రైల్వే మంత్రిత్వ శాఖ

ఫూల్‌బాగన్‌ మెట్రో స్టేషన్‌ను ప్రారంభించిన రైల్వే శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌

ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో సేవలు ఫూల్‌బాగన్‌ స్టేషన్‌ వరకు పొడిగింపు

Posted On: 04 OCT 2020 6:57PM by PIB Hyderabad

కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో ప్రాజెక్టులోని ఫూల్‌బాగన్‌ మెట్రో స్టేషన్‌ను రైల్వే శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ ప్రారంభించారు. వీడియో లింక్‌ ద్వారా జెండా ఊపి మొదటి రైలును ప్రారంభించారు. కొవిడ్‌ ఇబ్బందులు ఎదురైనా ఎక్కువ శ్రద్ధ పెట్టి పనులు పూర్తిచేసిన అందరినీ అభినందించారు. సీల్దా స్టేషన్‌కు సమీపంలోనే ఉన్నందున, సాల్ట్‌ లేక్‌ స్టేడియం నుంచి ఫూల్‌బాగన్‌ స్టేషన్‌ వరకు (1.665 కి.మీ.) మెట్రో సేవల పొడిగింపు ప్రయాణీకులకు ఉపయోకరమని అన్నారు. దీనిని 
దసరా కానుకగా అభివర్ణించిన కేంద్ర మంత్రి; సురక్షిత, పరిశుభ్ర, వేగవంతమైన రవాణాను మెట్రో అందిస్తోందని అన్నారు.  

    స్థలం దొరికి, ఆక్రమణలు తొలగిస్తే ఏ రైల్వే ప్రాజెక్టునైనా చేపట్టవచ్చని, నిధులు పెద్ద సమస్య కాదని శ్రీ పీయూష్‌ గోయల్‌ అన్నారు.

    అధునాతన, అందమైన ఫూల్‌బాగన్‌ స్టేషన్‌ను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ను, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ బాబుల్‌ సుప్రియో అభినందించారు. ఈ పొడిగింపు కారణంగా సీల్దా స్టేషన్‌కు ప్రజల రాకపోకలు మరింత సులభమవుతాయని అన్నారు. కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ శుష్రి దేబర్షి చౌదరి, మెట్రో రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ మనోజ్‌ జోషి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    
    ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో ప్రాజెక్టు మొత్తం పొడవు 16.5 కి.మీ. అంచనా వ్యయం రూ.8574.98 కోట్లు. హూగ్లీ నదికి పశ్చిమం వైపున్న హౌరాను, తూర్పు వైపున్న సాల్ట్‌ లేక్‌ సిటీని ఈ ప్రాజెక్టు కలుపుతుంది.

    మెట్రో ప్రాజెక్టు మొదటి దశ అయిన 'సాల్ట్‌ లేక్‌ స్టేడియం నుంచి సాల్ట్‌ లేక్‌ సెక్టార్‌-5' మార్గాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన శ్రీ పీయూష్‌ గోయల్‌ ప్రారంభించారు.

    ఫూల్‌బాగన్‌ స్టేషన్‌ నుంచి వాణిజ్య సేవలు 05.10.2020 నుంచి ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గం. వరకు; సాల్ట్‌ లేక్‌ సెక్టార్‌-5, ఫూల్‌బాగన్‌ స్టేషన్ల నుంచి 48 రైళ్లు నడుస్తాయి. ఆదివారం సెలవు.

***



(Release ID: 1661659) Visitor Counter : 153