ప్రధాన మంత్రి కార్యాలయం

‘కోసి మహా రైలువారధి’ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

బీహార్లో కొత్త రైలుమార్గాలు, విద్యుదీకరణ పథకాలకు ప్రారంభోత్సవం;

కోవిడ్ సమయంలో రైల్వేశాఖ నిర్విరామ సేవలను కొనియాడిన ప్రధాని;

విద్యుదీకరణ, పరిశుభ్రత లక్ష్యాల సాధన, కిసాన్ రైలు ప్రారంభం;

మానవరహిత రైలుగేట్ల తొలగింపు వగైరాలపై రైల్వేశాఖకు ప్రశంసలు;

వ్యవసాయ సంస్కరణల బిల్లుద్వారా రైతులకు విముక్తి : ప్రధానమంత్రి

Posted On: 18 SEP 2020 4:11PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బీహార్‌లో చారిత్రక ‘కోసి మహా రైలువారధి’ని జాతికి అంకితం చేయడంతోపాటు కొత్త రైలుమార్గాలు, విద్యుదీకరణ పథకాలను ప్రారంభించారు. బీహార్‌లో రైలుమార్గ అనుసంధానం చరిత్ర సృష్టించిందని ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. కోసి మహావారధి, కియూల్‌ వంతెన, విద్యుదీకరణ పథకాల ప్రారంభంతోపాటు రైల్వేల్లో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ప్రోత్సాహం, కొత్త ఉపాధి సృష్టికి వీలున్న మరో 12దాకా పథకాలను రూ.3,000 కోట్లతో ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకాలతో బీహార్‌లో రైలుమార్గాల అనుసంధానం బలోపేతం కావడమేగాక పశ్చిమబెంగాల్‌, తూర్పు భారత రైలుమార్గాల సంధాన కూడా శక్తిమంతం కాగలదని వివరించారు.

   బీహార్‌సహా తూర్పు భారత ప్రాంత రైలు ప్రయాణికులకు సరికొత్త, ఆధునిక సదుపాయాలు ఎంతో ప్రయోజనకరం కాగలవని, ఈ మేరకు బీహార్‌ ప్రజలను అభినందిస్తున్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో  ప్రవహించే అనేక నదులవల్ల బీహార్‌లోని వివిధ ప్రాంతాల మధ్య సంధానం లేకుండాపోయిందని ఆయన చెప్పారు. దీనివల్ల ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే చాలాదూరం ప్రయాణించాల్సి వస్తున్నదని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం దిశగా నాలుగేళ్ల కిందట పాట్నా, ముంగేర్‌లలో రెండు మహావంతెనల పనులు ప్రారంభించినట్లు గుర్తుచేశారు. నేడు ఈ రెండు వంతెనలను ప్రారంభించడంతో ఉత్తర-దక్షిణ బీహార్‌ ప్రాంతాల మధ్య ప్రయాణం సులువు కాగలదని చెప్పారు. అంతేకాకుండా దీనివల్ల ప్రత్యేకించింది ఉత్తర బీహార్‌లో ప్రగతి వేగం పుంజుకోగలదని ఆయన అన్నారు.

   ప్పుడెప్పుడో 85 ఏళ్ల కిందట తీవ్ర భూకంపం మిథిల, కోసి ప్రాంతాలను వేరుచేయగా, నేడు కరోనావంటి మహమ్మారి పరిస్థితుల్లో ఈ రెండు ప్రాంతాల మధ్య మళ్లీ అనుసంధానం ఏర్పడటం యాదృచ్ఛికమేనని ప్రధానమంత్రి అన్నారు. వంతెన నిర్మాణంలోనూ భాగస్వాములైన వలస కూలీల కృషితో నేడు సుపాల్-అసన్‌పూర్-కుఫా రైలు మార్గం దేశానికి అంకితం చేయబడిందని చెప్పారు. మిథిల, కోసి ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం దిశగా 2003లో శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా, శ్రీ నితీష్ కుమార్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్నపుడు ‘కోసి రైలు మార్గం’ ఊపిరి పోసుకున్నదని గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ పథకం పనులు వేగంగా సాగినట్లు పేర్కొన్నారు. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో సుపాల్-అసన్‌పూర్-కుఫా మార్గం  పనులు పూర్తయ్యాయని తెలిపారు.

   సుపాల్-అసన్‌పూర్ మధ్య కోసి మహారైలు వారధి మీదుగా ప్రారంభమయ్యే కొత్త రైలు సుపాల్, అరియారియా, సహర్సా జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని ప్రధానమంత్రి అన్నారు. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఇది ప్రత్యామ్నాయ రైలుమార్గంగానూ ఉపయోగపడగలదని పేర్కొన్నారు. ఈ మహావారధి అందుబాటులోకి రావడంతో లోగడ 300 కిలోమీటర్ల ప్రయాణం ఇప్పుడు కేవలం 22 కిలోమీటర్లకు తగ్గిపోతుందని చెప్పారు. తద్వారా బీహార్‌ ప్రజల సమయం, ధనం ఆదా కావడమేగాక ఈ ప్రాంతమంతటా వ్యాపార, ఉపాధి అవకాశాలకు ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అన్నారు. కోసి మహావారధి తరహాలోనే కియుల్ నదిపై కొత్త రైలు మార్గంలోనూ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సదుపాయంగల రైళ్లు గంటకు 125 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలవని ప్రధాని చెప్పారు. ఆ మేరకు హౌరా-ఢిల్లీ ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలను ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ సులభం చేస్తుందని, అనవసర జాప్యం ఇకపై ఉండకపోవడమేగాక ప్రయాణం సురక్షితంగా సాగుతుందని వివరించారు.

   వ భారత ఆకాంక్షలకు అనుగుణంగా, ‘స్వయం సమృద్ధ భారతం’ అంచనాలను ఆందుకునేలా రైల్వేశాఖకు సరికొత్త రూపమివ్వడం కోసం గడచిన ఆరేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత రైల్వేలు మునుపటికన్నా నేడు మరింత పరిశుభ్రంగా ఉన్నాయన్నారు. బ్రాడ్‌గేజ్‌ రైలుమార్గాల్లో మానరవహిత గేట్లను తొలగించడం ద్వారా రైల్వేలను గతంతో పోలిస్తే మరింత సురక్షితం చేసినట్లు వివరించారు. అంతేకాకుండా భారత రైల్వేల వేగం పెరిగిందని, వందే భారత్‌ వంటి ‘మేడ్ ఇన్ ఇండియా’ రైళ్లు స్వావలంబన, ఆధునికతలకు సంకేతాలుగా నిలుస్తున్నాయని, మన రైలుమార్గాల నెట్‌వర్క్‌లో భాగంగా మారుతున్నాయని తెలిపారు. రైల్వేల ఆధునికీకరణ ద్వారా బీహార్ భారీ ప్రయోజనాలు పొందుతున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’కు కొన్నేళ్లనుంచీ ఇస్తున్న ప్రోత్సాహంలో భాగంగా మాధేపురాలో ఎలక్ట్రిక్ ఇంజన్ల ఫ్యాక్టరీని, మార్హౌరాలో డీజిల్‌ ఇంజన్ల కర్మాగారాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. ఈ రెండింటిలోనూ దాదాపు రూ.44000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. భారతదేశంలోనే అత్యంత శక్తిమంతమైన 12000 అశ్వికశక్తిగల విద్యుత్‌ రైలింజన్‌ బీహార్‌లో  తయారవడం ఈ రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని ఆయన అన్నారు. అలాగే విద్యుత్‌ రైలింజన్ల నిర్వహణ కోసం బీహార్‌లో ఏర్పాటైన తొలి లోకో షెడ్ కూడా పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపారు.

   బీహార్‌లో నేడు దాదాపు 90 శాతం రైలుమార్గాల నెట్‌వర్క్ విద్యుదీకరణ పూర్తయిందని ప్రధానమంత్రి చెప్పారు. ముఖ్యంగా గడచిన ఆరేళ్లలోనే బీహార్‌లో 3000 కిలోమీటర్లకుపైగా  రైల్వే విద్యుదీకరణ పూర్తయినట్లు పేర్కొన్నారు. కాగా, 2014కు ముందు ఐదేళ్లలో కేవలం 325 కిలోమీటర్ల కొత్త రైలుమార్గాలు ప్రారంభం కాగా, 2014 తర్వాతి 5 సంవత్సరాలలో బీహార్‌లో 700 కిలోమీటర్ల కొత్త రైలుమార్గాలు ప్రారంభించబడ్డాయని వివరించారు. ఇది అంతకుముందు నిర్మించిన మార్గాలకన్నా రెట్టింపు కాగా, మరో 1000 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఇక హాజీపూర్- ఘోస్వర్- వైశాలి రైలు మార్గాన్ని ప్రవేశపెట్టడంద్వారా ఢిల్లీ-పాట్నాల మధ్య నేరుగా రైళ్ల అనుసంధానం సాకారం కాగలదని ప్రధానమంత్రి చెప్పారు. తద్వారా వైశాలిలో పర్యాటక రంగానికి ఎనలేని ప్రోత్సాహం లభిస్తుందని, కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొన్నారు. ఇక సరకుల రవాణా కసం ప్ర్యతేక కారిడార్ల పనులు వేగం పుంజుకుంటున్నాయని తెలిపారు. ఈ కారిడార్‌లో సుమారు 250 కిలోమీటర్ల మేర బీహార్‌ మీదుగా వెళ్తుందని చెప్పారు. ఈ పథకం పూర్తయ్యాక ప్రయాణిక రైళ్ల రాకపోకల్లో ఆలస్యం సమస్య మాత్రమేగాక, సరుకుల రవాణాలో జాప్యం కూడా బాగా తగ్గిపోతుందని చెప్పారు.

   రోనా సంక్షోభ సమయంలో రైల్వేలు నిర్విరామంగా పనిచేశాయని ప్రధానమంత్రి ప్రశంసించారు. ముఖ్యంగా వలస కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు వారిని శ్రామిక ప్రత్యేక రైళ్లద్వారా స్వస్థలాలకు చేర్చడంలో రైల్వే కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. అదేవిధంగా కరోనా మహమ్మారి పరిస్థితుల నడుమ దేశంలో మొట్టమొదటి కిసాన్‌ రైలును బీహార్‌-మహారాష్ట్ర మధ్య ప్రవేశపెట్టడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. బీహార్‌లో ఒకప్పుడు వైద్య కళాశాలలు కొద్ది సంఖ్యలో మాత్రమే ఉండేవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని వ్యాధి పీడితులు చాలా అసౌకర్యానికి గురయ్యేవారని, ప్రతిభగల యువత కూడా వైద్య విద్యకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అయితే, నేడు బీహార్‌లో 15కుపైగా వైద్య కళాశాలలు ఉండగా- వీటిలో అధికశాతం ఇటీవలి సంవత్సరాల్లో నిర్మించినవని చెప్పారు. మరోవైపు బీహార్‌లోని దర్భంగాలో కొత్త ఎయిమ్స్ ఏర్పాటుకు కొద్దిరోజుల కిందటే ప్రభుత్వ అనుమతి లభించిందని, దీనివల్ల వేలాది కొత్త ఉద్యోగాల సృష్టి కూడా సాధ్యం కాగలదని చెప్పారు.

వ్యవసాయ సంస్కరణల బిల్లు

   వ్యవసాయ సంస్కరణల రంగంలో దేశానికి నిన్నటి రోజు ఒక చారిత్రక దినమని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ మేరకు వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినట్లు పేర్కొన్నారు. ఇది మన రైతులను అనేక పరిమితులనుంచి విముక్తులను చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగాగల రైతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంస్కరణలవల్ల తమ ఉత్పత్తుల విక్రయం కోసం రైతులకు మరిన్ని అవకాశాలు అందబాటులోకి వస్తాయన్నారు. రైతు ఆర్జనలో అధికశాతం తన్నుకుపోయే దళారీ వ్యవస్థ నుంచి ఈ సంస్కరణలు రైతుకు రక్షణనిస్తాయన్నారు. కాగా, వ్యవసాయ సంస్కరణల బిల్లుపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రధానమంత్రి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన కొందరు వ్యవసాయ సంస్కరణల బిల్లుపై రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. నేడు సంస్కరణలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు తమ ఎన్నికల హామీల్లోనూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీల చట్టాల్లో మార్పులు తెస్తామని ప్రకటించినట్లు గుర్తుచేశారు.

   నీస మద్దతుధర ప్రయోజనాన్ని ప్రభుత్వం ఇక రైతులకు ఇవ్వదని కూడా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఖండించారు. కానీ, కనీస మద్దతు ధర ద్వారా రైతుకు గిట్టుబాటు ధర కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వపరంగా పంట ఉత్పత్తుల సేకరణ ఎప్పటిలాగానే కొనసాగుతుందని పునరుద్ఘాటించార. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక రైతులు తమ పంట కోతల తర్వాత దేశంలో ఎక్కడైనా తమకు గిట్టుబాటయ్యే ధరకు అమ్ముకునే వీలుంటుందని చెప్పారు. ఎపీఎంసీ చట్టాలద్వారా రైతుకు హాని కలుగుతున్నదని గుర్తించిన బీహార్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఈ చట్టాన్ని రద్దు చేశారని ప్రధాని గుర్తుచేశారు. ఈ సందర్భంగా రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. ఈ మేరకు ‘ప్రధాన మంత్రి కిసాన్ కల్యాణ్ యోజన, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన, వేప పూత యూరియా, దేశంలో భారీ శీతల గిడ్డంగుల నెట్‌వర్క్‌ నిర్మాణం, ఆహార తయారీ పరిశ్రమలలో పెట్టుబడులు,  వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి ఏర్పాటు” తదితరాలను ఏకరవు పెట్టారు.

   రైతుల ఆదాయం పెంచడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వ్యాధుల నుంచి పశువులకు రక్షణ దిశగా దేశవ్యాప్త కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తప్పుదోవ పట్టించేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని రైతులకు స్పష్టమైన సందేశమిచ్చారు. విమర్శకులు రైతులను రక్షించడం గురించి మాట్లాడుతున్నారని, వాస్తవానికి రైతులు ఇంకా బంధనాల్లోనే ఉండాలన్నది వారి మనోభావమని హెచ్చరించారు. వారు దళారీలకు మద్దతిస్తూ రైతుల ఆర్జన దోచేవారికి అండగా నిలుస్తున్నారని విమర్శించారు. ఇలాంటివారిని దూరంగా ఉంచడం ప్రస్తుతం ఎంతో అవశ్యమని పిలుపునిచ్చారు.

***


(Release ID: 1656342) Visitor Counter : 230