పార్లమెంటరీ వ్యవహారాలు

ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు లోక్ సభ సమావేశాలు 167శాతం, రాజ్యసభ సమావేశాలు

100.47శాతం ఫలించాయి: ప్రహ్లాద్ జోషి

11ఆర్టినెన్సులు చట్టాలుగా మారాయన్నకేంద్ర మంత్రి

Posted On: 24 SEP 2020 2:06PM by PIB Hyderabad

   2020 సంవత్సరపు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లోక్ సభ దాదాపు 167శాతం, రాజ్యసభ 100.47శాతం ఫలవంతమైందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన సందర్భంగా ఆయన రోజు ఒక ప్రకటన విడుదల చేశారు.

  2020 సెప్టెంబర్ 14 మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముందుగా నిర్ణయించిన ప్రకారమైతే అక్టోబర్ 1 ముగియాలని, అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా సెప్టెంబరు 23కే సమావేశాలను ముగించాల్సి వచ్చిందని అన్నారు. అత్యవసర సభా కార్యకలాపాల, లావాదేవీల అనంతరం లోక్ సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడ్డాయన్నారు. దీనితో ఉభయ సభలూ మొత్తం 10 రోజులపాటు సమావేశం జరిపాయన్నారు.

  వర్షాకాల సమావేశాల్లో మొత్తం 22 బిల్లులు ప్రవేశపెట్టారు. లోక్ సభలో 16 బిల్లులు, రాజ్యసభలో 6 బిల్లులు ప్రవేశపెట్టారని చెప్పారు. లోక్ సభ, రాజ్యసభ సొంతంగా 25 బిల్లుల చొప్పున ఆమోదించగా, ఉభయ సభలూ కలసి 27 బిల్లులకు ఆమోదం తెలిపాయి. అంటే ఉభయ సభలూ రోజుకు సగటున 2.7 బిల్లులు ఆమోదించాయి. ఆయా బిల్లుల పేర్లు, సభలు పరిశీలించిన బిల్లులు, ఆమోదించిన బిల్లుల వివరాలను అనుబంధంలో పొందుపరిచారు.

  పార్లమెంటు సమావేశం జరపని కాలంలో జారీ చేసిన 11 ఆర్డినెన్సుల స్థానంలో తీసుకువచ్చిన బిల్లులను పార్లమెంటు చట్టాలుగా ఆమోదించింది. అయితే, లోక్ సభలో నాలుగు పాత పెండింగ్ బిల్లులను, రాజ్యసభలో ఒక పెండింగ్ బిల్లును ఉపసంహరించుకున్నట్టు మంత్రి చెప్పారు.

  సమావేశాల్లో 2020-21 సంవత్సరపు తొలి దఫా అనుబంధ పద్దులు, 2016-17 సంవత్సరపు అదనపు పద్దులపై చర్చించి వాటిని ఆమోదించారు. వాటికి సంబంధించిన ద్రవ్య వినియోగ బిల్లులను లోక సభ 2020 సెప్టెంబరు 18 చర్చించి, ఆమోదించింది. రాజ్యసభ మాత్రం బిల్లులను తిప్పి పంపింది

    కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల నిర్వహణకోసం  చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయమని కేంద్రమంత్రి పేర్కొన్నారు. పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు, లావాదేవీల నిర్వహణతో ప్రమేయం ఉన్న వ్యక్తులు, సంస్థల నిర్విరామ కృషి వల్లనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అసాధారణ రీతిలో ఫలితాలనిచ్చాయన్నారు.

  రాజ్యాంగంలోని 85 ఆర్టికల్ ప్రకారం శాసనపరమైన అత్యవసర కార్యకలాపాలు, ఇతర లావాదేవీలు తప్పనిసరిగా పూర్తి చేయవలసి ఉన్నందున కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా పార్లమెంటు సమావేశాలు నిర్వహించవలసి వచ్చిందని, కోవిడ్ పై జాగ్రత్తలు తీసుకుంటూ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శక సూత్రాలను అనుసరిస్తూ సమావేశాలు నిర్వహించామన్నారు.

 

 

పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ముఖ్యమైన బిల్లులు కింది విధంగా ఉన్నాయి.:-

వ్యవసాయ సంస్కరణలు

  రైతుల ఉత్పాదనల వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయం) బిల్లు 2020: వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం, కొనుగోలు జరిగే చోటుకు సంబంధించి రైతులు, వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించగలిగే వ్యవస్థ కల్పనకు బిల్లు దోహదపడుతుంది. దీనితో,.. పోటీతత్వంతో కూడిన ప్రత్యామ్నాయ వ్యాపార మార్గాల కారణంగా రైతుల ఉత్పాదనలకు గిట్టుబాటు ధర లభించేందుకు అవకాశం ఉంటుంది.            రాష్ట్రంలోను, వివిధ రాష్ట్రాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేని, పారదర్శకమైన వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యానికి వీలు కల్పిస్తుంది. సంబంధిత రాష్ట ప్రభుత్వం నోటిఫై చేసిన వ్యవసాయ మార్కెట్లకు సంబంధం లేకుండా పంటల వాణిజ్యానికి అవకాశం కల్పిస్తుంది. రైతుల ఉత్పత్తులకు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సదుపాయానికి దోహదపడుతుంది.

  రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం బిల్లు 2020: పంటల  ప్రాసెసింగ్ సంస్థలతో, టోకు వ్యాపారులతో, అగ్రిగేటర్లతో, భారీ రిటెయిలర్లతో, ఎగుమతిదార్లతో రైతులు విక్రయ ఒప్పందం కుదుర్చుకోవడానికి బిల్లు వీలు కల్పిస్తుంది. భవిష్యత్తులో దిగుబడి అయ్యే పంట ఉత్పాదనను పరస్పరం ఆమోదయోగ్యమైన గిట్టుబాటు ధరకు సరసంగా, పారదర్శకంగా విక్రయించుకోగలిగే వ్యవస్థ ఏర్పాటుకు బిల్లు దోహదపడుతుంది.

  నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు 2020:  వ్యవసాయ రంగంలో సత్వరం పెట్టుబడులు పెట్టడానికి బిల్లు దోహదపడుతుంది. పోటీ తత్వం పెంచి, రైతుల ఆదాయం పెంపొందించడానికి వీలు కలిగిస్తుంది.

 

విద్యారంగం:

  జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయ బిల్లు 2020: నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బిల్లు వీలు కలిగిస్తుంది. ఫోరెన్సిక్ సైన్సులో అధ్యయనం, పరిశోధన, ప్రతిభ వంటి అంశాలపై జాతీయ ప్రాధాన్యం కలిగిన సంస్థగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఫోరెన్సిక్ సైన్సు అధ్యయనం, పరిశోధనతోపాటుగా, న్యాయశాస్త్రం, నేర పరిశోధన శాస్త్రం, సంబంధింత ఇతర రంగాలు, సాంకేతిక పరిజ్ఞానం, తదితర అంశాల్లో అధ్యయనానికి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు.

  రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం బిల్లు, 2020: రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, దాన్ని జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థగా ప్రకటించేందుకు బిల్లు వీలు కలిగిస్తుంది. బహుళ పాఠ్యాంశాల అధ్యయన సంస్థగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. పోలీసింగ్, క్రిమినల్ న్యాయ వ్యవస్థ, సంస్కరణా వ్యవహారాల పరిపాలన రంగాల్లో కొత్త విజ్ఞాన వనరులను సృష్టించేందుకు, శిక్షణ పొందిన వృత్తి నిపుణులను తయారు చేసేందుకు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇతర దేశాల్లోని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలతో విశ్వవిద్యాలయానికి సంబంధాలు ఉంటాయి. సమకాలీన పరిశోధనాంశాలను, అధ్యయన అంశాలను, కోర్సు రూపకల్పనను, సాంకేతిక పరిజ్ఞానాన్ని, శిక్షణ, నైపుణ్యాల సమాచారాన్ని ఇతర విశ్వవిద్యాలయాలతో వర్సిటీ పంచుకుంటుంది.

 

కార్మిక రంగం సంస్కరణలు:

వర్షాకాల సమావేశాల్లో 3 చారిత్రాత్మక సంస్కరణల బిల్లులు ఆమోదం పొందాయి..

  వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల నియమావళి బిల్లు 2020: ఒక సంస్థలో నియమితులైన వ్యక్తుల, ఉద్యోగుల వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన నియమాలతో కూడిన చట్టాలను సంలీనం చేసి సరళమైన చట్టానికి రూపకల్పన చేసేందుకు బిల్లు వీలు కలిగిస్తుంది. సరళమైన, హేతుబద్ధమైన చట్టం తయారీకి దోహదపడుతుంది.

  సామాజిక భద్రతా నియమాల బిల్లు 2020: ఉద్యోగుల, కార్మికుల సామాజిక భద్రతకు సంబంధించి ఇదివరకటి చట్టాలను సవరించి, ఒకే చట్టంగా రూపొందించేందుకు బిల్లు దోహదపడుతుంది. సంఘటిత, అసంఘటిత రంగంలోని ఉద్యోగులు, కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించడానికి వీలు కలిగిస్తుంది.

  పారిశ్రామిక సంబంధాల నియమాల బిల్లు 2020: ట్రేడ్ యూనియన్లు, పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన చట్టాలను సవరించి, ఒకే చట్టంగా రూపొందించేందుకు బిల్లు వీలు కలిగిస్తుంది. వివాదాల దర్యాప్తునకు, పరిష్కారానికి దోహదపడుతుంది.

 

కోవిడ్-19 సంబంధిత శాసనాలు:

  కోవిడ్-19 వ్యాప్తితో ఏర్పడిన ఇబ్బందులను ఉపశమింప జేసేందుకు కొన్ని ఆర్డినెన్సులను ఇటీవల జారీ చేశారు. వాటి స్థానంలో బిల్లులను తీసుకువచ్చారు.

 పార్లమెంటు సభ్యుల వేతనం, భత్యం, పెన్షన్ల (సవరణ) బిల్లు 2020: కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో పార్లమెంటు సభ్యులకు చెల్లించే వేతనాన్ని 30శాతం తగ్గించేందుకు బిల్లు వీలు కలిగిస్తుంది.2020 ఏప్రిల్ 1నుంచి ఏడాది పాటు తగ్గింపు అమలులో ఉంటుంది.

 మంత్రుల వేతనాలు, భత్యాల (సవరణ) బిల్లు 2020: ప్రతి మంత్రికీ ప్రభుత్వం చెల్లించే అలెవెన్సును 30శాతం తగ్గించేందుకు బిల్లును రూపొందించారు. 2020 ఏప్రిల్ నుంచి ఏడాది పాటు తగ్గింపు అమలులో ఉంటుంది.

 అంటువ్యాధుల (సవరణ) బిల్లు 2020: కోవిడ్-19 మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఎవరైనా హింసాకాండకు, అల్లర్లకు, శారీరక, మానసిక వేధింపులకు పాల్పడితే అరికట్టేందుకు బిల్లు వీలు కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణ సిబ్బందికి రక్షణ కల్పించడానికి దోహదపడుతుంది,

  దివాలా, బాంక్రప్టసీ కోడ్ బిల్లు 2020: దివాలా పిటిషన్లకు సంబంధించిన కార్పొరేట్ పరిష్కార ప్రక్రియను ప్రారంభించకుండా తొలుత ఆరు నెలలపాటు, అవసరమైతే మరో ఆరునెలల పాటు ఆంక్షలు విధించేందుకు వీలు కలిగిస్తుంది. అయితే,, బిల్లు నిబంధనల ప్రకారం వ్యవధి ఏడాదికి మించరాదు. 2020 మార్చి 25నుంచి   నిబంధన అమలులోకి వస్తుంది. కోవిడ్-19 వ్యాప్తితో  దెబ్బతిన్న కంపెనీలువెంటనే దివాలా ప్రక్రియకు గురికాకుండా నివారించి ఆర్థికపరమైన ఒత్తిడినుంచి సదరు కంపెనీ కోలుకునేంతవరకూ సహాయం అందించేందుకు బిల్లు వీలు కలిగిస్తుంది.

 

 

ఆరోగ్య రంగం:

   ఆయుర్వేద బోధన, పరిశోధనా సంస్థ బిల్లు 2020: మూడు ఆయుర్వేద అధ్యయన సంస్థల విలీనానికి బిల్లు వీలు కల్పిస్తుంది. (i) జామ్ నగర్ లోని ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్ బోధన, పరిశోధనా సంస్థ, (ii) జామ్ నగర్ లోని శ్రీ గులాబ్ కున్వరబా ఆయుర్వేద మహా విద్యాలయ, (iii) జామ్ నగర్ లోనే ఉన్న భారతీయ ఆయుర్వేద ఔషధ విజ్ఞాన శాస్త్ర సంస్థలను విలీనం చేయడానికి, కొత్తగా ఆయుర్వేద బోధన, పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయడానికి దోహదపడుతుంది. సంస్థను జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థగా ప్రకటించేందుకు బిల్లు వీలు కలిగిస్తుంది.

  భారతీయ వైద్య వ్యవస్ధపై జాతీయ కమిషన్ బిల్లు 2020: 1970 సంవత్సరపు భారతీయ వైద్య కేంద్రీయ మండలి చట్టాన్ని రద్దు చేసి, మరో నూతన వైద్య విద్యాబోధనా వ్యవస్థ ఏర్పాటు చేయడానికి బిల్లు రూపొందించారు. (i) భారతీయ వైద్య విధానంలో తగిన సంఖ్యలో నిపుణులైన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు, (ii) భారతీయ వైద్య వ్యవస్థలో తాజా, అధునాతన వైద్య పరిశోధనకు చేపట్టే అవకాశం కల్పించేందుకు, (iii) వైద్య సంస్థలను నిర్ణీత వ్యవధి ప్రకారం మధింపు చేయడానికి, (iv) వివాదాల పరిష్కారానికి పటిష్టమైన యంత్రాగాన్ని ఏర్పాటు చేయడానికి బిల్లు వీలు కలిగిస్తుంది.

  జాతీయ హోమియోపతి కమిషన్ బిల్లు 2020: 1973 సంవత్సరపు హోమియో పతి కేంద్రీయ మండలి చట్టాన్ని రద్దు చేసి, మరో ప్రత్యేకమైన వైద్య విద్యా బోధనా వ్యవస్థ ఏర్పాటుకు బిల్లును రూపొందించారు. (i)  అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన హోమియోపతి నిపుణులను అందుబాటులో ఉంచడానికి, (ii) హోమియోపతి వైద్య నిపుణులచేత అధునాతన వైద్య పరిశోధన నిర్వహింప చేయడానికి, (iii)  వైద్య సంస్థలను నిర్ణీత వ్యవధి ప్రకారం మధింపు చేయడానికి, (iv) వివాదాల పరిష్కారానికి పటిష్టమైన యంత్రాగాన్ని ఏర్పాటు చేయడానికి బిల్లు వీలు కలిగిస్తుంది.

 

ఆర్థిక రంగం/సులభతర వాణిజ్య నిర్వహణకు చర్యలు:

 దేశ ఆర్థిక అవసరాలను నెరవేర్చేందుకు, కొన్ని ముఖ్యమైన శాసనాలను వర్షాకాల సమావేశాల్లో ఆమోదించారు.

  బ్యాంకింగ్ నియంత్రణ (సవరణ) బిల్లు 2020: సహకార బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ నియంత్రణను విస్తరింపజేయడానికి వీలుగా బిల్లును రూపొందించారు. సహకార బ్యాంకుల మెరుగైన యాజమాన్యం, సరైన నియంత్రణ లక్ష్యంగా యాజమాన్యం, పెట్టుబడి, లెక్కల తనిఖీ, లిక్విడేషన్ వ్యవహారాల్లో రిజర్వ్ బ్యాంకు నియంత్రణను పెంచేందుకు బిల్లు దోహదపడుతుంది. రిజర్వ్ బ్యాంకు ద్వారా డిపాజిటర్ల ప్రయోజనాలకు రక్షణ కల్పించి, బ్యాంకింగ్ లో వృత్తిపరమైన నైపుణ్యం మెరుగుపరిచేలా, పెట్టుబడులకు మార్గం ఏర్పరచేలా, సమర్థవంతమైన బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించేలా బిల్లు వీలు కలిగిస్తుంది.  

  కంపెనీల (సవరణ) బిల్లు 2020: 2013 సంవత్సరపు కంపెనీల చట్టం నిబంధనల్లో ఏర్పడిన స్వల్పమైన నిర్వహణా, సాంకేతిక లోపాలను నేరాలకోసం దుర్వినియోగం చేయకుండా నివారించే లక్ష్యంతో బిల్లును రూపొందించారు. కోర్డుల్లో వివాదాల పెండింగ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవకతవకలు జరక్కుండా నివారించేందుకు బిల్లు వీలు కలిగిస్తుంది. కార్పొరేట్లు మరింత సౌకర్యవంతంగా జీవితం సాగించేందుకు ఇది దోహదపడుతుంది.

  క్వాలిఫైడ్ ఫైనాన్సియల్ కాంట్రాక్టుల బైలాటరల్ నెట్టింగ్ బిల్లు 2020: భారతీయ ఆర్థిక మార్కెట్లకు ఆర్థిక స్థిరత్వం కలిగించే చర్యలు తీసుకోవడానికి, వాటిలో పోటీ తత్వం పెరిగేలా చూడటానికి బిల్లు వీలు కలిగిస్తుంది. అర్హత కలిగిన ఆర్థిక కాంట్రాక్టుల వివాదాలను చట్టపరమైన ఒకే ప్రక్రియతో పరిష్కరించేందుకు బిల్లు దోహదపడుతుంది.

 పన్ను విధింపు, ఇతర చట్టాల (కొన్ని నిబంధనల సడలింపు) బిల్లు 2020: ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధానికి సంబంధించి కొన్ని నిబంధనలను సడలించడానికి బిల్లు వీలు కలిగిస్తుంది.

 

అనుబంధంలో పొందుపరిచిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*****



(Release ID: 1658801) Visitor Counter : 301