PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 01 JUN 2020 6:23PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 91,818కి చేరగా... కోలుకున్నవారి శాతం 48.19కి పెరుగుదల.
  • కేసులలో మరణాల శాతం 2.83- నిశిత నిఘా, సకాలంలో రోగుల గుర్తింపు, వైద్యపరంగా కేసుల నిర్వహణతోనే సాపేక్షంగా తక్కువ మరణాలు నమోదు.
  • కోవిడ్‌-19పై పోరులో డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు అజేయులు: ప్రధానమంత్రి ప్రశంసలు.
  • కేంద్రంలో రెండో ఏడాది పాలనలో భాగంగా కేంద్ర మంత్రిమండలి తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి; ఎంఎస్‌ఎంఈ, వీధి వర్తకులు, రైతుల కోసం చరిత్రాత్మక నిర్ణయాలు.
  • ‘ఒకే దేశం – ఒకే కార్డు’ పథకం పరిధిలోకి మరో మూడు రాష్ట్రాలు.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; కోలుకున్నవారి శాతం 48.19కి పెరుగుదల

గడచిన 24గంటల్లో 4,835 మందికి కోవిడ్‌-19 వ్యాధి నయంకాగా, దేశంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 91,818కి చేరింది. దీంతో కోలుకునేవారి శాతం ప్రగతిశీలంగా మెరుగుపడి 48.19కి పెరిగింది. కోలుకునేవారి శాతం మే 18నాటికి 38.29 కాగా, మే 3నాటికి 26.59 శాతంగా ఉంది. అలాగే ఏప్రిల్‌ 15నాటికి 11.42 శాతం మాత్రమే కావడం గమనార్హం.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైద్య పర్యవేక్షణలోగల యాక్టివ్‌ కేసుల సంఖ్య 93,322 కాగా, మరణాలు 2.83 శాతంగా ఉన్నాయి. కాగా, మే 18నాటికి ఇది 3.15 కాగా, మే 3నాటికి 3.25 శాతంగా ఉంది. అలాగే ఏప్రిల్‌ 15నాటికి 3.30 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో నిశిత నిఘా, సకాలంలో రోగుల గుర్తింపు, వైద్యపరంగా కేసుల నిర్వహణతోనే సాపేక్షంగా తక్కువ మరణాలు నమోదవుతున్నాయి.

మరోవైపు దేశంలో పరీక్షల నిర్వహణ సామర్థ్యం కూడా పెరిగింది. ఈ మేరకు 472 ప్రభుత్వ, 204 ప్రైవేటు (మొత్తం: 676) ప్రయోగశాలల్లో ఇప్పటిదాకా 38,37,207 నమూనాలను పరీక్షించగా, నిన్న ఒక్కరోజే 1,00,180 నమూనాల పరీక్ష పూర్తయింది.

 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628457

కోవిడ్‌-19పై పోరాటంలో డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల అజేయ పాత్ర: ప్రధానమంత్రి ప్రశంస; రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రసంగం

అంతర్జాతీయ సమాజం రెండు ప్రపంచ యుద్ధాలను చూసిన నేపథ్యంలో నేడు మరొక అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని శ్రీ మోదీ అన్నారు. ప్రపంచ యుద్ధాలకు ముందు-తర్వాత ప్రపంచంలో మార్పులు సంభవించాయని, అదేతరహాలో ఇప్పుడు కోవిడ్‌కు ముందు-తర్వాత ప్రపంచం మరింత భిన్నంగా ఉండబోతుందని భవిష్యవాణి వినిపించారు. కోవిడ్‌-19పై భారత్‌ సాహసోపేత యుద్ధానికి మూలాలు వైద్య సమాజం, కరోనా యోధుల కఠోర శ్రమ, సంకల్పాలలో ఇమిడి ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. యూనిఫాం లేదన్న మాటేగానీ దేశంలోని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సాక్షాత్తూ సైనికులేనని అభివర్ణించారు.

 కరోనా వైరస్‌ అదృశ్య శత్రువే అయినా, మన కరోనా యోధులు అజేయ యోధులని పేర్కొన్నారు. అయితే, అదృశ్య శత్రువు-అజేయ యోధుల మధ్య పోరులో అంతిమ విజయం కచ్చితంగా మన వైద్యనారాయణులదేనని స్పష్టం చేశారు. ఇంతటి సేవలందిస్తున్న ముందువరుసలోని సిబ్బందిపై మూక మనస్తత్వం కారణంగా కొన్ని హింసాత్మక దాడులు చోటు చేసుకోవడంపై ఆయన విచారం వ్యక్తంచేశారు. ఇటువంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని తెలిపారు. అలాగే అగ్రశ్రేణి యోధులకు రూ.50 లక్షల మేర బీమా రక్షణ కల్పించిందని గుర్తుచేశారు. మునుపటితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఆరోగ్య రంగంలో ఆధునికతను సంతరించుకోవడం ఎంతో ప్రాధాన్యంగల అంశమని ఆయన అన్నారు. ఈ మేరకు ఆరోగ్య సంరక్షణ రంగంతోపాటు వైద్యవిద్య పురోగతికి గడచిన ఆరేళ్లుగా ప్రభుత్వం అనేక వినూత్న చర్యలు తీసుకున్నదని చెప్పారు. ఇక దేశంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేవిధంగా ఆరోగ్య సంరక్షణ, సంబంధిత మౌలిక వసతులు నాలుగు స్తంభాల వ్యూహంతో ముందడుగు వేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628322

రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628323

రెండో ఏడాది పాలనలో కేంద్ర మంత్రిమండలి తొలి భేటీకి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి; ఎంఎస్ఎంఈ, వీధి వర్తకులు, రైతుల కోసం చరిత్రాత్మక నిర్ణయాలు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సోమవారం.. 2020 జూన్‌ 1న సమావేశమైంది. మోదీ ప్రభుత్వ పాలన రెండో ఏడాదిలో మంత్రిమండలి తొలి భేటీ ఇదే. ఈ సమావేశం సందర్భంగా- కష్టజీవులైన రైతులు, ఎంఎస్‌ఎంఈ రంగంతోపాటు వీధి వర్తకుల భవిష్యత్తును పరివర్తనాత్మకంగా ప్రభావితం చేయగల చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు: పద్నాలుగు సంవత్సరాల తర్వాత ‘ఎంఎస్‌ఎంఈ’ నిర్వచనాన్ని సవరించారు; తదనుగుణంగా మధ్యతరహా పరిశ్రమల పెట్టుబడి పరిమితి రూ.50 కోట్లకు, వార్షిక వ్యాపార పరిమాణం (టర్నోవర్‌) రూ.250 కోట్లకు పెంచబడ్డాయి; వీధ వర్తకులకు సముచిత వడ్డీతో సూక్ష్మ రుణ సదుపాయ లభ్యత కోసం ‘పీఎం స్వాని’ధి పేరిట పథకం ప్రారంభమైంది; ఇక ఖరీఫ్‌ పంటల కాలం 2020-21కిగాను కనీస మద్దతుధరను సాగు వ్యయంకన్నా 1.5 రెట్లు ఎక్కువగా నిర్ణయిస్తామన్నా హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది; వ్యవసాయ, అనుబంధ రంగాల స్వల్పకాలిక రుణాల చెల్లింపు తేదీలు పొడిగించబడ్డాయి; దీంతోపాటు సకాలంలో చెల్లింపులకు ప్రోత్సాహకంతోపాటు రైతులకు వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628501

ఎంఎస్‌ఎంఈ నిర్వ‌చ‌న ఉన్న‌తీక‌రణ స‌వ‌ర‌ణ‌కు ‌మంత్రిమండ‌లి ఆమోదం; ఈ రంగానికి ప్రకటించిన ‘(ఎ) ఒత్తిడిలోగ‌ల ఎంఎస్ఎంఈలకు రూ.20,000 కోట్లు (బి) నిధుల కోసం నిధి ద్వారా రూ.50,000 కోట్ల వాటా మూల‌ధ‌న మ‌ద్ద‌తు’ ప్యాకేజీల అమలుకు విధివిధానాలు/మార్గ ప్ర‌ణాళిక‌ల‌కూ ఆమోదం

దేశంలో ఎంఎస్‌ఎంఈలను బ‌లోపేతంపై కేంద్ర ప్రభుత్వం ప్ర‌ధానంగా దృష్టి సారించిన నేప‌థ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల బృందం (CCEA) ప్ర‌త్యేకంగా సమావేశమైంది. ఈ సంద‌ర్భంగా ‘ఎంఎస్‌ఎంఈ’ నిర్వ‌చ‌న ఉన్న‌తీక‌రణ స‌వ‌ర‌ణ‌కు ఆమోదం తెలిపింది. అలాగే స్వ‌యం స‌మృద్ధ భార‌తం ప్యాకేజీ కింద ప్ర‌క‌టించిన మిగిలిన రెండు ప‌థ‌కాల అమ‌లుకు ప‌టిష్ఠ యంత్రాంగం ఏర్పాటు దిశ‌గా విధివిధానాలు/మార్గ ప్ర‌ణాళికనూ ఆమోదించింది. ఆ మేర‌కు ‘స్వ‌యం స‌మృద్ధ భార‌తం’ మూలసూత్రాల‌కు అనుగుణంగా ఎంఎస్ఎంఈ రంగాన్ని శ‌క్తిమంతం చేయ‌డానికి ఇది బాట‌లు పరుస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628344

ఖరీఫ్‌ పంటల మార్కెటింగ్‌ సీజన్‌ 2020-21కిగాను కనీస మద్దతు ధర నిర్ణయం

దేశంలో నిర్దేశిత ఖరీఫ్‌ పంటల మార్కెటింగ్‌ సీజన్‌ 2020-21 కనీస మద్దతు ధర (MSP) పెంచేందుకు ఆర్థిక వ్యవహారాల మంత్రిమండ‌లి బృందం ఆమోదం తెలిపింది. ఖరీఫ్‌ పంటల మార్కెటింగ్‌ సీజన్‌ 2020-21లో రైతులు పండించే పంటలపై గిట్టుబాటు ధరకు భరోసా ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘గడ్డినువ్వులు’ (నైగర్‌ సీడ్‌)కు (క్వింటాలు రూ.755), ‘మంచినువ్వులు’ (సెసామమ్‌)కు (క్వింటాలు రూ.370) మినుము (క్వింటాలు రూ.300), పత్తి (పొడుగుపింజ; క్వింటాలు రూ.275) పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. పంటల సాగులో వైవిధ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ధరలపై ఇలా నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628490

ఎంఎస్ఎంఈలను బ‌లోపేతం చేసే సాంకేతిక ప‌రిజ్ఞాన వేదిక ‘ఛాంపియన్స్’కు ప్ర‌ధాన‌మంత్రి మోదీ శ్రీ‌కారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ సాంకేతిక పరిజ్ఞాన వేదిక “ఛాంపియన్స్‌” (CHAMPIONS) అంటే- ‘క్రియేషన్‌ (C) అండ్‌ హార్మోనియస్‌ (H) అప్లికేషన్‌ (A) ఆఫ్‌ మోడర్న్‌ (M) ప్రాసెసెస్‌ (P) ఫర్‌ ఇంక్రీజింగ్‌ (I) ది అవుట్‌పుట్‌ (O) అండ్‌ నేషనల్‌ (N) స్ట్రెంగ్త్‌ (S)కు శ్రీకారం చుట్టారు. ఈ పోర్టల్ ప్రాథమికంగా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించడంతోపాటు చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రోత్స‌హించ‌డం, మ‌ద్ద‌తివ్వ‌డం, స‌హాయ‌ప‌డ‌టం, చేయూత‌నివ్వ‌డంద్వారా పెద్ద‌విగా మారేందుకు తోడ్ప‌డుతుంది. ఎంఎస్ఎంఈ ప‌రిధిలోని ఈ పోర్ట‌ల్ అన్నిర‌కాల స‌మ‌స్య‌ల‌నూ ప‌రిష్క‌రించే వాస్త‌వ వేదిక‌. ప్ర‌స్తుత క్లిష్ట ప‌రిస్థితుల న‌డుమ ఎంఎస్ఎంఈల‌కు స‌హాయ‌ప‌డ‌టానికి ఏర్పాటైన ఈ స‌మాచార‌-వ‌ర్త‌మాన సాంకేతిక ప‌రిజ్ఞాన ఆధారిత వ్య‌వ‌స్థ‌, ఆ ప‌రిశ్ర‌మ‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయుల‌లో ‘ఛాంపియ‌న్లు’గా నిలిచేందుకు పూర్తి తోడ్పాటునిస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628490

మిషన్‌ సాగర్: కొమొరోజ్‌లోని మొరోనీ రేవులో ఐఎన్‌ఎస్‌ కేసరి

‘మిషన్‌ సాగర్‌’లో భాగంగా భారత నావికాదళ నౌక కేసరి 2020 మే 31న కొమొరోజ్‌ దేశంలోని మొరోనీ రేవుకు చేరింది. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారిపై పోరులో భాగంగా స్నేహపూరిత సంబంధాలుగల కొన్ని దేశాలకు భారత్‌ ఉదారంగా సహాయం అందిస్తోంది. తదనుగుణంగానే కొమొరోజ్‌లోని ప్రజలకోసం కోవిడ్‌ చికిత్స సంబంధిత అత్యవసర మందులు, ఇతర పరికరాలను ఐఎన్‌ఎస్‌ కేసరి అక్కడికి చేర్చింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628250

దేశవ్యాప్తంగా 2020 జూన్‌ 1 నుంచి ప్రారంభమైన 200 రైళ్ల రాకపోకలు

ప్రయాణిక సేవల పాక్షిక పునరుద్ధరణలో భాగంగా భారత రైల్వేశాఖ 2020 జూన్‌ 1 నుంచి ప్రత్యేక రైళ్లను నడపటం ప్రారంభించింది. ఈ మేరకు ఇవాళ తొలిరోజున 200 రైళ్లు 1.45 లక్షల మంది ప్రయాణికులతో వివిధ ప్రాంతాల నుంచి బయల్దేరాయి. కాగా, 2020 మే 1 నుంచి రైల్వేశాఖ నడుపుతున్న ‘శ్రామిక్‌ స్పెషల్‌’, 2020 మే 12 నుంచి నడుపుతున్న 30 ఏసీ ప్రత్యేక రైళ్లకు ఇవి అదనం. ఇవాళ్టినుంచి నడిచే అదనపు రైళ్లన్నీ పూర్తిగా సాధారణ రైలు సర్వీసుల్లాగానే నడుస్తాయి. వీటిలో ఏసీ, సాధారణ బోగీలుండగా టికెట్లు పూర్తిగా రిజర్వేషన్‌ ద్వారా మాత్రమే జారీచేస్తారు. ఇక సాధారణ బోగీల్లో కేవలం కూర్చుని ప్రయాణించే ఏర్పాటు మాత్రమే ఉంటుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628230

ఈ ఏడాది (2020-21) తొలి రెండు నెలల్లో రూ.100కోట్లకుపైగా విక్రయాలు సాధించిన ‘పీఎంబీజేకే’లు; 2019-20లో ఇదే కాలంలో విక్రయాలు రూ.40కోట్లు.

దేశంలోని ‘ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు’ (PMBJK) 2020-21 తొలి రెండు మాసాల్లో రూ.100.40 కోట్ల అమ్మకాలు నమోదు చేశాయి. కాగా, నిరుడు (2019-20) ఇదే కాలంలో విక్రయాలు రూ.44.60 కోట్లు మాత్రమే కావడం ఈ సందర్భంగా గమనార్హం. కాగా, ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో రూ.144 కోట్ల విలువగల సముచిత ధర, నాణ్యతతో కూడిన మందులను విక్రయించింది. దీనివల్ల కోవిడ్‌-19 మహమ్మారి దేశంపై విరుచుకుపడిన ప్రస్తుత పరిస్థితుల నడుమ ప్రజలకు రూ.800 కోట్లదాకా ఆదా అయింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628326

‘ఒకే దేశం – ఒకే కార్డు’ పథకం పరిధిలోకి మరో మూడు రాష్ట్రాలు

దేశంలోని మరో మూడు రాష్ట్రాలు ఒడిషా, సిక్కిం, మిజోరం ‘ఒకే దేశం-ఒకే కార్డు’ పథకం పరిధిలోకి వచ్చాయని కేంద్ర వినియోగదారు వ్యవహారాలు-ఆహార-ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు మూడు రాష్ట్రాలు ‘సమీకృత ప్రజాపంపిణీ నిర్వహణ వ్యవస్థ’ (IM-PDS)లో భాగమయ్యాయి. ఈ వ్యవస్థ కింద జాతీయ ఆహార భద్రత చట్టం(NFSA) పరిధిలో దేశంలో ఎక్కడైనా చెల్లుబాటయ్యే ‘ఒకే దేశం – ఒకే కార్డు’ ప్రణాళికద్వారా ప్రజలు లబ్ధి పొందే వీలుంటుంది. తదనుగుణంగా NFSA కార్డున్నవారు దేశంలో ఎక్కడైనా, ఏ చౌక దుకాణంలోనైన తమ కోటా సబ్సిడీ ఆహారధాన్యాలు తీసుకోవచ్చు. ఇందుకోసం వారు ఆధార్‌ ప్రామాణికతను రుజువు చేసుకుంటే చాలు. కాగా, ఇప్పటిదాకా 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకం పరిధిలో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628456

పీపీఈలు, ఇతర సామగ్రిని శుభ్రం చేసే ‘అల్ట్రా స్వఛ్‌’కు డీఆర్‌డీవో రూపకల్పన

వ్యక్తిగత రక్షణ సామగ్రి-పీపీఈ సహా ఇతర విస్తృతశ్రేణ వస్తువులపై రోగకారకాలను నాశనం చేసే పరికరాన్ని రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ-డీఆర్‌డీవో రూపొందించింది. “అల్ట్రాస్వఛ్‌” పేరిట తయారుచేసిన ఈ పరికరంతో పీపీఈలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వస్త్రాలు వగైరాలపై రోగకారకాలను నిర్మూలించవచ్చు. డీఆర్‌డీవో పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (ఇన్‌మాస్‌) దీన్ని రూపొందించింది. ఇది ‘మల్టిపుల్‌ బ్యారియర్‌ డిస్రప్షన్‌’ ద్వారా ‘ఓజోనేటెడ్‌ స్పేస్‌ టెక్నాలజీ ఫర్‌ డిజెన్ఫెక్షన్‌’ను ఉపయోగిస్తూ అత్యాధునిక ఆక్సిడేటివ్‌ ప్రక్రియతో పనిచేస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628456

దిగ్బంధం వేళ 19000మంది ఉద్యోగులకు-వారి కుటుంబాలకు అభ్యాస-అభివృద్ధి అవకాశాలను వేగిరపరచిన ఎన్టీపీసీ

ఎన్టీపీసీ తన 19,000 మంది ఉద్యోగులకు, వారి కుటుంబాలకు అభ్యాస అవకాశం కల్పించింది. కోవిడ్‌-19 సందర్భంగా దిగ్బంధం విధించిన నేపథ్యంలో అవసరాలకు తగినట్లు అవకాశాలను మలచుకోవడం కోసం ఈ వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా ఉద్యోగుల ప్రతిభకు మెరుగుపెట్టే రీతిలో డిజిటైజేషన్‌, ఆన్‌లైన్‌ శిక్షణద్వారా ‘అభ్యాస-అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించుకుంది. తదనుగుణంగా దేశంలో ఎక్కడున్న ఉద్యోగులు ఈ సేవలను వినియోగించుకునే వీలు కల్పించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628447

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్‌: రాష్ట్రంలో సరైన జాగ్రత్తలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కాగా, పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో మే 17 నుంచి 28వ తేదీ మధ్య మాస్కులు ధరించని కారణంగా 36,820 మందికి, రోడ్లపై ఉమ్మినందుకు 4,032 మందికి పోలీసులు జరిమానా విధించడంతోపాటు 503 కేసులు కూడా నమోదు చేశారు.
  • హర్యానా: రాష్ట్రంలో కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఒకవైపు వైరస్‌పై యుద్ధం సాగుతున్నా హర్యానాలోని ప్రతి నిరుపేద కుటుంబానికీ రేషన్ అందించేందుకు ప్రభుత్వం ప్రథమ  ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకే రేషన్‌ కార్డుదారులతోపాటు కార్డులేని వారికి ‘ఆపన్న టోకెన్లు’ జారీచేసి, రేషన్‌ అందించామని, తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,86,000 మంది ఈ ప్రయోజనం పొందారని ఆయన వివరించారు. ఈ వైరస్‌ నిరోధానికి ఇంకా ఎలాంటి టీకా అందుబాటులో లేదని, అందువల్ల మనలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, సామాజిక దూరం నిబంధనకు కట్టుబడటం వంటి జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి అన్నారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో సామాన్యుల సౌకర్యార్థం ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటలవరకు కర్ఫ్యూ సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇవాళ్టినుంచి జిల్లాల మధ్య బస్సులు నడవటం మొదలైందని, వీటిలో ప్రయాణించేటపుడే కాకుండా, బస్‌ స్టేషన్లలోనూ సామాజిక దూరం నిబంధన పాటించాలని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని బస్‌స్టాండ్ల వద్ద రద్దీ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణకు జిల్లా న్యాయాధికారులు, పోలీసు సూపరింటెండెంట్లు తగిన బలగాలను అందుబాటులో ఉంచుతారని చెప్పారు. బస్సులలో ప్రయాణికులు సీట్ల సామర్థ్యంలో 60శాతానికి పరిమితం కావాలని, అలాగే ప్రజలతోపాటు డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఆరోగ్యశాఖ సూచించిన భద్రత విధివిధానాలను అనుసరిస్తారని ఆయన చెప్పారు. పాస్ లేకుండా జిల్లాల మధ్య ప్రయాణించేందుకు ప్రజలకు అనుమతి ఇస్తామని, అంతర్రాష్ట్ర ప్రయాణానికి మాత్రం పాస్‌ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారిని నిర్బంధ వైద్య పర్యవేక్షణలో ఉంచుతామని, చెప్పారు. కాగా, రెడ్ జోన్లనుంచి వచ్చేవారిని సంస్థాగత నిర్బంధంలో ఉంచుతామని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని ఇళ్లలోనే నిర్బంధ వైద్యపర్యవేక్షణలో ఉండాల్సిందిగా సూచిస్తామని చెప్పారు. ప్రభుత్వ నిర్బంధ వైద్య పర్యవేక్షణలో ఉన్నవారికి కోవిడ్‌-19 పరీక్ష నిర్వహించాక వ్యాధి లేదని స్పష్టమైతేనే ఇళ్లకు పంపుతామని ఆయన చెప్పారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో ఇవాళ 2,487 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 67,655కు చేరింది. వీరిలో 29,329 మంది పూర్తిగా కోలుకోగా, 2,286 మంది మరణించారు. మరోవైపు 8 మంది అధికారులుసహా మరో 93మంది పోలీసు సిబ్బందికి వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో కరోనావైరస్‌ బారినపడిన పోలీసుల సంఖ్య 2,509కి చేరింది. వీరిలో 27 మంది ఇప్పటిదాకా మరణించారు. ఇక మహారాష్ట్ర నుంచి రోడ్డు, రైలు, గగన మార్గాల్లో అంతర్రాష్ట్ర ప్రయాణంపై నిషేధం జూన్ 30న దిగ్బంధం ముగిసేదాకా కొనసాగుతుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం... వలస కార్మికులతోపాటు చిక్కుకుపోయిన వారికోసం ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లద్వారా వెళ్లేందుకు సడలింపు ఇవ్వబడింది.
  • గుజరాత్: రాష్ట్రంలో 438 కొత్త కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి, మరణాల్లో 20 ఒక్క అహ్మదాబాద్‌లోనే నమోదైనవి కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,794కు మరణాల సంఖ్య 1,038కి చేరింది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో మరో 149 మందికి వ్యాధి సంక్రమించడంతో కోవిడ్‌-19 మొత్తం కేసుల సంఖ్య 8,980కి చేరింది. తాజా కేసులలో అత్యధికంగా భరత్‌పూర్ 44, జైపూర్ 32, బరన్ 27, పాలి 21 వంతున నమోదయ్యాయి. అన్ని అధ్యాత్మిక ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, హోటళ్ళు మూసివేతలో ఉండగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు పూర్తి సిబ్బందితో పనిచేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం అనుమతించింది.
  • మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలో గత 24 గంటల్లో 198 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 8,089కి పెరిగింది. అయితే, వ్యాధి సంక్రమించినవారిలో 398 మంది పూర్తిగా కోలుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో వారిని ఇళ్లకు పంపడం ఊరట కలిగించే పరిణామం. కాగా, ఒక్కరోజులో గరిష్ఠ సంఖ్యలో రోగులు వ్యాధి నయం చేసుకుని విడుదల కావడం ఇవాళే సంభవించింది.
  • ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరో 5 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 503కు చేరాయి. ఇందులో యాక్టివ్‌ కేసులు 388 కాగా, ఇప్పటివరకూ ఒకేఒక్క మరణం నమోదైంది.
  • కేరళ: రాష్ట్రంలో జిల్లాల మధ్య రేపటినుంచి బస్సులు తిరిగి నడవనున్నాయి. అయితే, ప్రస్తుతం అంతర్రాష్ట్ర ప్రయాణానికి మాత్రం అనుమతిలేదు. జూన్ 8 నుంచి హోటళ్ళు, రెస్టారెంట్లు భోజన సదుపాయాలతో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రార్థన స్థలాలను తిరిగి తెరవడంపై మత పెద్దలతో సంప్రదించి నిర్ణయం తీసుకోనుంది. కొత్త విద్యాసంవత్సరం ఇవాళ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని 12,000 పాఠశాలల్లో 41 లక్షలమంది విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘విక్టర్స్‌’ చానెల్‌ద్వారా వర్చువల్ తరగతులకు మారారు. తిరువనంతపురంలో మరో నలుగురికి వ్యాధి నిర్ధారణ అయింది. వీరిలో ముగ్గురు కువైట్ నుంచి, ఒకరు తమిళనాడు నుంచి తిరిగి వచ్చినవారు. నిన్న, ఇవాళ గల్ఫ్‌ దేశాల్లో 12 మంది కేరళీయులు వైరస్‌కు బలయ్యారు. దీంతో గల్ఫ్‌లో కేరళవాసుల మృతుల సంఖ్య 150కి చేరింది. నిన్న రాష్ట్రంలో ఒక మరణం, 61 కొత్త కేసులు నమోదవగా 670 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాడు: పుదుచ్చేరి శాసనసభ ప్రాంగణంలో ఒక వ్యక్తికి కోవిడ్‌-19 నిర్ధారణ కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయంలో రోగకారక నిర్మూలన చర్యలు చేపట్టారు. కాగా, ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మరో ముగ్గురికి కూడా వ్యాధి సోకినట్లు తేలింది. దీంతో ప్రస్తుతం పుదుచ్చేరిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 49కి చేరింది. ఇక తమిళనాడులో రెండు నెలల సుదీర్ఘకాలం తర్వాత బస్సులు తిరిగి రోడ్లపైకి వచ్చాయి. అయితే, చెన్నై నుంచి వెళ్లే ప్రయాణికులందరికీ పరీక్షలు తప్పనిసరి చేశారు. అలాగే హాట్‌స్పాట్ రాష్ట్ర్రాల నుంచి తమిళనాడుకు వచ్చేవారికీ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో తొలిసారిగా అత్యధికంగా నిన్న ఒకేరోజున 1,149 కేసులు నమోదవగా వీటిలో ఒక్క చెన్నై నగరంలోనే 804 కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు: 22,333 యాక్టివ్‌: 9400, మరణాలు: 173, డిశ్చార్జ్: 12,757; చెన్నైలో యాక్టివ్ కేసులు 6781గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలోని ఆలయాలు జూన్ 8నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ఇక మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు వచ్చేవారికి మాత్రమే 7 రోజుల సంస్థాగత నిర్బంధం తప్పనిసరి. కాగా, రాష్ట్రంలోని ఆరెంజ్‌, రెడ్‌ జోన్లలో డ్రైవింగ్ లైసెన్సుల జారీని ఆర్టీవో ప్రారంభించింది. కర్ణాటకలో చికెన్‌ వినియోగం పెరగడంతో పౌల్ట్రీ పరిశ్రమకు ప్రయోజనం కలుగుతోంది. నిన్న రాష్ట్రంలో 299 కొత్త కేసులు నమోదవగా వీరిలో 255మంది అంతర్రాష్ట్ర ప్రయాణికులు, ఏడుగురు విదేశాలనుంచి వచ్చినవారు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసులు:3221, యాక్టివ్‌: 1950, మరణాలు: 51, కోలుకున్నవి: 1218.
  • ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలో ‘తదుపరి ఆదేశాలు’ అందేవరకూ రైలు ప్రయాణానికి అనుమతి లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను రైల్వే స్టేషన్లలో పరీక్షించడంతోపాటు  14 రోజుల గృహ నిర్బంధం తప్పనిసరి చేశారు. కాగా- మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, చెన్నైలనుంచి వచ్చేవారికి 7 రోజుల సంస్థాగత నిర్బంధం తప్పనిసరి చేశారు. ఆ తర్వాత 7 రోజులు గృహ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. గడచిన 24 గంటల్లో 10,567 నమూనాలను పరీక్షించిన తర్వాత 76 కొత్త కేసులు, రెండు మరణాలు నమోదవగా, 34మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసులు: 3118. యాక్టివ్: 885, రికవరీ: 2169, మరణాలు: 64. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 446 మందిలో 249, విదేశాల నుంచి వచ్చినవారిలో 112 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.
  • తెలంగాణ: రైల్వే మంత్రిత్వశాఖ ఇవాళ్టినుంచి ప్రయాణిక రైలు సేవలను పునఃప్రారంభించడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌వద్ద ప్రయాణికులు బారులుతీరారు. ఈ మేరకు నేడు 7 రైళ్లలో 10,000 నుంచి 12,000 మంది పయనమయ్యారు. ఈ రైళ్లలో 4 సికింద్రాబాద్ నుంచి, 3 నాంపల్లి నుంచి బయల్దేరాయి. దిగ్బంధం నిబంధనల సడలింపు తర్వాత గత నెలలో ఎటువంటి కేసులేని జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజా కేసులు నమోదయ్యాయి. మే 31 నాటికి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,698గా ఉంది. కాగా, ఇప్పటివరకూ వలసదారులు/విదేశాలనుంచి తరలించిన, తిప్పిపంపినవారిలో 434 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రానికి నేటివరకూ సుమారు 8000 మంది తిరిగివచ్చారు. ఈ నేపథ్యంలో దిగ్బంధం, ఆరోగ్య పరీక్షల ప్రామాణిక విధాన ప్రక్రియలను కచ్చితంగా అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో దిగ్బంధం ఇంకా కొనసాగుతోందని, ఇతర ప్రాంతాల్లోని రాష్ట్రవాసులంతా తిరిగివచ్చాక సడలింపుపై నిర్ణయం తీసుకుంటామని అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రకటించారు.
  • అసోం: కోవిడ్‌-19వల్ల కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసే దిశగా సలహా కమిటీ సూచనల అమలుకు ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని పరిశ్రమలు-వాణిజ్యశాఖల మంత్రి పటోవరీ, వ్యవసాయశాఖ మంత్రి అతుల్‌ బోరాలతో కూడిన త్రిసభ్య కమిటీ మార్గప్రణాళికను రూపొందిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, రాష్ట్రంలో 6 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 1390కి చేరాయి. వీటిలో యాక్టివ్‌ కేసులు: 1198, కోలుకున్నవారు: 185, మరణాలు 4.
  • మణిపూర్: రాష్ట్రంలో 7 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 78కి చేరింది. వీటిలో యాక్టివ్‌: 67, కోలుకున్నవి: 11 ఉండగా వీరిలో అధికశాతం ఇతర రాష్ట్రాలనుంచి వచ్చినవారు.
  • మిజోరం: గోవా నుండి మిజోరంలోని బైరాబీకి చేరుకున్న ప్రయాణికులు తమ పొదుపు మొత్తాలతో  రూ.54,140 పోగుచేసి, బైరాబి కమ్యూనిటీ సంస్థలకు అందించారు. ఈ సంస్థలు రైల్వే స్టేషన్‌లో ఆపన్నులను నిస్వార్థంగా ఆదుకుంటున్నాయి.
  • నాగాలాండ్: పౌర స్వచ్ఛంద సంస్థలు లివింగ్‌స్టోన్‌లోగల ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో నిర్వహిస్తున్న దిగ్బంధం వైద్య కేంద్రాన్ని దిమాపూర్ కోవిడ్‌-19 కార్యాచరణ బృందం ఇన్‌చార్జి సందర్శించారు. కాగా, బెంగళూరులోని నాగా టాస్క్‌ఫోర్స్‌ కార్యకర్తలు నగరంలోని వలస కార్మికులకు, మురికివాడల వాసులకు రేషన్‌ పంపిణీ చేసేందుకు స్థానిక అధికారులకు సహకరిస్తున్నారు.

 

PIB FACT CHECK

*****

YB



(Release ID: 1628510) Visitor Counter : 257