కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికామ్/ఐసిటి కార్యకలాపాలలో బ్రిక్స్ దేశాల సహకారం కొనసాగింపు: సంజయ్ ధోత్రే
6వ బ్రిక్స్ కమ్యూనికేషన్ మంత్రుల వర్చువల్ సమావేశం
కోవిడ్ మీద పోరులో ఐసిటి పాత్ర, పిల్లల ఆన్ లైన్ రక్షణ,
గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ తదితర అంశాల్లో స్థూల ఏకాభిప్రాయం
Posted On:
17 SEP 2020 8:20PM by PIB Hyderabad
సెప్టెంబర్ 17న వర్చువల్ విధానంలో ఈరోజు జరిగిన ఆరవ బ్రిక్స్ దేశాల కమ్యూనికేషన్ మంత్రుల సమావేశంలో కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్యాశాఖల సహాయమంత్రి భారతదేశం తరఫున పాల్గొన్నారు. రష్యా డిజిటల్ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్స్, మాస్ మీడియా డిప్యూటీ మంత్రి శ్రీ మాక్సిన్ పర్షిన్ ఈ సమావేసానికి ఆతిథ్యమిచ్చారు. బ్రెజిల్ కమ్యూనికేషన్ల మంత్రి ఫాబియో సలుస్టినోమెస్కిటా డి ఫారియా, చైనా పరిశ్రమలు, ఐటి శాఖామంత్రి జియావో యాకింగ్, దక్షిణాఫ్రికా కమ్యూనికేషన్లు, టెలికమ్యూనికేషన్లు, తపాలా సేవల మంత్రి కుమారి స్టెల్లా తెంబిసా తమ తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించారు.
కోవిడ్ మీద పోరులో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ పాత్ర ఐసిటి ల వినియోగంలో నమ్మకం, భద్రత పెంపొందించుకోవటం, పిల్లలకు ఆన్ లైన్ లో రక్షన కల్పించటం గ్రామీణ ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావటం లాంటి విషయాలలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం ఎప్పటిలాగానే కొనసాగాలని ఈ సమావేశంలో ఒక స్థూల ఏకాభిప్రాయానికి వచ్చారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యసాధనలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పాత్రను కూడా చర్చించారు.
కోవిడ్ మీద పోరులో యోధుల్లాగా పనిచేసిన టెలికామ్ క్షేత్రస్థాయి సిబ్బందిని, మేనేజర్లను శ్రీ సంజయ్ ధోత్రే అభినందించారు. కోవిడ్ నియంత్రణకు ఆరోగ్యసేతు యాప్, కోవిడ్ క్వారంటైన్ అలర్ట్ సిస్టమ్, కోవిడ్ సావధాన్. వలస కార్మికులు తిరిగి స్వగ్రామాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాల కల్పనకు ఐసిటి వినియోగం, చౌకగా వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం అందుబాటు, ఇంటినుంచే నేర్చుకునే ఏర్పాట్లు సహా భారతదేశం తీసుకున్న అనేక చర్యలను కూడా మంత్రి ఈ సందర్భంగా బ్రిక్స్ సభ్యదేశాల దృష్టికి తెచ్చారు.
డిజిటల్ ద్వారా సమాజాన్ని సాధికారం చేసేందుకు భారత ప్రధాని ప్రారంభించిన డిజిటల్ ఇండియా పథకం కింద భారతదేశం టెలికామ్, ఐసిటి ఎదుగుదలకు తీసుకుంటున్న అనేక చర్యలను కూడా శ్రీ సంజయ్ ధోత్రే బ్రిక్స్ దేశాలతో పంచుకున్నారు. డిజిటల్ అనుసంధానపు ప్రయోజనాలు దేశంలో ప్రతి పౌరునికీ అందుతున్నాయని చెప్పారు. భారత్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పిపిపి పద్ధతిలో 250,000 గ్రామ పంచాయితీలు అనుసంధానమవుతున్నాయన్నారు. ఈశాన్య భారతపు కొండప్రాంతాలు, మారుమూలన ఉన్న అండమాన్ నికోబార్ దీవులు సైతం బ్రాడ్ బాండ్ పథకం ద్వారా దగ్గరవుతున్నాయని చెప్పారు. వ్యక్తిగత డేటా కాపాడటానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా మంత్రి వివరించారు.
బ్రిక్స్ కమ్యూనికేషన్స్ మంత్రుల సమావేశం ఏటా ఒక్కో దేశపు మంత్రి అధ్యక్షతన రొటేషన్ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఇందులో సభ్యులు. ఈ సారి 2021 లో భారత్ లో బ్రిక్స్ సమావేశం జరగాల్సి ఉండగా ఈ సమావేశానికి భారత్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటుంది.
***
(Release ID: 1656017)
Visitor Counter : 196