రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఏప్రిల్‌, మే నెలల్లో భారతీయ జనౌషధి కేంద్రాల ద్వారా రూ.100 కోట్లకు పైగా విక్రయాలు

గతేడాది ఇదే కాలానికి ఈ మొత్తం రూ.44.60 కోట్లు
మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కలిపి దాదాపు రూ.144 కోట్ల విలువైన ఔషధాల అమ్మకం

Posted On: 01 JUN 2020 3:24PM by PIB Hyderabad

2020-21 సంవత్సరానికి, మొదటి రెండు నెలల్లోనే "ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు" (పీఎంబీజేకే) రూ.100.40 కోట్ల విలువైన ఔషధాలను విక్రయించాయి. గతేడాది ఇదే కాలానికి ఈ మొత్తం రూ.44.60 కోట్లు మాత్రమే.

    లాక్‌డౌన్‌ కాలంలో, 2020 మార్చి నుంచి మే నెల వరకు, పీఎంబీజేకేల ద్వారా రూ.144 కోట్ల విలువైన నాణ్యమైన ఔషధాల అమ్మకాలు సాగాయి. దీనివల్ల దాదాపు రూ.800 కోట్ల వరకు భారతీయులకు ఆదా అయినట్లు అంచనా.

    కొవిడ్‌ సమయంలో ప్రజలందరికీ ఔషధాలు అందుబాటులో ఉంచేందుకు కేంద్రం నిబద్ధత చూపించిందని, ' కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ' మంత్రి శ్రీ డీవీ సదానందగౌడ చెప్పారు. పీఎంబీజేకే నెట్‌వర్క్‌ ద్వారా 'ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన' అమల్లో బీపీపీఐ పోషించిన ముఖ్య పాత్రపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 

https://twitter.com/mansukhmandviya/status/1267341118384947201?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1267341118384947201&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1628291 

    కొవిడ్‌ సంక్షోభ సమయంలో బీపీపీఐ సిబ్బంది, జనౌషధి కేంద్రాల యజమానులు, పంపిణీదారులు, ఇతర భాగస్వాములు ముందుకొచ్చి, కలిసికట్టుగా ఆ మహమ్మారిపై పోరాటం చేశారు. లాక్‌డౌన్‌ సవాళ్ల సమయంలోనూ జనౌషధి కేంద్రాలు, వినియోగదారులకు బీపీపీఐ అండగా నిలిచింది. జనౌషధి కేంద్రాల నిర్వహణకు ఆటంకాలు లేకుండా చూసి నిబద్ధత చాటుకుంది.

    జనౌషధి కేంద్రాల్లో అత్యవసర ఔషధాలకు కొరత రాకుండా బీపీపీఐ చూసింది. లాక్‌డౌన్‌ సమయంలోని ఏప్రిల్‌ నెలలో, జనౌషధి కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో రూ.52 కోట్ల విలువైన ఔషధాలను విక్రయించారు. మార్చిలో ఈ మొత్తం రూ.42 కోట్లు. ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న ఫేస్‌ మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లు, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, పారాసిటమాల్‌, అజిత్రోమైసిన్‌ మాత్రలు వంటివాటి కొరత రాకుండా సరిపడా నిల్వలు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా బీపీపీఐ చూసుకుంది. గత మార్చి, ఏప్రిల్‌ నెలల్లో దాదాపు 10 లక్షల ఫేస్‌ మాస్కులు, 50 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను అమ్మింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ దృష్ట్యా, వచ్చే ఆరు నెలలకు  సరిపడేలా, బీపీపీఐ కూడా ఈ ఔషధాల సేకరణకు కొనుగోలు ఆర్డర్లు పెట్టింది. మిత్రదేశాలకు పంపిణీ చేసేందుకు, విదేశీ వ్యవహారాల శాఖకు కూడా బీపీపీఐ ఔషధాలను అందించింది.

    లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ, దేశవ్యాప్తంగా 726 జిల్లాల్లో 6300 జనౌషధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో సామాజిక దూరాన్ని  పాటిస్తూ ఫార్మాసిస్టులు విధులు నిర్వహిస్తున్నారు. "స్వస్త్‌ కే సిపాయి" పేరిట రోగులు, వృద్ధుల ఇళ్ల వద్దకే మందులు తీసుకెళ్లి అందిస్తున్నారు. అంతేకాక, తన సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, వైరస్‌పై బీపీపీఐ పోరాటం చేస్తోంది. జనౌషధి సుగమ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ఇప్పుడు ప్రాచుర్యం పొందింది. దాదాపు 4 లక్షలకు పైగా డౌన్‌లోడ్లు నమోదయ్యాయి. ఈ విధంగా కరోనా వైరస్‌పై యుద్ధంలో బీపీబీఐ చురుకైన పాత్ర పోషిస్తోంది.


(Release ID: 1628326) Visitor Counter : 316