PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 24 SEP 2020 6:18PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో వరుసగా 6రోజు కొత్త కేసులకన్నా కోలుకున్న కేసులు అత్యధికంగా నమోదు.
  • దేశంలోని 13 రాష్ట్రాలు/యూటీలలో కొత్త కేసులకన్నా వ్యాధి నయమైనవారి సంఖ్య అధికం.
  • కోలుకునేవారి జాతీయ సగటు నేడు 81.55 శాతానికి చేరిక.
  • కొత్తగా నిర్ధారణ అయిన కేసులలో 75 శాతం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే.
  • కోవిడ్‌-19పై ప్రస్తుత స్థితిగతులు, ప్రతిస్పందనపై 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి సమీక్ష; వైరస్‌ వ్యాప్తి నిరోధంపై 1-2 రోజుల స్థానిక దిగ్బంధం విధింపుపై అంచనాలకు సూచన.
  • ఈ-సంజీవని ప్రారంభించాక 6 నెలల్లో 3 లక్షల దూరవాణి-సంప్రదింపులు పూర్తిచేసిన ఆరోగ్య మంత్రిత్వశాఖ.

దేశంలో కొనసాగుతున్న కోలుకునే ధోరణి; వరుసగా 6వ రోజు కొత్త కేసులకన్నా అధికంగా నయమైన కేసులు; 10 రాష్ట్రాలు/యూటీలలోనే 74 శాతం నమోదు

దేశంలో కోవిడ్ నుంచి నిత్యం కోలుకునేవారి  సంఖ్య విశేషంగా పెరుగుతోంది. మ‌హ‌మ్మారి నియంత్రణ దిశ‌గా పటిష్ఠ వ్యూహాలు, ప్రజాహితం  లక్ష్యంగా చేపడుతున్న క్ర‌మ‌బ‌ద్ధ చర్యలతోనే ఇది సాధ్యమైంది. ఈ నేప‌థ్యంలో వ‌రుస‌గా ఆరో రోజు కొత్త కేసులకన్నా కోలుకున్న కేసుల సంఖ్య అధికంగా న‌మోదైంది. ఈ మేర‌కు గ‌త 24 గంట‌ల్లో 87,374 మంది కోలుకుని ఇళ్ల‌కు వెళ్ల‌గా కొత్త కేసుల సంఖ్య 86,508గా ఉంది. దీంతో ఇప్ప‌టిదాకా వ్యాధి న‌య‌మైన‌వారి సంఖ్య 46.7లక్షలు (46,74,987) దాటి, జాతీయ స‌గ‌టు 81.55 శాతాన్ని అధిగ‌మించింది. త‌ద‌నుగుణంగా క్రియాశీల (9,66,382) కేసులతో పోలిస్తే కోలుకున్న (46,74,987) కేసుల మ‌ధ్య వ్య‌త్యాసం కూడా నిరంతరం పెరుగుతూ 37 లక్షలు దాటింది. ఈ మేర‌కు మొత్తం న‌మోదిత కేసుల‌లో చురుకైన కేసులు 16.86 శాతం మాత్రమే. అలాగే క్రియాశీల కేసుల సంఖ్య కూడా త‌గ్గుతూ వ‌స్తోంది. జాతీయ స్థాయిని అనుస‌రిస్తూ 13 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త కేసుల‌క‌న్నా న‌య‌మ‌య్యే కేసులే అధికంగా ఉంటున్నాయి. మొత్తంమీద కొత్తగా కోలుకున్న కేసుల‌లో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే దాదాపు 74 శాతం నమోదవ‌డం విశేషం. వీటిలోనూ మహారాష్ట్ర 19,476 కేసుల (22.3 శాతం)తో వరుసగా 6వ రోజు త‌న ఆధిప‌త్యం కొన‌సాగించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658685

దేశంలోని కొత్త కేసులలో 75 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదు

భారత్‌లో వరుసగా ఆరో రోజుల కోలుకున్న కేసులకన్నా నిర్ధారిత కేసుల సంఖ్య తక్కువగా నమోదైంది. ఈ మేరకు గత 24 గంటల్లో 86,508 కొత్త కేసులు నమోదవగా, వీటిలో 75 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోనే కేంద్రీకృతమ‌య్యాయి. ఒక్క‌ మహారాష్ట్రలోనే 21,000 నమోదవగా, ఆంధ్రప్రదేశ్ (7,000), కర్ణాటక (6,000) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో న‌మోదైన 1,129 మరణాలకుగాను 83 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే సంభ‌వించాయి. వీటిలోనూ ఒక్క మహారాష్ట్రలోనే 479 మరణాలు న‌మోద‌వ‌గా- ఉత్తరప్రదేశ్ (87), పంజాబ్‌ (64) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 1,082, ప్రైవేటు రంగంలో 728 వంతున ప్రయోగశాలలు ప్రజలకు అందుబాటులో ఉండగా గత 24 గంటల్లో 11,56,569 పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం 6.74 కోట్లకుపైగా నమూనాలను పరీక్షించినట్లయింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658687

కోవిడ్‌-19 స్థితిగతులు-స్పందనపై 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌లలో కోవిడ్‌-19 స్థితిగతులు, ప్రతిస్పందనపై ఆ రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా సంభాషించారు. దేశంలో ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జనారోగ్య యోజన రెండో వార్షికోత్సవం సందర్భంగా తాను వారితో సంభాషించడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ పథకం ద్వారా రెండేళ్లలో 1.25 కోట్లకుపైగా పేదలు ఉచితంగా చికిత్స పొందారని గుర్తుచేశారు. పేదల సేవలో నిరంతరం నిమగ్నమైన వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని ఆయన కొనియాడారు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ దేశంలో నిత్యం 10 లక్షలకుపైగా పరీక్షలు నిర్వహిస్తోందని, దీంతోపాటు కోలుకునేవారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతున్నదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ మహమ్మారి సంక్షోభ పరిష్కారం కోసం మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కేసుల అన్వేషణ, జాడ తీయడంపై మెరుగైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్‌ నిర్దిష్ట మౌలిక వసతుల కోసం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధిని వాడుకునే పరిమితిని 35 శాతం నుంచి 50 శాతానికి పెంచినట్లు తెలిపారు. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం స్థానికంగా 1-2 రోజుల దిగ్బంధంతో లభించగల ఫలితాలపై అంచనా వేయాలని ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను కోరారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658533

కోవిడ్ కేసుల భారంగల 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఆరోగ్య మంత్రులతో ఆన్‌లైన్‌ సమీక్ష సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658757

వయోనుగుణ దారుఢ్య విధివిధానాలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి; ‘ఫిట్ ఇండియా ఉద్యమ’ తొలి వార్షికోత్సవంలో వివిధ ఔత్సాహికులతో సంభాషణ

‘సుదృఢ భారత ఉద్యమం’ తొలి వార్షికోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా వయోనుగుణ దారుఢ్య విధివిధానాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ క్రీడాకారులు, దారుఢ్య నిపుణులు తదితరులతో చర్చాగోష్ఠిలో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయనతో చర్చలో పాల్గొన్న ప్రముఖులు తమ జీవితానుభవాలను, తమ దారుఢ్య పద్ధతులను పంచుకున్నారు. కొందరు భావించినట్లుగా శారీరక దృఢత్వం సాధించడం కష్టమైనదేమీ కాదని ప్రధానమంత్రి తన ప్రసంగంలో స్పష్టం చేశారు. కాస్త క్రమశిక్షణ, మరికాస్త కష్టంతో అందరూ సదా ఆరోగ్యంగా ఉండవచ్చునని సూచించారు. అందరి ఆరోగ్యం కోసం 'నిత్యం అరగంట దారుఢ్య మోతాదు’ అంటూ మంత్రోపదేశం చేశారు. ప్రతి ఒక్కరూ యోగా, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్, కరాటే, కబడ్డీ వంటి కార్యకలాపాల కోసం కనీసం 30 నిమిషాలు కేటాయించాలని కోరారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658796

‘సుదృఢ భారతం ఉద్యమం’ తొలి వార్షికోత్సవం సందర్భంగా పై చర్చాగోష్ఠిలో  ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658655

ఐక్యరాజ్యసమతి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాల ప్రతినిధుల సమావేశంలో డాక్టర్‌ హర్షవర్ధన్‌ ప్రసంగం

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇవాళ ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా ఐక్యరాజ్య సమితిలోని వివిధ సంస్థలు, భాగస్వామ్య సంస్థల అధిపతులతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాల ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. క్షయవ్యాధి నిర్మూలన దిశగా... ముఖ్యంగా కోవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో బహుళరంగ చర్యలను బలోపేతం చేయడంలో భారతదేశం పోషించిన పాత్ర, అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. “ఈ మహమ్మారి మన జీవితాల్లో ఒకటికన్నా ఎక్కువ మార్గాల్లో నాటకీయ మార్పులు తెచ్చిపెట్టింది” అని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658346

ఈ-సంజీవని ప్రారంభించాక 6 నెలల్లో 3 లక్షల దూరవాణి-సంప్రదింపులు పూర్తిచేసిన ఆరోగ్య మంత్రిత్వశాఖ

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆరు నెలల కిందట ప్రారంభించిన ‘ఈ-సంజీవని’ (OPD) వేదిక అత్యంత స్వల్ప కాలంలోనే 3 లక్షల దూరవాణి-సంప్రదింపుల మైలురాయిని అధిగమించింది. కోవిడ్‌-19 మహమ్మారి సంక్షోభం నడుమ ఈ-సంజీవని ఓపీడీ సేవలతో దూరవాణి సంప్రదింపులద్వారా రోగి-వైద్యుల మధ్య అనుసంధానం ఏర్పడింది. అటుపైన దేశవ్యాప్తంగా దీనిపై సానుకూల స్పందన నేపథ్యంలో ఈ వేదికకుగల ప్రజాదరణ రుజువైంది. ఇందులో భాగంగా తమిళనాడు అత్యధికంగా 1,29,801 దూరవాణి-సంప్రదింపులను నిర్వహించి జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658752

పార్లమెంటు 2020 వర్షాకాల సమావేశాల ముగింపు; లోక్‌సభలో దాదాపు 167 శాతం, రాజ్యసభలో 100.47శాతం వంతున ఉత్పాదకత నమోదు: ప్రహ్లాద్‌ జోషి

పార్లమెంటు 2020 వర్షాకాల సమావేశాలు ముగిసినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. లోక్‌సభలో దాదాపు 167 శాతం, రాజ్యసభలో సుమారు 100.47 శాతం వంతున ఉత్పాదకత నమోదైనట్లు అందులో తెలిపారు. కాగా, 2020 సెప్టెంబర్ 14 న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1న ముగియాల్సి ఉండగా అవసరమైన కార్యకలాపాలు పూర్తయ్యాక కోవిడ్‌-19 మహమ్మారి ముప్పు కారణంగా రాజ్యసభ 2020 సెప్టెంబర్ 23న నిరవధికంగా వాయిదా పడిందని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658801

51వ అంతర్జాతీయ చలనచిత్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ పత్రికా ప్రకటన

గోవాలో 2020 నవంబర్ 20 నుంచి 28 వరకు నిర్వహించాల్సిన 51వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వాయిదాపడింది. ఈ మేరకు ఈ వేడుకలను 2021 జనవరి 16 నుంచి 24 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర  సమాచార-ప్రసారశాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్‌తో గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్‌తో ఈ అంశంపై చర్చించిన అనంతరం సదరు ప్రకటన వెలువడింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658690   

‘ప్రధానమంత్రి స్వనిధి’ పథకం కింద 15 లక్షలకుపైగా దరఖాస్తుల స్వీకరణ

‘ప్రధానమంత్రి వీధివర్తకుల స్వయం సమృద్ధి నిధి’ (పీఎం స్వనిధి) పథకం కింద రుణాల కోసం ఇప్పటిదాకా 15 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. వీటిలో 5.5 లక్షలకుపైగా రుణాలు మంజూరు కాగా, అందులో సుమారు 2 లక్షల రుణాల పంపిణీ పూర్తయింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658751

కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ 46వ ఆవిర్భావ దినోత్సవం; శాస్త్ర పరిజ్ఞానాధారిత పర్యావరణ నిర్వహణకు సాంకేతిక నాయకత్వంపై ప్రతిన

పర్యావరణంలో గాలిని స్వచ్ఛంగా ఉంచాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు ప్రజలు సమానంగా పంచుకోవాలని కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ బాబుల్ సుప్రియో అన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన వెబినార్‌లో ఆయన ప్రసంగించారు. వాయు స్వచ్ఛత దిశగా కాలుష్య సంబంధిత సమాచార సేకరణ, సంకలనంలో కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ విశేషంగా కృషి చేస్తున్నదని కొనియాడారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658378

ఆయుష్మాన్‌ భారత్‌ యోజన కింద కోవిడ్‌-19 చికిత్స

ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జనారోగ్య యోజన (AB-PMJAY) ప్రారంభమైన తర్వాత 21.09.2020 వరకూ 1.26 కోట్లకుపైగా ఆసుపత్రి ప్రవేశాలకు ఆమోదం ఇవ్వబడింది. ఇందులో భాగంగా 5.13 లక్షల మంది కోవిడ్‌-19 పరీక్ష-చికిత్సలకూ అనుమతి ఇచ్చారు. ఏబీ-పీఎంజేఏవై కింద దేశవ్యాప్త ప్రాతిపదికన నిధులు కేటాయించబడతాయి. సంబంధిత నియమ-నిబంధనలకు అనుగుణంగా, తగు సమాచారంతో అందే ప్రతిపాదనలపై రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ నిధులు విడుదలవుతాయి. ఈ మేరకు పథకం మొదలైనప్పటినుంచి 21.09.2020దాకా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.5,474 కోట్లు విడుదల చేయబడ్డాయి. ఈ మేరకు లోక్‌సభలో నిన్న ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658435

‘ఆయుష్మాన్‌ భారత్‌ యోజన, జాతీయ ఆరోగ్య నిధి’ కింద ఓపీడీ సేవలు

ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్సపొందే పేదలకు ఆర్థిక సహాయం చేయడంకోసం ప్రభుత్వం ‘జాతీయ ఆరోగ్య నిధి’ పేరిట ఛాత్ర పథకాన్ని అమలు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జనారోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) కింద సామాజిక-ఆర్థిక-కులగణన గణాంకాల ప్రకారం గుర్తించిన పేద-బలహీన వర్గాల కుటుంబాలకు ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ కోసం ఆస్పత్రిలో సేవలు పొందడానికి ఏటా రూ.5 లక్షల మేర అందిస్తోంది. అయితే, ఈ పథకాలను అవుట్-పేషెంట్ సేవలకు విస్తరించే ప్రతిపాదనేదీ లేదని లోక్‌సభలో నిన్న ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658279

ఆశా కార్యకర్తలకు ప్రోత్సాహకాలు

కోవిడ్‌ మహమ్మారి సంబంధిత విధుల్లోగల ‘ఆశా’ కార్యకర్తలకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ “భారత కోవిడ్‌-19 అత్యవసర ప్రతిస్పందన-ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధత ప్యాకేజీ” కింద నెలకు రూ.1,000 వంతున అదనపు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. కాగా, “ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ: కోవిడ్-19పై పోరులోగల ఆరోగ్య సిబ్బందికి బీమా పథకం” కింద ఆశా  కార్యకర్తలుసహా ఇతరులందరికీ రూ.50 లక్షల బీమా సదుపాయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించింది. మేరకు లోక్‌సభలో నిన్న ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే ఈ విషయాన్ని వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658579

ఒకసారి వాడివదిలేసే ఫేస్‌ మాస్కుల వినియోగంపై మార్గదర్శకాలు

వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) హేతుబద్ధ వినియోగంపై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఇతర ముందువరుస యోధుల కోసం వైద్యపరమైన మాస్క్‌సహా వ్యక్తిగత రక్షణ పరికరాల ఉపయోగంలో పాటించాల్సిన నిర్దిష్టతలు, ప్రమాణాలను కూడా జారీచేసింది. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోనూ ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచింది. ఈ మేరకు లోక్‌సభలో నిన్న ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే ఈ విషయాన్ని వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658433

కరోనా వైరస్‌ నిర్మూలన దిశగా టీకాల అభివృద్ధి

కోవిడ్‌-19 మహమ్మారి నిర్మూలన దిశగా టీకాల అభివృద్ధి కోసం కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ కొన్ని సంస్థలకు వివిధ దశల్లో ప్రయోగ-పరీక్షల నిర్వహణకు అనుమతినిచ్చింది. ఈ జాబితాలో “సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పుణె; క్యాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్, అహ్మదాబాద్; భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హైదరాబాద్; బయోలాజికల్ ఇ-లిమిటెడ్, హైదరాబాద్; రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై; అరబిందో ఫార్మా లిమిటెడ్, హైదరాబాద్; జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, పుణె” సంస్థలున్నాయి. ఈ మేరకు లోక్‌సభలో నిన్న ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే ఈ విషయాన్ని వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658576

సంస్కరణల లక్ష్యం సాధించిన ఐదు రాష్ట్రాలకు రూ. 9,913 కోట్ల అదనపు రుణ సమీకరణకు అనుమతి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, కర్ణాటక, త్రిపుర రాష్ట్రాలు రూ.9,913 కోట్ల మేర అదనపు ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో భాగంగా బహిరంగ మార్కెట్‌ నుంచి రుణ సమీకరణ కోసం కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని వ్యయపరిశీలన విభాగం అనుమతినిచ్చింది. కేంద్రం నిర్దేశించిన సంస్కరణల్లో భాగమైన ‘ఒకే దేశం-ఒకే కార్డు’ విధానాన్ని విజయవంతంగా అమలు చేసిన నేపథ్యంలో ఈ  అనుమతి ఇవ్వబడింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658734

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • కేరళ: రాష్ట్ర రాజధాని తిరువనంతపురంసహా అలప్పుళ, పతనంతిట్ట, కోళికోడ్, కాసరగోడ్ జిల్లాల్లో కోవిడ్-19 వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రోగ లక్షణాలతో బాధపడేవారిని గుర్తించి, వెంటనే నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించింది. కాగా, కోళికోడ్ జిల్లాలో పరీక్షల అనంతర నిర్ధారిత కేసుల సగటు 9.1 శాతానికి పెరిగింది. దీంతో ఇక్కడి పాళయం మార్కెట్‌ను వారంపాటు మూసివేయాలని నిర్ణయించారు. ఈ మధ్యాహ్నం వరకు జిల్లాలో 143 కొత్త  కేసులు నమోదయ్యాయి. మొత్తంమీద కేరళలో నిన్న 5,376 కొత్త కేసులు నమోదవడంతో ప్రస్తుతం 42,786 మంది చికిత్స పొందుతుండగా రాష్ట్రంలో 2,12,629 మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత 24 గంటల్లో అత్యధికంగా 668 కొత్త కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,895కు చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 5097 కాగా, మరణాలు 487గా ఉన్నాయి. ఇక ఇప్పటిదాకా 19,311 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. కాగా, తమిళనాడులో డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ.విజయకాంత్‌కు కోవిడ్‌ నిర్ధారణ అయింది. మరణాల సంఖ్య 9,000 దాటడంతో రాష్ట్రం బుధవారం మరో విషాదకర మైలురాయిని చేరింది. ఇక కోలుకుని రాష్ట్రంలో నిన్న 5,325 తాజా కేసులు నమోదవగా మొత్తం కేసులు 5,57,999కు చేరాయి. అయితే, 5,363 మంది కోలుకోగా ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య  5 లక్షలు దాటింది,
  • కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్ మరణాల సగటు తగ్గుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమీక్ష సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడ్యూరప్ప ఆయన చెప్పారు. రాష్ట్రం 136 ప్రయోగ శాలలను ఏర్పాటుచేసిందని, రోజువారీగా 70,000 నమూనాలను పరీక్షిస్తున్నామని తెలిపారు. కర్ణాటకలో మార్చి నెలనుంచి ముందు వరుసలోని కోవిడ్‌ యోధులైన 43 మంది డాక్టర్లు వైద్యులు మహమ్మారి సోకి మరణించారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ గణాంకాలు పేర్కొంటున్నాయి. కాగా, రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివే 1.5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు మారారు.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని విజయవాడ, కర్నూలు, గుంటూరు వంటి పట్టణ ప్రాంతాల్లో కోవిడ్-19 విజృంభణను చవిచూసిన నేపథ్యంలో ఇప్పుడీ పరిస్థితి గ్రామీణ ప్రాంతాలకు మారింది. అయితే, ఇది ముందుగానే ఊహించిన పరిణామమని రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే, వ్యాధి వ్యాప్తి నియంత్రణ కష్టమేమీ కాదని ధీమా వ్యక్తం చేసింది. కాగా, ప్రతి జిల్లా గరిష్ఠంగా 40 రోజుల దశను అనుభవించిందని రాష్ట్ర ఆరోగ్య కమిషనర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం- మొత్తం 13 జిల్లాలూ అత్యున్నత సంక్రమణ దశను అధిగమించాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ 8,291 మంది కోలుకున్న నేపథ్యంలో వ్యాధి నయమయ్యేవారి శాతం ఆశావహంగా పెరుగుతోంది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2176 కొత్త కేసులు, 8 మరణాలు నమోదవగా 2004 మంది కోలుకున్నారు. కొత్త  కేసులలో 308 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,79,246; క్రియాశీల కేసులు: 30,037; మరణాలు: 1070; డిశ్చార్జి: 1,48,139గా ఉన్నాయి. కాగా, సిటీ బస్సులపై ఆధారపడిన ప్రయాణికులకు ఊరట కల్పిస్తూ హైదరాబాద్ నగర శివార్లలో టీఎస్‌ఆర్టీసీ శివారు బస్సు సర్వీసులను ప్రారంభించింది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 289 కొత్త కేసులు నమోదవగా వీటిలో ఇటానగర్ రాజధాని ప్రాంతంలోనే 173 కేసులున్నాయి.
  • అసోం: అసోంలో గత 24 గంటల్లో 1762 మంది కోలుకోగా ప్రస్తుతం 30182 చురుకైన కేసులున్నాయి. కాగా, ఇప్పటివరకూ మొత్తం 132709 మందికి వ్యాధి నయమైంది.
  • మణిపూర్: రాష్ట్రంలో  96 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 9376కు చేరాయి. మణిపూర్‌లో 75 శాతం కోలుకునే సగటు నమోదవగా, ప్రస్తుతం 2206 క్రియాశీల కేసులున్నాయి. కాగా, రాష్ట్రంలో మరో ఇద్దరు కోవిడ్‌ రోగుల మరణంతో మృతుల సంఖ్య 62కు చేరింది.
  • సిక్కిం: రాష్ట్రంలో నేటిదాకా 1974 మంది కోలుకోగా ప్రస్తుతం 607 క్రియాశీల కేసులున్నాయి.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో కోవిడ్‌-19పై పోరులో భాగంగా తమ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘నా కుటుంబం-నా బాధ్యత’ ప్రత్యక్ష సంప్రదింపుల కార్యక్రమం మరింత బలోపేతం కాగలదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విశ్వాసం వ్యక్తంచేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 2.25కోట్ల గృహాలకు చేరువ కావడంకోసం 59వేల ఆరోగ్య బృందాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కోవిడ్-19పై ప్రజల్లో అవగాహన కల్పనతోపాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంద్వారా రోగ లక్షణాలను గుర్తించి సరైన చికిత్స అందించే దిశగా ఈ ప్రచారం సాగాల్సి ఉంది. కాగా, 7 రాష్ట్రాల్లో కోవిడ్‌ పరిస్థితిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం సమీక్ష నిర్వహించిన సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రచారం గురించి ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు.
  • గుజరాత్: రాష్ట్రంలోని ప్రైవేటు ప్రయోగశాలలపై విచారణ నిర్వహించాలని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాష్ట్ర ఆరోగ్యశాఖను ఆదేశించారు. వలస కార్మకులకు 14 రోజుల దిగ్బంధం తప్పించే దిశగా ఈ ప్రయోగశాలలు వ్యాధి సోకలేదని నిర్ధారిస్తూ బూటకపు ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తున్నట్లు ఓ గుజరాతీ దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైన నేపథ్యంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
  • రాజస్థాన్: రాష్ట్రంలో కరోనా రోగులు కోలుకునే సగటు 83.12 శాతానికి చేరింది. ఆ మేరకు ఇప్పటిదాకా కోవిడ్‌ మహమ్మారి కోరలనుంచి విజయంతంగా బయటపడినవారి సంఖ్య  కూడా లక్ష దాటింది. ఇక రాజస్థాన్‌లో కోలుకునే సగటురీత్యా బార్మర్ 95 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, బుండి, సిరోహి జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని 21 జిల్లాల్లో గడచిన 23 రోజుల్లో కోవిడ్ కేసులు రెట్టింపయ్యాయి. ఓ మూడు జిల్లాల్లో మూడు రెట్లు అధికం కాగా, నర్సింగ్‌పూర్‌లో దాదాపు 400 శాతం పెరిగాయి. అయితే, మధ్యప్రదేశ్‌లోని తీవ్ర ముప్పున్న ప్రధాన  ప్రాంతాల జాబితాలోగల ఇండోర్, భోపాల్, జబల్పూర్, గ్వాలియర్ ఈ 21 జిల్లాల జాబితాలో లేకపోవడం గమనార్హం.

FACT CHECK

******


(Release ID: 1658878) Visitor Counter : 210