ప్రధాన మంత్రి కార్యాలయం
‘నమామి గంగే’ యోజన, ‘ఎఎంఆర్ యుటి’ యోజన లలో భాగం గా బిహార్ లో వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
Posted On:
15 SEP 2020 3:11PM by PIB Hyderabad
‘నమామి గంగే’ యోజన, ‘ఎఎంఆర్ యుటి’ (అమృత్) యోజన లలో భాగంగా బిహార్ లో వివిధ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రోజున ప్రారంభించిన నాలుగు ప్రాజెక్టుల్లో అమృత్ యోజన లో భాగంగా పట్నా నగరం లోని బేవూర్, కరమ్-లీచక్ లలో మురుగు శుద్ధి ప్లాంటులతో పాటు సీవాన్, ఛప్రా లలో జల పథకాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా నమామి గంగే లో భాగంగా ముంగెర్, జమాల్ పుర్ లలో నీటి సరఫరా పథకాలకు, ముజప్ఫర్ పుర్ లో రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ స్కీము కు శంకుస్థాపన లు జరిగాయి.
కరోనా నేపథ్యం లో సైతం వివిధ అభివృద్ధి పథకాల పనులు బిహార్ లో ఏ అంతరాయం లేకుండా పురోగమిస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రారంభించిన ప్రాజెక్టుల విలువ కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంటుందంటూ ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల విస్తరణ తో పాటు, బిహార్ లోని రైతులకు కూడా లబ్ధిని చేకూర్చుతాయని ఆయన చెప్పారు.
భారతదేశం లో దార్శనికుడైన ఆధునిక సివిల్ ఇంజినీరు సర్ ఎం. విశ్వేశ్వరయ్య స్మరణార్థం ఈ రోజు ను ఇంజినీర్ల దినోత్సవం గా జరుపుకొంటున్న సందర్భం లో దేశాభివృద్ధి కి ఇంజినీర్లు అందించిన సేవలను ప్రధాన మంత్రి ప్రశంసించారు. బిహార్ సైతం లక్షల కొద్దీ ఇంజినీర్లను తయారు చేసి దేశాభివృద్ధి లో చెప్పుకోదగ్గ తోడ్పాటును అందించిందన్నారు.
బిహార్ అనేక చరిత్రాత్మక నగరాల నిలయం, బిహార్ కు వేల సంవత్సరాల సుసంపన్నమైన వారసత్వం ఉందని మోదీ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అనేక మంది దార్శనికత కలిగిన నేతలు ఇక్కడ దాస్య యుగం లో చోటుచేసుకొన్న వక్రీకరణలను దూరం చేయడానికి వారి వంతుగా పాటుపడ్డారని ఆయన చెప్పారు. ఆ తరువాతి కాలంలో ప్రాధాన్యాలు మారిపోయి, అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది, ఫలితంగా పట్టణ ప్రాంతాల మౌలిక సదుపాయాలు దిగజారుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కుప్పకూలాయని ఆయన అన్నారు.
పరిపాలన కన్నా స్వార్ధపరత్వానిదే పైచేయి అయినప్పుడు వోటు బ్యాంకు రాజకీయాలు తెర మీదకు వస్తాయని, వాటివల్ల అప్పటికే నిరాదరణ బారిన పడ్డ వర్గాలు, వంచనకు లోనైన వర్గాలు మరింతగా దెబ్బతింటాయని ప్రధాన మంత్రి అన్నారు. బిహార్ ప్రజలు ఈ బాధలను దశాబ్దాల తరబడి సహిస్తూ వచ్చారని, ఆ కాలంలో నీటి సరఫరా, మురుగు శుద్ధి లాంటి కనీస అవసరాలు కూడా తీరలేదని ఆయన అన్నారు. గత్యంతరం లేక శుభ్రపరచని నీటిని తాగవలసి వచ్చినప్పుడు ప్రజలకు వ్యాధులు సోకుతాయి, అలాంటప్పుడు నీటి శుద్ధి కి వ్యక్తి తన సంపాదన లో పెద్ద మొత్తాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది అని ప్రధాన మంత్రి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో బిహార్ సమాజంలో ఓ పెద్ద భాగం వారి నొసటన రుణం, వ్యాధి, నిస్సహాయత, నిరక్షరాస్యతలే రాసి పెట్టి ఉన్నాయనే భావనకు వచ్చేశారని ఆయన చెప్పారు.
గత కొన్నేళ్ళ లో వ్యవస్థ ను సంస్కరించేందుకు కృషి జరుగుతోంది, సమాజంలో చాలా ప్రభావితం అయిన వర్గాలలో తిరిగి విశ్వాసాన్ని కల్పించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి అని ప్రధాన మంత్రి అన్నారు. పుత్రికల విద్య కు పెద్ద పీట వేసి, పంచాయతీరాజ్ సహా స్థానిక సంస్థల్లో అణగారిన వర్గాల వారికి ప్రాతినిధ్యం పెంచుతున్న తీరుతో వారిలో విశ్వాసం అధికమవుతోందన్నారు. 2014 నుంచి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పథకాల నియంత్రణ ను ఇంచుమించు పూర్తి స్థాయి లో గ్రామ పంచాయతీలకు లేదా స్థానిక సంస్థలకు అప్పగించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రణాళిక రూపకల్పన మొదలుకొని అమలు వరకు, అలాగే పథకాల నిర్వహణ సహా స్థానిక సంస్థలు ఆయా ప్రాంతాల అవసరాలను తీర్చగలుగుతున్నాయి, బిహార్ లో నగర ప్రాంతాల్లో తాగునీరు, మురుగు పారుదల వ్యవస్థ లాంటి కనీస సౌకర్యాలు నిరాఘాటం గా మెరుగుపడుతున్నాయని ఆయన వివరించారు.
గత నాలుగైదు సంవత్సరాల్లో మిషన్ అమృత్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా బిహార్ లోని పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయాన్ని లక్షల కొద్దీ కుటుంబాల అందుబాటు లోకి తీసుకురావడమైందని ప్రధాన మంత్రి చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో ప్రతి ఇంటికీ గొట్టపు మార్గం ద్వారా నీరు సరఫరా అయ్యే రాష్ట్రాల్లో బిహార్ కూడా స్థానాన్ని సంపాదించుకొంటుందని ఆయన తెలిపారు. ఈ మహత్తర లక్ష్యాన్ని సాధించడానికి బిహార్ ప్రజలు కరోనా సంక్షోభ కాలంలో సైతం ఎడతెగక శ్రమించారని ఆయన అన్నారు. గత కొన్ని నెలల్లో 57 లక్షలకు పైగా కుటుంబాలకు నీటి కనెక్షన్లను అందించడంలో ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ ఒక ప్రముఖ పాత్రను పోషించిందని ఆయన వివరించారు. దీనిలో ఇతర రాష్ట్రాల నుంచి బిహార్ కు తిరిగి వచ్చిన వలస కార్మికుల శ్రమ పాత్ర కూడా ఉందన్నారు.
ఈ ‘జల్ జీవన్ మిషన్’ బిహార్ లో చెమటోడ్చుతున్న సహోద్యోగులకు అంకితం అయింది అని ప్రధాన మంత్రి అన్నారు. గత ఏడాది లో దేశవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ లో రెండు కోట్లకు పైగా నీటి కనెక్షన్లను ఇవ్వడమైందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజు ఒక లక్ష పైగా గృహాలకు గొట్టాల ద్వారా కొత్తగా నీటి కనెక్షన్లను ఇవ్వడం జరుగుతోందన్నారు. శుభ్రమైన నీరు పేదల జీవితాలను మెరుగుపరచడం ఒక్కటే కాకుండా, అనేక తీవ్ర వ్యాధుల బారి నుండి వారిని కాపాడుతుందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో సైతం బిహార్ లో 12 లక్షల కుటుంబాలకు అమృత్ యోజన ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించే పనులు శర వేగంగా అమలవుతున్నాయని, వీటిలో దాదాపు 6 లక్షల కుటుంబాలు ఇప్పటికే శుద్ధ నీటి కనెక్షన్లను అందుకున్నాయని ఆయన తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో జనావాసాలు శీఘ్రంగా పెరుగుతున్నాయని, పట్టణీకరణ ప్రస్తుతం ఒక వాస్తవ రూపాన్ని దాల్చుతోందని ప్రధాన మంత్రి అన్నారు. అయితే, అనేక దశాబ్దాల పాటు, పట్టణీకరణ ను ఒక అడ్డంకిగా భావించారని ఆయన అన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ మాటలను ప్రధాన మంత్రి గుర్తు తెస్తూ, అంబేడ్కర్ పట్టణీకరణ ను ఒక సమస్య గా భావించలేదని చెప్పారు. అంబేడ్కర్ నిరుపేదలు కూడా అవకాశాలను చేజిక్కించుకునే నగరాలను గురించి ఆలోచించారని ప్రధాన మంత్రి అన్నారు. నగరాలు ఎలా ఉండాలంటే, ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి యువత, అనంతమైన అవకాశాలను, కొత్త అవకాశాలను దక్కించుకొంటూ ముందడుగు వేసే ఆస్కారం ఆ నగరాల్లో ఉండాలి అని ఆయన అన్నారు. ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా, సౌభాగ్యం తో జీవనం గడిపే విధంగా నగరాలు ఉండాలని ఆయన అన్నారు. పేద ప్రజలు, దళితులు, వెనుకబడిన వర్గాలవారు, మహిళలు అందరూ గౌరవప్రదమైన జీవనం గడిపే విధంగా నగరాలు ఉండాలని ప్రధాన మంత్రి అన్నారు.
దేశం లో ప్రస్తుతం ఒక నూతన పట్టణీకరణ ధోరణి ని మనం చూస్తున్నామని ప్రధాన మంత్రి అన్నారు. నగరాలు వాటి ఉనికిని చాటుకొంటున్నాయని కూడా ఆయన వివరించారు. కొన్నేళ్ళ క్రితం వరకు పట్టణీకరణ అంటే కొన్ని ఎంపిక చేసిన నగరాల లో ఏ కొద్ది ప్రాంతాలనో అభివృద్ధి చేయడంగా భావించారని, కానీ ప్రస్తుతం ఈ ఆలోచన మారుతోందని ప్రధాన మంత్రి అన్నారు. బిహార్ ప్రజానీకం భారతదేశంలో కొత్త తరహా పట్టణీకరణ కు వారి వంతుగా పూర్తి తోడ్పాటును అందిస్తున్నారని ఆయన అన్నారు. వర్తమాన అవసరాలకు అనుగుణంగా కాకుండా, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా నగరాలను తీర్చిదిద్దడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఈ ఆలోచన తోనే అమృత్ మిషన్ లో భాగంగా బిహార్ లోని అనేక నగరాల్లో కనీస సౌకర్యాల అభివృద్ధి కి ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బిహార్ లోని 100 కు పైగా పురపాలక సంస్థల్లో 4.5 లక్షలకు పైగా ఎల్ఇడి వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు శ్రీ మోదీ చెప్పారు. దీనితో మన చిన్న నగరాల్లోని వీధులలో దీపాల పరిస్థితి మెరుగుపడుతోందని, వందల కోట్ల రూపాయల విలువైన విద్యుత్తు ఆదా సాధ్యమవుతోందని, ప్రజల జీవితాలు సరళతరంగా మారుతున్నాయని ఆయన వివరించారు. రాష్ట్రంలోని సుమారు 20 పెద్ద నగరాలు, ప్రధాన నగరాలు, గంగానది తీర ప్రాంతాల్లోనే ఉన్నాయని ఆయన చెప్పారు. గంగానది శుద్ధి వల్ల, గంగా జలాన్ని శుభ్రపరచడం వల్ల ఈ నగరాల్లో ఉన్న కోట్లాది ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. గంగానది పరిశుభ్రతను దృష్టి లో పెట్టుకుని బిహార్ లో 6,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 50కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. నేరుగా గంగానది లోకి వచ్చి కలుస్తున్న మురికి కాలువలను అడ్డుకోవడానికి గంగా తీరాన్ని ఆనుకొని ఉన్న అన్ని నగరాల్లో అనేక నీటిశుద్ధి ప్లాంటులను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.
ఈ రోజు పట్నా లో ప్రారంభించిన బేవూర్, కరమ్-లీచక్ పథకం ఈ ప్రాంతంలో లక్షలాది ప్రజలకు ప్రయోజనాలను అందిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. దీనితో పాటు గంగానది ఒడ్డున ఉన్న పల్లెలను కూడా ‘గంగా గ్రామ్’ లుగా తీర్చిదద్దడం జరుగుతోందని ఆయన వివరించారు.
***
(Release ID: 1654521)
Visitor Counter : 285
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam