వారు త‌ప్పుడు ప్ర‌చారాల‌కు పాల్ప‌డుతున్నార‌ని అంటూ దానికి సంబంధించిన అపోహ‌ల‌ను మంత్రి తొల‌గించారు. కోవిడ్ మ‌హ‌మ్మారి, అనేది , ఆరోగ్య‌వంతులైన వ్య‌క్తుల‌లో ఆర్గాన్ హార్వెస్టింగ్‌కు వీలు క‌ల్పించ‌డానికి జరుగుతున్న కుట్ర‌గా కొంద‌రు ప్ర‌చారం చేస్తుండ‌డాన్ని మంత్రి త‌ప్పుప‌ట్టారు. అలాంటి ప్ర‌చారాల‌ను కొట్టిపారేశారు.

ప్రపంచ బ్యాంకు- ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ , ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి ఇటీవల  15,000 కోట్ల రూపాయల వరకు రుణం తీసుకున్న దృష్ట్యా, COVID-19 అత్యవసర ప్రతిస్పందనను అమలు చేయడానికి ఫైనాన్సింగ్ ఏజెన్సీల‌తో ఆర్థిక ప‌ర‌మైన లావాదేవీలు ఏవీ ప్ర‌భుత్వానికి లేవ‌ని ఆయ‌న అన్నారు.
మ‌రో వ్య‌క్తి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ మంత్రి, వాక్సిన్ బ్లాక్‌మార్కెట్‌కు వెళ్లే ప‌రిస్థ‌తి ఉండ‌ద‌ని అన్నారు. వాక్సిన్‌ను ముందుగా నిర్ణ‌యించిన ప్రాధాన్య‌తా క్ర‌మం ప్ర‌కారం , ప్ర‌ణాళికా బ‌ద్దంగా చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు.ఈ విష‌యంలో పార‌దర్శ‌క‌త‌, జ‌వాబుదారిత్వం ఉండ‌డానికి ఇందుకు సంబంధించిన వివ‌రాల‌న్నింటినీ  రాగ‌ల నెల‌ల్లో వెల్ల‌డించ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌లు, పెద్ద‌లు, ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌నివ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు.
 ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కే స‌మాధాన‌మిస్తూ మంత్రి, ఒక‌వాక్సిన్ మ‌రో దానికంటే మెరుగైన‌ద‌ని వ్యాఖ్యానించ‌డం సాధ్యంకాద‌ని ఆయ‌న అన్నారు.  మ‌న‌కు ర‌క‌ర‌కాల వాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చినా అన్నివాక్సిన్లూ సుర‌క్షిత‌మైన‌విగా ఉండ‌నున్నాయ‌ని , కోవిడ్ వైర‌స్‌కువ్య‌తిరేకంగా  రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించేవిగా ఉంటాయ‌ని చెప్పారు.  అన్ని వాక్సిన్లూ క్లినిక‌ల్ ప‌రీక్ష‌ల‌లో సుర‌క్షిత‌మైన‌విగా తేలాల‌ని , దేశం వెలుప‌ల కూడా వాటి సుర‌క్షిత‌త్వంపై అనుసంధాన‌త ప‌రీక్ష‌లు జ‌రుపుకోవాల‌ని అయితేఇవ‌న్నీ త‌క్కువ శాంపిల్ సైజులో త్వ‌ర‌గా పూర్తి అవుతాయ‌ని ఆయ‌న తెలిపారు.

వివిధ క్లినిక‌ల్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి స‌మాన‌ అవ‌కాశాల గురించి అడిగిన‌ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ మంత్రి, అన్ని ప్ర‌తిపాదిత క్లినిక‌ల్‌ప‌రీక్ష‌లూ,నిర్దేశిత సూత్రాల‌ను ఉప‌యోగించుకుని రూపొందించిన‌వ‌ని,డ్ర‌గ్‌కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సంబంధింత అంశంపై నిపుణుల క‌మిటీ క‌ఠిన స‌మీక్ష  నిర్వ‌హిస్తుంద‌ని అన్నారు. దేశంలో కోవిడ్ 19 వాక్సిన్ లైసెన్సు పొంద‌డానికి అవ‌స‌ర‌మైన రెగ్యులేట‌రీ అంశాల‌కు సంబంధించి ముసాయిదా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను డిసిజిఐ ఇటీవ‌ల రూపొందించింద‌ని ఆయ‌న అన్నారు. ర‌ష్యాకుచెందిన స్పుత్నిక్‌-5 వాక్సిన్ విష‌యంలో 3 వ ద‌శ క్లినిక‌ల్‌ప‌రీక్ష‌ల‌పై అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ మంత్రి,ఈ అంశం ఇంకా ప‌రిశీల‌న‌లో ఉంద‌ని, 3 వ ద‌శ ప‌రీక్ష‌ల‌పై ఇంకా ఒక నిర్ణ‌యం తీసుకోలేద‌ని అన్నారు.
 
వాక్సిన్ వేయించుకున్న అనంత‌రం అక్క‌డ‌క్క‌డా కొన్ని  రియాక్ష‌న్‌లు  సాధార‌ణ‌మ‌ని, అంటూ డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ఇంజ‌క్ష‌న్ వేయించుకున్న ప్రాంతంలో నొప్పి వంటి రియాక్ష‌న్ రావ‌డం, స్వ‌ల్పంగా జ్వ‌రం ,ఎర్ర‌బార‌డం, ఆందోళ‌న‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు త‌దితరాలు ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని అయితే ఇవి వాక్సిన్‌ర‌క్ష‌ణాత్మ‌క స్పంద‌న‌పై ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేవ‌ని అన్నారు. ఇలాంటిదే మ‌రోప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ మంత్రి,హ్యూమ‌న్ ఛాలెంజ్ ఎక్స్‌పిర‌మెంట్స్‌కు సంబంధించిన నైతిక‌ప‌ర‌మైన అంశాల‌గురించి వివ‌రించారు. ఈ ప‌ద్ధ‌తి అంత‌ర్జాతీయ అనుభ‌వం ప్ర‌కారం ప్ర‌యోజ‌న క‌ర‌మని తేలేవ‌ర‌కు ఇలాంటి ప్ర‌యోగాల‌లోకి ఇండియా అడుగుపెట్ట‌ద‌ని ఆయ‌న అన్నారు. ఇందుకు బ‌దులుగా ఇండియాలో ఎన్నో అద్భుత ప్ర‌క్రియ‌లు వాక్సిన్ క్లినిక‌ల్‌ప‌రీక్ష‌లు సుర‌క్షితంగా , స‌మ‌ర్ధంగా ఉండేందుకు  ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఒక వేళ హ్యూమ‌న్ ఛాలెంజ్ అధ్య‌య‌నాలు చేప‌ట్టాల్సి వ‌స్తే అందుకు ఎంతో ముందు చూపు, జాగ్ర‌త్త అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు .ఇందుకు సంబంధించి వ‌చ్చే స‌మాచారం , మ‌నుషుల‌కు గ‌ల రిస్కును సైతం స‌మ‌ర్ధించేదిగా  ఉండాల‌ని ఆయ‌న అన్నారు.
సింగిల్ డోస్‌, డ‌బుల్ డోస్ వాక్సిన్ విష‌యంలో త‌న అభిప్రాయం వ్య‌క్తం చేస్తూ , కోవిడ్ మ‌హ‌మ్మారి త‌క్ష‌ణం అదుపులోకి రావ‌లంటే సింగిల్ డోస్ వాక్సిన్ ఉంటేనే మేల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే సింగిల్ డోస్‌తో అనుకున్న ఫ‌లితాలు సాధించ‌డం ఒక్కోసారి సాధ్యం కాక‌పోవ‌చ్చ‌ని అన్నారు. రెండు డోస్‌ల వాక్సిన్ అనుకున్న ఫ‌లితాలు సాధించ‌డానికి ఉప‌క‌రించ‌వ‌చ్చ‌ని అన్నారు.తొలిడోస్ కొంత ఇమ్యూన్‌ప్రొటెక్ష‌న్ ఇస్తుంద‌ని రెండో డోస్‌దానిని మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌ని అన్నారు.

పాఠ‌శాల‌లు తిరిగి తెర‌వ‌డం గురించి ప్ర‌స్తావిస్తూ, ఆయ‌న కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ ఈ విష‌యంలో జారీచేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌స్తావించారు. విద్యార్థులు పాఠ‌శాల‌ల‌కు హాజ‌రుకావ‌చ్చ‌ని అయితే,త‌ల్లిదండ్రుల లిఖిత‌పూర్వ‌క అనుమ‌తితోనే వారు హాజ‌రుకావాల‌న్నారు. హాజ‌రు విష‌యంలో ఒత్తిడి చేయ‌బోర‌ని అన్నారు. పునఃప్రారంభించ‌డానికి అనుమ‌తి పొందిన పాఠ‌శాల‌లు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ఎస్‌.ఒ.పిని పాటించాల‌ని అన్నారు.
 సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు స‌హాయంచేసేందుకు ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల గురించి మంత్రి వివ‌రించారు. క‌రోనా బారిన‌ప‌డిన వ‌యోధికుల‌కు ప్రాధాన్య‌తా ప్రాతిప‌దిక‌న చికిత్స అందించాల్సిందిగా అన్ని ప్ర‌భుత్వం, ప్ర‌భుత్వేత‌ర ఆస్ప‌త్రుల‌కు ఖ‌చ్చిత‌మైన ఆదేశాలు జారీచేయ‌డం జ‌రిగింద‌ని డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చెప్పారు.  వ‌యోధికుల స‌మ‌స్య‌ల‌ను శ్ర‌ద్ధ‌గా విని వారికి వెంట‌నే త‌గిన స‌ల‌హా ఇవ్వాల్సిందిగా ప్ర‌భుత్వ కాల్‌సెంట‌ర్ల‌ను ఆదేశించ‌డం జ‌రిగింద‌న్నారు. ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ సీనియ‌ర్‌సిటిజ‌న్ల‌కు సంబంధించి ప్ర‌త్యేక మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీచేసింది. వారుచేయ‌వ‌ల‌సిన‌వి,చేయ‌కూడ‌నివి అందులో వివ‌రించ‌డం జ‌రిగింది. అన్ని వృద్ధాశ్ర‌మాల వారినీ ,వ‌యోధికుల‌ను క‌రోనానుంచి కాపాడేందుకు తీసుకోవ‌ల‌సిన అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకోవ‌ల‌సిందిగా ఆదేశించ‌డం జ‌రిగింది. దీనికి ఒక నోడ‌ల్ అధికారిని నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు. 60 సంవ‌త్స‌రాలు పైబ‌డిని సిజిహెచ్ఎస్ ల‌బ్ధిదారుల‌కు వారి ఇంటివ‌ద్ద‌కే వెళ్లి మందులు అందించే ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

టిబి నిర్మూల‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కూ సాధించిన ప్ర‌యోజ‌నాల‌ను , కోవిడ్ ప‌రిస్థితుల నేప‌ధ్యంలో ప‌‌రిర‌క్షించేందుకు తీసుకున్న చ‌ర్య‌ల‌ను డాక్ట‌ర్‌హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ వివ‌రించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన కేంద్ర టిబి డివిజ‌న్‌కు ముంద‌స్తుగా ఆదేశాలు ఇవ్వ‌డం జ‌రిగింద‌ని,  కోవిడ్ స‌మ‌యంలో కూడా టిబి సేవ‌లు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రాలు, జిల్లాల‌లో ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించ‌డం జ‌రిగింద‌న్నారు.  కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో టిబి నిర్ధార‌ణ ప‌రీక్షా కేంద్రాల‌ను తెర‌చి ఉంచాల్సిందిగా  ఆదేశించామ‌న్నారు.  మందుల ను మ‌రింత ఎక్కువ కాలానికి ఇవ్వ‌డం, ఇంటివ‌ద్ద‌కే మందులు చేర‌వేయ‌డం, టిబి పేషెంట్ల విష‌యంలో తీసుకోవ‌ల‌సిన మ‌రిన్న జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌పైనా మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌న్నారు. టిబిని నియంత్రించే స‌దుపాయాలను గ‌రిష్ఠ సామ‌ర్ధ్యంతో వినియోగించుకునేందుకు,సంస్థాగ‌త స్క్రీనింగ్‌కు, టిబి కి సంబంధించి ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం తీసుకు రావ‌డం వంటి విష‌యాల‌పై మ‌రింత దృష్టిపెట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. పేద‌రికం, పౌష్టికాహార లోపం, స‌రైన నివాస స‌దుపాయాలు లేక‌పోవ‌డం, ప‌రిస‌రాల‌ప‌రిశుభ్ర‌తా స‌మ‌స్య‌లు,ఆరోగ్య‌ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో త‌గిన శ్ర‌ద్ధ లేకపోవ‌డం వంటి ఎన్ని సామాజిక అడ్డంకులు ఉన్న‌ప్ప‌టికీ 2025 నాటికి టిబిని నిర్మూలిస్తామ‌ని డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు.
 పండుగ‌ల సీజ‌న్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ మంత్రి, ప్ర‌ధాన‌మంత్రి మాట‌ల‌ను ప్ర‌స్తావించారు, జాన్ హై తో జ‌హాన్ హై. మ‌నం ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం మ‌న పండుగ‌ల‌ను ఆనందంగా జ‌రుపుకో గ‌లుగుతాం అని ఆయ‌న అన్నారు. రానున్న పండుగ‌ల సీజ‌న్‌లో పూజా మండ‌పాల ఏర్పాటువిష‌యంలో రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాయ‌న్నారు.  మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌కు సంబంధించి సూచ‌న‌లు జారీచేసింద‌ని, గ‌ర్బా, దాండియా మ‌హోత్స‌వం వంటివి ఉండ‌రాద‌ని సూచించింద‌ని తెలిపారు. గుజ‌రాత్ కూడా గర్బా , దాండియా మ‌హోత్స‌వ్‌ను ఈ ఏడాది అనుమ‌తించ‌డం లేద‌ని తెలిపారు.

కోవిడ్‌కు సంబంధించి కొంద‌రు త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించ‌క పోవ‌డానికి కార‌ణం , నిర్ల‌క్ష్యం క‌న్నా నిరంత‌రం జాగ్ర‌త్త‌లు తీసుకుని అల‌సి పోవ‌డ‌మే కార‌ణం కావ‌చ్చ‌ని అన్నారు. “నిరంత‌రం జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ప్ర‌జ‌లు ఒక‌ద‌శ‌లో అల‌సిపోయేఅవ‌కాశం ఉంది. ఇలాంటి వారిలో కొంద‌రు ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మానేస్తారు. ఈవిష‌యంలో నేను ప్ర‌తి ఒక్క‌రికీ చెప్పేది ఒక్క‌టే, మ‌నమంద‌రం ఎంతో శ్ర‌ద్ధ‌తో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లుతీసుకోవాలి” అని ఆయ‌న అన్నారు. పండ‌గ సీజ‌న్‌లో కోవిడ్ నియంత్ర‌ణ‌కు సంబంధించి అన్ని జాగ్ర‌త్త చ‌ర్య‌లూ తీసుకోవ‌ల‌సిందిగా డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మీకు మీరు గా ఎవ‌రికి వారు వారి స్థాయిలో బాధ్య‌త తీసుకోవాలి. వ్య‌క్తులుగా, స‌మాజ‌ప‌రంగా,కాల‌నీలో, కార్యాల‌యంలో బాధ్య‌త తీసుకుని జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆయ‌న సూచించారు.
 
సండేసంవాద్ నాలుగ‌వ ఎపిసోడ్ ను వీక్షించ‌డానికి కింది లింక్‌ల‌ను క్లిక్‌చేయండి:

Twitter: https://twitter.com/drharshvardhan/status/1312659867224612864

Facebook: https://www.facebook.com/watch/?v=3281142565296376

Youtube: https://www.youtube.com/watch?v=fF1Vpsn4Z2w

DHV App: http://app.drharshvardhan.com/download

***



(Release ID: 1661633) Visitor Counter : 280