ప్రధాన మంత్రి కార్యాలయం

వర్చువల్ అంతర్జాతీయ టీకా సదస్సు 2020ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

సవాలుతో కూడిన ప్రస్తుత రోజుల్లో ప్రపంచం యావత్తుకు సంఘీభావంగా నిలుస్తామని ప్రధానమంత్రి ప్రకటన

అంతర్జాతీయ వ్యాక్సిన్ అలయన్స్ గవికి 15 మిలియన్ డాలర్ల నిధులు అందించడానికి భారత్ హామీ

Posted On: 04 JUN 2020 7:30PM by PIB Hyderabad

అంతర్జాతీయ టీకా సంఘటన గావికి 15 మిలియన్ డాలర్ల నిధులు అందించడానికి భారతదేశం హామీ ఇచ్చింది. 

యుకె ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఏర్పాటు చేసిన ఈ వర్చువల్ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. 50కి పైగా దేశాల వ్యాపార దిగ్గజాలు, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, పౌర సమాజం ప్రతినిధులు, వివిధ ప్రభుత్వాల్లోని మంత్రులు, దేశాధినేతలు, దేశ నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
అత్యంత సవాలుతో కూడిన ప్రస్తుత రోజుల్లో భారతదేశం ప్రపంచానికి సంఘీభావంతో వ్యవహరిస్తుందని ప్రధానమంత్రి తన ప్రసంగంలో హామీ ఇచ్చారు. 

భారత నాగరికత ప్రపంచం యావత్తును ఒకే కుటుంబం అని బోధించిందని, ప్రస్తుతం మహమ్మారి ప్రపంచం యావత్తును కల్లోలితం చేస్తున్న తరుణంలో భారతదేశం ఆ బోధనకు దీటుగా నిలుస్తుందని శ్రీ మోదీ అన్నారు. ఆ బోధనకు అనుగుణంగానే భారతదేశం స్పందించి సమీపంలోని ఇరుగుపొరుగు దేశాలకు సహాయం అందించేందుకు తక్షణ ఉమ్మడి స్పందన వ్యూహం అనుసరించిందని,   తన జనాభాను కాపాడుకోవడంతో పాటుగా అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను 120కి పైగా దేశాలతో పంచుకున్నదని ప్రధానమంత్రి చెప్పారు. 

కోవిడ్-19 మహమ్మారి కొన్ని రకాలుగా ప్రపంచ సహకారంలోని పరిమితులను బట్టబయలు చేసిందంటూ ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా మానవాళి యావత్తు సుస్పష్టమైన ఉమ్మడి శత్రువును ఎదుర్కొంటున్నదని ప్రధానమంత్రి అన్నారు.

గవి అనేది ఒక ప్రపంచ స్థాయి సంఘటన మాత్రమే కాదని, అంతర్జాతీయ సంఘీభావానికి చిహ్నమని, ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనకి మనం సహాయం చేసుకున్నట్టే అనే స్ఫూర్తిని అందరికీ గుర్తు చేసిందని ఆయన చెప్పారు.

భారతదేశం భారీ జనసంఖ్య, పరిమిత ఆరోగ్యసంరక్షణ వసతులు గల దేశమని, టీకా మందుల ప్రాధాన్యం తెలుసునని ఆయన అన్నారు. 

తన ప్రభుత్వం చేపట్టిన తొలి కార్యక్రమాల్లో మిషన్ ఇంద్రధనుష్ ఒకటని, మారుమూల ప్రాంతాల్లో నివశిస్తున్నవారు సహా యావత్ దేశంలోని బాలలు, గర్భిణులకు పూర్తి స్థాయి టీకా మందులు ఇవ్వడం దాని లక్ష్యమని ప్రధానమంత్రి వివరించారు. 

రక్షణ కవచాన్ని మరింతగా విస్తరించే లక్ష్యంతో భారతదేశం తన టీకామందుల కార్యక్రమానికి ఆరు కొత్త వ్యాక్సిన్లను జత చేసిందని ఆయన తెలిపారు. 

భారతదేశం తన వ్యాక్సిన్ల సరఫరా వ్యవస్థ యావత్తును డిజిటైజ్ చేసిందని, శీతలీకరణ వసతుల సమగ్రతను పర్యవేక్షించేందుకు ఎలక్ర్టానిక్ వ్యాక్సిన్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిందని ప్రధానమంత్రి చెప్పారు. 

ప్రపంచంలో టీకాల ఉత్పత్తిలో ముందువరుసలో ఉన్న దేశం భారత్ అని చెబుతూ ప్రపంచ బాలల్లో 60 శాతం మందికి టీకా మందులు అందిస్తున్న దేశం కావడం భారతదేశం అదృష్టమని  ప్రధానమంత్రి చెప్పారు. 

గావి చేపట్టే కార్యకలాపాల విలువను భారతదేశం గుర్తించిందని, అందుకే గావికి తన వంతు నిధులను విరాళంగా అందిస్తున్నదని, గావి మద్దతుకు అర్హత సాధించిందని శ్రీ మోదీ చెప్పారు.

గావికి భారతదేశం మద్దతు కేవలం ఆర్థికపరమైనదే కాదని, అంతర్జాతీయంగా వ్యాక్సిన్ల ధరలు తగ్గేందుకు భారతదేశానికి గల భారీ డిమాండు దోహదపడిందని చెబుతూ గత ఐదేళ్ల కాలంలో గావికి 400 మిలియన్ డాలర్లు ఆదా కావడానికి భారతదేశం సహాయకారి అయిందని ఆయన చెప్పారు.

తక్కువ ధరలోనే నాణ్యమైన ఔషధాలు, వ్యాక్సిన్లు తయారుచేయగల ధ్రువీకృత సామర్థ్యం, టీకామందుల కార్యక్రమం అందరికీ త్వరితగతిన విస్తరించిన అనుభవం,  శాస్ర్తీయ పరిశోధన లో విస్తారమైన అనుభవం గల ప్రతిభావంతులతో  ప్రపంచం యావత్తుకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
 
భారతదేశం ప్రపంచ స్థాయిలో ఆరోగ్య కార్యకలాపాలకు తన వంతు సహకారం అందించగల సామర్థ్యం కలిగి ఉండడమే కాకుండా భాగస్వామ్యం, సంరక్షణ స్ఫూర్తితో తన వంతు సహాయం అందించేందుకు ఇష్టపూర్వకంగా సిద్ధంగా ఉన్నదని ఆయన హామీ ఇచ్చారు.

 


(Release ID: 1629511)