PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
15 SEP 2020 6:42PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- గత 24 గంటల్లో వ్యాధి నయమైనవారు 79,000కు పైగానే; 78 శాతం దాటిన కోలుకునేవారి సగటు.
- మొత్తం క్రియాశీల కోవిడ్ కేసులలో 60 శాతం 5 తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లోనే;
- బీహార్‌లోని దర్భంగాలో ‘ఎయిమ్స్’ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం.
- కోవిడ్-19పై దృష్టాంత ఆధారిత విధానాన్ని అనుసరిస్తున్న భారత్.
- కోవిడ్-19 బాధితుల మానసిక ఆరోగ్యానికి మద్దతుగా అనేక వినూత్న చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం.
- పీఎంజీకేపీ బీమా పథకం లెక్కల ప్రకారం... దేశంలో కోవిడ్-19 మహమ్మారివల్ల 155 మంది ఆరోగ్య సిబ్బంది మృతి


భారత్‌లో భారీగా కోలుకుంటున్న కోవిడ్ బాధితులు; గత 24 గంటల్లో వ్యాధి నయమైనవారు 79,000కుపైగానే; 78 శాతం దాటిన కోలుకునేవారి సగటు; చికిత్స పొందేవారిలో 60 శాతం 5 రాష్ట్రాల్లోనే నమోదు
దేశంలో రోజువారీగా వ్యాధి నయమయ్యేవారి సంఖ్య నానాటికీ భారీగా పెరుగుతోంది. ఆ మేరకు కోలుకునేవారి జాతీయ సగటు కూడా వేగంగా పెరుగుతూ ఇవాళ 78.28 శాతానికి దూసుకెళ్లింది. తదనుగుణంగా గత 24 గంటల్లో 79,292 మందికిపైగా ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 38,59,399గా నమోదైంది. చికిత్స పొందే కేసులకన్నా కోలుకున్న కేసుల సంఖ్య నేడు 28 లక్షలు (28,69,338) దాటింది. ఆ మేరకు ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలోగల రోగుల సంఖ్య 9,90,061గా ఉంది. ఇక ఆస్పత్రులలో ఉన్నవారిలో దాదాపు సగం (48.8%) మంది కేవలం 3 రాష్టాల్లోనే... మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్నారు. మరో పావు భాగం (24.4%) ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, కేరళ, తెలంగాణలలో ఉన్నారు. మొత్తంమీద... చికిత్స పొందే కేసులలో 60.35 శాతం వాటా మహారాష్ట్ర. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలదే కాగా, కోలుకున్నకేసులపరంగానూ 60 శాతం (59.42%) దాకా ఈ రాష్ట్రాల్లోనే నమోదైంది. మరోవైపు గత 24 గంటల్లో 1,054 మంది మరణించగా, దాదాపు 69 శాతం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీల్లో సంభవించాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన మరణాల్లో ఒక్క మహారాష్ట్రలోనే 37 శాతం (29,894) సంభవించగా, గత 24 గంటల్లో 34.44 శాతం (363) నమోదయ్యాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654409
ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో తగినంత ఆక్సిజన్ లభ్యత దిశగా 29 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో ఆరోగ్య, పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య, ఔషధ శాఖల కార్యదర్శుల చర్చ
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రిత్వశాఖ కార్యదర్శి నిన్న దేశంలోని 29 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్ర పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య, ఔషధ, జౌళి శాఖల కార్యదర్శులు ఆన్‌లైన్ మాధ్యమంద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లోగల అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో కోవిడ్ రోగుల కోసం తగినంత ఆక్సిజన్ లభ్యతకు భరోసా కల్పించడం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. ఆ మేరకు అన్ని రాష్ట్రాలూ తమతమ పరిధిలోనేగాక, ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ రవాణాపై ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654399
‘నమామి గంగే, అమృత్’ పథకాల్లో భాగంగా బీహార్‌లో వివిధ పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘నమామి గంగే, అమృత్’ పథకాలకింద బీహార్‌లో వివిధ కొత్త పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా పాట్నా నగరంలోని బ్యూర్, కరం-లీచక్ ప్రాంతాల్లో మురుగుశుద్ధి ప్లాంట్లకు ఆయన శ్రీకారం చుట్టారు. వీటితోపాటు ‘అమృత్’ యోజన కింద సివాన్, ఛాప్రాల్లో మంచినీటి ప్రాజెక్టులకు కూడా ప్రారంభోత్సవం చేశారు. ఇవేకాకుండా ‘నమామి గంగే’ యోజన కింద ముంగేర్, జమాల్‌పూర్ మంచినీటి పథకాలకు, ముజఫర్‌పూర్‌లో నదీతీర అభివృద్ధి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. కరోనా మహమ్మారి సమయంలోనూ బీహార్‌లో అనేక అభివృద్ధి పథకాల పనులు నిరంతరాయంగా కొనసాగాయని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇక ‘ఇంజనీర్ల దినోత్సవం’ సందర్భంగా దేశ ప్రగతిలో ఇంజనీర్లు పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమైనదని ప్రశంసించారు. భారత ముద్దుబిడ్డ, ఇంజనీర్లకు ఆదర్శప్రాయుడైన సివిల్ ఇంజనీర్ ‘సర్ ఎం.విశ్వేశ్వరాయ’ను స్మరించుకుంటూ ఏటా సెప్టెంబరు 15న ఇంజనీర్ల దినోత్సవం నిర్వహిస్తారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654521
బీహార్‌లో వివిధ పథకాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654432
బీహార్‌లోని దర్భంగాలో అఖిలభారత వైద్యవిజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
బీహార్‌లోని దర్భంగాలో అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన (పిఎమ్ఎస్ఎస్‌వై) కింద దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఎయిమ్స్ నిర్మాణానికి రూ.1264 కోట్లు ఖర్చు కానుండగా, దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించిన 48 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఈ వైద్య విజ్ఞాన సంస్థలో 100 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు, 15 నుంచి 20 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయి. ప్రస్తుతం పనిచేస్తున్న ఎయిమ్స్ గణాంకాల ప్రకారం... ప్రతి కొత్త ఎయిమ్స్ రోజుకు సుమారు 2000 మంది ఓపీడీ రోగుల అవసరాలను, నెలకు 1000 మంది ఐపీడీ రోగుల అవసరాలను తీర్చగలదని భావిస్తున్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654602
కోవిడ్-19 మృతుల్లో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు అంటువ్యాధుల వ్యాప్తి నిరోధం-నియంత్రణ విధానాలపై మార్గదర్శకాలను జారీచేసింది. కాగా, 2020 మార్చిలో అన్ని రాష్ట్రాలకు శిక్షణ ఇవ్వబడింది. అలాగే ఐగాట్ వేదిక పరిధిలోని అన్ని విభాగాల ఆరోగ్య కార్యకర్తలకూ సంబంధిత శిక్షణ కూడా అందుబాటులో ఉంచబడింది. కోవిడ్, కోవిడేతర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచేసే ఆరోగ్య సంరక్షణ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 2020 జూన్ 18న ఒక సలహాపత్రం జారీ చేసింది. మరోవైపు ఆస్పత్రి, సామాజిక పరిస్థితుల్లో (ముందువరుస కార్యకర్తలుసహా) పీపీఈల హేతుబద్ధ వినియోగంపై 24.03.2020న మార్గదర్శకాలను కూడా కేంద్రం జారీ చేసింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654564
కోవిడ్-19పై పోరాటంలో వ్యూహాత్మక విధానం
కోవిడ్-19పై పోరాటంలో భాగంగా దృష్టాంత ఆధారిత విధానాన్ని భారత్ అనుసరించనుంది. ఈ పద్ధతిలో భాగంగా (1) దేశంలో ప్రయాణ సంబంధిత కేసులు (2) కోవిడ్-19 స్థానిక సంక్రమణ (3) నియంత్రణకు వీలైన భారీ కేసుల భారత (4) కోవిడ్-19 విస్తృత సామాజిక వ్యాప్తి (5) భారత్‌కు కోవిడ్-19 స్థానికంగా మారడం వంటి నేపథ్యాలను పరిగణనలోకి తీసుకోనుంది. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో భారీగా కేసులు నమోదవుతున్నా వాటి నియంత్రణలో ఇబ్బందులు లేవు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధానాన్ని అనుసరిస్తోంది. ఆ మేరకు దేశంలో కోవిడ్-19 వేగంగా వ్యాపించకుండా అదుపు చేయగలిగింది. అందువల్లనే ప్రతి 10 లక్షల జనాభాకు కేసుల సంఖ్య 3,328 కాగా- మరణాల సంఖ్య 55కు మాత్రమే పరిమితమైంది. ఇది ప్రపంచంలోనే అత్యల్పం కావడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వనీకుమార్ చౌబే ఈ మేరకు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654579
కోవిడ్-19 బాధితుల కోసం కొత్త ఆరోగ్య సంరక్షణ పథకం
కోవిడ్-19తో పోరాటంలో ముందువరుసలోగల ఆరోగ్య కార్యకర్తల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజి’ కింద వనరులు కేటాయించింది. ఈ మేరకు వ్యాధిగ్రస్థులతో ప్రత్యక్షంగా మసలుతూ వ్యాధి సంక్రమణకు గురయ్యే అవకాశం మెండుగా ఉన్న సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించింది. ఇప్పటికే కోవిడ్-19వల్ల మరణించిన ఆరోగ్య కార్యకర్తలకూ ఈ బీమా వర్తిస్తుంది. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది/రిటైరైనవారు/స్వచ్ఛంద కార్యకర్తలు/స్థానిక పురపాలక కార్మికులు/కాంట్రాక్టు కార్మికులు/రోజు కూలీలు/తాత్కాలిక/రాష్ట్రాల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది/కేంద్ర ఆసుపత్రులు/స్వయం ప్రతిపత్తిగల కేంద్ర ఆసుపత్రులు/రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు, ఎయిమ్స్, ఐఎన్ఐలు/కేంద్ర మంత్రిత్వ శాఖల ఆస్పత్రులను కోవిడ్-19 సంబంధిత బాధ్యతలకు అనుమతించారు. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వనీ కుమార్ చౌబే రాతపూర్వక సమాధానమిచ్చారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654504
కోవిడ్-19 బాధితుల మానసిక ఆరోగ్యానికి మద్దతుగా అనేక వినూత్న చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం
కోవిడ్-19 పిల్లలుసహా ప్రజల మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని మానసికంగా మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా బాధితులందరికీ మానసిక ఆరోగ్య నిపుణులతో సలహాలిచ్చేందుకు 24 గంటల సహాయ కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మానసిక సమస్యలున్నవారిని పిల్లలు, పెద్దలు, మహిళలు, ఆరోగ్య కార్యకర్తలు తదితర వర్గాలుగా విభజించింది. ఈ చర్యలకు సంబంధించిన అనేక అంశాల గురించి రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వనీ కుమార్ చౌబే ఇవాళ రాతపూర్వక సమాధానమిచ్చారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654627
భారతీయ వైద్య విధానం, హోమియో వైద్యవిద్యలో విప్లవాత్మక పునరుజ్జీవం
ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన రెండు ముఖ్యమైన బిల్లులను పార్లమెంటు ఆమోదించింది. దీంతో భారతీయ వైద్య విధానం, హోమియో వైద్య విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చేందుకు దేశం సన్నద్ధమవుతోంది. ‘భారతీయ వైద్య విధానం జాతీయ కమిషన్ బిల్లు-2020, హోమియోపతి జాతీయ కమిషన్ బిల్లు-2020’లను లోక్‌సభలో సెప్టెంబర్ 14న ఆమోదించారు. ప్రస్తుత ‘ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ యాక్ట్-1970, హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ యాక్ట్-1973’ స్థానంలో ఈ జంట బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా, ఈ బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందడం ఆయుష్ శాఖ చరిత్రలోనే ఒక మైలురాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654416
కోవిడ్-19 నుంచి కోలుకోవడంలో రోగులకు యోగా సాయం
కోవిడ్-19 బాధితులు వేగంగా కోలుకోవటంలో యోగా ఏ మేరకు తోడ్పడుతున్నదో పరిశోధించడం కోసం ఢిల్లీలోని రాజివ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎయిమ్స్, ఎయిమ్స్ రిషీకేశ్, ఆర్‌ఎంఎల్ ఆస్పత్రుల సహకారంతో కేంద్ర యోగా-నేచురోపతి పరిశోధన మండలి (CCRYN) ఒక ప్రాజెక్ట్ చేపట్టింది. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంద్వారా వెల్లడించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654526
దేశంలో కోవిడ్-19 వ్యాప్తిపై ముందస్తు సంకేతాలు
చైనాలోని వుహాన్ పట్టణంలో నిమోనియా లక్షణాల వ్యాప్తి పరిణామాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను 2020 జనవరి 6న హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ చైనాలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్యసేవల విభాగం డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో ఏర్పాటైన సంయుక్త పర్యవేక్షక బృందం 2020 జనవరి 8న సమావేశమైంది. ఈ సందర్భంగా చైనాలో పరిస్థితులతోపాటు స్వదేశంలో ప్రజారోగ్య వ్యవస్థ సంసిద్ధతపైనా, వ్యాధి వ్యాప్తి నిరోధంపైనా అనుసరించాల్సిన వివిధ వ్యూహాలపై చర్చించింది. తదనుగుణంగా దేశవ్యాప్త దిగ్బంధం విధింపునకు ముందే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనడానికి సముచిత చర్యలు తీసుకుంది. ఈ అంశాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీకుమార్ చౌబే ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన సందర్భంగా వివరాలు వెల్లడించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654576
భారతదేశంలో కోవిడ్ టీకా అభివృద్ధి ప్రగతిపై సమాచారం
దేశంలో కోవిడ్‌కు సమర్థ, సురక్షిత టీకా రూపకల్పనకు ప్రభుత్వం, వివిధ పరిశోధన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నది కచ్చితంగా వెల్లడించడం కష్టసాధ్యం. అయితే, ప్రభుత్వం తనవంతు ప్రయత్నాల్లో భాగంగా ఉన్నతస్థాయి జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి, పర్యవేక్షణ బాధ్యతను అప్పగించింది. తదనుగుణంగా టీకా అభివృద్ధికి సంబంధించిన వివిధ దశలను ఈ బృందం పర్యవేక్షిస్తూ సమస్యల పరిష్కారానికి తోడ్పడుతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంద్వారా వెల్లడించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654736
ప్రైవేటు ఆస్పత్రులలో అధిక రుసుముల వసూలుపై నియంత్రణ
కోవిడ్-19 ప్రభావం నిరోధం, నియంత్రణ, ఉపశమనం దిశగా ప్రభుత్వం అనేక వరుస చర్యలు తీసుకుంది. ఆ మేరకు ‘పూర్తిస్థాయి ప్రభుత్వం’, ‘సంపూర్ణ సమాజం’ విధానాన్ని ప్రధానంగా అనుసరించింది. గౌరవనీయ ప్రధానమంత్రి, ఉన్నతస్థాయి మంత్రుల బృందం, మంత్రిమండలి కార్యదర్శి, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖలోని కార్యదర్శులు-సీనియర్ అధికారుల కమిటీలు ప్రజారోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చాయి. అయితే, ప్రైవేటు ఆస్పత్రులను రంగంలోకి దించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది కావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఆ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ లేఖలు రాసింది. అంతేకాకుండా కోవిడ్ చికిత్స కోసం పీఎం-జేఏవై, సీజీహెచ్‌ఎస్ ప్యాకేజీలు నిర్దేశిస్తున్న ప్రకారమే రుసుములు వసూలు చేసేలా చూడాలని కూడా సూచించింది. తదనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర సూచనల మేరకు ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంద్వారా వెల్లడించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654535
మహమ్మారిపై పోరు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి భారతదేశానికి రుణవితరణ వివరాలు
కోవిడ్-19 మహమ్మారిపై భారత పోరాటానికి మద్దతుగా ప్రపంచ బ్యాంకు ఇప్పటిదాకా 2.5 బిలియన్ డాలర్లను మూడు రుణాల రూపంలో అందించింది. ఈ మేరకు ఆరోగ్యం, (1 బిలియన్), సామాజిక రక్షణ (0.75 బిలియన్), ఆర్థిక ఉద్దీపన (0.75 బిలియన్)ల కోసం విడుదల చేసింది. ఈ రుణాలతో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రయోజనాలు లభించాయని ఇవాళ ఒక ప్రశ్నకు రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653923
మాధ్యమిక దశ విద్యార్థుల కోసం ఎన్‌సీఈఆర్‌టీ 8 వారాల ప్రత్యామ్నాయ విద్యా కేలండర్‌ను విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
కోవిడ్-19 సమయంలో ఇళ్లలో ఉండిపోయిన విద్యార్థులకు అర్థవంతమైన విద్యాభ్యాసం కోసం కేంద్ర విద్యాశాఖ పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహాయంతో ఇంట్లోనే విద్యా కార్యకలాపాలకు వీలు కల్పించింది. తదనుగుణంగా 1 నుంచి 12 తరగతులవారి కోసం జాతీయ విద్యా-పరిశోధన-శిక్షణ మండలి (NCERT)తో నాలుగు వారాల ప్రత్యామ్నాయ విద్యా కేలండర్ (AAC)ను సిద్ధం చేయించింది. అలాగే ప్రాథమిక-ప్రాథమికోన్నత దశల విద్యార్థుల కోసం ఎనిమిది వారాల కేలండర్ ఇప్పటికే విడుదల కాగా, ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ఆవిష్కరించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654563
వలస కార్మికులకు ఆర్థిక సహాయం
దేశంలో దిగ్బంధం అనివార్యమైన పరిస్థితులలో ప్రజలకు నిత్యావసరాల సరఫరా ఆగకూడగదన్న వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ మరువలేదు. ఈ మేరకు జాతీయ స్థాయిలో కంట్రోల్ రూమ్‌ల ద్వారా పరిస్థితిని 24 గంటలూ పర్యవేక్షిస్తూ వచ్చింది. తదనుగుణంగా వలస కార్మికులుసహా నిరాశ్రయులకు ఆహారం, ఆరోగ్య సంరక్షణ, ఆశ్రయం కల్పించే దిశగా 28.03.2020న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్)ని వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించింది. కాగా, దిగ్బంధం సమయంలో వలసకార్మికులు స్వస్థలాలకు నడచివెళ్లే సమయంలో పలువురు మరణించినప్పటికీ దీనిపై కేంద్రస్థాయిలో రికార్డులేవీ లేవు. అయినప్పటికీ వలస కార్మికుల ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలన్నీ తీసుకుంది. కాగా, ఈ అంశంపై లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన దేశీయాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ ఈ మేరకు వెల్లడించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653923
దిగ్బంధంపై ఎన్డీఎంఏ మార్గదర్శకాలు
దేశంలో కోవిడ్-19 వ్యాప్తి నిరోధం దిశగా సముచిత చర్యలు చేపట్టడంతోపాటు దేశవ్యాప్తంగా మహమ్మారి నియంత్రణకు మార్గదర్శకాలు జారీచేయాల్సిందిగా జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (NDMA) దేశీయాంగ శాఖను ఆదేశించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ చట్టం-2005 (సెక్షన్ 6 (2) (i)) ప్రకారం జాతీయ కార్యనిర్వాహక కమిటీ (NEC) చైర్‌పర్సన్‌గా ఉన్న దేశీయాంగ కార్యదర్శికి ఉత్తర్వు జారీచేసింది. తదనుగుణంగానే ఎన్‌ఈసీ ఎప్పటికప్పుడు దేశంలో దిగ్బంధం, దిగ్బంధ విముక్తి దశలపై మార్గదర్శకాలను జారీ చేస్తూవస్తోంది. దీనికి సంబంధించి ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంద్వారా దేశీయాంగ శాఖ సహాయమంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ వివరాలు వెల్లడించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654750
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్ కేసులు, మరణాలు పెరిగిన నేపథ్యంలో వైద్యపరమైన ఆక్సిజన్ దేశీయ తయారీ, సరఫరాలను వేగిరపరచాలని పంజాబ్ ముఖ్యమంత్రి ఆరోగ్యశాఖను ఆదేశించారు. దీంతోపాటు ఆక్సిజన్ సరఫరా, డిమాండ్ తదితరాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నోడల్ అధికారిని కూడా నియమించింది.
- హర్యానా: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉండబోదని హర్యానా ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ద్రవ, వైద్యపరమైన ఆక్సిజన్ ఉత్పాదన, నిల్వకు తగినంత సామర్థ్యం ఉందని, తదనుగుణంగా ప్రభుత్వ-ప్రైవేట్ ఆస్పత్రులలో ఆక్సిజన్‌కు కొరత లేకుండా ఏర్పాట్లు కూడా చేశామని చెప్పారు.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని హోలోంగిలోగల పీహెచ్‌సీలో పనిచేసే ఉద్యోగి కోవిడ్-19తో అరుణాచల్ ప్రదేశ్‌లో కన్నుమూశారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11కు చేరింది. కాగా, రాష్ట్రంలో 176 కొత్త కేసులు నమోదవగా క్రియాశీల కేసుల సంఖ్య 1,756కు చేరగా, 156మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
- అసోం: రాష్ట్రంలో నిన్న 1,918 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,15,051కు చేరగా, చురుకైన కేసుల సంఖ్య 28,630గా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు.
- మణిపూర్: రాష్ట్రంలో 96 కొత్త కేసులు నమోదవగా, 79 శాతం కోలుకునే సగటుతో 149 మంది వ్యాధి నయం చేసుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం మొత్తం 1,585 క్రియాశీల కేసులున్నాయి.
- మేఘాలయ: రాష్ట్రంలో క్రియాశీల కేసులు 1,623కు చేరగా, వీరిలో బిఎస్‌ఎఫ్, సాయుధ దళాల సిబ్బంది 344 మంది కాగా, ఇతరులు 1,279 మంది ఉన్నారు. కాగా, ఇప్పటిదాకా 2,075 మంది కోలుకున్నారు.
- మిజోరం: రాష్ట్రంలో నిన్న 40 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,468కి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 549గా ఉన్నాయి.
- నాగాలాండ్: రాష్ట్రంలోని 5,214 కేసులలో సాయుధ దళాల సిబ్బంది 2,463 మంది కాగా, రాష్ట్రానికి తిరిగి వచ్చినవారు 1411 మంది, ముందువరుసలోని ఆరోగ్య కార్యకర్తలు 319 మంది, పరిచయాలతో వ్యాధి సంక్రమించినవారు 1,021 మంది ఉన్నారు.
- సిక్కిం: రాష్ట్రంలో కోవిడ్ కేసుల వివరాలు: వ్యాధినయమై ఇళ్లకు వెళ్లినవారు 1,690 మంది. ప్రస్తుత క్రియాశీల కేసులు 464, కొత్త కేసులు 54గా ఉన్నాయి.
- కేరళ: రాష్ట్రంలో ఓణం పండుగ తరువాత కోవిడ్ పరిస్థితి తీవ్రమైందని రాష్ట్ర ఆరోగ్యశాఖ అంచనా వేసింది. కేరళలోని 6 జిల్లాల్లో కేసులు పెరగ్గా, మూడు జిల్లాల్లో కేసులు రెట్టింపయ్యే వ్యవధి తగ్గింది. రోజువారీ పరీక్షల సంఖ్యను పెంచాలని, ప్రాంతీయ స్థాయిలో ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరింది. కేరళలో నిన్న 2,540 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం, 30,486 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.05 లక్షలమంది పరిశీలనలో ఉండగా మృతుల సంఖ్య 454గా ఉంది.
- తమిళనాడు: సకాల వైద్యచికిత్సకు వీలు కల్పించడంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ హెలికాప్టర్‌ను ఎయిర్ అంబులెన్స్‌గా మార్చాలని యోచిస్తోంది. కాగా, కోయంబత్తూరులో కోవిడ్ పరీక్షా ఫలితాలను సకాలంలో ప్రకటించడంలో భాగంగా వివిధ స్థాయిలలో నమూనాల నిర్వహణలో దుర్వినియోగం చోటుచేసుకున్నట్లు ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ మాధ్యమాలు వార్తా కథనాల్లో పేర్కొన్నాయి. ఇక రాష్ట్రంలో నిన్న 5,752 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటగా ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 4.5 లక్షలుగా ఉంది. కాగా, తమిళనాడులో మృతుల సంఖ్య 8434గా ఉంది.
- కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరగడంతో, చిక్కమగళూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తమ ప్రాంగణంలో ఒక ద్రవ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇది మరో వారంలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో నిన్న 8244 కొత్త కేసులు, 8865 డిశ్చార్జిలు, 119 మరణాలు నమోదయ్యాయి. కాగా, బెంగళూరు నగరంలో కేసుల సంఖ్య 2966గా ఉంది. నిన్నటిదాకా మొత్తం కేసులు: 4,67,689; క్రియాశీల కేసులు: 98,463; మరణాలు: 7384; డిశ్చార్జి: 3,61,823గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావుకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, ఆస్పత్రులలో కోవిడ్ రోగులకు మందులు, ఆహారం అందించడంలో సాయపడగల రోబోను వాల్టేర్ డివిజన్ డీజిల్ లోకోషెడ్ సిబ్బంది రూపొందించారు. దీనికి ‘మెడ్ రోబో’ (MeD ROBO)గా నామకరణం చేశారు. దీన్ని విశాఖపట్నంలోని డివిజనల్ రైల్వే ఆసుపత్రిలో వినియోగించే దిశగా విస్తృత పరీక్షలు నిర్వహించారు.
- తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2058 కొత్త కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కాగా, 2180 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 277 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,60,571; క్రియాశీల కేసులు: 30,400; మరణాలు: 984; డిశ్చార్జి: 1,29,187గా ఉన్నాయి. కోవిడ్-19 చికిత్స పర్యవేక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఉన్నత-స్థాయి కార్యాచరణ బృందం పడకల తనిఖీతోపాటు సాధారణ- ఇతర వార్డులలో పరిశీలన ప్రారంభమైంది. కాగా, హైదరాబాద్‌లోని దక్షిణమధ్య రైల్వే కార్యాలయంలో తొలిసారిగా 30 మంది సిబ్బందికి కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆఫీసును మూసివేశారు.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో వైద్యపరమైన ఆక్సిజన్ రవాణాచేసే వాహనాలకు ఏడాదిపాటు ‘అంబులెన్స్’ హోదా ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితోపాటు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు ఆక్సిజన్ నిరంతరాయ సరఫరా అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కోవిడ్ రోగులలో సుమారు 11 శాతానికి 500 టన్నుల ఆక్సిజన్ అవసరం. అయితే, మహారాష్ట్రలో ప్రస్తుతం 1,000 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ, కొరత ఉందంటూ చాలాచోట్లనుంచి ఫిర్యాదులు వచ్చాయి.
- గుజరాత్: రాష్ట్రంలో తాను ప్రవేశపెట్టిన "టెస్ట్ ఈజ్ బెస్ట్" నినాదం మేరకు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వచ్ఛందంగా పరీక్ష చేయించుకోగా, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. వ్యాధి సోకిందీ లేనిదీ నిర్ధారణ కోసం ముందుకొచ్చేలా ప్రజలను ప్రోత్సహించడం కోసం ఆయన స్వయంగా పరీక్ష చేయించుకున్నారు.
- రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయం 793 కొత్త కేసులు నమోదవగా రాజస్థాన్‌లో క్రియాశీల కేసులు 17,410కి చేరాయి. వీటిలో జోధ్పూర్ 147, రాజధాని జైపూర్ 145 వంతున అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిరంతరం కేసులు పెరుగుతున్నా కోలుకునేవారి సగటు 82 శాతంగా ఉండటం విశేషం.
- మధ్యప్రదేశ్: రాష్ట్రానికి మహారాష్ట్ర నుంచి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిన ఫలితంగా ఏర్పడిన సంక్షోభం పరిష్కారానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పారిశ్రామికంగా ఆక్సిజన్ వాడకాన్ని నిషేధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రస్తుతం 180 టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతుండగా, డిమాండ్ రోజుకు 110 నుంచి 120 టన్నుల మధ్య ఉంటోంది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం చురుకైన కేసులు 90,000కన్నా ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో సోమవారం అత్యధికంగా ఒకేరోజు 2,483 కేసులు నమోదయ్యాయి. ఐదు రోజులుగా నిత్యం 2 వేలదాకా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్ల మద్దతుగల 560 కొత్త పడకలు రాయ్‌పూర్‌కు అందుబాటులోకి రానున్నాయి. కాగా, లాల్‌పూర్‌లోని కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిలో ఆక్సిజన్ సదుపాయాలుగల 100 పడకలను ఏర్పాటు చేసినట్లు రాయ్‌పూర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. మరోవైపు రాయ్‌పూర్‌లోని ఆయుర్వేద కళాశాల ఆస్పత్రిలో 400, ఈఎస్‌ఐసీ ఆస్పత్రిలో 60 వంతున అదనపు పడకలు ఏర్పాటుకానున్నాయి.
FACT CHECK


********
(Release ID: 1654771)
Visitor Counter : 214