రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ధర నియంత్రణ పరిధిలోకి వచ్చిన 871 అత్యవసర ఔషధాల షెడ్యూల్డ్‌ ఫార్ములాలు

Posted On: 23 SEP 2020 3:16PM by PIB Hyderabad

జాతీయ ఔషధ ధరల అథారిటీ (ఎన్‌పీపీఏ), 871 ఔషధాల షెడ్యూల్డ్‌ ఫార్ములాలకు గరిష్ట ధరలు నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అత్యవసర ఔషధాల జాతీయ జాబితా-2015 కింద ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.

    ఔషధ ధర నియంత్రణ ఉత్తర్వులు-2013లోని 19వ పేరా ప్రకారం, గుండెలో అమర్చే స్టెంట్ల ధర కూడా ఇందులో ఉంది. స్టెంట్ల ధర తగ్గింపు ఫలితంగా, 'బేర్ మెటల్ స్టెంట్‌' ధర దాదాపు 85 శాతం, 'డ్రగ్‌ ఎలూటింగ్‌ స్టెంట్‌' ధర దాదాపు 74 శాతం తగ్గింది.

    కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానం రూపంలో రాజ్యసభకు సమర్పించారు. స్టెంట్లతో పాటు, మోకీలు మార్పిడి, 106 మధుమేహ నిరోధక, గుండె జబ్బుల మందులు, 42 షెడ్యూల్‌ కాని క్యాన్సర్ నిరోధక మందులను కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ధర హేతుబద్ధీకరణలోకి తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

    ఎన్‌పీపీఏ ద్వారా గరిష్ట ధరల నిర్ణయం ఇకపైనా కొనసాగే ప్రక్రియగా శ్రీ గౌడ చెప్పారు. అత్యవసర ఔషధాల జాతీయ జాబితాలోకి ఫార్ములాలను చేరిస్తే, వాటి ధరలను ఎన్‌పీపీఏ నిర్ణయిస్తుందని లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

***


(Release ID: 1658433) Visitor Counter : 222