శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ఎస్సీ, ఎస్టీల్లో నైపుణ్యాభివృద్ధికి కృషి

'కేఐ'లు, ఎస్‌&టీ ఆధారిత ఎన్జీవోల నెట్‌వర్క్‌కు గ్రాంట్ల రూపంలో డీఎస్‌టీ మద్దతు
మాస్కులు, శానిటైజర్లు, ముఖ కవచాలు రూపొందించేలా శిక్షణ
మధ్యవర్తులు లేకుండా అటవీ ఉత్పత్తులు అమ్ముకునేలా ఏర్పాట్లు

Posted On: 05 JUN 2020 4:06PM by PIB Hyderabad


    దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా జీవనోపాధికి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక డిపార్టుమెంట్‌కు చెందిన "సైన్స్‌ ఫర్‌ ఈక్విటీ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌" (సీడ్‌) విభాగం చర్యలు చేపడుతోంది. అనేక విజ్ఞాన సంస్థలు, శాస్త్ర&సాంకేతిక ఆధారిత స్వచ్ఛంద సంస్థలకు గ్రాంట్ల రూపంలో సాయం అందిస్తోంది.

    మనుషుల రాకపోకలు, సంబంధాలపై దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రభావం చూపింది. అట్టడుగు స్థాయి నుంచి ఎస్సీ, ఎస్టీ వర్గాల అవసరాలను తీర్చాల్సిన అవసరాన్ని ఇది బయటపెట్టింది. దీంతోపాటు, ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం, స్వల్ప ఆర్థిక స్థోమత, చదువు లేకపోవడం, ఆరోగ్య సంరక్షణపైన, సామాజిక సేవల గురించి అవగాహన లేకపోవడం వంటివి.. సాయం, పునరావాస చర్యలు వీరి వద్దకు చేరకుండా అడ్డంకులుగా మారాయి.
 
    విజ్ఞాన సంస్థలు, శాస్త్ర&సాంకేతిక ఆధారిత స్వచ్ఛంద సంస్థల నెట్‌వర్క్‌కు సీడ్‌ విభాగం అందించిన మద్దతు.. సంబంధిత వర్గాల్లో, ముఖ్యంగా క్షేత్రస్థాయి మూలాలున్న ఎన్‌జీవో నెట్‌వర్క్‌లో కదలిక తెచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభావవంతమైన సాయం, పునరుద్ధరణ, జీవనోపాధిని కల్పించే వ్యూహాలపై ఇవి దృష్టి పెట్టి పనిచేస్తున్నాయి.

    కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాస్కులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం హ్యాండ్‌ శానిటైజర్లు, త్రీడీ ప్రింట్‌ ద్వారా ముఖ కవచాలు వంటి వాటిని రూపొందించడంలో.. సీడ్‌ విభాగం సాయం పొందిన సంస్థలు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.

    ఆంధ్రప్రదేశ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రేషన్‌, వేడి ఆహారం, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈలు), ఆవిష్కరణ పరికరాలు, పద్ధతుల రూపకల్పనలో.. విజ్ఞాన సంస్థలు, శాస్త్ర&సాంకేతిక ఆధారిత స్వచ్ఛంద సంస్థలు సాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న జీవనోపాధిని పరిరక్షించడంతోపాటు... మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ సంస్థలు ఇప్పటికే 70 వేల ఎస్సీ ప్రజలకు, 26 వేల ఎస్టీ ప్రజలకు చేరవయ్యాయి. 60 వేల మందికి సహాయ సామగ్రి, 36 వేల మందికి శానిటైజర్లు, 56 వేల మాస్కులు అందించాయి. 500 అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. వీటిలో 35 వేల మంది పాల్గొన్నారు. 25 వేల ముఖ కవచాలను ఆరోగ్య కార్యకర్తలకు ఈ సంస్థలు అందించాయి. 
 
    గిరిజనుల నుంచే నేరుగా అటవీ ఉత్పత్తుల సేకరించేలా.., ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు వ్యాపారులు, సేకరణ కేంద్రాలతో క్షేత్రస్థాయి బృందాలకు సంబంధాలను కల్పించారు. వ్యవసాయం, ఆక్వా, అటవీ ఉత్పత్తుల సేకరణ, ఇతర వ్యవసాయేతర కార్యక్రమాల్లో శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల ద్వారా 12 వేల కుటుంబాల జీవనోపాధికి భద్రత ఏర్పడింది.
     
    ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో కొవిడ్‌-19 ప్రభావ నియంత్రణకు విజ్ఞాన సంస్థలు, శాస్త్ర&సాంకేతిక ఆధారిత స్వచ్ఛంద సంస్థలు చేసిన ప్రయత్నాలను డీఎస్‌టీ కార్యదర్శి ప్రొ.అశుతోష్‌ శర్మ ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో ఉన్న జ్ఞాన ప్రయోజనం సంబంధిత సమాచారం లభ్యతపై మాత్రమే కాక.., స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చేపట్టే ప్రదర్శనలు, ప్రామాణిక నిబంధనలు పాటించడం వంటి వాటి ప్రభావవంతమైన వ్యాప్తిపై కూడా ఆధారపడి ఉంటుందని చెప్పారు.



(Release ID: 1629724) Visitor Counter : 218