వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
గత వారం ఎగుమతుల్లో ఏర్పడిన రెండంకెల వృద్ధి దేశం త్వరిత రికవరీ సాధిస్తోందనేందుకు నిదర్శనం అన్న శ్రీ పీయూష్ గోయెల్; యుకెతో వాణిజ్య ఒప్పందం త్వరితంగా చేసుకునేందుకు ఇదే సమయం అన్న మంత్రి
Posted On:
15 SEP 2020 8:49PM by PIB Hyderabad
దేశం 500 బిలియన్ సేవల ఎగుమతుల లక్ష్యం దిశగా పయనించాలని రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ పిలుపు ఇచ్చారు. సిఐఐ నిర్వహణలో ఇండియా-యుకె వార్షిక వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ ఈ లక్ష్యం సాధించగలిగేలా కనిపిస్తున్నదని చెప్పారు. "ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించే లక్ష్యంలోకి తిరిగి ప్రవేశించగలదని మనందరికీ విశ్వాసం ఉంది. దాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి సరైన సమయం ఇదే" అని ఆయన అన్నారు. సెప్టెంబర్ 8 నుంచి 14 తేదీల మధ్య వారంలో దేశ ఎగుమతుల విలువ 6.88 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఎగుమతుల వృద్ధి 10.73 శాతం ఉంది అని మంత్రి చెప్పారు. "భారతదేశం లక్ష్యసాధన దిశగా తిరిగి అడుగు పెట్టగలదనేందుకు ఇది సంకేతం, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగల స్థితి ఫలితాలనిస్తోంది, మనలో విశ్వాసం పెరుగుతోంది, ఏదైనా సాధించగలం అనే స్ఫూర్తికి ఈ అంకెలు దర్పణం పడుతున్నాయి" అని ఆయన అన్నారు.
భారత-యుకెల మధ్య వాణిజ్య ఒప్పందం సత్వరం పూర్తి చేసుకునేందుకు ఇది మంచి అవకాశం, సరైన సమయం అనే విశ్వాసం శ్రీ గోయెల్ ప్రకటించారు. "ఎఫ్ టిఏపై మనం కృషి చేయాల్సి ఉంది. ప్రాధాన్యతా వాణిజ్య అంగీకారంపై మనం దృష్టి సారించడం వల్ల భారత-యుకె వాణిజ్య బంధం విషయంలో మన చిత్తశుద్ధి, కట్టుబాటు ప్రపంచం యావత్తుకు ప్రదర్శించగలుగుతాం. ఉభయ దేశాల మధ్య గల ద్వైపాక్షిక ఒప్పందాల కింద మనం కొన్ని ఇస్తున్నాం, కొన్ని పొందుతున్నాం. రెండు దేశాల్లోనూ వ్యాపారాలకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు ఉపాధి కూడా కల్పించగలుగుతున్నాం" అని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో మనం ఎఫ్ టిఏపై త్వరితంగా దృష్టి సారించాల్సి ఉందని ఆయన అన్నారు. జపాన్, ఆస్ర్టేలియా, భారత్ మధ్య ఇదే తరహా చొరవ గురించి మాట్లాడుతూ సరఫరా వ్యవస్థల్లో నిలకడకు ఇది దోహదపడిందని చెప్పారు. అదే విధంగా యుకె, యూరప్, అమెరికా, లాటిన్ అమెరికా దేశాలు, ఆఫ్రికా దేశాలు కొన్నింటితో కూడా ఇదే తరహా ఏర్పాటుకు మంచి అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.
యుకెలోని వ్యాపారాలతో కలిసి పని చేయగల సామర్థ్యం పలు పరిశ్రమలకు ఉన్నదన్నారు. భారతదేశం మంచి పోటీ సామర్థ్యం, సాపేక్ష ప్రయోజనంతో యుకె నికర దిగుమతిదారుగా ఉన్న విభాగాల్లో ఆ దేశం అవసరాలు తీర్చగల స్థితిలో ఉందని మంత్రి చెప్పారు. "యుకెతో బంధాన్ని తదుపరి దశకు తీసుకువెళ్లే క్రమంలో రాబోయే జనవరి లోగా వాణిజ్య చర్చలు ప్రారంభించేందుకు సంసిద్ధులు కావడానికి మంచి అవకాశం లభించింది" అని ఆయన అన్నారు. భారతదేశం ఆరోగ్య సంరక్షణ రంగంలో అందించే సేవల ద్వారా యుకె కచ్చితంగా ప్రయోజనం పొందుతుందని ఆయన చెప్పారు. అందరూ భరించగల సరసమైన ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు ఆ దేశం కనివిని ఎరుగనంత వేగంతో అందించగల సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆయన తెలిపారు.
కోవిడ్-19 మహమ్మారి విసిరిన సవాలు నుంచి భారతదేశం బయటపడగలదన్న విశ్వాసాన్ని సిఐఐ ప్రకటించడం నిజంగా ప్రశంసనీయమని మంత్రి అన్నారు. "మనం త్వరితంగా కోలుకోగలం. వ్యాపారాలు తిరిగి పట్టాల పైకి వచ్చేలా చేయడంతో పాటు వృద్ధి పథంలోకి తిరిగి ప్రవేశించగలుగుతాం. వచ్చే ఐదేళ్ల కాలంలో మన తయారీ రంగా 300 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న నమ్మకం ఉంది. దేశీయ వినియోగం, ఎగుమతులు పెంచడానికి మద్దతు ఇచ్చే క్రమంలో 24 పారిశ్రామిక అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నాం" అన్నారు.
కరోనా మహమ్మారి సమయంలో ప్రకటించిన అన్ని అంతర్జాతీయ కట్టుబాట్లు భారతదేశం పూర్తి చేయగలిగిందని శ్రీ గోయెల్ చెప్పారు. "భారతదేశం అందించగల విశ్వసనీయ భాగస్వామ్యాన్ని ప్రపంచం గుర్తించింది. మహమ్మారి ప్రపంచం యావత్తును కుదిపేస్తున్న సమయంలో కూడా మన ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 90 శాతం మేరకు ఉన్నాయి. ప్రపంచంలో భారతదేశం విశ్వసనీయ భాగస్వామి అనే విశ్వాసం ఏర్పడేందుకు ఇది సహాయపడింది. శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో మనం ప్రపంచ దేశాలు, నాయకులతో సుహృద్భావం, స్నేహం, విశ్వాసం సాధించగలిగాం" అని ఆయన చెప్పారు.
భారతదేశం ఆర్థికంగా త్వరిత రికవరీ సాధిస్తూ ఉండడం పట్ల హర్షం ప్రకటిస్తూ 2020 ఆగస్టులో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే రైల్వేల ద్వారా సరకు రవాణా 4 శాతం పెరిగిందని మంత్రి చెప్పారు. అలాగే సెప్టెంబర్ నెల తొలి 13 రోజుల కాలంలో కూడా గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే రైల్వేలు 12 శాతం అధిక సరకు రవాణా నిర్వహించగలిగాయన్నారు.
డిజిటైజేషన్ గురించి మాట్లాడుతూ రాబోయే 1000 రోజుల వ్యవధిలో వైఫై దేశంలోని ప్రతీ ఒక్క గ్రామానికి చేర్చాలనే లక్ష్యం ప్రధానమంత్రి నిర్దేశించారని శ్రీ గోయెల్ చెప్పారు. "ప్రభుత్వ, పరిశ్రమ భాగస్వామ్యంతో మనం ఈ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించి తీరుతాం. కోవిడ్ అనంతర ప్రపంచంంలో ఇది అత్యంత అవసరం. గత 6 సంవత్సరాల కాలంలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలపై పెట్టిన భారీ పెట్టుబడుల ప్రయోజనాలు భారత్ పొందింది. మహమ్మారి సమయంలో భారత్ బలంగా నిలబడేందుకు ఇవి సహాయకారిగా నిలిచాయి" అని మంత్రి అన్నారు. కొన్ని దేశాలు డేటా నిర్వహణ, డేటా విశ్లేషణ వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వింటున్నాం, ఇది భారత జాతీయ ప్రయోజనాలకు ఏ మాత్రం మంచిది కాదని ఆయన చెప్పారు.
***
(Release ID: 1654908)
Visitor Counter : 212