PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 05 JUN 2020 6:41PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో గత 24 గంటల్లో 5,355 మంది కోలుకోగా కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 1,09,462కు చేరి, కోలుకునేవారి శాతం 48.27కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,10,960గా ఉంది.
  • దేశవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాప్తి అవకాశం అధికంగాగల బహిరంగ, పాక్షిక బహిరంగ పరిస్థితుల నిర్వహణకు ప్రామాణిక ప్రక్రియ విధివిధానాలు జారీచేసిన కేంద్ర ఆరోగ్యశాఖ.
  • అంతర్జాతీయ టీకాల రూపకల్పన కూటమి  ‘గవి’కి 15 మిలియన్‌ అమెరికా డాలర్ల విరాళం ప్రకటించిన భారత ప్రభుత్వం
  • ఈసారి భారత్‌లో డిజిటల్‌ మార్గాన అంతర్జాతీయ యోగా దినోత్సవం.

 

Image

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

భారత్‌లో దిగ్బంధం నిబంధనలను ప్రభుత్వం క్రమబద్ధంగా, ముందుజాగ్రత్తలతో, చురుకైన రీతిలో సడలిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాప్తి అవకాశం అధికంగాగల బహిరంగ, పాక్షిక బహిరంగ పరిస్థితుల నిర్వహణకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రామాణిక ప్రక్రియ విధివిధానాలను (SOP) జారీచేసింది. సామాజిక-ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతోపాటు కోవిడ్‌ పరిస్థితులకు తగినట్లు ప్రజల ప్రవర్తనను మలచడంద్వారా వ్యాధి సంక్రమణ గొలుసును ఛేదించడం ఈ కొత్త మార్గదర్శకాల ధ్యేయం.

   గడచిన 24గంటల్లో 5,355 మందికి కోవిడ్‌-19 నయం కాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,09,462కు చేరిన నేపథ్యంలో కోలుకునేవారి శాతం 48.27గా నమోదైంది. ప్రస్తుతం 1,10,960 యాక్టివ్‌ కేసులు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి.

   దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రయోగశాలల సంఖ్య 507కు పెరిగింది. ప్రైవేటు ప్రయోగశాలల సంఖ్య కూడా 217కు చేరింది (మొత్తం 727 ల్యాబ్‌లు). దీంతో గత 24 గంటల్లో 1,43,661 నమూనాలను పరీక్షించగా మొత్తం పరీక్షల సంఖ్య 43,86,379కి చేరింది. ఇక 2020 జూన్‌ 5నాటికి కోవిడ్‌ సంబంధిత ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం చేయబడ్డాయి. ఆ మేరకు కోవిడ్‌ ఆస్పత్రుల సంఖ్య 957కు చేరగా, వాటిలో 1,66,460 ఏకాంత చికిత్స పడకలు, 21,473 ఐసీయూ పడకలు, 72,497 ఆక్సిజన్‌ ఆధారిత పడకలు, అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు దేశవ్యాప్తంగా కోవిడ్‌-19పై పోరుకు 11,210 నిర్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రాలు, 7,529 కోవిడ్ సంరక్షణ కేంద్రాలలో 7,03,786 పడకలు ఉన్నాయి.

 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629633

వర్చువల్‌ అంతర్జాతీయ వ్యాక్సిన్‌ సదస్సు-2020లో ప్రధాని ప్రసంగం; ప్రపంచ టీకాల కూటమి గవికి 15 మిలియన్‌ డాలర్ల విరాళం ప్రకటించిన భారత్‌

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ నిర్వహించిన వర్చువల్‌ అంతర్జాతీయ వ్యాక్సిన్‌ సదస్సు-2020లో ప్రసంగించారు. ప్రపంచంలోని 50కిపైగా దేశాల వ్యాపారవేత్తలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు, పౌరసమాజం, మంత్రులు, దేశాధినేతలు, జాతీయ నాయకులు పలువురు ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుత సంక్షోభ, పరీక్షా సమయంలో ప్రపంచానికి భారత్‌ సంఘీభావం ప్రకటిస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రపంచ టీకాల కూటమి గవికి భారత్‌ తరఫున 15 మిలియన్‌ డాలర్ల విరాళం అందిస్తామని ప్రకటించారు. ప్రపంచ దేశాలమధ్య సహకారంలో పరిమితులను కోవిడ్‌-19 మహమ్మారి ఒకవిధంగా వెలుగులోకి తెచ్చిందని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే ఇటీవలి చరిత్రలో తొలిసారి మానవాళి మొత్తానికి ఒక స్పష్టమైన ఆర్థిక వ్యవస్థ అనుభవంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. మరోవైపు తక్కువ ఖర్చుతో నాణ్యమైన మందులు, టీకాల‌ను ఉత్పత్తి చేయగల నిరూపిత సామర్థ్యంస‌హా వేగంగా విస్త‌రిస్తున్న రోగనిరోధకత, శాస్త్రీయ పరిశోధనల్లో గ‌ణ‌నీయ‌ ప్రతిభ స‌హితంగా భారతదేశం ప్రపంచానికి సంఘీభావం తెలుపుతున్న‌ద‌ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629511

జీఎస్టీ లోటుభర్తీ కింద రాష్ట్రాలకు రూ.36,400కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

దేశంలోని వివిధ రాష్ట్రాలు/శాసనసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలకు వస్తుసేవల పన్ను (GST) లోటుభర్తీ కింద 2019 డిసెంబరు నుంచి 2020 ఫిబ్రవరి మధ్య కాలానికిగాను కేంద్ర ప్రభుత్వం నిన్న రూ.36,400 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత కోవిడ్‌-19 పరిస్థితుల నడుమ ప్రభుత్వాలు తప్పనిసరి వ్యయాలను భరించాల్సి ఉండగా రాష్ట్రాల వనరులపై ప్రతికూల ప్రభావం పడటాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పరిహార నిధులను విడుదల చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629508

ఈసారి భారత్‌లో డిజిటల్‌ మార్గాన అంతర్జాతీయ యోగా దినోత్సవం

దేశంలో ప్రస్తుత ఆరోగ్య అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు డిజిటల్‌ మార్గంలో ప్రపంచం ముందుకు రానున్నాయి. భారత సాంస్కృతిక సంబంధాల మండలి అధ్యక్షుడు డాక్టర్‌ వినయ్‌ సహస్రబుద్ధే ఇవాళ న్యూఢిల్లీలో ఆయుష్‌ మంత్రిత్వశాఖ అధికారులతో కలసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. ప్ర‌తి ఒక్క‌రికీ యోగా ఎంత ప్ర‌యోజ‌నక‌ర‌మో ఈ ఏడాది కార్య‌క్ర‌మంతో స్ప‌ష్టమ‌వుతుంద‌ని ఆయ‌న అన్నారు. అలాగే ప్రపంచ మహమ్మారిపై పోరులో భాగంగా రోగనిరోధక శక్తిని పెంచ‌డంతోపాటు ప్ర‌స్తుత సంక్షోభ సంబంధిత ముఖ్యాంశాల నిర్వ‌హ‌ణ‌లో సమాజాన్ని బలోపేతం చేస్తుంద‌ని డాక్టర్ సహస్రబుద్ధే తెలిపారు. ఈ సంయుక్త విలేక‌రుల స‌మావేశంలో ఆయుష్ శాఖ కార్య‌ద‌ర్శి వైద్య రాజేష్ కొటేచా కూడా పాల్గొన్నారు. కాగా, క‌రోనా వైర‌స్‌ కారణంగా కోవిడ్‌-19 వ్యాప్తి ముప్పు అత్య‌ధికంగా‌ ఉన్నందువ‌ల్ల ఈసారి సామూహిక కార్య‌క్ర‌మాలు ఉండ‌వ‌న్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629722

అవగాహన పెంపు లక్ష్యంగా “కోవిడ్‌-19 సమయంలో సురక్షిత ఆన్‌లైన్‌ అభ్యాసం” కరదీపికను ఆవిష్కరించిన హెచ్‌ఆర్‌డి మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ ‘నిషాంక్‌’

జాతీయ విద్య-పరిశోధన-శిక్షణ మండలి (NCERT), యునెస్కో-న్యూఢిల్లీ కార్యాలయం సంయుక్తంగా ఈ కరదీపికను రూపొందించాయి. సురక్షిత ఆన్‌లైన్‌ అభ్యాసం కోసం ప్రాథమికంగా పాటించాల్సిన/పాటించకూడని అంశాలపై పిల్లలు, యువతకు అవగాహన కల్పించడంలో ఈ కరదీపిక కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఇంటర్నెట్‌ను సురక్షితంగా వినియోగించడంపై పిల్లలకు అవగాహన కల్పించేలా తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులకూ తోడ్పడుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629709

బహ్రెయిన్‌, ఓమన్‌ల నుంచి వచ్చిన 176 మంది భారత పౌరులకు కోచ్చిలోని నావికాదళ స్థావరంలో నిర్బంధవైద్య పర్యవేక్షణ వ్యవధి పూర్తి

బహ్రెయిన్‌, ఓమన్‌ దేశాలనుంచి తిరిగి వచ్చిన 176 మంది భారత పౌరులు కోచ్చిలోని నావికాదళ స్థావరంలోని నిర్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రంలో తప్పనిసరిగా ఉండాల్సిన వ్యవధిని పూర్తిచేసుకున్నారు. దీంతో ఈ దక్షిణ నావికాదళ కమాండ్‌లోగల కోవిడ్‌ సంరక్షణ కేంద్రం (CCC) నుంచి వీరు దేశంలోని తమతమ స్వస్థలాలకు ప్రయాణించే వీలుంటుంది. వీరు తొలుత ఇక్కడికి చేరాక, గడపాల్సిన వ్యవధి పూర్తయ్యాక అందరికీ ఆర్టీ-పీసీఆర్‌ (RT-PCR) పరీక్షలు నిర్వహించారు. తదనుగుణంగా వ్యాధి సోకలేదని తేలడంతో ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించారు. వీరిలో బహ్రెయిన్‌ నుంచి వచ్చిన 129 మంది బృందం జూన్‌ 1, 2 తేదీల్లో ఇక్కడినుంచి పయనం కాగా, ఓమన్‌ నుంచి వచ్చిన 49 మంది బృందం నిన్న బయల్దేరింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629509

ప్రస్తుత కోవిడ్‌ సంక్షోభం సందర్భంగా మహారాష్ట్రలో గిరిజన సేకరణదారులకు వినూత్న చర్యల ద్వారా తోడ్పడుతున్న వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాలు

ప్రస్తుత సంక్షుభిత సమయంలో గిరిజనులకు జీవనోపాధికి తోడ్పటంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని ట్రైఫెడ్‌ (TRIFED) ప్రవేశపెట్టిన పథకం కింద ఏర్పాటైన వన్‌ధన్‌ కేంద్రాలు ఆదర్శప్రాయంగా కృషిచేస్తున్నాయి. ఈ  సంక్షోభ సమయాన తీవ్రంగా ప్రభావితమైన వ‌ర్గాల్లో గిరిజ‌నం కూడా ఒక‌రు. సాధార‌ణంగా ఏప్రిల్‌-జూన్ నెల‌ల మ‌ధ్య విరివిగా ల‌భించే సూక్ష్మ అట‌వీ ఉత్ప‌త్తుల సేకర‌ణద్వారా వారు త‌మ ఆదాయంలో అధిక‌ శాతం ఆర్జిస్తారు. ఈ నేపథ్యంలో మ‌హారాష్ట్రలో కోవిడ్-19 తీవ్రత అత్య‌ధికంగా ఉన్నప్ప‌టికీ వారిని ఆదుకోవ‌డంలో వ‌న్‌ధ‌న్ పథకం సాధించిన విజ‌య‌ం ఆద‌ర్శ‌ప్రాయంగా నిలుస్తోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629714

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2019కి సంబంధించి మిగిలిన అభ్యర్థులకు 2020 జూలై 20 నుంచి ప‌ర్స‌నాలిటీ టెస్ట్‌

కోవిడ్‌-19 నేప‌థ్యంలో దేశంలో ప్రస్తుత పరిస్థితుల సమీక్ష నిమిత్తం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇవాళ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు వివిధ రాష్ట్రాల్లో దిగ్బంధం తొల‌గింపు, నిబంధ‌న‌ల్లో ప్ర‌గ‌తిశీల సడ‌లింపుల దృష్ట్యా దేశ‌వ్యాప్తంగా పరీక్షలు/నియామక పరీక్ష (RT)ల సవరించిన షెడ్యూల్ జారీకి నిర్ణ‌యించింది. సంబంధిత వివ‌రాలు యూపీఎస్సీ త‌మ వెబ్‌సైట్‌లో అభ్య‌ర్థుల‌కు అందుబాటులో ఉన్నాయి. కాగా, 2020 జూలై 20నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2019కి సంబంధించి మిగిలిన అభ్యర్థుల ప‌ర్స‌నాలిటీ టెస్ట్‌ను పునఃప్రారంభించాల‌ని కూడా కమిషన్ నిర్ణయించింది. దీనిపై అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం పంపుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629701

దేశానికి స‌రికొత్త వ్యాపార గ‌మ్యంగా ఆవిర్భ‌వించ‌నున్న ఈశాన్య భారతం: డాక్టర్ జితేంద్ర సింగ్

దేశానికి ‌స‌రికొత్త వ్యాపార గ‌మ్యంగా ఈశాన్య భార‌త ప్రాంతం నెమ్మ‌దిగానే అయినా స్థిరంగా ముంద‌డుగు వేస్తున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యంలో కేంద్ర ఈశాన్య‌భార‌త ప్రాంత అభివృద్ధి శాఖ స‌హాయ (ఇన్‌చార్జి) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ మేర‌కు ఇవాళ ఇక్క‌డ మాట్లాడుతూ- కోవిడ్ అనంత‌రం కాలంలో ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, శాస్త్రీయ పరిశోధనలు స‌హా పలు విభిన్న రంగాల్లో వినూత్న ప్ర‌గ‌తి దిశ‌గా క్రొంగొత్త న‌మూనాలు ఆవిర్భ‌వించే అవ‌కాశాలున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. త‌ద‌నుగుణంగా ఈశాన్యభార‌తాన్ని దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కూడ‌లిగా, అంకుర సంస్థ‌ల స్థాప‌న‌కు స‌ముచిత గ‌మ్యంగా మారుస్తాయ‌న్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629505

దేశవ్యాప్తంగా వేసవి పరిశోధన శిక్ష‌ణ నిర్వ‌హించ‌నున్న సీఎస్‌ఐఆర్ ల్యాబ్

కోవిడ్‌-19 మహమ్మారి నేప‌థ్యంలో దేశ విద్యారంగంలో నెలకొన్న స్తబ్దతను తొల‌గించేందుకు ఈశాన్యభార‌త శాస్త్ర-సాంకేతిక సంస్థ (NEIST) కృషిచేస్తోంది. ఈ మేరకు జోర్హాట్‌లోగ‌ల‌ సీఎస్ఐఆర్-ఎన్ఈఐఎస్‌టీ దేశ‌వ్యాప్త సీఎస్ఐఆర్‌-వేస‌వి ప‌రిశోధ‌న శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని (CSIR-SRTP-2020) స‌మ‌న్వ‌యం చేయ‌డంతోపాటు స్వ‌యంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా దేశ‌మంత‌టా విస్త‌రించిన 38 సీఎస్‌ఐఆర్ ప్రయోగశాలల్లోని బోధ‌కులు, ప్రోత్సాహ‌కులద్వారా సంబంధిత‌ ఆన్‌లైన్ కార్య‌క్ర‌మం ఆవిష్కృతం కానుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629503

కోవిడ్‌-19నుంచి బ‌య‌ట‌ప‌డే దిశ‌గా ఎస్సీ, ఎస్టీల స్థైర్యం పెంచేందుకు శాస్త్ర-సాంకేతిక సంబంధిత చ‌ర్య‌ల‌ద్వారా డీఎస్టీ కృషి

దేశ‌మంత‌టా దిగ్బంధం నేప‌థ్యంలో ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల వారు జీ‌వ‌నోపాధి కోల్పోయి, ఆర్థిక‌స్థితి దెబ్బ‌తిని దురవ‌స్థ‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ‌కోవిడ్‌-19 ప‌రిస్థితుల‌కు ఎదురొడ్డి మ‌ళ్లీ కోలుకునేలా వారిని ఆదుకునేందుకు కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ చొర‌వ చూపింది. ఇందులో భాగంగా “సైన్స్‌ ఫర్‌ ఈక్విటీ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌” (SEED) విభాగం చర్యలు చేపడుతోంది. అనేక విజ్ఞాన సంస్థలు, శాస్త్ర-సాంకేతికత ప్రాతిప‌దిక‌న కృషిచేసే స్వ‌చ్ఛంద సంస్థ‌లకు నిధుల‌ను గ్రాంట్ రూపంలో అంద‌జేసి, ఎస్సీ-ఎస్టీల కోసం త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు సిద్ధం చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629724

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: కోవిడ్‌-19 రోగులను సకాలంలో  కనుగొనడంద్వారా రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి నిరోధం దిశగా ప్రజలకు పరీక్షల నిర్వహణను బలోపేతం చేయాలని పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ జాబితాలోని ప్రైవేట్ ఆస్పత్రులు-వైద్యశాలలు పంపే కోవిడ్‌-19 నమూనాలకు ఉచిత RT-PCR పరీక్ష నిర్వహణకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా నమూనాల సేకరణ, ప్యాకింగ్‌సహా సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య సదుపాయానికి రవాణా చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు/వైద్యశాలలే ఏర్పాట్లు చేసుకోవాలి.
  • హర్యానా: కోవిడ్‌-19 సవాలు ఫలితంగా రాష్ట్రంలోని వ్యాపారాలపై పడిన ప్రతికూల ప్రభావాన్ని ఉపశమింప చేయడానికి హర్యాన ప్రభుత్వం నడుంకట్టింది. ఇందులో భాగంగా ‘స్టార్టప్ ఇండియా’ సహకారంతో వర్చువల్ మెంటార్‌షిప్ వర్క్‌షాపులు నిర్వహించేందుకు నిర్ణయించింది. అంకుర సంస్థల దృక్పథం విస్తరణ... ముఖ్యంగా ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో వారిలో విశ్వాసం పాదుకొల్పేలా సహాయపడటం ఈ వర్క్‌షాపుల నిర్వహణ లక్ష్యం. ఇది మూడు నెలలపాటు  సాగే సంలీన కార్యక్రమం. తద్వారా ఆరంభదశలోనివి సహా ఏ దశలోగల అంకుర సంస్థలైనా పరిశ్రమ నిపుణులతో సంభాషించడానికి, వారి విజ్ఞాన-నైపుణ్యాలనుంచి నేర్చుకోవడానికి, వ్యాపారారంభానికి, వేగవంతం చేయడానికి, వ్యూహాల రూపకల్పనకు అవకాశాలు లభిస్తాయి. ఈ కార్యక్రమంలో బృందాలుగా, ముఖాముఖి విధానంలో సంభాషించే వీలుంది.
  • కేరళ: దిగ్బంధం విముక్తి తొలిదశలో రాష్ట్రంలోని మతపరమైన ప్రార్థన స్థలాలు, మాల్స్‌ తిరిగి తెరవడానికి అనుమతించవద్దని భారత ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీనివల్ల మూలాలు తెలియకుండానే వ్యాధి వ్యాప్తికి దారితీసి కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా సామాజిక సంక్రమణ ప్రమాదం కూడా ఉంటుందని అప్రమత్తం చేసింది. కేంద్రం ఇవాళ జారీచేసిన కొత్త ప్రామాణిక ప్రకియల విధివిధానాల ప్రాతిపదికగా దిగ్బంధం విముక్తి తొలిదశపై రాష్ట్ర మార్గదర్శకాలను ప్రభుత్వం రేపు జారీచేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఐఎంఏ ఈ మేరకు హెచ్చరికలు జారీచేసింది. కాగా, కోళికోడ్‌లో ఒక గర్భిణికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో వైద్యులుసహా పలువురు సిబ్బందిని నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉంచారు. మరోవైపు జిల్లాలోని మావూర్‌ పంచాయతీలో చాలామందికి కోవిడ్‌ సోకిందని తేలడంతో ఆ పంచాయతీని నియంత్రణ జోన్‌గా ప్రకటిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వు జారీచేశారు. కాగా, రాష్ట్రంలో నిన్న 94 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,588కి చేరింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో 884 మంది చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాడు: కోవిడ్-19 నియంత్రణ దిశగా చెన్నైలోని 15 జోన్లను తమిళనాడు రాష్ట్ర మంత్రులు ఐదుగురు పర్యవేక్షించనున్నారు. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్యబీమా పథకం కింద ప్రైవేటు ఆసుపత్రులలో కోవిడ్-19 రోగులకు చికిత్సకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే, సదరు చికిత్స వ్యయంపై నిర్దిష్ట పరిమితి విధించింది. ఇక రాష్ట్రంలో నిన్న 1,384 కొత్త కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి; చెన్నైలో నిర్ధారిత కేసులు 1,072 కాగా, రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య: 27,256, యాక్టివ్ కేసులు: 12,132, మరణాలు: 220, డిశ్చార్జ్: 14,901. చెన్నైలో యాక్టివ్ కేసులు 9,066.
  • కర్ణాటక: మహారాష్ట్ర నుంచి తిరిగివచ్చిన వలస కార్మికులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చెప్పారు. కాగా, ప్లాస్మా థెరపీతో చికిత్స పొందిన రెండో కోవిడ్-19 రోగి కోలుకొని ఐసీయూనుంచి ఇంటికి వెళ్లినట్లు ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. నిన్న రాష్ట్రంలో 257 కొత్త కేసులు నమోదవగా, 106 మంది డిశ్చార్జి అయ్యారు... నాలుగు మరణాలు నమోదయ్యాయి. నిన్నటివరకు మొత్తం కేసులు: 4,320, యాక్టివ్ కేసులు: 2,651, మరణాలు: 57, కోలుకున్నవి: 1610గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని ఏపీటీడీసీ హోటళ్లుసహా ఇతర హోటళ్లు, రెస్టారెంట్లు జూన్ 8న తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో అవి పాటించాల్సిన ప్రామాణిక ప్రక్రియ విధివిధానాలను ప్రభుత్వం జారీచేసింది. కాగా, తిరుమలలో జూన్ 11నుంచి శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభం కానుండగా రోజుకు 6000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యర్థాల బదిలీకి ఉద్దేశించిన ఆన్‌లైన్ వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇక గడచిన 24 గంటల్లో 9831 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో 50 కొత్త కేసుల నమోదుతోపాటు 21 మంది డిశ్చార్జ్ కాగా, ఇద్దరు మరణించారు. మొత్తం కేసులు: 3427. యాక్టివ్: 1060, రికవరీ: 2294, మరణాలు: 73. వలసదారులలో నిర్ధారిత రోగుల సంఖ్య 700కాగా, వీరిలో 442మంది యాక్టివ్‌ కేసుల కింద ఉన్నారు. అలాగే విదేశాలనుంచి వచ్చినవారిలో 123 కేసులకుగాను 119 యాక్టివ్‌గా తేలాయి. ఇప్పటివరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య: 4,23,564.
  • తెలంగాణ: ప్రస్తుతం కొనసాగుతున్న వందే భారత్ మిషన్ మూడోదశను ప్రారంభించడానికి  ప్రభుత్వం సిద్ధమవుతుండగా, నగరానికి తిరిగి రావడానికి ఎదురుచూస్తున్న వందలాది మంది సహాయంకోసం అధికారులను ఆశ్రయించారు. ఆస్పత్రులలో రోగులకు సేవలందిస్తున్న 37 మంది డాక్టర్లకు కోవిడ్-19 నిర్ధారణ అయిన నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత రక్షణ సామగ్రి అందిస్తున్నట్లు ఒకవైపు ప్రభుత్వం చెబుతుండగా ఇంతమందికి కరోనా వైరస్‌ ఎలా సంక్రమించిందని తీవ్ర వ్యాఖ్యచేసింది. రాష్ట్రంలో జూన్ 3 నాటికి మొత్తం కేసులు 3,147 కాగా, వీరిలో నేటివరకూ వలసదారులు, విదేశాలనుంచి తిరిగి వచ్చినవారిలో 448 మంది ఉన్నారు.

 

*******



(Release ID: 1629785) Visitor Counter : 229