ప్రధాన మంత్రి కార్యాలయం
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 25 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రసంగం తెలుగు అనువాదం
Posted On:
01 JUN 2020 12:19PM by PIB Hyderabad
ఈ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం 25 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉన్న మొత్తం వైద్యులు, శాస్త్రవేత్తల బృందానికి నా అభినందనలు.
ఇన్నేళ్ళుగా మీరు వైద్యరంగంలో బోధన, శిక్షణవిషయంలో అద్భుత కృషి కొనసాగిస్తున్నారు.
ఈ విశ్వవిద్యాలయానికి 25 సంవత్సరాలంటే, ఇది కీలకమైన యవ్వన దశలో ఉన్నట్టు. అంటే ఈ వయసు, మరింత పెద్ద పెద్ద ఆలోచనలు చేయడానికి మరింత గొప్ప పనితీరు కనబరచడానికి తగిన వయసు.రాగల రోజులలో ఈ విశ్వవిద్యాలయం అద్భుత ప్రతిభ కనబరచడంలో నూతన శిఖరాలు అధిరోహిస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను.కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కోవడంలో కర్ణాటక ప్రభుత్వం కృషిని నేను అభినందించాలనుకుంటున్నాను.
మిత్రులారా, మామూలు పరిస్థితులలో అయితే ఈ ఉత్సవాలు తప్పకుండా మరింత పెద్ద స్థాయిలో జరిగి ఉండేవి.ఈ అంతర్జాతీయ మహమ్మారి లేకుండా ఉండి ఉంటే , ఈ ప్రత్యేక కార్యక్రమానికి బెంగళూరు లో మీ అందరిమధ్య ఉండడానికి నేను ఎంతొ ఇష్టపడే వాడిని.
అయితే, ఇవాళ ప్రపంచం , రెండు ప్రపంచయుద్ధాల తర్వాత మున్నెన్నడూ లేనంతటి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ప్రపంచ యుద్దాలకు ముందు, ఆ తర్వాత ప్రపంచం మార్పులు చవిచూసినట్టు,కోవిడ్ ముందు, ఆ తర్వాతి ప్రపంచం భిన్నంగా ఉండనుంది.
మిత్రులారా, అలాంటి సమయంలో ప్రపంచం మన వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తల వైపు ఎంతో ఆశతో కృతజ్ఞతతో చూస్తున్నది. సంరక్షణ, నివారణ రెండింటినీ ప్రపంచం మీ నుంచి కోరుకుంటున్నది.
మిత్రులారా, కోవిడ్ -19 పై భారతదేశం ధైర్యంతో సాగిస్తున్న పోరాటానికి మూలం, మన వైద్య సిబ్బంది, మన కరోనా పోరాట యోధుల విశేష కృషి. ఒక రకంగా వైద్యులు, వైద్య సిబ్బంది సైనికుల లాంటి వారు. అయితే వీరికి సైనికుల యూనిఫాం ఉండదు అంతే తేడా. వైరస్ కంటికి కనిపించని శత్రువే కావచ్చు. కానీ మన కరోనా పోరాటయోధులు, వైద్య సిబ్బంది అజేయ శక్తిసంపన్నులు. కనిపించని వైరస్‌కు , అజేయశక్తిసంపన్నులకు మధ్య జరిగే పోరాటంలో మన వైద్య సిబ్బందే ఖచ్చితంగా విజయం సాధిస్తారు.
మిత్రులారా, గతంలో గ్లోబలైజేషన్‌పై చర్చలు ప్రధానంగా ఆర్థిక అంశాలపై జరిగేవి. కానీ, ఇప్పుడు ప్రపంచం మొత్తం మానవత్వం కేంద్రంగా అభివృద్ధి అంశాలపై దృష్టిపెట్టడంలో ఐక్యంగా ఉండాల్సిఉంది.
వివిధ దేశాలు ఆరోగ్య రంగంలో సాధించే పురోగతి ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. మిత్రులారా, గడచిన ఆరు సంవత్సరాలలో మనం ఇండియాలో వైద్యవిద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలోఎన్నో చర్యలు తీసుకున్నాం.
మనం ప్రధానంగా నాలు స్తంభాల ఆధారంగా పనిచేస్తున్నాం :
అందులో మెదటిది- ముందస్తు ఆరోగ్య సంరక్షణ: యోగా, ఆయుర్వేద, సాధారణ శారీరకదృఢత్వం ఇవన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి .40 వేలకు పైగా వెల్‌నెస్ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. జీవన విధానానికి సంబంధించిన వ్యాధులను నియంత్రించడంపై ఇవి ప్రధానంగా దృష్టిపెడతాయి. స్వచ్ఛ భారత్ విజయం, ముందస్తు ఆరోగ్య సంరక్షణలో మరో కీలకమైన అంశం.
ఇక రెండవది- ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ చర్యలు. ఆయుష్మాన్ భారత్-ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం మనదేశానికి చెందినదే. రెండు సంవత్సరాల వ్యవధిలో , కోటిమంది ప్రజలు ఈ పథకం కింద లబ్ధిపొందారు. ప్రధానంగా ఈ పథకం కింద మహిళలు, గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా లబ్ధిపొందారు.
మూడవది-సరఫరాకు సంబంధించి పరిస్థితి మెరుగు పరచడం. మన దేశం వంటి దేశానికి తగిన వైద్య మౌలిక సదుపాయాలు, వైద్యవిద్యా మౌలిక సదుపాయాలు ఉండాలి. దేశంలో ప్రతిజిల్లాలో ఒక మెడికల్ కళాశాల లేదా ఒక పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఉండేలా చర్యలు మొదలయ్యాయి.22 ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎంఎస్‌లు)లు నెలకొల్పడంలో దేశం గొప్ప పురోగతి సాధించింది.గత ఐదు సంవత్సరాలలో మనం ఎం.బి.బి.ఎస్‌లో 30 వేల సీట్లను , పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 15 వేల సీట్లను పెంచుకోగలిగాం. స్వాతంత్ర్యానంతరం ఏ ప్రభుత్వ హయాంలోనూ లేని రీతిలో ఐదు సంవత్సరాల వ్యవధిలో అత్యధిక సంఖ్యలో పెంచుకున్న సీట్లుగా దీనిని చెప్పుకోవచ్చు. పార్లమెంటు చట్టం ద్వారా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను తీసుకురావడం జరిగింది.ఇది దేశంలో వైద్యవిద్యా నాణ్యతను పెంచడంలో ,వైద్య విద్యను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకెళ్ళడంలో ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.
ఇక నాలుగవ స్తంభం- మిషన్ మోడ్ లో అమలు. బాగా ఆలోచించి పేపేర్ మీద పెట్టే ఒక ఆలోచన, కేవలం ఒక మంచి ఆలోచనగా ఉండిపోతుంది.కాని ఆ మంచి ఆలోచనను సక్రమంగా అమలు చేస్తే అది గొప్పది అవుతుంది. అందువల్ల అమలు అనేది అత్యంత కీలకమైనది.
ఇక్కడ నేను భారతదేశ పౌష్టికాహార మిషన్ విజయాన్ని ప్రస్తావించదలచుకున్నాను ఇది దేశ యువతకు, తల్లులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. 2025 నాటికి క్షయవ్యాధి(టిబి)ని నిర్మూలించేందుకు దేశం అనుక్షణం కృషి చేస్తున్నది. ఇది ప్రపంచ లక్ష్యమైన 2030 కంటే 5 సంవత్సరాల ముందే. మిషన్ ఇంధ్రదనుష్ మన వార్షిక వాక్సినేషన్ కవరేజ్ రేటును నాలుగురెట్లు పెంచింది. మిత్రులారా, 50కి పైగా వివిధ అనుబంధ, ఆరోగ్య సంరక్షణ ప్రొఫెషనల్స్‌కు సంబంధించిన విద్యను విస్తృతం చేయడానికి ఇటీవలే కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ చట్టం ఒక సారి ఆమోదం పొందితే దేశంలో పారామెడికల్ సిబ్బంది కొరతను తీర్చగలుగుతుంది.అంతేకాదు నిపుణులైన వారిని ఇతర దేశాలకు అందించడానికి కూడా ఇండియాకు సహాయపడుతుంది.
మిత్రులారా, మూడు విషయాలపై గరిష్ఠస్థాయిలో చర్చ , భాగస్వామ్యం అవసరమని నేను భావిస్తున్నాను.
అందులో ఒకటి, టెలిమెడిసిన్ లో ఆధునిక పోకడలు, టెలిమెడిసిన్‌ను పెద్ద సంఖ్యలో పాపులర్ అయ్యేట్టు చేసేందుకు మనం ఏవైనా కొత్త నమూనాలను ఆలోచించగలమా అన్నది.
ఇక మరొకటి, ఆరోగ్య రంగంలో మేక్ ఇన్ ఇండియా . ప్రారంభం ప్రయోజనాలను గమనిస్తే నాకు పరిస్థితి ఆశాజనకంగా ఉంది. మన దేశీయ తయారీదారులు పిపిఇ ల ఉత్పత్తి ప్రారంభించారు. వీరు కోవిడ్ పోరాట యోధులకు 1 కోటి పిపిఇలు సరఫరా చేశారు. అలాగే మనం 1.2 కోట్ల మేక్ ఇన్ ఇండియా ఎన్ -95 మాస్క్‌లను అన్ని రాష్ట్రాలకూ సరఫరా చేశాం.
ఇక మూడవది- ఆరోగ్యకరైమన సమాజాలకు ఐటి సంబంధిత ఉపకరణాలు. మీ అందరి మొబైళ్ళలో ఆరోగ్యసేతు యాప్ ఉందని నేను అనుకుంటున్నాను. ఆరోగ్యంపట్ల చైతన్యం కలిగిన 12 కోట్లమంది ప్రజలు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. కరోనావైరస్‌పై పోరాటంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది.
మిత్రులారా, మీ అందరికీ ఎంతో ఆందోళన కలిగించే అంశం గురించి నాకు తెలుసు. ముందువరుసలో ఉండి కోవిడ్‌పై పోరాటం చేస్తున్న డ్యూటీ డాక్టర్లు, నర్సులు, సఫాయి వర్కర్లు ,కొందరి మూక మనస్తత్వం వల్ల దాడులకు గురౌతున్నారు. హింస, దురుసుగా ప్రవర్తించడం,దుర్బాషలాడడం ఇవి ఆమోదయోగ్యం కాదు. ఏ రూపంలోని హింసనుంచైనా మిమ్మల్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. కోవిడ్ పై పోరాటంలో ముందువరుసలో పనిచేస్తున్న వారికి మేం 50 లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పించాం.
మిత్రులారా, గత 25 సంవత్సరాలుగా ఈ విశ్వవిద్యాలయం సాగిస్తున్న ఫలప్రదమైన ప్రయాణం పట్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంస్థ ఇప్పటి వరకు వేలాది మంది వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని తయారు చేసింది. వీరంతా ప్రస్తుత క్లిష్ట సమయంలో పేదలు, వైద్య ఆరోగ్యసేవలు అవసరమైన వారికి ఎంతగానో సహాయపడుతున్నారు. ఈ విశ్వవిద్యాలయం దేశం ,రాష్ట్రం గర్వపడే రీతిలో అద్బుత నాణ్యతా ప్రమాణాలు , గొప్ప సామర్థ్యం కలిగిన నిపుణులను తయారు చేయడం కొనసాగించగలదని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను.
ధన్యవాదాలు.
***
(Release ID: 1628323)
Visitor Counter : 343
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam