PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
20 MAY 2020 6:46PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో ప్రతి లక్ష జనాభాకు కోవిడ్ కేసులు 7.9 కాగా, ప్రపంచ సగటు ప్రతి లక్ష జనాభాకు 62.3.
- దేశంలో కోవిడ్-19 నయమైనవారి సంఖ్య 42,298; కోలుకున్న రోగుల శాతం 39.6కు మెరుగు.
- దేశంలో సుమారు 8 కోట్లమంది వలస/చిక్కుకుపోయిన కార్మికులకు కేంద్ర నిల్వలనుంచి ఉచిత ఆహారధాన్యాల కేటాయింపునకు కేంద్ర మంత్రిమండలి నిర్ణయానంతర ఆమోదం; అలాగే కోవిడ్-19పై పోరులో ఆర్థికవ్యవస్థకు మద్దతుగా స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీకింద పలు అంశాలకు సమ్మతి.
- శ్రామిక్ స్పెషల్ రైళ్లద్వారా 20 రోజుల్లో 23 లక్షలమందికిపైగా ప్రయాణికులను సొంత రాష్ట్రాలకు చేరవేసిన రైల్వేశాఖ; జూన్ 1 నుంచి కొత్త సమయ పట్టికతో 200 రైళ్ల రాకపోకలు ప్రారంభం.
- 10, 12 తరగతి పరీక్షల నిర్వహణకు దిగ్బంధ చర్యల నుంచి దేశీయాంగ శాఖ మినహాయింపు.
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; దేశంలో ప్రతి లక్ష జనాభాకు కేసులు 7.9 కాగా, ప్రపంచ సగటు లక్ష జనాభాకు 62.3; కోలుకున్నవారే సంఖ్య మెరుగుపడి 39.6 శాతానికి చేరిక
కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడంలో భారత్ సాపేక్షంగా విజయవంతమైందని ఈ మహమ్మారి పీడిత కేసులపై తాజా సమాచారం స్పష్టం చేస్తోంది. ప్రపంచ స్థాయితో పోలిస్తే ప్రతి లక్ష జనాభాకు 62.3 కేసులు నమోదవగా, మన దేశంలో నేటికీ ప్రతి లక్ష జనాభాకు కేవలం 7.9 కేసులు మాత్రమే నమోదవడం ఇందుకు నిదర్శనం. ఇక ప్రతి లక్ష జనాభాకు మరణాల సగటు ప్రపంచ స్థాయిలో 4.2 కాగా, భారతదేశంలో ఇది 0.2 మాత్రమే కావడం విశేషం. సాపేక్షంగా మరణాల సగటు తక్కువగా ఉండటాన్నిబట్టి- సకాలంలో రోగుల గుర్తింపు, కేసుల వైద్య నిర్వహణ చురుగ్గా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 42,298 కాగా, కోలుకునేవారి శాతం నిరంతరం మెరుగుపడుతూ 39.6కు చేరింది. దీంతో ఈ వ్యాధిని నయం చేయడం సాధ్యమేనని, తదనుగుణంగా భారత్ అనుసరించిన వైద్య నిర్వహణ విధివిధానాలు సమర్థమైనవేనని తేటతెల్లమవుతోంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625574
అలీనోద్యమ కూటమి ఆరోగ్య మంత్రుల సమావేశంలో పాల్గొన్న డాక్టర్ హర్షవర్ధన్
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా అలీనోద్యమ కూటమి (నామ్) దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజల జీవితాలను విచ్ఛిన్నం చేసిన ప్రపంచ మహమ్మారి సవాళ్లను అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న నేపథ్యంలో నామ్ సదస్సు జరగడం గమనార్హం. ఈ మేరకు కోవిడ్-19వల్ల ప్రపంచానికి వాటిల్లిన ముప్పుపై ‘నామ్’ ఆందోళన వ్యక్తం చేసింది. సముచిత సన్నద్ధత, నిరోధం, నిలదొక్కుకునే సామర్థ్య నిర్మాణం, జాతీయ-ప్రాంతీయ-అంతర్జాతీయ స్థాయిలో మరింత సంయుక్త, సమష్టి కృషితో ఈ సవాలను దీటుగా ఎదుర్కోవాలని దృఢ సంకల్పం ప్రకటించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625462
ప్రస్తుత పాక్షిక రుణ హామీ పథకంలో మార్పులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వరంగ బ్యాంకులు (PSB), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFC)/సూక్ష్మ ఆర్థిక సహాయ సంస్థలు (MFC/MFI) వంటివి జారీచేసే ‘ఎఎ’ (AA) అంతకన్నా తక్కువ రేటింగ్‌గల (రేటింగ్‌లేని వాస్తవ/ఏడాది ఆరంభ పరిపక్వత ఉన్నవిసహా) బాండ్లు/వాణిజ్య పత్రాల (CP) కొనుగోలుపై ప్రభుత్వ హామీ (సావరిన్ పోర్ట్‌ఫోలియో)ని పాక్షిక రుణ హామీ పథకం (PCGS) విస్తరణద్వారా 20శాతంగా నిర్ణయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625551
సూక్ష్మ ఆహారతయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకానికి మంత్రిమండలి ఆమోదం
అఖిల భారత ప్రాతిపదికన అసంఘటిత రంగం కోసం రూ.10,000 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన కేంద్ర ప్రాయోజిత “మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ ఫార్మలైజేషన్ స్కీమ్” (FME)కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలు వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625568
ప్రధానమంత్రి ‘వయో వందన యోజన’ పొడిగింపునకు మంత్రిమండలి ఆమోదం
ప్రధానమంత్రి వయా వందన యోజన (PMVVY)ను 2020 మార్చి 31 నుంచి 2023 మార్చి 31దాకా మరో మూడేళ్లు పొడిగించడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది వృద్ధపౌరుల సామాజిక భద్రతకు ఉద్దేశించిన పథకం. దీనికింద కొనుగోలు ధర/చందా మొత్తంపై హామీగల రాబడి ఆధారంగా వారికి కనీస పెన్షన్ లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై ప్రారంభంలో 2020-21కిగాను 7.4 శాతం వార్షిక రాబడికి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత ఏటా రాబడి శాతం సవరించబడుతుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625452
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు మంత్రిమండలి ఆమోదం
ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన (PMMSY) అమలుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దేశంలో సుస్థిర, బాధ్యతాయుత మత్స్యాభివృద్ధి రంగంద్వారా ‘నీలి విప్లవం’ తెచ్చేందుకు ఈ పథకం ఉద్దేశించబడింది. కేంద్ర ప్రభుత్వ పథకం (CS), కేంద్ర ప్రాయోజిత పథకం (CSS) కింద ఇది రెండు అంగాలుగా విభజించబడింది. ఈ రెండు అంగాల కింద (i) కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.9,407 కోట్లు (ii) రాష్ట్ర వాటాగా రూ.4,880కోట్లు (iii) లబ్ధిదారుల వాటాగా రూ.5,763 కోట్లు వంతున మొత్తం అంచనా పెట్టుబడి రూ.20,050 కోట్లుగా ఉంటుంది. ఈ పథకాన్ని 2020-21 ఆర్థిక సంవత్సరంనుంచి 2024-25దాకా ఐదేళ్లు అమలుచేస్తారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625414
స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీలో భాగంగా వలసదారులు/వలస కార్మికులకు ఆహారధాన్యాల కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం
దేశంలోని సుమారు సుమారు 8 కోట్లమంది వలసదారులు/చిక్కుకుపోయిన కార్మికులకు నెలకు తలా 5కిలోల వంతున (2020 మే జూన్) రెండు నెలలు ఉచిత ఆహారధాన్యాల కేటాయింపునకు కేంద్ర మంత్రిమండలి నిర్ణయానంతర ఆమోదం తెలిపింది. తద్వారా వెచ్చించే రాయితీ మొత్తం రూ.2,982.27కోట్లదాకా ఉంటుంది. రాష్ట్రాల్లో ఆహారధాన్యాల రవాణా, నిర్వహణ ఖర్చులు, డీలర్ల లాభశాతం/అదనపు లాభశాతం తదితరాలకు రూ.127.25 కోట్లదాకా అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. కోవిడ్-19వల్ల కలిగే ఆర్థిక దుస్థితి కారణంగా వలసదారులు/చిక్కుకుపోయిన కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు ఈ ఆహారధాన్యాల కేటాయింపుతో తీరగలవు.
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు/గృహరుణ సంస్థల ఆర్థిక ఒత్తిడిని తొలగించే ‘ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకా’నికి మంత్రిమండలి ఆమోదం
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, గృహ రుణ సంస్థలకు ద్రవ్య ప్రవాహాన్ని పెంచే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనివల్ల ప్రభుత్వంపై ప్రత్యక్ష ఆర్థికభారం రూ.5 కోట్లు కాగా, ఈ మొత్తాన్ని ప్రత్యేక ప్రయోజన సంస్థ (SPV)లో వాటా కింద సమకూర్చే అవకాశం ఉంది. అలాగే సంబంధిత హామీ నెరవేర్చే ప్రస్తావన వచ్చేదాకా ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదు. అయితే, అటువంటి ప్రస్తావన వచ్చినపుడు హామీ సొమ్ము గరిష్ఠ పరిమితికి లోబడి బకాయి మొత్తానికి సమానంగా ఉంటుంది. కాగా, సంచిత హామీ గరిష్ఠ పరిమితి రూ.30,000 కోట్లుగా నిర్ణయించబడింది. అవసరాన్నిబట్టి దీన్ని మరింత పెంచే వీలుంది.
అత్యవసర రుణ హామీ పథకం ప్రవేశపెట్టడంద్వారా అదనంగా రూ.3 లక్షల కోట్ల నిధులిచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం
దేశంలోని ఎంఎస్ఎంఈలు, ఆసక్తిగల ముద్ర రుణగ్రహీతలకు “అత్యవసర రుణ హామీ పథకం” ద్వారా రూ.3 లక్షల కోట్లదాకా అదనపు నిధులు సమకూర్చేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హతగల ఎంఎస్ఎంఈలు, ఆసక్తిగల ముద్ర రుణగ్రహీతలకు ‘హామీగల అత్యవసర రుణ వితరణ’ (GECL) రూపంలో రూ.3 లక్షల కోట్ల అదనపు నిధులు సమకూర్చడం కోసం ‘నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ’ (NCGTC) వందశాతం హామీ సదుపాయం కల్పిస్తుంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు మరో మూడు ఆర్థిక సంవత్సరాల కాలంలో రూ.41,600కోట్ల మూల నిధిని సమకూరుస్తుంది.
ఆయుష్మాన్ భారత్ పథకంలో ‘కోటి’ నమోదిత లబ్ధిదారుతో ప్రధాని సంభాషణ
దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారుల సంఖ్య కోటి స్థాయికి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. దీనిపై సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా ఆయన ప్రజలతో తన సంతోషం పంచుకుంటూ- ఇది ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పేర్కొన్నారు. “ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వినూత్న పథకంకింద రెండేళ్లకన్నా తక్కువకాలంలో చాలామంది జీవితాల్లో ఆశావహ దృక్పథం పాదుకొల్పింది. ఈ మేరకు లబ్ధిదారులకు, వారి కుటుంబసభ్యులకు నా అభినందనలు. వారంతా చక్కని ఆరోగ్యంతో జీవించాలని నేను ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లద్వారా 20 రోజుల్లో 23.5 లక్షలమందికిపైగా ప్రయాణికులను సొంత రాష్ట్రాలకు చేర్చిన భారత రైల్వేశాఖ
భారత రైల్వేశాఖ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 2020 మే 20వ తేదీ ఉదయం 10:00 గంటలదాకా 1773 ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లను నడిపి, 23.5 లక్షల మందికిపైగా ప్రయాణికులను వారి సొంత రాష్ట్రాలకు చేర్చింది. కాగా, నిన్న.. అంటే 2020 మే 19న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 205 ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లద్వారా 2.5 లక్షలమందికిపైగా ప్రయాణికులను గమ్యస్థానం చేర్చింది. మొత్తంమీద ఈ 1773 రైళ్లు- ఆంధ్రప్రదేశ్, బీహార్, చండీగఢ్ (కేంద్రపాలిత ప్రాంతం), ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం), పంజాబ్, రాజస్థాన్, ఒడిసా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలనుంచి బయల్దేరాయి.
కొత్త సమయ పట్టికతో 2020 జూన్ 1 నుంచి 200 రైళ్లు ప్రారంభం; ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్ల సంఖ్య రెట్టింపు చేయడంపై రైల్వేశాఖ యోచన
వలస కార్మికులకు మరింత ఊరట దిశగా ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లను రెట్టింపు సంఖ్యలో నడపాలని రైల్వేశాఖ యోచిస్తోంది. వీటితోపాటు 2020 జూన్ 1 నుంచి కొత్త సమయ పట్టికతో 200 రైళ్లను పునఃప్రారంభించనుంది. ఈ రైళ్లు ప్రయాణించే మార్గాలతోపాటు వాటి సమయాలను త్వరలో ప్రకటించనుంది. వీటిలో ప్రయాణించేందుకు ఆన్‌లైన్‌ద్వారా మాత్రమే టికెట్లు పొందే వీలు కల్పించనుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625268
విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా దిగ్బంధ చర్యల నుంచి 10, 12 తరగతి బోర్డు పరీక్షల నిర్వహణకు మినహాయింపు: శ్రీ అమిత్ షా
పెద్దసంఖ్యలోగల విద్యార్థుల విద్యా ప్రయోజనాల దృష్ట్యా 10, 12 తరగతుల బోర్డు పరీక్షల నిర్వహణకు దిగ్బంధం చర్యల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా తెలిపారు. దిగ్బంధం మార్గదర్శకాల మేరకు పాఠశాలలు తెరవడంపై నిషేధం ఉన్నందున ఆయా రాష్ట్రాల విద్యాబోర్డులు 10, 12 తరగతుల పరీక్షల నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర మాధ్యమిక విద్యాబోర్డు (సీబీఎస్‌ఈ) పరీక్షలకు నిర్వహణకు విజ్ఞప్తి చేశాయి. తదనుగుణంగా పరీక్షల నిర్వహణకు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు అనుమతి ఇస్తూ అందుకు తగిన నిబంధనలను దేశీయాంగ శాఖ నిర్దేశించింది.
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఉద్యోగులు-యాజమాన్యాలకు అధిక ద్రవ్య లభ్యత దిశగా ఉద్యోగ భవిష్యనిధి చందా 10 శాతానికి తగ్గింపు
స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీలో భాగంగా ఉద్యోగ భవిష్యనిధి-సంకీర్ణ నిబంధనల చట్టం-1952 పరిధిలోకి వచ్చే అన్నిరకాల సంస్థలకు సంబంధించి వేతనమాసాలు 2020 మే, జూన్, జూలైలకుగాను ఉద్యోగుల, యాజమాన్యాల చట్టబద్ధ భవిష్యనిధి చందా వాటాను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం 13.05.2020న ప్రకటన జారీచేసింది. అయితే, భవిష్యనిధి చందా వాటాలో ఈ తగ్గింపు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, లేదా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలోని సంస్థలకు వర్తించదు. ఆయా సంస్థలు మాత్రం తమ ఉద్యోగుల మూలవేతనం, కరవుభత్యం మొత్తంలో 12 శాతం వాటాను భవిష్యనిధికి జమచేయాల్సిందే.
జేఈఈ మెయిన్, నీట్-2020లకు నమూనా పరీక్షల కోసం కృత్రిమ మేధో పరిజ్ఞాన ఆధారిత మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన హెచ్‌ఆర్‌డి మంత్రి
“నేషనల్ టెస్ట్ అభ్యాస్” పేరిట ఓ కొత్త మొబైల్ యాప్‌ను శ్రీ రమేస్ పోఖ్రియాల్ నిషాంక్ ఆవిష్కరించారు. జాతీయ పరీక్షల ప్రాధికార సంస్థ (NTA) పరిధిలో నిర్వహించబోయే ‘జేఈఈ మెయిన్, నీట్’కు హాజరయ్యే అభ్యర్థులు నమూనా పరీక్షలకు హాజరవడం కోసం ఎన్టీఏ (NTA) ఈ యాప్‌ను రూపొందించింది. అభ్యర్థులు తమ ఇళ్లనుంచే సురక్షితంగా, సౌకర్యంగా ఈ అత్యున్నత నాణ్యతగల నమూనా పరీక్షలు రాసేందుకు వీలుగా ఇది రూపొందింది. దేశంలో దిగ్బంధం కారణంగా విద్యా సంస్థలతోపాటు ఎన్టీఏ నిర్వహణలోని పరీక్ష అభ్యాస కేంద్రాలన్నీ మూతపడటంతో విద్యార్థులు సిద్ధం కావడానికి సమయం సరిపోని దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారి డిమాండ్ మేరక ఎన్టీఏ యాప్‌కు రూపకల్పన చేసింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625238
కోవిడ్-19 అనంతర పరిస్థితులను ఎదుర్కొనేలా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం సాంకేతికత ఉన్నతీకరణకు ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి పిలుపు
కోవిడ్-19 అనంతర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే దిశగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం సాంకేతిక పరిజ్ఞాన ఉన్నతీకరణకు కృషిచేయాలని ఎంఎస్‌ఎంఈ రంగానికి శ్రీ నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చురుగ్గా కార్యాచరణలో దిగి, ఎంఎంస్‌ఎంఈ రంగానికి ప్రధాని ప్రకటించిన ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది మార్చి 31నాటికి దాదాపు 6 లక్షల ఎంఎంస్‌ఎంఈల పునర్నిర్మాణం పూర్తికగా, డిసెంబరు 31నాటికి ఈ సంఖ్య మరో 25 లక్షల మేర పెరగనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన రూ.10,000 కోట్ల విలువైన ‘నిధులతో కూడిన నిధి’ని ఇతర నిధుల చేర్పుద్వారా మరింత బలోపేతం చేసి రూ.50,000 కోట్లకు చేరుస్తామని ఆయన చెప్పారు.
దేశ ఆరోగ్య రంగంపై ఉన్నతస్థాయి బృందంతో 15వ ఆర్థిక సంఘం సమావేశం
ఆరోగ్యరంగంపై 2018 మే నెలలో ‘ఎయిమ్స్” డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అధ్యక్షతన, ఆ రంగంలోని పలువురు ప్రసిద్ధ నిపుణులు సభ్యులుగా ఒక ఉన్నతస్థాయి బృందాన్ని 15వ ఆర్థికసంఘం ఏర్పాటుచేసింది. ఈ బృందం 2019 ఆగస్టులో తుది నివేదికను సమర్పించింది. ఇందులోని కొన్ని కీలక సిఫారసులను 2020-21కిగాను తన తొలి నివేదికలో 15వ ఆర్థిక సంఘం పొందుపరచింది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఆరోగ్య రంగానికిగల అగ్రప్రాధాన్యం దృష్ట్యా ఈ ఉన్నతస్థాయి బృందంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.
కరోనా నిర్వహణకు ఈశాన్య భారత నమూనా
ఈ అంశంపై కేంద్ర ఈశాన్య భారత ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ (ఇన్‌చార్జి) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక వ్యాసం రాశారు.
గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం కొబ్బరి పీచు ఉత్పత్తుల వాడకానికి అనుమతి
కొబ్బరి పీచుతో రూపొందే ఉత్పత్తులు అధిక శోషకశక్తితోపాటు సహజమైనవేగాక బలంగా, చివికిపోకుండా అధిక మన్నికతో ఉండి సూక్ష్మజీవులను దరిచేరనివ్వవు. ఈ నేపథ్యంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఇది ఉత్తమ సరంజామా కాగలదని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల పథకం-3’ కింద దీన్ని వాడేందుకు అనుమతించింది. గ్రామీణ రోడ్ల నిర్మాణంలో కొబ్బరి పీచును ప్రత్యామ్నాయంగా వాడేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ఎంఎస్ఎంఈ, ఉపరితల రవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- "రహదారుల నిర్మాణంలో కొబ్బరి పీచు ఉత్పత్తుల వినియోగం విజయవంతం అవుతున్న నేపథ్యంలో ఇది కీలక పరిణామం. మొత్తంమీద ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో కుదేలైన కొబ్బరి పీచు పరిశ్రమకు ఈ నిర్ణయం ప్రాణప్రతిష్ట చేస్తుంది” అన్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625347
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- పంజాబ్: రాష్ట్రంలోని అమృతసర్ నుంచి 19.05.2020న 200వ రైలు బయల్దేరడంతో పంజాబ్ ప్రభుత్వం ఇప్పటిదాకా 2,50,000 మందికిపైగా వలస కార్మికులను వారి రాష్ట్రాలకు పంపినట్లయింది. కాగా, ఈ రైళ్లలో అధికశాతం ఉత్తరప్రదేశ్ వెళ్తుండగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ఛత్తీస్‌గఢ్, మణిపూర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లకు కూడా పంజాబ్ ప్రభుత్వం రైళ్లు పంపుతోంది. సంక్షోభం ప్రారంభమైన తొలి నాళ్లలోనే సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లాలనుకునే వలస కార్మికులకు అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
- హర్యానా: దేశంలో నాలుగో దశ దిగ్బంధంపై దేశీయాంగ శాఖ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రయాణిక వాహనాల సీటింగ్ సామర్థ్య పరిమితులను నిర్దేశిస్తూ హర్యానా ప్రభుత్వం తన సొంత మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే నియంత్రణ జోన్లలో సంచార నియంత్రణలో భాగంగా అత్యవసర, నిత్యావసర వస్తు/సేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ప్రతి ఒక్కరూ అన్ని సమయాల్లో సామాజిక దూరం పాటించాలని నిర్దేశించింది. మరోవైపు కోవిడ్-19వ్యాప్తి నిరోధానికి దేశీయాంగ శాఖ నిర్దేశిత దిగ్బంధం నాలుగోదశ ఏకీకృత మార్గదర్శకాల మేరకు హర్యానాతోపాటు చండీగఢ్‌లో గల ప్రభుత్వ కార్యాలయాలను పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గ్రూప్-ఎ, బి ఉద్యోగులు 100 శాతం; గ్రూప్-సి, డి ఉద్యోగులు 50 శాతం వంతున హాజరు కావాలని నిర్దేశించింది.
- హిమాచల్ ప్రదేశ్: ఈశాన్య భారత రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రవాసులను తరలించడానికి ఒక ఉమ్మడి రైలు నడపడంపై సమన్వయం చేయాలని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులను కోరారు. ఈశాన్య రాష్ట్రాలనుంచి హిమాచల్ ప్రదేశ్‌కు రోడ్డుమార్గాన వెళ్లడం అసాధ్యం కావడంతో ఈ రాష్ట్రాల ప్రజలను తరలించేందుకు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉమ్మడి రైలు నడిపేందుకు సంయుక్తంగా యత్నించాలని ఆయన అన్నారు. అంతేగాక ఈ రైలు నడపడంపై రైల్వేశాఖతోనూ సంయుక్తంగా సంప్రదించాలని కోరారు.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం మరో నాలుగు ‘ట్రూనాట్’ యంత్రాలను కొనుగోలు చేయనుంది.
- అసోం: ప్రధానమంత్రి నిర్దేశిత స్వయం సమృద్ధ భారతం సాధన దిశగా రాష్ట్రంలో రుణ పరపతి, బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ తన అధ్యక్షతన గువహటిలో వివిధ బ్యాంకుల అధికారులతో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
- మణిపూర్: రాష్ట్రంలో రోగలక్షణాలుగలవారికి మాత్రమేగాక రాష్ట్రానికి తిరిగివచ్చే అందరికీ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటిదాకా 2,743 పరీక్షలు నిర్వహించగా, వీటిలో 0.32 శాతం కేసులు నిర్ధారణ అయ్యాయి.
- నాగాలాండ్: దిమాపూర్‌లోగల గణేష్‌నగర్‌లోని ఈశాన్య భారత తొలి ప్రత్యేక ఆర్థికమండలిని ప్రధాన దిగ్బంధ వైద్య పర్యవేక్షణ కేంద్రంగా మార్చాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది. కాగా, ఇక్కడ 6000 మందికిపైగా వసతి కల్పించే వీలుంది.
- సిక్కిం: రాష్ట్రానికి తిరిగివచ్చే వారికోసం రంగ్పో గోలి మైదానంలో ఏర్పాటు చేస్తున్న అదనపు వైద్య పరీక్షల కేంద్రాన్ని కార్యాచరణ బృందం అధికారులతో కలిసి తూర్పు సిక్కిం జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
- త్రిపుర: అగర్తల నుంచి 1584 మంది ప్రయాణికులతో శ్రామిక్ స్పెషల్ రైలు ఇవాళ ప్రయాగ్‌రాజ్‌కు బయల్దేరింది. ఈ రైలెక్కేముందు ప్రయాణికులకు వైద్యపరీక్షలు నిర్వహించడంతోపాటు ఆ తర్వాత వారికి ఉచిత ఆహారం, నీరు అందించారు.
- కేరళ: రాష్ట్రంలో పాఠశాల పరీక్షలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే, నియంత్రణ జోన్లలో పరీక్ష కేంద్రాలు ఉండరాదని, విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మే 26నుంచి ప్రారంభం కావాల్సిన ఎస్‌ఎస్‌ఎల్‌సి, ప్లస్ టూ పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, స్వదేశం తిరిగి రాకముందే ప్రవాస భారతీయులకు కోవిడ్ పరీక్ష నిర్వహించేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు రాష్ట్రం హైకోర్టు నిరాకరించింది. ఇక రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ కఠినమైన షరతులతో జిల్లాల మధ్య బస్సులు నడపనుంది. క్షౌరశాలలు, బ్యూటీ పార్లర్లు, డిజిటల్ స్టూడియోలతోపాటు ఆభరణాల దుకాణాలు దాదాపు రెండు నెలల విరామం తర్వాత ఇవాళ తెరుచుకున్నాయి. గల్ఫ్ దేశాలతోపాటు రష్యానుంచి 6 విమానాలు ఈ రాత్రి రాష్ట్రానికి చేరుకోనున్నాయి. కాగా, ఓమన్‌లో మరో ఇద్దరు కేరళవాసులు కోవిడ్-19కు బలయ్యారు. రాష్ట్రంలో నిన్న 12 కొత్త కేసులు నమోదవగా వీరంతా విదేశాలనుంచి వచ్చినవారే కావడం గమనార్హం.
- తమిళనాడు: దిగ్బంధం నేపథ్యంలో ఆర్థిక సహాయం కింద రాష్ట్రంలో చేనేత సంక్షేమ బోర్డు సభ్యులుకాని తమిళనాడు చేనేత కార్మికులకు రూ.2000 వంతున సాయం ప్రకటించింది; కాగా, బోర్డు సభ్యులైన 1,03,343 కార్మికులకు రూ.2,000 మొత్తాన్ని రెండు విడతలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. దిగువ తరగతులకు పరీక్షలు నిర్వహించవద్దని రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలను మెట్రిక్యులేషన్ పాఠశాలల డైరెక్టరేట్ హెచ్చరించింది. కోవిడ్-19 రోగులను డిశ్చార్జి చేసే విధానాన్ని ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు మహమ్మారి నిర్వహణ కోసం సమగ్ర మార్గదర్శకాలను జారీచేసింది. నిన్నటిదాకా మొత్తం కేసులు: 12,448, యాక్టివ్ కేసులు: 7466, మరణాలు: 84, డిశ్చార్జ్: 4895. చెన్నైలో యాక్టివ్ కేసులు 5691.
- కర్ణాటక: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం 12 గంటలదాకా 63 కొత్త కేసులు నమోదయ్యాయి; వీటిలో హసన్ 21, బీదర్ 10, మాండ్యా 8, కల్బుర్గి 7, ఉడిపి 6, బెంగళూరు-తుమ్కూర్‌లలో నాలుగేసి, యాదగిరి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడలో ఒక్కొక్కటివంతున ఉన్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1458కి పెరిగింది. ఇవాళ 10 మంది డిశ్చార్జ్ అయిన నేపథ్యంలో కోలుకున్నవారి సంఖ్య 553కు చేరింది. ఇప్పటివరకూ 40 మరణాలు నమోదుకాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 864గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వలస కార్మికులకు తోడ్పడటం కోసం వారికి ఎక్కువ అవకాశాలివ్వాలని ముఖ్యమంత్రి ఇవాళ గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు.
- ఆంధ్రప్రదేశ్: యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి ఇవాళ రాష్ట్రంలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 156మంది ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాక వారిని ప్రత్యేక బస్సులలో స్వస్థలాలకు తరలించారు. వందేభారత్ మిషన్‌లో భాగంగా విదేశాలనుంచి రాష్ట్రానికి 13విమానాలు రానున్నాయి. ఇక రేపటి నుంచి ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో స్పందన పోర్టల్‌ద్వారా నమోదు చేసుకున్నవారికి ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభించింది. కాగా, తొలిదశలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులు, విద్యార్థులు, తరలింపుదారులను మాత్రమే ఈ బస్సులలో అనుమతిస్తారు. ఇక రాష్ట్రంలో ఇవాళ 68 కొత్త కేసులు, ఒక మరణం నమోదవగా గత 24 గంటల్లో 43 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసులు: 2407; యాక్టివ్: 715; రికవరీ: 1639; మరణాలు: 53; ఇతర రాష్ట్రాలనుంచి తిరిగి వచ్చిన 153 మందిలో వ్యాధిలక్షణాలు కనిపించగా 128మంది యాక్టివ్ కేసుల జాబితాలో ఉన్నారు.
- తెలంగాణ: ప్రభుత్వం నిర్దేశించిన సరి-బేసి ప్రణాళిక హైదరాబాద్‌లో తొలిరోజు అనుకున్నట్లు జరగలేదు. నగరంలోని సగం దుకాణాలను జీహెచ్‌ఎంసీ ఈ మేరకు గుర్తించక పోవడంతోపాటు నిబంధనల అమలులో అధికారుల వైఫల్యం ఇందుకు కారణమైంది. దీంతో పక్కపక్కనేగల దుకాణాలు తెరవడంవల్ల సామాజిక దూరం నిబంధన కూడా అమలు కాలేదు. కాగా, ఈ నెల 7 నుంచి 19 మధ్య మాస్కులు ధరించకుండా బయటకొచ్చినవారిపై పోలీసులు 16,264 కేసులు నమోదు చేశారు. ఇక రాష్ట్రంలో నిన్నటివరకూ కోవిడ్ కేసులు 1634దాకా ఉన్నాయి.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో తాజా సమాచారం ప్రకారం ఇవాళ 2,100 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 37,158కి పెరిగింది. హాట్‌స్పాట్‌గా ఉన్న ఒక్క ముంబై నగరంలోనే ఇవాళ 1411 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22,563కు చేరింది. పోలీసు సిబ్బందిలో కోవిడ్-19 కేసుల సంఖ్య ప్రస్తుతం 1388గా ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇక వందే భారత్ మిషన్ కింద 1972 భారత పౌరులు ముంబైకి తిరిగిరాగా, వారిని నిర్బంధవైద్య కేంద్రాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. వీరిలో 822 మంది ముంబైవాసులు, 1025 మంది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలవారు కాగా, 125 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు.
- గుజరాత్: రాష్ట్రంలో తాజా సమాచారం మేరకు... 21 జిల్లాలనుంచి 395 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 12,141కు చేరింది. మరణించినవారి సంఖ్య 719కు పెరగ్గా, ఇప్పటిదాకా 6,379 మంది కోలుకున్నారు. కోవిడ్-19 చికిత్సకు వాడే తక్కువ ఖర్చుతో కూడిన ధమన్-1 వెంటిలేటర్ల పనితీరు సరిగాలేదన్న ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది; NABL ఆమోదిత EQDC ప్రయోగశాలలో కృత్రిమ ఊపిరితిత్తులపై నిర్వహించిన భద్రత, పనితీరు పరీక్షలలో సామర్థ్యం నిరూపితమైన తర్వాతే ఈ వెంటిలేటర్లను కొనుగోలు చేసినట్లు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జయంతి రవి ఇవాళ స్పష్టం చేశారు.
- రాజస్థాన్: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం 2:00 గంటలదాకా 107 కొత్త కేసులు నమోదవగా వీటిలో అత్యధికం దుంగార్‌పూర్‌కు చెందినవే. దీంతో రాష్ట్రంలోని కోవిడ్-19 రోగుల సంఖ్య 5,952కు చేరింది. ఇప్పటిదాకా 3,373 మంది కోలుకోగా, 2939 మంది వివిధ ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు.
- మధ్యప్రదేశ్: తాజా సమాచారం ప్రకారం... 229 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం రోగుల సంఖ్య 5,465కు చేరుకుంది. కొత్త కేసులలో 72 హాట్‌స్పాట్ అయిన ఇండోర్ నగరంలోనే నమోదయ్యాయి. ఇక 42 కేసులతో బుర్హాన్పూర్ జిల్లా రెండోస్థానంలో ఉంది. నేటిదాకా 2,630 మంది కోలుకోగా, 2577 యాక్టివ్ కేసులున్నాయి.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో ఇప్పటిదాకా 101 కోవిడ్ కేసులు నిర్ధారణకాగా, 59 మంది కోలుకున్నారు. నేటిదాకా మరణాలేవీ సంభవించలేదు.
- గోవా: ఇవాళ 8 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 39కి చేరింది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలో ప్రవేశించిన 109 మందిని గృహనిర్బంధంలో ఉంచగా, 373మంది సంస్థాగత వైద్య నిర్బంధంలో ఉన్నారు.
PIB FACTCHECK




*****
(Release ID: 1625582)
|