సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

పింఛన్లు‌ &పింఛనుదారుల సంక్షేమ విభాగం ఏడాది ప్రగతిపై ఈ-బుక్‌లెట్‌ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్‌

మోదీ ప్రభుత్వం 2.0లో పింఛన్లకు సంబంధించి ఈ ఏడాది కాలంలో తెచ్చిన సంస్కరణలు ఈ-బుక్‌ ద్వారా వెల్లడి
పింఛన్ల విధానంలో సంస్కరణలతో పింఛనుదారులకు భారీ ప్రయోజనాలు: డా.జితేంద్ర సింగ్‌
లాక్‌డౌన్‌ సమయంలోనూ అధికార గణం చూపిన నిబద్ధతను ప్రశంసించిన కేంద్ర మంత్రి

Posted On: 04 JUN 2020 7:18PM by PIB Hyderabad

కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు&పింఛన్ల శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్‌ (స్వతంత్ర బాధ్యత).., పింఛన్లు‌&పింఛనుదారుల సంక్షేమ విభాగం ఏడాది ప్రగతిపై ఈ-బుక్‌లెట్‌ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది.

    పింఛన్లు‌&పింఛనుదారుల సంక్షేమ విభాగం అధికారులందరినీ కేంద్ర మంత్రి అభినందించారు. పింఛన్లకు సంబంధించి వరుసగా తెచ్చిన సంస్కరణలు ప్రధాని మోదీ ప్రభుత్వ సున్నితత్వానికే కాక, లాక్‌డౌన్‌ సమయంలో అధికారుల బృందం చూపించిన నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. పింఛనుదారుల్లో కొవిడ్‌ భయాందోళనలు తగ్గించేందుకు ప్రముఖ వైద్యులతో వెబినార్‌ నిర్వహించం ద్వారా అధికారులు వృత్తి ధర్మాన్ని నిరూపించారన్నారు. ఇతర ఏ విభాగాలకు లేనివిధంగా.., వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులకు సేవ చేసే అరుదైన అవకాశం దేవుడి దయవల్ల ఈ ఒక్క విభాగానికి మాత్రమే ఉందని  మంత్రి చెప్పారు.

 


    
    పింఛన్ల విధానంలో తెచ్చిన అనేక సంస్కరణల్లో, సీసీఎస్‌ పింఛన్ల నిబంధనలు-1972లోని 54వ నిబంధనకు చేసిన సవరణ పేరెన్నికగన్నది. ఏడేళ్ల సర్వీసు పూర్తికాకపోయినా, దురదృష్టవశాత్తు ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి మెరుగైన కుటుంబ పింఛను ఈ సవరణ ద్వారా అందుతుంది. ఇంతకుముందు ఈ తరహా పింఛను (చివరగా తీసుకున్న జీతంలో సగం) పొందాలంటే సదరు ఉద్యోగి కచ్చితంగా ఏడేళ్ల సర్వీసు పూర్తి చేసివుండాలి.

    01.01.2004 కి ముందు ఉద్యోగ నియామక ఫలితం వెలువడి, 01.01.2004న లేదా ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన అందరికీ పాత పెన్షన్ పథకాన్ని విస్తరించడం ఈ ఏడాది కాలంలో మరో మైలురాయి. జాతీయ పింఛను విధానం (ఎన్‌పీఎస్‌) కింద ఉన్న ఉద్యోగులందరి దీర్ఘకాలిక డిమాండ్ ఇది. న్యాయస్థానాల్లో ఉన్న అనేక కేసులు వారికి శాపంగా మారాయి.

    మోదీ ప్రభుత్వం 2.0 ఏర్పాటైన వెంటనే పింఛనర్ల కోసం వరుసగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధులైన పింఛనుదారుల ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి, పాత ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం చెప్పడానికి "సమీకృత ఫిర్యాదుల విభాగం &టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-11-1960 తో కాల్‌ సెంటర్‌" ఏర్పాటు చేయడం, "ఆల్‌ ఇండియా పెన్షన్‌ అదాలత్‌" నిర్వహించడం వంటివి సంక్షేమ కార్యక్రమాల్లో ఉన్నాయి. "ఆల్‌ ఇండియా పెన్షన్‌ అదాలత్‌"లను దాదాపు 50 ప్రాంతాల్లో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా చేపట్టారు. దీనివల్ల 4 వేలకు పైగా ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి.

    పింఛనుదారులు జీవన ధృవపత్రాన్ని సమర్పించేందుకు ఇంటి వద్దకే సేవలు తీసుకురావడం గత ఏడాది కాలంలో తెచ్చిన సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటి. పింఛన్లు ఇచ్చే బ్యాంకులు, 24 నగరాల్లోని పింఛనర్ల సంఘాల సాయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనిపై తొలి ప్రాంతీయ అదాలత్‌ను జమ్ములో నిర్వహించి, పింఛనర్ల జీవన సౌలభ్యానికి భరోసా ఇచ్చేలా బ్యాంకులకు ఏకీకృత సూచనలు జారీ చేశారు. 

    కొవిడ్‌-19పై పింఛనుదారుల సందేహాలు తీర్చేందుకు... ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డా.రణ్‌దీప్‌ గులేరియా, ఎయిమ్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.ప్రసూన్ ఛటర్జీతో టెలీ కన్సల్టేషన్‌ కూడా ఏర్పాటు చేశారు.

    పింఛనుదారుల జీవన సౌలభ్యాన్ని పెంచే సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్న మంత్రి డా.జితేంద్ర సింగ్‌కు.. పింఛన్లు‌&పింఛనుదారుల సంక్షేమ విభాగం డైరెక్టర్‌ డా.ఛత్రపతి శివాజీ కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్‌కు ముందే 100 శాతం ఈ-ఆఫీస్‌లు కలిగిన అతి కొన్ని విభాగాల్లో తమదీ ఒకటిని ఆయన వెల్లడించారు. అందువల్లే ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయడం సులభమైందన్నారు. ఉద్యోగులు ఏ ప్రాంతంలో ఉన్నా వీపీఎన్‌ ద్వారా ఇంటి నుంచే పని చేసే వెలుసుబాటు కల్పించామని, దీనివల్ల కొవిడ్‌ ప్రభావం విధులపై పడలేదన్నారు.

    ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని అంశాలను విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్‌ నారాయణ్‌ మాధుర్‌, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు. మరో అధికారి శ్రీ రుచిర్‌ మిత్తల్‌ 'ఓట్‌ ఆఫ్‌ థాంక్స్‌' చెప్పారు.

    పింఛను ఈ-బుక్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
 


(Release ID: 1629505) Visitor Counter : 270