మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

"కోవిడ్ సమయంలో సురక్షిత ఆన్ లైన్ అభ్యసనం" పుస్తకం విడుదల చేసిన కేంద్ర మానవవనరుల శాఖామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్

ఆన్ లైన్ లో ఉపాధ్యాయులు, విద్యార్థులు సురక్షితంగా ఉండటం మీద అవగాహన
పెంచుతూ ఎన్ సి ఇ ఆర్ టి, యునెస్కో న్యూ ఢిల్లీ ఉమ్మడిగా పుస్తకం రూపకల్పన

Posted On: 05 JUN 2020 3:51PM by PIB Hyderabad

"కోవిడ్ సమయంలో సురక్షిత ఆన్ లైన్ అభ్యసనం" పేరిట రూపొందిన పుస్తకాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఈరోజు న్యూ ఢిల్లీలో డిజిటల్ విధానంలో ఆవిష్కరించారు. ఆన్ లైన్ లో సురక్షితంగా ఉండేలా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అవగాహన పెంచగల ఈ చిన్న పుస్తకాన్ని జాతీయ విద్యా, పరిశోధన, శిక్షణామండలి ( ఎన్ సి ఇ ఆర్ టి). న్యూ ఢిల్లీ లోని యునెస్కో కార్యాలయం ఉమ్మడిగా రూపొందించాయి. పిల్లలు, యువత ఆన్ లైన్ లో చేయదగిన, చేయదగని ప్రాథమిక అంశాలతో కూడిన ఈ పుస్తకం ఇంటర్నెట్ ను ఎలా సురక్షితంగా వాడుకోవాలో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కూడా తెలియజేస్తుంది.


పుస్తకావిష్కరణ అనంతరం మంత్రి శ్రీ రమేశ్ పోక్రియాల్ మాట్లాడుతూ, " కోవిడ్-19 కారణంగా ఆన్ లైన్ చదువులు, దూరవిద్య పెద్ద ఎత్తున పెరిగినందున అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు ఆన్ లైన్ వేదికలు విస్తృతంగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు ఆన్ లైన్ వాతావరణంలో సురక్షితంగా ఉండేట్టు చూడటానికి భారత్ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఎన్ సి ఇ ఆర్ టి కట్టుబడి ఉన్నాయి. సైబర్ ఆకర్షణకు బలైనవారంతా మాకు ఫిర్యాదు చేసి సహాయం పొందవచ్చు. ఎన్ సి ఇ ఆర్ టి, యునెస్కో ఉమ్మడిగా ఈ పుస్తకాన్ని రూపొందించటం సంతోషంగా ఉంది. దీనివలన విద్యార్థులలో, ఉపాధ్యాయులలో అవగాహన పెరుగుతుంది. అదే సమయంలో సైబర్ వల విసిరే వాళ్లమీద తగిన చర్యలు తీసుకోవచ్చు" అన్నారు.

 

Banner English.jpg



కోవిడ్ మరింత వ్యాపించకుండా చూసేందుకు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, శిక్షణాకేంద్రాలు, ఇతర విద్యాసంస్థలు దేశవ్యాప్తంగా మార్చి 20 నుంచి మూసివేశారు. దీనివలమ విద్యారంగంలో కనీవునీ ఎరుగని అంతరాయం ఏర్పడింది. 90%  పైగా పాఠశాలల విద్యార్థులు ప్రభావితమయ్యారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖతోబాటు రాష్ట్రాల విద్యాశాఖలు కూడా కలిసి అనేక డిజిటల్ వేదికల ద్వారా చదువులు కొనసాగేందుకు కృషి చేస్తున్నాయి. అయితే, ఈ క్రమంలో టీనేజ్ పిల్లలు సైబర్ నేరగాళ్ళ ఆకర్షణకు బలయ్యే ప్రమాదం కూడా పెరిగింది.

భారతదేశంలో 5-11 ఏళ్ళ మధ్య వయసున్న పిల్లలు దాదాపు 7 కోట్ల 10 లక్షలమంది తమ కుటుంబ సభ్యుల కంప్యూటర్ పరికరాలమీద ఇంటర్నెట్ చూస్తున్నారు. దేశంలో ఇంటర్నెట్ వాడే 50 కోట్ల మందిలో వీరు 14 శాతం. మొత్తం ఇంటర్నెట్ వాడకం దారులలో మూడింట రెండొంతులమంది 12-29 ఏళ్ళ మధ్య వయసున్నవారే. లాక్ డౌన్ అనంతరం సైబర్ నేరగాళ్ళు వలపన్నటం బాగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశలో జాతీయ విద్య, పరిశోధనా, శిక్షణామండలి, యునెస్కో న్యూ ఢిల్లీ కార్యాలయం ఉమ్మడిగా ఈ సమాచార పుస్తకాన్ని రూపొందించాయి.


డైరెక్టర్, యునెస్కో న్యూ ఢిల్లీ ప్రతినిధి అయిన శ్రీ ఎరిక్ ఫాల్ట్ మాట్లాడుతూ " ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణంలో పిల్లలందరికీ విద్య అందాలన్నదే యునెస్కో ధ్యేయం. ఈ సమయంలో వెబ్ సైట్స్, డిజిటల్ ప్లాట్ ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ సైబర్ నేరగాళ్ళ అక్రమాలకు అందుబాటులో ఉండకూడదు. అందుకే ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో " సురక్షిత ఆన్ లైన్ అధ్యయనం" సైబర్ నేరగాళ్ళ చర్యలను ప్రస్తావిస్తూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ తయారైంది. ఇందులో భాగస్వామి కావటం సంతోషంగా ఉంది" అన్నారు.

జాతీయ విద్య, పరిశోధనా, శిక్షణామండలి ( ఎన్ సి ఇ ఆర్ టి) డైరెక్టర్ ప్రొఫెసర్ హృషీకేశ్ సేనాపతి మాట్లాడుతూ, " ఆన్ లైన్ భద్రత మీద మనం దృష్టి సారించకపొతే  మనం విద్యావ్యవస్థ మీద పెట్టే పెయ్యుబడి వృధా అయినట్టే. సురక్షితం కాని అధ్యయన వాతావరణం నాణ్యమైన విద్యకు దారితీయకపోవచ్చు. అది విద్యార్థుల భవిష్యత్ విద్యను, ఉద్యోగావకాశాలను దెబ్బతీయవచ్చు. ఉద్వేగపు వాతావరణం, భయం మధ్య విద్య చదువు ముందుకు సాగదు. అందుకే యువత శ్రేయస్సును, ఆరోగ్యాన్ని,  ఆన్ లైన్ నేరగాళ్ళ బారినుంచి కాపాడటాన్ని తన బాధ్యతగా ఎన్ సి ఇ ఆర్ టి భావిస్తోంది" అన్నారు.

సురక్షిత అభ్యసనం ఇంగ్లీష్  పిడి ఎఫ్ ప్రతికోసం ఇక్కడ క్లిక్ చేయండి

సురక్షిత అభ్యసనం హిందీ పిడిఎఫ్ ప్రతికోసం ఇక్కడ క్లిక్ చేయండి


 

*****



(Release ID: 1629709) Visitor Counter : 273