PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 18 SEP 2020 6:29PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • గత 24 గంటల్లో 87,472 మందికి వ్యాధి నయం.
  • కోలుకునేవారి సగటు 78.86 శాతంగా నమోదు.
  • దేశంలోని ఐదు రాష్ట్రాలో్లనే క్రియాశీల, కోలుకున్న కేసులు అత్యధికం.
  • మొత్తం కేసులలో మరణాల సగటు ప్రస్తుతం 1.62 శాతానికి పరిమితం.
  • కోవిడ్‌ సమయంలో రైల్వేశాఖ నిర్విరామంగా సేవలందించిందని ప్రధానమంత్రి ప్రశంస.
  • ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 3,445 కేసులతో ప్రపంచంలో అత్యల్ప సగటుగల దేశాల్లో భారత్‌.
  • దేశంలోని పరిశ్రమలు, విద్యా సంస్థలలో పరిశోధనలు... వివిధ దశల్లో సుమారు 30 దాకా నమూనా టీకాలు

కోవిడ్ నుంచి కోలుకోవటంలో భారత్ సరికొత్త రికార్డు; 24 గంటల్లో 87,472 మందికి వ్యాధిన‌యం; బాధితులు, కోలుకున్నవారు కూడా 5 రాష్ట్రాల్లోనే అధికం

కోవిడ్‌ నుంచి ఒక్కరోజులో కోలుకునేవారి సంఖ్యరీత్యా భారత్‌ మళ్లీ కొత్త రికార్డు సృష్టించింది. గత 24 గంటల్లో 87,472 మంది ఆస్పత్రులనుంచి ఇళ్లకు వెళ్లడటం, ఏకాంత గృహవాసం నుంచి విముక్తం కావటం జరిగింది. దేశంలో కోలుకునేవారి సంఖ్య చాలా రోజులనుంచీ ఎక్కువగా నమోదవుతోంది. తదనుగుణంగా గత 11 రోజులలో నిత్యం 70,000 మందికిపైగా కరోనా బాధితులు విముక్తులు కావడంతో కోలుకునేవారి జాతీయ సగటు ఇవాళ 78.86 శాతానికి పెరిగింది. మొత్తంమీద ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 41,12,551కి చేరింది. ప్రస్తుతం చికిత్స పొందే కేసులకన్నా కోలుకున్నవి 4.04 రెట్లు అంటే- 30,94,797 మేర అధికంగా ఉన్నాయి. ఇక చికిత్సలోగల, కోలుకున్న కేసులు దేశంలోని 5 రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. ఈ మేరకు మొత్తం క్రియాశీల కేసులలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక,  ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే 59.8 శాతం ఉన్నారు. అయితే, కోలుకున్నవారిలోనూ ఈ ఐదు రాష్ట్రాల్లోనే 59.3 శాతం నమోదు కావటం గమనార్హం. మరోవైపు కొత్తగా కోలుకునేవారిలో 90 శాతం 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలవారే ఉన్నారు. ఆ మేరకు తాజాగా కోలుకున్నవారిలో 22.31 శాతం మహారాష్ట్ర (19,522)లో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ (12.24%), కర్ణాటక (8.3%), తమిళనాడు (6.31%) చత్తీస్‌గఢ్‌ (6.0%)లలో 32.8 శాతం ఉన్నారు. మొత్తంమీద కొత్తగా కోలుకున్నవారిలో 55.1 శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉన్నారు. మరోవైపు నమోదిత కేసులలో 1.62 శాతం మరణాలతో ప్రపంచంలో అత్యల్ప మరణాల సగటుగల దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656100

ప్రపంచ వ్యాధిగ్రస్థుల భద్రత దినోత్సవంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సదస్సు

రెండో ‘ప్రపంచ వ్యాధిగ్రస్థుల దినోత్సవం’ సందర్భంగా కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ ఆరోగ్య వ్యవస్థ వనరుల కేంద్రం నిన్న ఒక వెబినార్‌  నిర్వహించింది. కోవిడ్‌-19 మహమ్మారి భారీ సవాళ్లను, నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో రోగుల సంరక్షణ సందర్భంగా ముందువరుసలో ఉండి సేవలందించిన ఆరోగ్య కార్యకర్తలు ప్రధానంగా వాటికి గురవుతారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరం వ్యాధిగ్రస్తుల దినోత్సవ ఇతివృత్తాన్ని “ఆరోగ్య కార్యకర్తల భద్రతతోనే; రోగుల భద్రతకు పాధాన్యం”గా నిర్దేశించారు. అలాగే “సురక్షిత ఆరోగ్య కార్యకర్తలు-సురక్షిత రోగులు” నినాదంతో ఈ కార్యక్రమం సాగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల గురించి ఆరోగ్యశాఖ కార్యదర్శి తన ప్రసంగంలో వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656019

జి20 ఆరోగ్య-ఆర్థికశాఖ మంత్రుల సంయుక్త సమావేశంలో డాక్టర్‌ హర్షవర్ధన్‌ ప్రసంగం

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జి20 ఆర్థిక-ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన ప్రసంగిస్తూ- ప్రజారోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టడంవల్ల కలిగే మేలు గురించి వివరించారు. భారతదేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన ఈ విధానం ఇప్పటికే మొదలైందని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు మహమ్మారిపై పోరులో సంసిద్ధతకు సమర్థ ఆరోగ్య వ్యవస్థల రూపకల్పనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656305

చారిత్రక కోసి మహా రైలువారధిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి; బీహార్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త రైలుమార్గాలు, విద్యుదీకరణ పథకాలకు ప్రారంభోత్సవం; కోవిడ్‌ వేళ రైల్వేశాఖ నిర్విరామ సేవలకు ప్రశంసలు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బీహార్‌లో చారిత్రక ‘కోసి మహా రైలువారధి’ని జాతికి అంకితం చేయడంతోపాటు కొత్త రైలుమార్గాలు, విద్యుదీకరణ పథకాలను ప్రారంభించారు. బీహార్‌లో రైలుమార్గ అనుసంధానం చరిత్ర సృష్టించిందని ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. నవ భారత ఆకాంక్షలకు అనుగుణంగా, ‘స్వయం సమృద్ధ భారతం’ అంచనాలను ఆందుకునేలా రైల్వేశాఖకు సరికొత్త రూపమివ్వడం కోసం గడచిన ఆరేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత రైల్వేలు మునుపటికన్నా నేడు మరింత పరిశుభ్రంగా ఉన్నాయన్నారు. బ్రాడ్‌గేజ్‌ రైలుమార్గాల్లో మానరవహిత గేట్లను తొలగించడం ద్వారా రైల్వేలను గతంతో పోలిస్తే మరింత సురక్షితం చేసినట్లు వివరించారు. కరోనా సంక్షోభ సమయంలో రైల్వేలు నిర్విరామంగా పనిచేశాయని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఖ్యంగా వలస కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు వారిని శ్రామిక ప్రత్యేక రైళ్లద్వారా స్వస్థలాలకు చేర్చడంలో రైల్వే కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656342

కోవిడ్‌ కేసులు... సెరో సర్వే ప్రస్తుత పరిస్థితులు

భారతదేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు కోవిడ్‌ కేసుల సంఖ్య 3445 సగటుతో  అత్యల్పంగా ఉంది. ఆ మేరకు అమెరికా 19,295, బ్రెజిల్‌ 20,146, రష్కా సమాఖ్య 7,283, దక్షిణాఫ్రికా 10,929 సగటుతో పోలిస్తే భారత్‌ ఎంతో మెరుగ్గా ఉండటం గమనార్హం. అయితే, ఆగ్నేయాసియా దేశాలతో పోలిస్తే మాత్రం భారత్‌లో ప్రతి 10 లక్షల జనాభాకు కేసుల సగటు ఎక్కువేనని చెప్పవచ్చు. ఇక భారత్‌లో మరణాల సగటు అత్యల్పంగా కాగా- కేసుల సత్వర గుర్తింపు, సకాలంలో ఆస్పత్రులకు తరలింపు, చికత్స-పర్యవేక్షణ తదితర విధానాలే ఇందుకు కారణం. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ మేరకు వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656310

కోవిడ్‌ వ్యాప్తి నిరోధంపై అంచనాలు

చైనాలోని వుహాన్ నగరంలో గుర్తుతెలియని మూలం నుంచి న్యుమోనియా వంటి వ్యాధి వ్యప్తి గురించి భారత్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం 2020 జనవరి 6న కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. అటుపైన జనవరి 9వ తేదీన ‘నవ్య కరోనావైరస్’ విస్తృత వ్యాప్తి గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. తర్వాత ఈ వైరస్‌కు ‘సార్స్‌-సీవోవీ-2’ (SARS-CoV-2)గా, దీనివల్ల సోకే వ్యాధికి ఫిబ్రవరి 11న “కోవిడ్‌-19”గా నామకరణం చేసింది. కాగా, భారత్‌లో తొలి కోవిడ్‌-19 కేసు 2020 జనవరి 30న వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో జాతీయస్థాయి దిగ్బంధం విధించడానికి ముందునుంచే ప్రభుత్వం అనేక ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2020 జనవరి 18న ఓడరేవులు, విమానాశ్రయాలు, భూ సరిహద్దులద్వారా ప్రయానికుల ప్రవేశ ప్రాంతాల్లో తనిఖీ ప్రారంభించింది. ఇలా అప్పటినుంచీ చేపట్టిన చర్యల క్రమాన్ని ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656410

జమ్మూ ప్రాంతానికి ఉన్నతస్థాయి బృందాన్ని పంపిన కేంద్ర ప్రభుత్వం

జమ్ము జిల్లాలో కోవిడ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయించింది. అక్కడి పరిస్థితులపై సమీక్షించి, మహమ్మారిపై నిఘా, నియంత్రణ, పరీక్షలు, కేసులకు సమర్థ చికిత్స తదితర కార్యకలాపాల్లో అక్కడి యంత్రాంగానికి ఈ బృందం సహకరిస్తుంది. కాగా, కేసుల సంఖ్య అధికంగా నమోదయ్యే వివిధ రాష్ట్రాలకు/కేంద్రపాలిత ప్రాంతాలకు కోవిడ్‌ నిర్వహణ కోసం పంపిన తరహాలోనే కేంద్రం జమ్ము విషయంలోనూ స్పందించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655895

టీకాపై పరిశోధనలకు నిర్దిష్ట ప్రక్రియ

దేశంలో టీకాలపై పరిశోధన-ప్రయోగాలుసహా కొత్త మందుల విక్రయం తదితరాలపై అనుమతులకు సంబంధించిన విధివిధానాలు ఇకపై “న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్-2019” అనుగుణంగా ఉంటాయని ‘కేంద్ర ఔషధ ప్రమాణ-నియంత్రణ సంస్థ (CDSCO) ప్రకటించింది. కోవిడ్‌-19 టీకాపై పరిశోధన, అధ్యయనాల కోసం దేశంలోని ఏడు తయారీ సంస్థలకు సీడీఎస్‌సీవో అనుమతులిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు వెల్లడించింది. కాగా, కరోనావైరస్‌పై టీకాల పరిశోధన-అభివృద్ధికి సంబంధించి ప్రామాణిక ప్రక్రియలు అతిక్రమించినట్లు తమకు ఎలాంటి నివేదికలూ అందలేదని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655718

దేశంలోని పరిశ్రమలు, విద్యా సంస్థలలో పరిశోధనలు... వివిధ దశల్లో సుమారు 30 దాకా నమూనా టీకాలు

కేంద్ర జీవసాంకేతిక విభాగం దేశంలో ఐదు జాతీయ కోవిడ్‌-19 జీవ సాంకేతిక నిధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. జీవసాంకేతిక విభాగం, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), పారిశ్రామిక-శాస్త్రవిజ్ఞాన పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయ తలపెట్టిన కోవిడ్‌-19 సాంకేతిక నిధి కేంద్రాలలో ప్రస్తుత 5 కేంద్రాలు ఒక భాగం. కాగా, జాతీయ స్థాయిలో పరిశ్రమలు, విద్యాసంస్థల ఆధ్వర్యంలో దాదాపు 30దాకా కోవిడ్ టీకాల నమూనాల పరిశోధన-అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. వీటిలో 3 ప్రస్తుతం తొలి, మలి, తృతీయ ప్రయోగాత్మక దశలను పూర్తిచేసుకున్నాయి. మరో 4 ఆధునిక ప్రయోగపూర్వ దశలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర శాస్త్ర-సాంకేతిక-భూ విజ్ఞాన, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656455

కోవిడ్‌-19 అనంతరం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో మార్పు

దేశవ్యాప్త కోవిడ్‌-19 దిగ్బంధ సమయంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ  ‘ఇ-స్కిల్‌ఇండియా’ వేదికపై జాతీయ నైపుణ్యాధివృద్ధి సంస్థద్వారా ఆన్‌లైన్ నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలోపాటు 2020 సెప్టెంబర్ 21 నుంచి  ప్రత్యక్ష నైపుణ్య శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు దేశీయాంగ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం... శిక్షణ పునఃప్రారంభానికి ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రామాణిక విధాన ప్రక్రియలను జారీచేసింది. ఈ మేరకు నైపుణాభివృద్ధి- వ్యవస్థాపన శాఖ సహాయమంత్రి శ్రీ ఆర్.కె.సింగ్‌ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656131

మహమ్మారి సమయంలో ఎగుమతుల ప్రోత్సాహానికి చర్యలు

ప్రపంచ మహమ్మారి సమయంలో ఎగుమతులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం నిరంతర కృషి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా 2020 మార్చి నుంచి ఎగుమతుల ప్రోత్సాహక మండళ్లు, పారిశ్రామిక సంఘాల సమాఖ్య, వివిధ పరిశ్రమల సంఘాలు/సంస్థలతో వారికిగల సమస్యలపై చర్చిస్తూనే ఉంది. వారు లేవనెత్తిన వివిధ సమస్యలు, ఇబ్బందుల సత్వర పరిష్కారానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలు ప్రయత్నించాయి. తదనుగుణంగా ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వీటిగురించి కేంద్ర వాణిజ్య-పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656296

ఎలక్ట్రానిక్‌ వాణిజ్యంపై కోవిడ్‌-19 ప్రభావం

కోవిడ్‌-19 దిగ్బంధం సమయంలో సామాజిక దూరం నిబంధనను కచ్చితంగా పాటించే విధంగా దేశీయాంగ శాఖ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీచేస్తూ వచ్చింది. తదనుగుణంగా ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలుసహా నిత్యావసర వస్తువుల సరఫరా కోసం ఎలక్ట్రానిక్‌ వాణిజ్య సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించింది. అయితే, ప్రస్తుతం మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇ-కామర్స్ రంగంపై అది ఏ మేరకు ఉన్నదో అంచనా వేసేందుకు ఇది సమయం కాదు. ఇందుకోసం అనేక అంశాలను పరిశీలించాల్సిన ఉన్నందున ఇ-కామర్స్ నిర్వాహకులు కూడా ఇతర వస్తుసేవల సరఫరాదారుల తరహాలో వస్తుసేవల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య-పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656213

రైలు బోగీలు ఏకాంత చికిత్స వార్డులుగా మార్పు

కరోనావైరస్‌ మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత రైల్వేశాఖ 2020 మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో 601 బోగీలను కోవిడ్‌ సంరక్షణ కేంద్రాలుగా మార్పుచేసింది. వివిధ రాష్ట్రాల్లో సదుపాయాల కొరత ఏర్పడినప్పుడు మాత్రమే ఈ ప్రత్యేక రైలు బోగీలను వాడుకునే వెసులుబాటు కల్పించింది. తదనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన మేరకు ఇవాళ్టిదాకా మొత్తం 813 బోగీలను సమకూర్చింది. ఈ మేరకు రైల్వే, వాణిజ్య-పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655887

శ్రామిక్‌ రైళ్లు

కోవిడ్‌ దిగ్బంధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల తరలింపు నిమిత్తం రాష్ట్రాల అవసరాలకు తగినట్లు ప్రభుత్వాల విజ్ఞప్తిపై  రైల్వేశాఖ ఉద్యమ తరహాలో శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను నడిపింది. తదనుగుణంగా 2020 మే 1వ తేదీనుంచి ఆగస్టు 31వ తేదీవరకు 4,621 రైళ్లద్వారా 63.19 లక్షల మందిని వారి సొంత రాష్ట్రాలకు చేరవేసింది. ఈ మేరకు రైల్వే, వాణిజ్య-పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ  పీయూష్‌ గోయల్‌ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655887

మాస్కులు, పీపీఈ కిట్ల కోసం తగుమేర ముడిపదార్థాల లభ్యత

దేశంలో కోవిడ్‌ మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో 2020 మార్చినాటికి పీపీఈ కిట్లు తయారుచేసే యూనిట్లు ఒక్కటికూడా లేని పరిస్థితి నుంచి ప్రభుత్వ ప్రోత్సాహంతో నేడు ఏకంగా 1,100 సంస్థలు వీటిని తయారుచేస్తున్నాయి. వీటిలో అధికశాతం ఎంఎస్‌ఎంఈ రంగంలోనివి కాగా, 2020 మే నాటికి వీటి ఉత్పత్తి రోజుకు 5 లక్షల స్థాయికి దూసుకెళ్లింది. ఈ మేరకు కేంద్ర జౌళిశాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్‌ ఇరానీ ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656453

జౌళి రంగంపై కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావం

కోవిడ్‌-19 అంతర్జాతీయ మహమ్మారి ప్రభావం నేపథ్యంలో పలు నిబంధనలు, విధివిధానాలకు అనుగుణంగా వివిధ జౌళిరంగ పరిశ్రమలు తమ నిర్వహణ విధానాలను మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘భారత పట్టు పరిశ్రమపై కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావం’ పేరిట ప్రభుత్వం ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ సందర్భంగా ఉత్పత్తికి ఆటంకాలు, ఆర్డర్లు రద్దుకావడం, ఎగుమతులు దెబ్బతినడంసహా పరిశ్రమకు ఎదురైన పలు సమస్యలను గుర్తించింది. తదనుగుణంగా జౌళి రంగాన్ని ఆదుకునేందుకు స్వయం సమృద్ధ భారతం కింద ఉద్దీపన చర్యలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర జౌళిశాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్‌ ఇరానీ ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655643

కోవిడ్‌-19 సమయంలో ఆరోగ్య సేవల అందుబాటు

కోవిడ్‌-19 నేపథ్యంలో ఆరోగ్య సేవల అందుబాటుపై కేంద్ర ప్రభుత్వం క్రమబద్ధంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్షిస్తూ వచ్చింది. అలాగే మహిళలు, పిల్లలకు పౌష్టికాహార సరఫరా, ఇతర కార్యక్రమాల అమలుపై కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి శాఖ అనేక చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్‌ ఇరానీ ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656246

అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటియు) వేదికపై టెలికాం/ ఐసీటీ కార్యకలాపాలకు బ్రిక్స్ దేశాల నిరంతరం సహకారం: సంజయ్ ధోత్రే

బ్రిక్స్‌ కూటమి కమ్యూనికేషన్‌ మంత్రుల 6వ సమావేశాన్ని 2020 సెప్టెంబర్ 17న ఆన్‌లైన్‌ మాధ్యమంద్వారా నిర్వహించారు. భారత్‌ తరఫున కమ్యూనికేషన్లు-ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్‌-19పై పోరులో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీల పాత్ర, ఐసీటీల వాడకంలో విశ్వాసం/భద్రతల పెంపు తదితర ముఖ్యమైన అంశాలలో బ్రిక్స్ కూటమి దేశాలమధ్య సహకారం కొనసాగించడంపై సమావేశంలో విస్తృత ఏకాభిప్రాయానికి వచ్చింది. కాగా, భారత ప్రభుత్వం కోవిడ్‌ మహమ్మారి నిర్వహణలో భాగంగా చేపట్టిన వినూత్న డిజిటల్‌ చర్యల గురించి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పాత్ర గురించిచ శ్రీ సంజయ్ ధోత్రే తన ప్రసంగంలో వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656017

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • కేరళ: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నందాకా మూడు కోవిడ్ మరణాలు నమోదవగా మొత్తం మృతుల సంఖ్య 492కు చేరింది. కాగా, మంత్రి కె.టి.జలీల్‌ రాజీనామా డిమాండ్‌తో విపక్షాలు ఇవాళ వరుసగా 7వ రోజు కొనసాగించిన నిరసనల్లో కోవిడ్‌ నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగింది. కేరళలో నిన్న 4351 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం చికిత్స పొందే రోగుల సంఖ్య 34,314కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,13,595 మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కోవిడ్‌ నిర్ధారణ ఫలితాన్ని ఐదు నిమిషాల్లో వెల్లడించగల కొత్త పద్ధతిని  అమెరికాకు చెందిన రాపిడ్ డయాగ్నస్టిక్స్ ప్లాట్‌ఫాం సంస్థ రికవర్ హెల్త్‌కేర్ ఇంక్, ఐఐటీ-మద్రాస్ సంయుక్తంగా పాయింట్-ఆఫ్-కేర్ కోవిడ్-19 యాంటిజెన్ పరీక్షను అభివృద్ధి చేశాయి, ఇవి లాలాజల నమూనాలను ఉపయోగించి ఐదు నిమిషాల్లో ఫలితాలను అందించగలవు. కాగా, దేశవ్యాప్తంగా 63 మంది వైద్యులు కోవిడ్‌కు బలికాగా, వారిలో చెన్నైకి చెందినవారు 12 మంది ఉన్నారని ఢిల్లీలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. తమిళనాడులో గురువారం 5,560 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. కాగా, రాష్ట్రంలో 45,000 మందికిపైగా పిల్లలు ఇప్పటిదాకా కోవిడ్‌కు చికిత్స పొంది కోలుకున్నారని తెలిపారు.
  • కర్ణాటక: అధికారిక నిధుల పంపిణీ తగ్గిన నేపథ్యంలో కర్ణాటకకు రూ.5,495 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్న 14వ ఆర్థిక కమిషన్ సిఫారసులను అంగీకరించాలని ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప గురువారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో కోవిడ్ కేసుల నిరంతర పెరుగుదలవల్ల  కర్ణాటక కేసుల సంఖ్య అక్టోబరు 12 నాటికి 7 లక్షలకు చేరుతుందని, మరణాలు 11,200కు చేరగలవని ఒక అధ్యయనం పేర్కొంది. ఇక విక్టోరియా ఆసుపత్రిలో 370 మంది కోవిడ్‌ రోగుల మరణాలపై విశ్లేషణ సందర్భంగా వీరిలో 71మంది చేరిన 12 గంటల్లోగా, 32 మంది 24 గంటల్లోగా ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. ఈ ఆస్పత్రిలో ఇప్పటివరకు 5,000 మంది కోవిడ్ రోగులకు చికిత్స చేశారు.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో రేపటినుంచి సిటీ బస్సులు నడపడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తొలిదశలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విశాఖపట్నం, విజయవాడలలో బస్సులు నడుపుతారు. అయితే బస్సులలో 60 శాతం ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. కాగా, ఏపీ ఎంసెట్‌ తొలిరోజు పరీక్షకు తెలంగాణ నుంచి ఇంజనీరింగ్‌ విభాగంలో 5,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2043 కొత్త కేసులు, 11 మరణాలు నమోదవగా 1802 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 314 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,67,046; క్రియాశీల కేసులు: 30,673; మరణాలు: 1016; డిశ్చార్జి: 1,35,357గా ఉన్నాయి. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఫ్ఆర్), హైదరాబాద్ పరిశోధకులు 30 నిమిషాల్లో కరోనా వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ ప్రత్యక్ష గుర్తింపు కోసం రంగు-ఆధారిత పరీక్షను ప్రామాణీకరించారు. సత్వర, విశ్వసనీయ పరీక్షా పద్ధతుల అవసరాన్ని తీర్చడంలో ఆర్టీ-ల్యాంప్‌ పరీక్ష ఆచరణీయ ప్రత్యామ్నాయమని టిఎఫ్ఆర్ పరిశోధకులు శుక్రవారం తెలిపారు.
  • మహారాష్ట్ర: ముంబై, పుణె ఇతర ప్రదేశాల మధ్య ఇంటర్‌సిటీ ఎయిర్ కండిషన్డ్ (ఎసి), నాన్-ఎసి బస్సులలో ప్రయాణించేవారిపై మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ అధికారులు నేటినుంచి ఆంక్షలను సడలించారు. కాగా, కరోనావైరస్ వ్యాధి వ్యాప్తి మధ్య ఆంక్షల సడలింపులో భాగంగా ఎంఎస్‌ఆర్‌టిసి తన బస్సులను పూర్తి సామర్థ్యంతో నడపడం ప్రారంభించింది. ఇక మహారాష్ట్ర ఇంధనశాఖ మంత్రి నితిన్ రౌత్‌కు కోవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటిదాకా వ్యాధికి గురైన మంత్రులలో ఈయన 9వ వారుగా నిలిచారు.
  • గుజరాత్: రాష్ట్రంలో ఒకేరోజు అత్యధికంగా 1,379 కొ్త్త కేసులు నమోదవగా, మొత్తం కేసులు 1,19,088కి చేరాయి. అలాగే మరో 14 మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య 3,273కు పెరిగినట్లు గుజరాత్‌ ఆరోగ్యశాఖ అధికారులు గురువారం తెలిపారు. కాగా, కొత్త కేసులలో సూరత్‌లో 280, అహ్మదాబాద్ 171, రాజ్‌కోట్ 145, జామ్‌నగర్ 129, వడోదర 127 వంతున నమోదయ్యాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో కోవిడ్‌ మరణాలకు ప్రధాన కారణమైన సహ అనారోగ్యాలు, ముందునుంచీ ఉన్న వ్యాధులు గలవారికి స్పెషలిస్ట్ వైద్యులు సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇప్పటిదాకా గుండె, మూత్రపిండాలు, మెదడు, ఇతర అవయవాల చికిత్సలు చేసే నిపుణులు నేరుగా కోవిడ్ చికిత్స ప్రక్రియలో పాల్గొనలేదు. అయితే, ఇకపై RUHS హాస్పిటల్, జైపురియా ఆసుపత్రిలో చేరేవారు SMS వైద్య కళాశాల నిపుణుల సేవలను పొందుతారు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో తాత్కాలిక ప్రాతిపదికన కోవిడ్‌-19 వైద్యసేవల కోసం  స్వయంప్రతిపత్తిగల వైద్య కళాశాలల నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులు ఉత్తీర్ణులైనవారిని ప్రభుత్వం నియమించింది. ఈ సేవలందించిన కాలాన్ని వారు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాల్సిన వ్యవధిలో భాగంగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 159 కొత్త కేసుల నమోదుతో  క్రియాశీల కేసులు 1871కి చేరాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో కోలుకునేవారి సగటు 72.5 శాతంగా ఉంది.
  • మణిపూర్: రాష్ట్రంలో 110 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు 77.5 శాతం కోలుకునే సగటుతో 18 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1840 క్రియాశీల కేసులుండగా ముగ్గురు మరణించారు.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న 28 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 1534కు చేరాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 585గా ఉన్నాయి.
  • మేఘాలయ: రాష్ట్రంలో ప్రస్తుత క్రియాశీల కేసులు 1983 కాగా, వీరిలో 363 మంది బీఎస్‌ఎఫ్‌, సాయుధ దళాల సిబ్బంది ఉన్నారు. ఇక ఇప్పటిదాకా మొత్తం 2342 మంది కోలుకున్నారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలో గురువారం 43 కొత్త కేసులు నమోదవగా వీటిలో 24 దిమాపూర్, 18 కొహిమా, 1 సోమా నుంచి నమోదయ్యాయి.

FACTCHECK

******



(Release ID: 1656462) Visitor Counter : 177