ప్రధాన మంత్రి కార్యాలయం

రాజీవ్ గాంధీ ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం 25వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి

కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో వైద్యులు, ఆరోగ్య పరిరక్షణ కార్మికుల పాత్ర అజేయమైనదని ప్రశంసించిన - ప్రధానమంత్రి.


అదృశ్యానికీ, అజేయానికి మధ్య జరిగే యుద్ధంలో మన వైద్య నిపుణులు తప్పక విజయం సాధిస్తారు - ప్రధానమంత్రి.


దేశంలో వైద్య సంరక్షణను పెంపొందించడానికి నాలుగు స్తంభాల వంటి అంశాలతో కూడిన ఒక వ్యూహాన్ని ప్రకటించారు.


ఆరోగ్య రంగంలో, టెలి-మెడిసిన్, మేక్ ఇన్ ఇండియా, మరియు ఐ.టి. ఆధారిత ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషించాలి.

Posted On: 01 JUN 2020 1:10PM by PIB Hyderabad

బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం 25వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు

కోవిడ్-19 పరిస్థితిని పరిష్కరించడంలో కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు.

రెండు ప్రపంచ యుద్ధాల తరువాత ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభం ఇదేనని శ్రీ మోడీ అన్నారు.  ప్రపంచ యుద్ధాలకు ముందు, ఆ తర్వాత ప్రపంచం ఎలా మారిపోయిందో, ఇప్పుడు కోవిడ్ ముందు ప్రపంచానికీ, కోవిడ్ తర్వాత ప్రపంచానికీ చాలా మార్పు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

వైద్య సమాజం మరియు మన కరోనా యోధుల కృషే, కోవిడ్-9 కు వ్యతిరేకంగా భారతదేశం కొనసాగిస్తున్న ధైర్య పోరాటానికి వెన్నుముకగా నిలిచిందని,  శ్రీ మోడీ అన్నారు.  వైద్యులు, వైద్య కార్మికులు మిలటరీ యూనిఫామ్ లేని సైనికులని ఆయన అభివర్ణించారు. 

వైరస్ ఒక అదృశ్య శత్రువు కావచ్చు, కాని మన కరోనా యోధులు అజేయంగా ఉన్నారనీ, అదృశ్యానికీ, అజేయానికి మధ్య జరిగే యుద్ధంలో మన కరోనా యోధులు విజయం సాధించడం ఖాయమని, ప్రధానమంత్రి అన్నారు.

ఫ్రంట్ లైన్ కార్మికులపై మూక దాడి కారణంగా సంభవించిన హింసాత్మక సంఘటనలపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.  వారిని అరికట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు.   ఫ్రంట్ లైన్ లో సేవలందిస్తున్న వారికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల మేర బీమా కూడా కల్పించిందని ఆయన తెలిపారు. 

ప్రపంచీకరణ యుగంలో ఆర్థిక సమస్యలపై చర్చలకు బదులు అభివృద్ధికి మానవ కేంద్రీకృత అంశాలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

ఆరోగ్య రంగంలో వివిధ దేశాలు సాధించిన పురోగతి మునుపెన్నడూ లేనంత ప్రాముఖ్యతను సాధించింది.  అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా గత 6 సంవత్సరాల్లో ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య విద్యలో అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన అన్నారు.

ఆరోగ్య సంరక్షణ, దాని మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు మరియు అవి అందరికీ అందుబాటులో ఉండే విధానాన్ని అమలు చేసేందుకు నాలుగు స్తంభాల వంటి అంశాలతో కూడిన ఒక  వ్యూహాన్ని అమలుచేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

మొదటి స్తంభం నివారణ ఆరోగ్య పరిరక్షణ. ఇక్కడ యోగా, ఆయుర్వేదం మరియు జనరల్ ఫిట్నెస్ లకు ప్రాముఖ్యత ఉంటుందని ఆయన అన్నారు.  జీవనశైలికి సంబంధించిన వ్యాధుల నియంత్రణపై కీలక దృష్టి పెట్టి 40,000 కి పైగా వెల్నెస్ సెంటర్లను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.  స్వచ్ఛ భారత్ మిషన్ విజయం, నివారణ ఆరోగ్య సంరక్షణలో మరో ముఖ్యమైన రంగమని ఆయన అన్నారు. 

రెండవ స్థంభం - అందుబాటు ధరల్లో ఆరోగ్య రక్షణ. ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య రక్షణ పథకం - ఆయుష్మాన్ భారత్ విజయం గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.  రెండు సంవత్సరాలలోపు సమయంలో, ఒక కోటి మంది ప్రజలు,  ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు ఏవిధంగా ప్రయోజనం పొందినదీ,ఆయన వివరించారు. 

మూడవ స్తంభం- సరఫరా వైపు మెరుగుదల.  భారతదేశం లాంటి దేశానికి సరైన వైద్య మౌలిక సదుపాయాలు, వైద్య విద్య మౌలిక సదుపాయాలు ఉండాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

దేశంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాల లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య సంస్థ ఉండేలా పనులు జరుగుతున్నాయని, ఆయన చెప్పారు.  మరో 22 ఎయిమ్స్ సంస్థలను స్థాపించడం ద్వారా దేశం వేగంగా పురోగతి సాధించిందనే విషయాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.

గత ఐదేళ్ళలో  ఎం.బి.బి.ఎస్. ‌లో 30,000 సీట్లు,  పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ‌లో 15 వేల సీట్లను జోడించగలిగామని ఆయన అన్నారు.  స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం కూడా తమ ఐదేళ్ల కాలంలో అతిపెద్ద సంఖ్య లో సీట్లను పెంచలేదని ఆయన అన్నారు. 

పార్లమెంటు చట్టం ద్వారా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు గురించి ప్రధాని మాట్లాడారు.

చివరిగా నాల్గవ స్తంభం, అన్ని పథకాల మిషన్ మోడ్ అమలు అని, మంచి ఆలోచన విజయవంతం కావడానికి ఇది చాలా కీలకమని ఆయన అన్నారు

జాతీయ పౌష్టికాహార పధకం అమలు యువతకు మరియు తల్లులకు ఎలా సహాయపడుతుందో మరియు 2025 నాటికి క్షయవ్యాధిని తొలగించడానికి భారతదేశం ఎలా నిశ్చయించుకుంటుందో ఆయన ఉదహరించారు.  ఇది 2030 గా నిర్ణయించుకున్న ప్రపంచ స్థాయి లక్ష్యం కంటే 5 సంవత్సరాలు ముందుంది.

టీకాలు వేయడంలో వార్షిక పెరుగుదల నాలుగు రెట్లు పెరిగిన మిషన్ ఇంద్ర ధనుష్ గురించి కూడా ఆయన మాట్లాడారు.

50 మందికి పైగా వివిధ అనుబంధ మరియు ఆరోగ్య నిపుణుల విద్యను విస్తరించడానికి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి చెప్పారు.  ఇది దేశంలో పారామెడికల్ సిబ్బంది కొరతను పరిష్కరిస్తుంది.

టెలి-మెడిసిన్ లో ఎలా పురోగతి సాధించాలి, ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా ఆరోగ్య రంగంలో ఎలా లాభాలు పొందాలి మరియు ఆరోగ్య సంరక్షణలో ఐటి సంబంధిత సేవలను ఎలా తీసుకురావాలి, అనే మూడు అంశాలపై చర్చించి, ఆదర్శంగా ఉండాలని ఆయన సభను కోరారు; 

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పి.పి.ఈ. లు మరియు ఎన్-95 మాస్క్‌ ల ఉత్పత్తిని ప్రారంభించిన మొదటి దశలోనే లాభాలు ఆర్జించిన  దేశీయ తయారీదారులను ఆయన అభినందించారు. వారు ఇప్పటికే ఒక కోటి పి.పి.ఈ. లను మరియు 1.5 కోట్ల మాస్క్ ‌లను సరఫరా చేసినందుకు ఆయన ప్రశంసించారు.

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఆరోగ్య సేతు యాప్ ఉపయోగపడుతున్న తీరును ప్రధానమంత్రి ప్రశంసించారు.

***



(Release ID: 1628322) Visitor Counter : 306