ప్రధాన మంత్రి కార్యాలయం

ఏడు తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లో కోవిడ్ సన్నద్ధత-స్పందనపై ప్రధాని సమీక్ష

రోజువారీ కోవిడ్ కేసులలో 62 శాతం... మరణాల్లో 77 శాతం ఈ 7 రాష్ట్రాల్లోనే;

అధిక కేసుల భారంగల 60 జిల్లాలపై దృష్టి పెట్టాలని సీఎంలకు ప్రధాని పిలుపు;

కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంపుసహా ‘ర్యాట్’లో నెగటివ్ వచ్చినా లక్షణాలు కనిపిస్తే ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నిర్వహించాలని రాష్ట్రాలకు సూచన;

కోవిడ్ రక్షణాత్మక వైఖరి కొనసాగింపు... బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధారణ, సామాజిక దూరం, పరిశుభ్రత, చేతుల శుభ్రత పాటించాలని ప్రజలకు పిలుపు

Posted On: 23 SEP 2020 9:47PM by PIB Hyderabad

దేశంలోని ఏడు రాష్ట్రాల్లో కోవిడ్‌ సన్నద్ధత, స్పందనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ముఖ్యమంత్రులు, ఇతర అధికార ప్రముఖులతో తన అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర దేశీయాంగ, రక్షణ, ఆరోగ్య శాఖల మంత్రులతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు. అలాగే ఆయా రాష్ట్రాల హోం, ఆరోగ్యశాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోం-ఆరోగ్యశాఖల కార్యదర్శులుసహా డీజీపీ కూడా హాజరయ్యారు. వీరేకాకుండా ప్రధానమంత్రి కార్యాలయం, మంత్రిమండలి కార్యదర్శి, నీతి ఆయోగ్‌ సభ్యుడు, కేంద్ర ఆరోగ్య-హోంశాఖల కార్యదర్శులతోపాటు ఐసీఎంఆర్‌, ఇతర సంబంధిత అధికారులు కూడా పాలుపంచుకున్నారు.

   సందర్భంగా భారత్‌లో కోవిడ్‌ స్థితిగతులపై దేశీయాంగ శాఖ కార్యదర్శి సమగ్ర సచిత్ర వివరణ ఇచ్చారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసులలో 62 శాతం, కోవిడ్‌ మరణాల్లో సుమారు 77 శాతం ఈ 7 రాష్ట్రాలోనే ఉన్నట్లు వివరించారు. అంతేగాకుండా ఈ రాష్ట్రాల్లో కేసుల తీవ్రత, నిర్వహించిన పరీక్షలు, మరణాలు, నమూనా నిర్ధారిత కేసులపై జిల్లాలవారీగా ఆయా అంశాలపై ప్రముఖంగా విశదీకరించారు.

   నంతరం తమతమ రాష్ట్రాల్లో కోవిడ్‌ స్థితిగతులు, తాము తీసుకున్న వివిధ నియంత్రణ చర్యలను ప్రధానమంత్ర్రికి ముఖ్యమంత్రులు వివరించారు. దీనిపై గౌరవనీయులైన ప్రధాని స్పందిస్తూ- ఆయా రాష్ట్రాల్లో వైరస్‌ సంక్రమణ గొలుసు విచ్ఛిన్నానికి భరోసా లభించేలా అన్ని చర్యలనూ కచ్చితంగా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు కేసుల సత్వర గుర్తింపు నిమిత్తం పరీక్షల సంఖ్యను తగుమేర పెంచాలని, మరణాల సగటు తగ్గింపుపై దృష్టి కేంద్రీకరించాలని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రజలు కోవిడ్‌ బారినపడకుండా స్వీయ రక్షణ పద్ధతులను తప్పక పాటించేలా ప్రోత్సహిస్తూ మహమ్మారి సామాజిక సంక్రమణకు అవకాశం లేకుండా చూడాలని పిలుపునిచ్చారు.

   కేసుల భారం అధికంగాగల జిల్లాలను గుర్తించడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా కోవిడ్‌ మహమ్మారి బారినపడకుండా పాటించాల్సిన ప్రవర్తనాత్మక పద్ధతులపై వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టి ప్రజలను ప్రోత్సహించాలని కోరారు. కోవిడ్‌ సుస్థిర నిర్వహణకు సామాజిక అవగాహన, భాగస్వామ్యం పాత్ర అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. ఆ విధంగా కోవిడ్‌ నిర్వహణలో జన భాగస్వామ్యం, ప్రజా ఉద్యమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. రానున్న రోజుల్లో కోవిడ్‌ సముచిత వేడుకల నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. నియంత్రణ మండళ్లలో నిబంధనలు, నిఘా కఠినంగా అమలు చేయాల్సిన ఉందన్నారు. వైరస్‌ సంక్రమణ వ్యాప్తిని నిరోధించేవిధంగా పరిచయాల అన్వేషణ, వృద్ధ రోగులు, సహ-అనారోగ్య పీడితుల విషయంలో ప్రత్యేక పర్యవేక్షణ అవసరమన్నారు. తద్వారా వారిలో వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలను సమర్థంగా అమలు చేయడంతోపాటు ఆక్సిజన్, మందులు, ఇతర పరికరాల సరఫరాకు కొరత రాకుండా చూడటంద్వారా మరణాలను తగ్గించవచ్చునని స్పష్టం చేశారు. ఆరోగ్య మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ చాలా ముఖ్యమని, అదే సమయంలో క్షేత్రస్థాయిలో ఆస్పత్రి ప్రవేశం నిరంతరం కొనసాగేలా పర్యవేక్షించడంతోపాటు ప్రజలకు దీనిపై అవగాహన కల్పించడం కూడా ప్రధానమని ఆయన పేర్కొన్నారు.

   కోవిడ్‌ మహమ్మారి నిర్వహణలో మన యుద్ధం ఇంకా చాలాదూరం సాగాల్సి ఉందని ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాలూ తమ ప్రస్తుత కృషిని ఉద్యమ తరహాలో ముందుకు తీసుకెళ్తూ దేశంలో మహమ్మారి పరిస్థతులను సమర్థంగా నియంత్రించేందుకు తమవంతు తోడ్పాటునందించాలని కోరారు.

***


(Release ID: 1658533)