ప్రధాన మంత్రి కార్యాలయం

వ‌య‌సుకు త‌గిన దేహ‌దారుఢ్యానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి


ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ప్ర‌థ‌మ వార్షికోత్స‌వం సంద‌ర్భంలో అనేక మంది ఫిట్ నెస్ ఔత్సాహికుల‌ తో ఆయన సంభాషించారు

‘ఫిట్ ఇండియా డైలాగ్’ కార్య‌క్ర‌మం ప్ర‌తి వ‌యో వ‌ర్గం దేహ‌ దారుఢ్య ప్ర‌యోజ‌నాల‌పై దృష్టి పెడుతుంద‌ని, దేహ‌దారుఢ్యం తాలూకు వివిధ కోణాల‌ను ఆవిష్క‌రిస్తుంద‌న్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 24 SEP 2020 5:23PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గురువారం ‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్’ ప్ర‌థ‌మ వార్షికోత్స‌వ సంద‌ర్భం లో ఏజ్ అప్రోప్రియేట్ ఫిట్ నెస్ ప్రోటోకాల్స్ ను వ‌ర్చువ‌ల్ కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు.

ఈ సంద‌ర్భం లో ఏర్పాటైన ‘‘ఫిట్ ఇండియా డైలాగ్’’ కార్య‌క్ర‌మంలో భాగంగా శ్రీ మోదీ క్రీడాకారులతో, ఫిట్‌నెస్ నిపుణులతో, ప్రముఖులు మరికొందరితో  మాట్లాడారు.  వర్చువల్ మాధ్య‌మంలో జ‌రిగిన ఈ సంభాష‌ణ లో పాల్గొన్న‌ వారు తాము అనుస‌రిస్తున్న దేహ‌దారుఢ్యం సంబంధిత సూత్రాల‌తో పాటు, వారి నిత్య జీవితంలోని అనుభ‌వాల‌ ను ప్ర‌ధాన మంత్రి తో ఇష్టాగోష్టి తరహా లో పంచుకొన్నారు.
 

పారాలింపిక్స్ లో జావ‌లిన్ త్రో విభాగం లో స్వ‌ర్ణ‌ ప‌త‌క గ్ర‌హీత శ్రీ దేవేంద్ర ఝాఝ‌రియాతో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌.



ప్ర‌పంచ‌ పారాలింపిక్ ఈవెంట్ల లో భార‌త‌దేశానికి ఖ్యాతి ని సంపాదించిపెట్టిన శ్రీ దేవేంద్ర ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు.  ఆయ‌న శ్రీ దేవేంద్ర త‌న‌కు ఎదురైన స‌వాళ్ళ‌ను ఎలా అధిగ‌మించిందీ, ఒక ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత క్రీడాకారునిగా ఎలా ఎదిగిందీ అడిగి తెలుసుకొన్నారు.

విద్యుదాఘాతం కార‌ణంగా తాను ఒక చేయి ని కోల్పోయిన త‌రువాత త‌న జీవితంలో గ‌డ్డు కాలాన్ని ఎదుర్కొన్న‌ట్లు, ఈ స‌మ‌యంలో ఒక సాధార‌ణ బాలునిగా వ్య‌వ‌హ‌రిస్తూ ఫిట్‌నెస్ కోసం  కృషి చేసేందుకు త‌న త‌ల్లిగారు త‌న‌కు ఏ విధంగా ప్రేర‌ణ‌ను అందించిందీ శ్రీ దేవంద్ర ఝాఝ‌రియా వివ‌రించారు.

భుజానికి మ‌రోసారి గాయం అయినప్పటి ప‌రిస్థితిని ఎలా సంబాళించుకొన్న‌ారు?, క్రీడా రంగం నుంచి రిటైర్ అవ్వాల‌న్న భావ‌న నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? అంటూ ఆయనను ప్ర‌ధాన మంత్రి అడిగారు.  దీనికి దేవేంద్ర ఝాఝ‌రియా ఎవ‌రైనా శారీర‌క‌ సవాళ్లను, మాన‌సిక స‌వాళ్ళ‌ను అధిగ‌మించాలి అంటే ముందుగా వారికి త‌న మీద త‌న‌కు న‌మ్మ‌కం ఉండాలి అని బదులిచ్చారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న కొన్ని క‌స‌ర‌త్తుల‌ ను చేసి చూపించారు.  గాయం నుంచి కోలుకొనేందుకు తాను పాటించిన దారుఢ్య సంబంధిత నియ‌మాల‌ను ఆయ‌న ఈ సంద‌ర్భం లో వెల్ల‌డించారు.  

పారాలింపిక్స్ లో బంగారు ప‌త‌కాన్ని సాధించినందుకు ఆయ‌న‌ ను ప్ర‌ధాన మంత్రి  ప్ర‌శంసించారు.  ఆయ‌న సాధించిన విజయం ఎంతో స్ఫూర్తిదాయ‌క‌మైంద‌న్నారు.  ఆయ‌న త‌ల్లిగారు 80 ఏళ్ళ వ‌య‌స్సులో కూడా త‌న ప‌నుల‌ను తానే చేసుకొంటున్నందుకు ఆమె ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు.


ఫుట్‌బాల్ క్రీడాకారిణి అఫ్శాన్ ఆషిక్ తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌



జ‌మ్ము- క‌శ్మీర్ కు చెందిన గోల్ కీప‌ర్ అఫ్శాన్ ఆషిక్ ఈ కార్య‌క్ర‌మం లో మాట్లాడుతూ, ప్ర‌తి ఒక్క మ‌హిళా ఒక మాతృమూర్తి పాత్ర‌ తో పాటు, కుటుంబానికి సంర‌క్ష‌కురాలి భూమిక‌ను కూడా నిర్వ‌హించవ‌ల‌సి ఉన్నందున త‌న‌ను తాను ఆరోగ్యం గా చూసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.  ప్ర‌ముఖ క్రికెటర్ శ్రీ ఎమ్.ఎస్‌. ధోనీ తొణకకుండా బెణకకుండా త‌న బాధ్య‌తను తాను ప్ర‌శాంత‌ంగా, స్థిర చిత్తం లో నిర్వ‌హించ‌డం చూసి తాను ప్రేర‌ణ ను పొందినట్లు ఆమె తెలిపారు.  ప్ర‌శాంతం గా ఉండ‌టం కోసం రోజూ ఉద‌యం పూట ధ్యానం చేస్తూ ఉంటాన‌ని ఆమె వివ‌రించారు.

జ‌మ్ము- క‌శ్మీర్ లో ప్ర‌త్యేక వాతావ‌ర‌ణం ఉంటుందని, ఆ ప‌రిస్థితుల్లో అక్క‌డి ప్ర‌జ‌లు హుషారుగా ఉండ‌టానికి అనుస‌రించే సంప్ర‌దాయ ప‌ద్ధ‌తులు ఏమేమిట‌ంటూ ప్ర‌ధాన మంత్రి అడిగారు.  దీనికి అఫ్శాన్ స‌మాధాన‌మిస్తూ, శారీర‌కంగా ప‌టుత్వం గా ఉండ‌డం కోసం తాము క‌ష్ట‌మైన ప్ర‌యాణాల‌కు బ‌య‌లుదేరివెళ్లి ఆ ప‌ని ని పూర్తి చేసుకు వ‌స్తూ ఉంటామ‌న్నారు.  జ‌మ్ము- క‌శ్మీర్ ప్ర‌జ‌లు ఎత్త‌యిన ప్రదేశాల్లో నివ‌సిస్తూ ఉంటార‌ని, ఈ కార‌ణం గా వారికి శ్వాస‌ ను పీల్చుకొనే సామ‌ర్ధ్యం ఎక్కువ‌గా ఉంటుంద‌ని, అందువల్ల వేరే చోట శారీర‌కంగా ఏవైనా ప‌నుల్లో తలమునకలైనప్పుడు ఊపిరి పీల్చుకోవ‌డం లో వారికి ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురు కావ‌ని కూడా ఆమె చెప్పారు.

ఒక గోల్ కీప‌ర్ గా శారీరకం గా తాను ఎంతో చురుకుగా ఉండ‌టంతో పాటు, మాన‌సికంగా ఏకాగ్ర‌త‌ ను సాధించ‌వల‌సిన అవ‌స‌రం ఎంతో ఉంటుంద‌ని అఫ్శాన్ అన్నారు.
 

న‌టుడు, మోడ‌ల్ శ్రీ మిలింద్ సోమ‌న్ తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌



ప్ర‌ధాన మంత్రి శ్రీ మిలింద్ సోమ‌న్ ను ‘మేడ్ ఇన్ ఇండియా మిలింద్’ అంటూ అభివర్ణించారు.  శ్రీ సోమ‌న్ త‌న‌దైన శైలిలో ‘మేక్ ఇన్ ఇండియా’ కు గ‌ట్టి మ‌ద్ధ‌తుదారుగా ఉన్నార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ‘ఫిట్ ఇండియా ఉద్య‌మం’ ప్ర‌జ‌ల్లో చైత‌న్యాన్ని రేకెత్తించింద‌ని, వారు వారి శారీర‌క‌ బలాన్ని గురించి, మాన‌సిక బ‌లాన్ని గురించి ప్ర‌స్తుతం అవ‌గాహ‌న ను ఏర్ప‌ర‌చుకొంటున్నార‌ని శ్రీ మిలింద్ సోమ‌న్ అన్నారు.  ఆయ‌న త‌న త‌ల్లిగారి ఫిట్‌నెస్ ను గురించి వివ‌రించారు.  ఇదివ‌ర‌కు ప్ర‌జ‌లు చ‌క్క‌ని శారీర‌క ప‌టుత్వాన్ని క‌లిగి ఉండేవార‌ని, నీటిని తెచ్చుకోవ‌డానికి ప‌ల్లె ప్ర‌జ‌లు 40- 50 కిలో మీట‌ర్ల దూరం కాలిన‌డ‌క‌నే వెళ్ళి వ‌చ్చేవార‌ని శ్రీ సోమ‌న్ అన్నారు.  అయితే, ఇవాళ న‌గ‌రాల్లో సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వ‌చ్చినందువ‌ల్ల మ‌నం ఉన్న‌చోటే ఉంటూ, ప‌నుల‌న్నీ పూర్తి చేసుకొనే జీవ‌న‌శైలికి అల‌వాటుప‌డ్డామ‌ని, ఇది మ‌న‌కు అనేక స‌మ‌స్య‌ల‌ ను తెచ్చిపెడుతోంద‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, దేహ‌దారుఢ్యానికి వ‌య‌స్సు అడ్డంకి కాద‌న్నారు. శ్రీ‌ మిలింద్ సోమ‌న్ త‌ల్లిగారు 81 ఏళ్ళ వ‌య‌స్సులో సైతం క‌ష్ట‌త‌ర‌మైన క‌స‌ర‌త్తులు స‌హా ఫిట్‌నెస్ నియ‌మాల‌ను పాటించ‌డం అభినంద‌నీయ‌మ‌ని ఆయ‌న అన్నారు.

ఏ వ్య‌క్తి అయినా త‌న‌కు అందుబాటులో ఉన్న ప‌ద్ధ‌తుల్లోనే దేహ‌దారుఢ్యాన్ని క‌లిగి ఉండ‌వ‌చ్చ‌ని, దీనికి కావ‌ల‌సింద‌ల్లా దృఢ దీక్ష‌, విశ్వాసాలేన‌ని శ్రీ మిలింద్ సోమ‌న్ అన్నారు.

ప్ర‌ధాన మంత్రి విమ‌ర్శ‌ల ప‌ట్ల‌ ఎలా స్పందిస్తారో  శ్రీ మిలింద్ తెలుసుకోగోరారు.  దీనికి ప్ర‌ధాన మంత్రి బ‌దులిస్తూ, చేసే ప‌ని ని పూర్తి అంకిత భావం తో చేయ‌డం, ప్ర‌తి ఒక్క‌రికీ సేవ చేయాల‌నే అభిప్రాయం, క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌హించాలనే స్ఫూర్తి ఉంటే ఒత్తిడికి తావు ఉండ‌దు అన్నారు.  చ‌క్క‌ని ఆలోచ‌న‌లు చేయ‌డానికి పోటీ ఒక సంకేతంగా నిలుస్తుంద‌ని, అయితే, అవ‌త‌లి వ్య‌క్తి తో పోటీ ప‌డ‌టం కంటే మ‌న‌తో మ‌నం పోటీ ప‌డ‌టంపైన దృష్టి ని కేంద్రీక‌రించాల‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

   పాతకాలపు ఆహారపు అలవాట్లు... పప్పు, అన్నం, నెయ్యివంటి పదార్థాలను భుజించే సంస్కృతికి తిరిగి మళ్లాల్సిన అవసరాన్ని రుజుతా దివేకర్‌ నొక్కిచెప్పారు. స్థానికంగా పండే పంటలను ఆహారంలో భాగం చేసుకుంటే మన రైతులతోపాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకూ ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆ మేరకు “స్థానికం కోసం స్వగళం” దృక్పథం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ప్రజల ప్రస్తుత ధోరణులను గమనిస్తే- నెయ్యి తయారుచేయడం ఎలాగో వారు గ్రహిస్తున్నారని, పసుపు-పాలకుగల ప్రాముఖ్యాన్ని గుర్తిస్తున్నారని వివరించారు.

మన శారీరక, మానసిక ఆరోగ్యానికి హానిచేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ప్రాంతానికీ ఒక్కో ఆహారం ప్రత్యేకమని, ఆ మేరకు ఇంటి భోజనం సదా మేలు చేస్తుందని పేర్కొన్నారు. మనం పాకెట్లలో వచ్చే, శుద్ధీకరణ విధానాలతో తయారయ్యే ఆహారాన్ని తీసుకోవడం మాని, ఇంటి తయారీ వంటకాలను మరింతగా తీసుకుంటే అనేకవిధాల ప్రయోజనాలు పొందవచ్చునని వివరించారు.

స్వామి శివధ్యానం సరస్వతితో ప్రధానమంత్రి సంభాషణ

   “సర్వజన హితాయ.. సర్వజన సుఖాయ”... ‘లోకజన క్షేమమే సర్వజనావళి సుఖం’ సూక్తి తనకెంతో స్ఫూర్తినిస్తుందని స్వామి శివధ్యానం సరస్వతి అన్నారు. తన గురువుల గురించి, యోగాభ్యాస ప్రాముఖ్య విస్తరణ దిశగా వారినుంచి పొందిన ప్రేరణ గురించి ఆయన వివరించారు. పురాతన “గురుకులాల్లో గురు-శిష్య” సంప్రదాయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ విధానంలో విద్యార్థి శారీరక, మానసిక వికాసంపైనే అధికంగా దృష్టి నిలిపేవారని గుర్తుచేశారు. యోగాభ్యాసం కేవలం ఒక వ్యాయామ ప్రక్రియ కాదని, అదొక జీవన విధానమని, గురుగుల సంప్రదాయంలో ఇదొక భాగంగా అనుసరించబడిందని వివరించారు. కాగా, మారుతున్న జీవనశైలికి అనుగుణంగా యోగాభ్యాస ప్రక్రియలను రూపుదిద్దడం గురించి ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడారు.

విరాట్కోహ్లీతో ప్రధానమంత్రి సంభాషణ

   విరాట్‌ కోహ్లీతో ఆయన శరీర దారుఢ్య నిర్వహణ పద్ధతుల గురించి ప్రధానమంత్రి చర్చించారు. శారీరక శక్తితో మానసిక శక్తి కూడా ఏకకాలంలో బలోపేతం కావాలన్నది తన విధానమని విరాట్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఢిల్లీలో లభించే రుచికరమైన ప్రసిద్ధ వంటకం ‘చోలే భటూరే’ తినే అలవాటును ఎలా మానుకోగలిగారంటూ ప్రధానమంత్రి ఆయనను ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ- శరీర దారుఢ్య స్థాయిని పెంచుకోవడంలో ఇంటి భోజనం ఎంత సులభంగా క్రమశిక్షణను తెస్తుందో వివరించారు. ఆహారంలో కేలరీలను నియంత్రించడం ఎలాగంటూ ప్రధాని ప్రశ్నించగా- తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియ కోసం శరీరానికి తగినంత సమయం ఇవ్వాలని విరాట్‌ బదులిచ్చారు. ఈ సందర్భంగా “యోయో టెస్ట్‌” (శరీర దారుఢ్య ప్రమాణ పరీక్ష) గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- శరీర దారుఢ్య నిర్వహణ సంస్కృతిని పెంపొందించాల్సిన ప్రాముఖ్యం గురించి నొక్కిచెప్పారు. నిత్యం ఆటలాడే మీకు అలసట అనిపించదా? అని ప్రధాని ప్రశ్నించగా- చక్కని నిద్ర, మంచి ఆహారం, శరీర దారుఢ్యంతో శరీరం ఒక వారంలోనే పూర్తి శక్తిని సంతరించుకోగలదని విరాట్‌ పేర్కొన్నారు.

విద్యావేత్త ముకుల్కనిత్కర్తో ప్రధానమంత్రి సంభాషణ

   దారుఢ్యం అన్నది శారీరక-మానసిక ఆరోగ్యానికి మాత్రమేగాక సామాజిక ఆరోగ్యానికీ ఎంతో అవసరమైన భావన అని ముకుల్‌ కనిత్కర్‌ అన్నారు. ఆ మేరకు ఆరోగ్య సంస్కృతిని పెంచిపోషించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ‘సూర్య నమస్కారం’ యోగాభ్యాసానికి ప్రధానమంత్రి స్వయంగా ప్రబోధకులు కావడంపై ఆయన ప్రశంసించారు. భగవద్గీతను ఇద్దరు దృఢమైన వ్యక్తుల నడుమ చర్చాగోష్ఠిగా ఆయన అభివర్ణించారు. జాతీయ విద్యావిధానం-2020లో శరీర దారుఢ్యాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చడంపై ప్రధానమంత్రిని కొనియాడారు. తద్వారా సుదృఢ భారతం దిశగా ప్రతి ఒక్కరినీ ఉత్తేజితం చేశారని పేర్కొన్నారు. దారుఢ్యమంటే మనస్సు-జ్ఞానం-చింతనల సమ్మేళనమని ఆయన వివరించారు.

ప్రధానమంత్రి ముగింపు వ్యాఖ్యలు

   సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- సుదృఢ భారతం చర్చాగోష్ఠి ప్రధానంగా ప్రతి వయోవర్గం దృఢత్వ ప్రయోజనాలపై దృష్టి సారించడంతోపాటు శరీర దృఢత్వానికి సంబంధించిన అన్ని కోణాలనూ స్పృశిస్తుందని పేర్కొన్నారు. ‘సుదృఢ భారతం’ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన తర్వాత దేశంలో శరీర దారుఢ్యంపై స్పృహ అత్యధిక స్థాయిలో కనిపిస్తున్నదని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆరోగ్యం, శరీరదారుఢ్యంపై అవగాహన నిరంతరం పెరుగుతున్నదని, చురుకుదనం కూడా అదేస్థాయికి చేరుతున్నదని అభిప్రాయపడ్డారు. యోగా, వ్యాయామం, నడక, పరుగు, ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకర జీవనవిధానం తదితరాలన్నీ మన నిత్యచైతన్యంలో ఒక భాగం కావడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యంగా కరోనా సంబంధిత ఆంక్షలున్నప్పటికీ ఈ సంక్షోభ సమయంలో సుదృఢ భారతం ఉద్యమం తన ప్రభావాన్ని, సాపేక్షతను చాటుకున్నదని తెలిపారు. కొందరు భావిస్తన్నట్లుగా దృఢంగా ఉండటం ఎంతమాత్రం కష్టం కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కాస్తంత క్రమశిక్షణకు మరికాస్త శ్రమ జోడిస్తే ప్రతి ఒక్కరూ చక్కని ఆరోగ్యంతో జీవించగలరని పేర్కొన్నారు. ఈ మేరకు “ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం కోసం నిత్యం ఒక అరగంట దారుఢ్య మోతాదు”ను ఒక మంత్రంగా స్వీకరించాలని నిర్దేశించారు. ప్రతి ఒక్కరూ యోగా లేదా బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, ఫుట్‌బాల్‌, కరాటే లేదా కబడ్డీ వంటి శారీరక కసరత్తుకు వీలున్న కార్యకలాపాలకు రోజూ కనీసం ఓ అరగంట కేటాయించాలని సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర యువజన-ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఇవాళ దారుఢ్య విధివిధానాలను ఆవిష్కరించినట్లు ఆయన చెప్పారు.

   రరీ దారుఢ్యంపై అవగాహన నేడు ప్రపంచవ్యాప్తమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆహారం, శారీరక కార్యకలాపాలు, ఆరోగ్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ వ్యూహాన్ని రూపొందించిందని చెప్పారు. ముఖ్యంగా శారీరక కార్యకలాపాలపై ఒక అంతర్జాతీయ సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్‌, అమెరికా వంటి పలు దేశాలు ఇవాళ శరీర దారుఢ్యంపై కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ దిశగా కృషి చేస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా అనేక దేశాల్లో నేడు ఇదే తరహా భారీ ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయని, తదనుగుణంగా నిత్య వ్యాయామంవైపు వస్తున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతుదన్నదని గుర్తుచేశారు.

***



(Release ID: 1658796) Visitor Counter : 247