సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

కాయిర్‌ జియో టెక్స్‌టైల్స్‌తో గ్రామీణ రహదారుల నిర్మాణానికి అనుమతి

కొబ్బరి పీచు పరిశ్రమకు ప్రాణం పోయనున్న కేంద్ర నిర్ణయం

Posted On: 20 MAY 2020 12:59PM by PIB Hyderabad

కొబ్బరి పీచుతో తయారైన చాపలు, పట్టలు మంచి శోషణ శక్తిని కలిగి ఉంటాయి. ఇవి సహజమైనవి. బలంగా, చల్లగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయి. చిరుగులకు లోనకావు. సూక్ష్మజీవులను దరి చేరనివ్వవు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కొబ్బరి పీచును గ్రామీణ రోడ్ల నిర్మాణంలో వాడేందుకు అనుమతి లభించింది.

     పీఎంజీఎస్‌వై-3 కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లలో కాయిర్‌ జియో టెక్స్‌టైల్స్‌ను ఉపయోగిస్తామని, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏజెన్సీ సమాచారం ఇచ్చింది. 

    గ్రామీణ రోడ్ల నిర్మాణంలో కొబ్బరి పీచును ప్రత్యామ్నాయంగా వాడేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో ఎంఎస్‌ఎంఈ, రహదారి రవాణా&హైవే శాఖల మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ కీలక పాత్ర పోషించారు. ఆయన మాట్లాడుతూ, "ఇది ముఖ్యమైన పరిణామం. రోడ్ల నిర్మాణంలో కాయిర్‌ జియో టెక్స్‌టైల్స్‌ వాడడంలో మనం ఇప్పుడు విజయం సాధించాం. కొవిడ్‌ సమయంలో కుదేలైన కొబ్బరి పీచు పరిశ్రమకు ఈ నిర్ణయం ప్రాణం పోస్తుందని"చెప్పారు.

    పీఎంజీఎస్‌వై ఇచ్చిన కొత్త సాంకేతిక మార్గదర్శకాల ప్రకారం, ప్రతి నిర్మాణ ప్రతిపాదనలో 15 శాతం పొడవైన రోడ్లను కొత్త సాంకేతికతలు ఉపయోగించి నిర్మించాలి. ఇందులో 5 శాతం రోడ్లను 'ఐఆర్‌సీ' గుర్తింపు పొందిన సాంకేతికత ఆధారంగా నిర్మించాలి. కాయిర్‌ జియో టెక్స్‌టైల్స్‌ను నిర్మాణ సామగ్రిగా ఐఆర్‌సీ ప్రస్తుతం గుర్తించింది.
 
    కేంద్ర సూచనల ప్రకారం, పీఎంజీఎస్‌వై-3 కింద నిర్మించే గ్రామీణ రహదారుల్లో 5 శాతాన్ని కాయిర్‌ జియో టెక్స్‌టైల్స్‌ను ఉపయోగించి నిర్మించాలి. దీని ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 164 కిలోమీటర్లు‌, గుజరాత్‌లో 151 కిలోమీటర్లు, కేరళలో 71 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 328 కిలోమీటర్లు, ఒడిశాలో 470 కిలోమీటర్లు, తమిళనాడులో 369 కిలోమీటర్లు‌, తెలంగాణలో 121 కిలోమీటర్ల రహదారిని కాయిర్‌ జియో టెక్స్‌టైల్స్‌ ఉపయోగించి నిర్మిస్తారు. ఈ ఏడు రాష్ట్రాల్లో మొత్తం 1674 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంలో కాయిర్‌ జియో టెక్స్‌టైల్స్‌ను వినియోగిస్తారు. ఇందుకోసం ఒక కోటి చదరపు మీటర్ల కాయిర్‌ జియో టెక్స్‌టైల్స్‌ అవసరమని, ఇందుకు రూ.70 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 
 
    కోవిడ్-19 దెబ్బతో డీలా పడిన కొబ్బరి పీచు పరిశ్రమకు కేంద్ర నిర్ణయం వరంలా మారింది. దేశంలో కాయిర్ జియో టెక్స్‌టైల్స్‌కు మార్కెట్‌ పెంచుతుంది.



(Release ID: 1625347) Visitor Counter : 263