PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 16 SEP 2020 6:15PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • గత 24 గంటల్లో 82,961మందికి వ్యాధి నయం కావడంతో ఒకేరోజు అత్యధికంగా కోలుకున్నవారి సంఖ్యరీత్యా భారత్‌ సరికొత్త రికార్డు.
  • కోలుకున్నవారిలో నాలుగోవంతు ఒక్క మహారాష్ట్రలోనే నమోదు; చురుకైన కేసులకన్నా కోలుకున్న కేసులు నాలుగు రెట్లు అధికం.
  • దేశంలో 90,123 కొత్త కేసుల నమోదుతో ప్రస్తుతం చికిత్స పొందేవారి సంఖ్య 9,95,933కు చేరిక.
  • కోవిడ్‌-19పై పోరులో భాగస్వాములైన ఆరోగ్య సిబ్బందికి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ కింద బీమా పథకం మరో 6 నెలలు పొడిగింపు.
  • గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ కింద రూ.23,559.20 కోట్లతో ఆరు రాష్ట్రాల్లో 27,21,17,240 పనిదినాల ఉపాధి సృష్టి.

భారత్‌లో గత 24 గంటల్లో 82,961 మందికి వ్యాధి నయం; ఒక్కరోజులో కోలుకున్నవారి సంఖ్యరీత్యా సరికొత్త రికార్డు

భారత్‌లో కోవిడ్‌ నుంచి కోలుకునేవారి సంఖ్య నానాటికీ భారీగా పెరుగుతూనే ఉంది. ఆ మేరకు గత 24 గంటల్లో 82,961 మందికి వ్యాధి నయం కాగా, కోలుకునేవారి సగటు 78.53 శాతానికి దూసుకెళ్లింది. కోలుకునేవారి 7 రోజుల చలనశీల సగటు స్థిరంగా పైపైకి వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 39,42,360గా నమోదైంది. ఇవాళ ఆస్పత్రులనుంచి ఇళ్లకు వెళ్లినవారి సంఖ్యరీత్యా 23.41 శాతంతో మహారాష్ట్ర (19,423) ముందంజ వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ (9,628), కర్ణాటక (7,406), ఉత్తర ప్రదేశ్ (6,680), తమిళనాడు (5,735) రాష్ట్రాల్లోనూ గత 24 గంటల్లో 35.5 శాతం కోలుకున్నారు. మొత్తంమీద కొత్తగా కోలుకున్నవారిలో దాదాపు 59 శాతం ఈ ఐదు రాష్ట్రాలకు చెందినవారే. ప్రస్తుతం 9,95,933 క్రియాశీల కేసులుండగా కోలుకున్నవారి సంఖ్య ప్రస్తుతం చికిత్స పొందేవారికన్నా ఇవాళ 29 లక్షలు (29,46,427) దాటింది. అంటే.. ప్రస్తుత కేసులకన్నా కోలుకున్నవి దాదాపు 4 రెట్లు (3.96) అధికంగా ఉన్నాయి. కాగా- చురుకైన కేసులలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడులలో 60 శాతం ఉండగా, దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 90,123 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 20,000 కుపైగా కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ (8,846), కర్ణాటక (7,576) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654935  

‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ కింద కోవిడ్‌-19పై పోరులో భాగస్వాములైన ఆరోగ్య సిబ్బందికి బీమా పథకం’ 6 నెలలు పొడిగింపు

కోవిడ్‌-19తో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తల కోసం 90 రోజుల కాలానికిగాను ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్‌ ప్యాకేజీ బీమా పథకం’ అమలు చేయనున్నట్లు 2020 మార్చి 30న ప్రభుత్వం ప్రకటించింది. అయితే, దీన్ని ఆ తర్వాత మరో 90 రోజుల (2020 సెప్టెంబర్ 25) వరకు పొడిగించిన నేపథ్యంలో తాజాగా మరో 180 రోజులు.. అంటే- 6 నెలలపాటు  పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటించింది. కోవిడ్‌ రోగుల ప్రత్యక్ష వైద్యసేవలలోగల సిబ్బంది వ్యాధిబారిన పడే ప్రమాదం అధికం కాబట్టి ఈ కేంద్ర రంగ పథకం కింద వారికి రూ.50 లక్షల బీమా రక్షణను ప్రభుత్వం కల్పించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654905

అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష

అంతర్జాతీయ ప్రయాణికుల బదిలీకి వీలుగా ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రయాణం ప్రారంభించే విమానాశ్రయంలో కోవిడ్‌ నిర్ధారణ కోసం ఆర్టీ-పీసీఆర్ పరీక్షను పౌర విమానయాన మంత్రిత్వశాఖ అనుమతించింది. దీనికింద విమానాశ్రయ నిర్వహణ సంస్థ పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లతోపాటు నమూనాల సేకరణ కూడా చేపడుతుంది. పరీక్షలో వారికి వ్యాధి సోకలేదని తేలితే, వేచి ఉండే ప్రదేశం నుంచి నేరుగా వారు ప్రయాణించాల్సిన విమానం వద్దకు అనుమతిస్తారు. అయితే, వ్యాధి నిర్ధారణ అయిన పక్షంలో సంబంధిత రాష్ట్రంలో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు అమలవుతున్న విధివిధానాల ప్రకారం పరిశీలన చేపడతారు. కాగా, ఏ ప్రయాణికుడూ అనుమతి లేకుండా నిష్క్రమించరాదు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ సహాయ (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక జవాబిచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654905

కరోనా వైరస్‌ ప్రభావం

కోవిడ్‌-19 హఠాత్తుగా విజృంభించడంతో ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ మేరకు అమెరికా, ఐరోపా సమాఖ్య, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, భారత్‌సహా ప్రపంచంలోని అనేక కీలక దేశాలను ఈ మహమ్మారి సంక్షోభంలోకి నెట్టింది. ఫలితంగా 2020-21లో అంతర్జాతీయ స్థూల దేశీయోత్పత్తిని కుంచించివేసిందని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేశాయి. కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తితోపాటు తదనుగుణ దేశవ్యాప్త దిగ్బంధంతో వివిధ రంగాలు ప్రభావితమయ్యాయి. ఏదేమైనా, దిగ్బంధం సడలించాక ఆర్థిక వ్యవస్థలో భాగమైన అనేక రంగాల్లో గణనీయ మెరుగుదల ప్రస్ఫుటమవుతోంది. ఆ మేరకు ప్రభుత్వం కూడా పరిశ్రమల పునరుజ్జీవనానికి అనేక చర్యలు చేపట్టిందని కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇవాళ ఒక ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655172

రైలుబోగీలు కోవిడ్‌-19 సంరక్షణ కేంద్రాలుగా మార్పు

కోవిడ్‌-19పై పోరాటానికి మద్దతులో భాగంగా దిగ్బంధ సంక్షోభ సమయంలో భారత రైల్వేశాఖ 5,231 సాధారణ బోగీలను కోవిడ్‌ రోగుల ఏకాంత చికిత్స కేంద్రాలుగా మార్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు 12.09.2020న వీటిలో 813 బోగీలను కేటాయించింది. వీటితో అవసరం తీరిన తర్వాత మళ్లీ సాధారణ ప్రయాణికుల బోగీలుగా మార్చనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ, వాణిజ్య-పరిశ్రమల శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇవాళ ఒక ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654579

కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో కార్మిక సంక్షేమం, ఉపాధి సృష్టికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అపూర్వం: శ్రీ గంగ్వార్‌

కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగాగల కార్మికులతోపాటు వలసకార్మికుల సంక్షేమం, ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అపూర్వమైన చర్యలు తీసుకున్నదని కేంద్ర కార్మిక-ఉపాధిశాఖ మంత్రి శ్రీ సంతోష్ గంగ్వార్ ఇవాళ చెప్పారు. అందులో భాగంగా దిగ్బంధం ప్రకటించగానే వారందర్నీ ఆదుకునే దిశగా తీసుకోవాల్సిన వివిధ చర్యలపై అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు తమ శాఖ తగువిధంగా ఆదేశాలు పంపిందని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాలు నిర్వహిస్తున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి నుంచి ఇప్పటిదాకా సుమారు 2 కోట్లమంది వలస కార్మికుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.5000 కోట్లమేర జమ చేసినట్లు అంచనా వేశామన్నారు. అలాగే దిగ్బంధ సమయంలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 20 కంట్రోల్ రూమ్‌ల ద్వారా కార్మికులకు సంబంధించిన 15,000కుపైగా ఫిర్యాదులు పరిష్కరించామని చెప్పారు. కార్మిక-ఉపాధి కల్పనశాఖ జోక్యంతో రెండు లక్షలకు పైగా కార్మికులకు వారి వేతన బకాయిల కింద రూ.295 కోట్ల మేర చెల్లింపు చేసినట్లు వివరించారు. మరోవైపు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ఉద్యోగుల భవిష్యనిధి సభ్యులు 75 శాతందాకా  సొమ్ము తీసుకునేందుకు అనుమతించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకూ చందాదారులు సుమారు రూ.39,000 కోట్లు ఉపసంహరించుకున్నారని వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655094

ఎగుమతులతో రెండంకెల వృద్ధి.. దేశం వేగంగా కోలుకుంటుండటానికి ఇదే నిదర్శనం: శ్రీ పీయూష్‌ గోయల్‌

భారతదేశం నుంచి సేవల ఎగుమతి లక్ష్యాన్ని 500 బిలియన్‌ డాలర్లుగా నిర్దేశించుకోవాలని  రైల్వే, వాణిజ్య-పరిశ్రమల శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. భారత పరిశ్రమల సమాఖ్య (CII) నిన్న నిర్వహించిన భారత-బ్రిటన్‌ వార్షిక సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆన్‌లైన్‌ద్వారా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- “ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌ 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కావాలన్న లక్ష్యాన్ని చేరుకోగలదని మనమంతా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఆ మేరకు మనం కూడా ఈ దిశగా ముందడుగు వేయాల్సిన సమయమిది” అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 8 నుంచి 14వరకు వారం రోజుల్లో ఎగుమతుల విలువ 6.88 బిలియన్ డాలర్లుగా నమోదైందని, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 10.73 శాతం పెరిగిందని చెప్పారు. “భారత్‌ వేగంగా తిరిగి కోలుకునే క్రమంలో ఉందనడానికి ఇది నిదర్శనం” అని ఆయన చెప్పారు. ఈ మేరకు కోవిడ్‌-19 మహమ్మారిని అధిగమించగల భారత సామర్థ్యంపరంగా సీఐఐ ప్రదర్శించిన విశ్వాసం వాస్తవంగా ఎంతో గొప్పదని మంత్రి ప్రశంసించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654908

కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం డిమాండ్ ఆధారిత వేతన ఉపాధి పథకం. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి వయోజన సభ్యుడు, ఈ చట్టం కింద ఉపాధి కార్డు కలిగి ఉంటే ఈ పథకం కింద ఉపాధి కోసం డిమాండ్‌ చేసే వీలుంటుంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 86,81,928 కొత్త జాబ్ కార్డులు జారీ అయ్యాయి. కాగా, గత  ఆర్థిక  సంవత్సరం (2019-20)లో జారీ చేసిన కార్డుల సంఖ్య 64,95,823 మాత్రమే కావడం గమనార్హం. ఇక 2020 ఏప్రిల్ నుంచి ఆగస్టుదాకా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉపాధి హామీ పథకం కింద కేంద్రం విడుదల చేసిన/ఖర్చుచేసిన మొత్తం రూ.5870600 లక్షలు (విడుదలచేసిన నిధులు) కాగా, మొత్తం ఖర్చు రూ.5293764 లక్షలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10.09.2020 నాటికి మంత్రిత్వ శాఖ ఈ పథకం కోసం రూ.60,44,098.23 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి-పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ నిన్న లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654863

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ (GKRA)ను గౌరవనీయులైన ప్రధానమంత్రి 2020 జూన్ 20న ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి తమ స్వస్థలాలకు తిరిగివచ్చిన వలస కార్మికులతోపాటు గ్రామీణ కార్మికులకు 125 రోజుల ఉపాధి కల్పన లక్ష్యంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఆ మేరకు దేశంలోని6 రాష్ట్రాల పరిధిలోగల 116 జిల్లాల్లో 25 రకాల పనులను దీనికింద చేపట్టేలా రూపొందించారు. తదనుగుణంగా బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లలో రూ.27559.20 కోట్ల వ్యయంతో 27,21,17,240 పనిదినాలద్వారా ఉపాధి కల్పించారు. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి-పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654896

ఆస్పత్రుల ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తల భద్రతకు ప్రభుత్వ చర్యలు

దేశంలోని వివిధ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు రాష్ట్రాల పరిధిలోనివి కాబట్టి వాటిలో ఆరోగ్యం, భద్రత ముప్పులవల్ల మరణించిన పారిశుధ్య కార్మికుల సమాచారం సంబంధిత సమాచారంపై కేంద్రం ఎలాంటి రికార్డులూ నిర్వహించలేదు. అయితే, సంబంధిత అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలనూ కోరింది. తదనుగుణంగా కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తగిన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ దిశగా నిర్దేశించిన వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖ మంత్రి శ్రీ రామ్‌దాస్ అథవాలే ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655122

కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వృద్ధాప్య గృహాల నిర్వహణ సంస్థలకు ముందస్తుగా నిధుల విడుదలపై సామాజిక న్యాయం-సాధికారత శాఖ నిర్ణయం

దేశంలో కోవిడ్‌ మహమ్మారి పరిస్థితులు కొనసాగుతున్న దృష్ట్యా వృద్ధాప్య గృహాలను నడిపే, నిర్వహించే సంస్థలకు తగినన్ని నిధులు అందుబాటులో ఉండకపోవచ్చునని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు ముందస్తుగా నిధులు విడుదల చేయాలని కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా 2020-21లో ఇప్పటికే రూ.83.74 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సామాజిక న్యాయం-సాధికారత శాఖ సహాయమంత్రి శ్రీ రతన్‌లాల్‌ కటారియా ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655029

కరోనా సంక్షోభం సమయంలో పీఎంయూవై కింద వంటగ్యాస్‌ సిలిండర్ల పంపిణీ

దేశంలోని నిరుపేద కుటుంబాల్లో మహిళలకు డిపాజిట్‌ రహిత వంటగ్యాస్‌ కనెక్షన్ల మంజూరు కోసం 01.05.2016న ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ (PMUY)ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యం 20196 సెప్టెంబరు 7వ తేదీకల్లా పూర్తయింది. కాగా, కరోనా సంక్షోభ సమయంలో పీఎంయూవై కింద 13.06 కోట్ల సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655138

రక్షణ బలగాల్లో కోవిడ్‌-19 కేసులు

దేశంలోని రక్షణ బలగాల సిబ్బందిలోనూ అనేకమంది కోవిడ్‌-19 మహమ్మారి బారినపడ్డారు. ఈ మేరకు సైనిక దళాల్లో 16,758 మంది, నావికా దళంలో 1,365 మంది, వైమానిక దళంలో 1,716 మందికి కోవిడ్‌ సోకింది. అయితే, సైనిక దళాల్లో 32 మంది, వైమానిక దళంలో ముగ్గురు మరణించగా నావికాదళంలో అందరూ కోలుకున్నారు. కాగా, రక్షణ బలగాల సిబ్బందిలో కోవిడ్‌ మరణాలకు సంబంధించి ప్రత్యేక పరిహారమిచ్చే నిబంధనలేవీ లేవు. అయితే, వారందరికీ పదవీ విరమణ ప్రయోజనాలన్నీ కల్పించినట్లు రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద యశోనాయక్‌ ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.   

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654736

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • మహారాష్ట్ర: రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులలో సీటీ-స్కాన్ పరీక్షపై రుసుముల నిర్ణయానికి మహారాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యుతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ ఆస్పత్రులలో అధిక రుసుములు వసూలు చేస్తున్నట్లు అందిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “నా కుటుంబం-నా బాధ్యత” కార్యక్రమం అమలులో పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మహారాష్ట్రలోని అన్ని గ్రామాల సర్పంచులనూ కోరారు. ఈ మేరకు ఆయన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో కలిసి రాష్ట్రంలోని 28 వేలమంది సర్పంచ్‌లతో ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు.
  • రాజస్థాన్: రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రయోగశాలలు కోవిడ్‌-19 పరీక్షల ధరలను రాజస్థాన్‌ప్రభుత్వం రూ.1,200కు తగ్గించింది. ఆర్టీ-పీసీఆర్ పరీక్ష కిట్, ఇతరత్రా పరికరాలు, వస్తువుల ధరలన్నీ తగ్గినందున పరీక్ష సదుపాయాన్ని సామాన్యులకు తక్కువ ధరకే అందించాలని నిర్ణయించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రఘుశర్మ తెలిపారు. కాగా, సవాయి మాన్‌సింగ్‌ వైద్య కళాశాల ఆస్పత్రి సీనియర్ వైద్యులు, ఇతర సంబంధిత నిపుణులతో సంప్రదించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆయన చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్‌ నిర్వహణ వ్యూహాల అనుకూల-ప్రతికూల ప్రభావాలపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ అగ్రశ్రేణి వైద్యనిపుణులతో చర్చించారు.
  • మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌కు మహారాష్ట్ర నుంచి వైద్యపరమైన ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయిన కారనంగా ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించే దిశగా తీసుకున్న చర్యలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ఆక్సిజన్ వాడకాన్ని నిషేధించింది. దీంతోపాటు ఆక్సిజన్ సిలిండర్ల కొరతను పరిష్కరించడంలో భాగంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో మంగళవారం అత్యధికంగా 3,450 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 70,777కు పెరిగాయి. కాగా, దుర్గ్ జిల్లా ఆసుపత్రిలో ప్రభుత్వం 50 ఆక్సిజన్ మద్దతు పడకలను ప్రారంభించింది. ఏకాంత గృహవాస చికిత్సలో ఉన్న రోగుల కోసం దుర్గ్ పాలన యంత్రాంగం ఉచిత ఫోన్‌ నంబర్లను ప్రకటించింది. కాగా, ముంగేలి జిల్లాలో 7 రోజుల దిగ్బంధం  విధిస్తూ పాలన యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది.
  • కేరళ: రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కోవిడ్-19 రోగులకు, మంచానపడిన వారికి తపాలా ఓట్లను వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఒక ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. అలాగే ఓటింగ్ వ్యవధిని మరో గంట పొడిగించాలని కూడా నిర్ణయించింది. వీటితోపాటు కోవిడ్‌-19 పరిస్థితుల నడుమ ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనంలో కోత విధించిన మొత్తాన్ని వారి భవిష్య నిధి ఖాతాలో జమచేయాలని కూడా నిర్ణయించింది. కాగా, రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఇవాళ కోవిడ్ -19 నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీలోని 110 మంది కార్మికులకు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,156 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 2,08,141మంది పరిశీలనలో ఉన్నారు. కేరళలో మృతుల సంఖ్య 466గా ఉంది.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కోవిడ్‌-19 భద్రత నిబంధనల అమలుతోపాటు విధివిధానాల ఉల్లంఘనను నిరోధించడం కోసం పోలీసు, రెవెన్యూ, పురపాలక అధికారులతో కూడిన ఉమ్మడి సంచార బృందాలను నియమిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ప్రకటించారు. కాగా, తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ సమష్టి కృషివల్ల కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి శాసనసభలో ప్రకటించారు. మహమ్మారిపై అసెంబ్లీలో చర్చకు ఆయన ఈ మేరకు స్పందించారు. రాష్ట్రంలో కోలుకునేవారి సగటు దేశంలోనే అత్యధికంగా (89%) ఉందని పేర్కొన్నారు. అలాగే మరణాల సగటు కూడా అత్యల్పంగా (1.67%) ఉందన్నారు. ఇక రాష్ట్రంలో ఈ నెలలో తుది సెమిస్టర్ పరీక్షల నిర్వహణ కోసం 13 విశ్వవిద్యాలయాలకు, సాంకేతిక విద్య డైరెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.
  • కర్ణాటక: రాష్ట్ర రుణ సమీకరణ పరిమితిని జీడీపీలో ప్రస్తుత 3 శాతం నుంచి 5 శాతానికి పెంచే దిశగా కర్ణాటక ఆర్థిక బాధ్యత చట్టం (కెఎఫ్‌ఆర్‌ఎ) సవరణకు మంత్రిమండలి మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ సవరణ పూర్తయితే కేఎఫ్‌ఆర్‌ఏ కింద ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘన కాకుండానే అదనంగా రూ.36,000 కోట్లదాకా రుణాలు సేకరించవచ్చు. కాగా, రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మయ్‌ కోవిడ్‌ బారినపడ్డారు. దీంతో ఇప్పటిదాకా వ్యాధిసోకిన మంత్రులలో ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక సెప్టెంబర్ 18దాకా సమ్మె కొనసాగించాలని కర్ణాటక ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం నిర్ణయించింది. వైద్య విద్య విభాగంలోని తమ సహచరులతో వేతన సమానత్వం లేదా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ప్రకారం జీతాల సవరణకు వారు డిమాండ్‌ చేస్తున్నారు.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గ్రామ, వార్డు కార్యదర్శుల పోస్టుల పరీక్షకు హాజరయ్యేవారిలో కోవిడ్‌ సోకినవారి కోసం ప్రభుత్వం ప్రత్యేక గదులు ఏర్పాటు చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వ కోవిడ్‌ విధివిధానాలకు అనుగుణంగా భక్తుల భాగస్వామ్యం లేకుండా సెప్టెంబర్ 17 నుంచి 27 వరకు తిరుమలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని తిరుమల-తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉండగా, ప్రస్తుతం 5014కు చేరింది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2273 కొత్త కేసులు, 12 మరణాలు నమోదవగా 2260మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 325 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,62,844; క్రియాశీల కేసులు: 30,401; మరణాలు: 996; డిశ్చార్జి: 1,31,447గా ఉన్నాయి. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ ముగిసే అవకాశం ఉంది; ఒక ఎమ్మెల్యేతోపాటు 50 మంది అసెంబ్లీ సిబ్బందికి సోమవారం కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో సమావేశాలను ముగించాలని స్పీకర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఇక తెలంగాణలో కోవిడ్ -19 కేసులు వేగంగా పెరగడం వల్ల సమీప భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి రవాణా, ఇతర వ్యయాలు పెరిగినందువల్ల ఆక్సిజన్ సిలిండర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో మరో రెండు కోవిడ్‌ మరణాలు సంభవించాయి. దీంతో మృతుల సంఖ్య 13కు పెరిగింది. కాగా, అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండుసహా 170 కొత్త కోవిడ్ కేసులు నమోదవడంతో ప్రస్తుత క్రియాశీల కేసుల సంఖ్య 1795కు చేరింది.
  • అసోం: అసోంలో నిన్న 1849 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. అసోంలో ప్రస్తుతం కేసుల సంఖ్య 146575కు చేరింది. వీటిలో 29180 క్రియాశీల కేసులున్నాయి.
  • మణిపూర్: రాష్ట్రంలో 239 కొత్త కేసులు నమోదవగా, 78 కోలుకునే సగటుతో 78మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. మణిపూర్‌లో ప్రస్తుతం 1745 క్రియాశీల కేసులుండగా ఒకరు మరణించారు.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న 12 కొత్త కేసులు నమోదవగా, మొత్తం కేసులు 1480కి చేరాయి. వీటిలో ప్రస్తుతం 588 క్రియాశీల కేసులున్నాయి. మిజోరంలో ఇకపై లక్షణరహిత రోగులు ఏకాంత గృహవాస చికిత్స పొందే వీలుంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది.
  • మేఘాలయ: రాష్ట్రంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1818 కాగా, వీరిలో 379 మంది బీఎస్‌ఎప్‌, ఇతర సాయుధ దళాల సిబ్బంది ఉన్నారు.

FACT CHECK

********



(Release ID: 1655457) Visitor Counter : 223