PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 27 MAY 2020 6:15PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 నుంచి కోలుకున్నవారి శాతం క్రమేణా మెరుగుపడి 42.4కి చేరింది; ఈ మేరకు వ్యాధి నయమైన/కోలుకున్నవారి సంఖ్య 64,426గా నమోదైంది.
  • దేశంలో కోవిడ్‌-19 నిర్ధారిత కేసుల సంఖ్య 1,51,767కు చేరింది.
  • నిన్న దేశవ్యాప్తంగా 1,16,041 కోవిడ్‌-19 నమూనాల పరీక్ష.
  • దిగ్బంధం విధింపుతో వ్యాధి వ్యాప్తి వేగం తగ్గడంసహా దేశానికి పలురకాల ప్రయోజనాలు.
  • ఆరోగ్య సేతు ఆండ్రాయిడ్‌ వర్షన్‌ ఇకపై ఓపెన్‌ సోర్స్‌.

 

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; కోలుకునేవారి శాతం మెరుగై 42.4కు చేరిక; నిన్న 1,16,041 నమూనాల పరీక్ష

దేశంలో దిగ్బంధం విధింపువల్ల అనేక ప్రయోజనాలు సిద్ధించగా... వాటిలో ప్రధానమైనది కోవిడ్‌ వ్యాధి వ్యాప్తి వేగం గణనీయంగా తగ్గడం. అదే సమయంలో కోవిడ్‌-19 సంబంధిత ప్రత్యేక ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి వీలు కలిగింది; అంతేగాక మానవ వనరుల సామర్థ్య వికాసం; పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెరుగుదల; అత్యవసర సరఫరాలు, పరికరాలు, ఆక్సిజన్‌ అందుబాటులో మెరుగుదల; సముచిత మార్గదర్శకాల జారీ, ప్రమాణాల నిర్ధారణ, సమాచార వ్యాప్తిసహా అనుసరణ, భాగస్వామ్యం; రోగనిర్ధారణ సదుపాయాల అభివృద్ధి, ఔషధ ప్రయోగాలు, టీకాపై పరిశోధన వంటివి మరికొన్ని కీలక ప్రయోజనాలు. ఇక సాంకేతికతపరంగా నిఘా వ్యవస్థలు బలోపేతమై వ్యాధి పీడితుల సంబంధాన్వేషణ, ఇంటింటి సర్వేసహా ఆరోగ్యసేతు యాప్‌ వంటి ఉపకరణాల అభివృద్ధి తదితర ప్రయోజనాలు కూడా సమకూరాయి.

   దేశవ్యాప్తంగా ప్రస్తుతం 435 ప్రభుత్వ, 189 ప్రైవేటు (మొత్తం 624) ప్రయోగశాలలద్వారా నమూనాల పరీక్ష సామర్థ్యం ఇనుమడించింది. ఆ మేరకు రెండురంగాల్లోని ప్రయోగశాలల్లో ఇప్పటిదాకా 32,42,160 కోవిడ్‌-19 నమూనాలను పరీక్షించగా, నిన్న ఒక్కరోజే 1,16,041 నమూనాల పరీక్ష సాగింది. దేశంలో ఇప్పటిదాకా కోవిడ్‌-19 రోగుల సంఖ్య 1,51,767కు చేరగా, వారిలో కోలుకున్నవారి సంఖ్య 64,426గా నమోదు కావడంతో నయమయ్యేవారి శాతం మెరుగుపడి నేడు 42.4కు చేరింది. అలాగే ప్రపంచంలో మరణాల శాతం 6.36 కాగా, మన దేశంలో క్రమేణా తగ్గుముఖం పడుతూ 2.86 శాతానికి దిగివచ్చింది.

ఇక కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో, ఆ త‌ర్వాత పునరుత్పత్తి, ప్రసూతి, నవజాత, పిల్లలు-కౌమార బాలల ఆరోగ్యంస‌హా పోషకాహార సేవలు అందించడంపై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్గదర్శక ప్ర‌క‌ట‌న జారీచేసింది.

 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627267

ఆరోగ్య సేతు ఇకపై ఓపెన్‌ సోర్స్‌

కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణ కృషిని ముమ్మరం చేయడంలో తోడ్పడేందుకు బ్లూటూత్‌ ఆధారితంగా ఈ మహమ్మారి సమాచార విస్తృతి, వ్యాధివ్యాప్తి అధికంకాగల ప్రాంతాల గుర్తింపు, రోగుల మధ్య సంబంధాల అన్వేషణ లక్ష్యంగా ‘ఆరోగ్య సేతు’ మొబైల్‌ యాప్‌ను 2020 ఏప్రిల్‌ 2వ తేదీన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రపంచంలోని ఇదేతరహా సంబంధాన్వేషణ యాప్‌ల వినియోగంతో పోలిస్తే మే 26వ తేదీనాటికి మన దేశంలో ఆరోగ్య సేతు యాప్‌ను 114 మిలియన్లకుపైగా ప్రజలు వినియోగిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్‌, ఐవోఎస్, కేఏఐవోఎస్ వేదికలపై మొత్తం 12 భాషలలో ప్రజలకు అందుబాటులో ఉంది. పారదర్శకత, గోప్యత, భద్రతలే ఆరోగ్య సేతు యాప్‌ మూలస్తంభాలు. ఈ నేపథ్యంలో భారత్‌ అనుసరిస్తున్న ఓపెన్‌సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ విధానానికి అనుగుణంగా ఆరోగ్యసేతు సోర్స్‌ కోడ్‌ను ప్రభుత్వం ఇప్పుడు ఓపెన్‌ సోర్స్‌గా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఇకపై ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో ఈ యాప్‌పై సమీక్ష, సహకారాలకు వీలుంటుంది. అలాగే ఐవోఎస్‌ వెర్షన్‌లోనూ ఓపెన్‌సోర్స్‌ మరో రెండు వారాల్లో లభ్యంకానుంది. అటుపైన సర్వర్‌ కోడ్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627140

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఖతర్‌ పాలకుడు గౌరవనీయ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌-థానీ మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ- ఖతర్‌ పాలకుడు గౌరవనీయ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌-థానీతో టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా ఆయనతోపాటు ఖతర్‌ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల నడుమ ఖతర్‌లోని భారతీయుల సంక్షేమంపై వ్యక్తిగత శ్రద్ధ చూపినందుకుగాను దేశాధినేతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఖతర్‌లో భారతీయులు... ప్రత్యేకించి ఆరోగ్యరంగంలోని కార్యకర్తలు ప్రశంసనీయ సేవలు అందిస్తున్నారని ఖతర్‌ అధినేత కూడా కొనియాడారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627094

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు గౌరవనీయ అబ్దెల్‌ ఫతా అల్‌-సిసి మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ- ఈజిప్టు అధ్యక్షుడు గౌరవనీయ  అబ్దెల్‌ ఫతా అల్‌-సిసితో టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా ఆయనతోపాటు ఈజిప్టు ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై ఈజిప్టు అధ్యక్షుడు స్పందిస్తూ... ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన భారత్‌-ఈజిప్టు దేశాల నాగరకరతలను ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వేగంగా విస్తరిస్తున్నాయంటూ హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో ఈజిప్టులోని భారతీయుల భద్రత, సంక్షేమాలపై అధికారవర్గాలు సంపూర్ణ శ్రద్ధవహించి వారికి మద్దతుగా నిలిచినందుకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఈజిప్టులో తన పర్యటన కార్యక్రమం కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా వాయిదాపడటాన్ని ప్రస్తావిస్తూ- పరిస్థితులు సహకరిస్తే వీలైనంత త్వరగా అధ్యక్షుడు సిసితో భేటీకోసం ఎదురుచూస్తున్నానని ప్రధాని మోదీ చెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627190

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గణతంత్ర ఆస్ట్రియా అధ్యక్షుడు గౌరవనీయ (డాక్టర్) అలెగ్జాండర్‌ వాన్‌డెర్‌ బెలెన్‌ మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ- గణతంత్ర ఆస్ట్రియా అధ్యక్షుడు గౌరవనీయ (డాక్టర్) అలెగ్జాండర్‌ వాన్‌డెర్‌ బెలెన్‌తో టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. కోవిడ్‌-19 సృష్టించిన ఆరోగ్య, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనడంలో తమ దేశాల్లో అనుసరించిన విధానాలపై దేశాధినేతలిద్దరూ పరస్పరం అభిప్రాయాలు వెల్లడించుకున్నారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనడంలో అంతర్జాతీయ సహకారానికిగల ప్రాముఖ్యాన్ని వారిద్దరూ అంగీకరించారు. కోవిడ్‌ మహమ్మారి అనంతరం ప్రపంచంలో భారత్‌-ఆస్ట్రియాల సంబంధాల వైవిధ్యీకరణతోపాటు బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్షను అధినేతలిద్దరూ పునరుద్ఘాటించారు. మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన-ఆవిష్కరణ, ఎస్‌ఎంఈ తదితర రంగాల్లో సహకార విస్తృతికిగల అవకాశాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627197

ఈశాన్య భారత రాష్ట్రాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక విద్యాసదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: హెచ్‌ఆర్‌డి మంత్రి

సిక్కింలోని యాంగ్‌యాంగ్‌లో రూ.986.47 కోట్ల వ్యయంతో సిక్కిం (కేంద్రీయ) విశ్వవిద్యాలయ శాశ్వత ప్రాంగణం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరుచేసింది. ఇందుకోసం సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల విలువైన 300 ఎకరాల భూమిని కేటాయించడమేగాక ఇప్పటికే 265.94 ఎకరాలను విశ్వవిద్యాలయానికి స్వాధీనం చేసింది. ఇక అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్‌, ఢిల్లీ, పుదుచ్చేరిలలో రూ.4371.90 కోట్ల సవరించిన అంచనా వ్యయంతో ఆరు కొత్త ఎన్‌ఐటీల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అనుమతులిచ్చిందని మంత్రి గుర్తుచేశారు. ఇవి 2022 మార్చి 31 నుంచి తమతమ శాశ్వత ప్రాంగణాల్లో పూర్తిస్థాయిన పనిచేయడం ప్రారంభిస్తాయని వెల్లడించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627095

జమ్ముకశ్మీర్‌లో కోవిడ్‌-19 పరిస్థితిపై కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ సమీక్ష

జమ్ముకశ్మీర్‌లో కోవిడ్‌-19 వ్యాప్తి ప్రస్తుత స్థితిగతులపై కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇప్పటిదాకా ఇతర ప్రాంతాల్లోఉన్నవారు ఈ కేంద్రపాలిత ప్రాంతానికి తిరిగివస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మంత్రి సమీక్షించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627265

కోవిడ్‌-19పై పోరు దిశగా ఆరోగ్య సంరక్షణలో పరిశోధన-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్న ‘సిపెట్‌’; డబ్ల్యూహెచ్‌వో/ఐఎస్‌వో మార్గదర్శకాల మేరకు పీపీఈలు, సంబంధిత ఉత్పత్తుల తయారీ-ధ్రువీకరణ

కోవిడ్‌-19పై పోరు దిశగా కేంద్ర రసాయనాలు-ఎరువుల మంత్రిత్వశాఖ పరిధిలోని అత్యున్నత జాతీయ సంస్థ ‘సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ-సిపెట్‌’ (CIPET) తనవంతు కృషికి సిద్ధమైంది. ఈ మేరకు ఆరోగ్య సంరక్షణ రంగంలో పరిశోధన-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO)/అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ(ISO)ల మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యక్తిగత రక్షణ సామగ్రి, సంబంధిత ఇతర ఉత్పత్తుల తయారీ-ధ్రువీకరణ బాధ్యతలను చేపడుతుంది. కాగా, కరోనా వైరస్‌పై పోరులో భాగంగా మురుత్తల్‌, జైపూర్‌, మదురై, లక్నోలలోని ‘సిపెట్‌’ కేంద్రాలు ఇప్పటికే వ్యక్తిగత రక్షణ సామగ్రి-ముఖ కవచాలను రూపొందించాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627193

కోవిడ్‌-19 రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బందికి మధ్యాహ్న భోజనం సరఫరా చేయనున్న పీఎఫ్‌సీ

కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్ర విద్యుత్‌ శాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మరొక ముందడుగు వేసింది. ఈ మేరకు కోవిడ్‌-19పై పోరులో ముందువరుసలోగల కరోనా యోధులకు పరిశుభ్ర, పౌష్టికాహార సరఫరా కోసం ఆసియాలోనే అతిపెద్ద ఆహార కంపెనీల సమూహమైన ‘తాజ్‌ శాట్స్‌’తో అనుసంధానం చేసుకుంది. ఈ భాగస్వామ్యంకింద న్యూఢిల్లీలోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో కోవిడ్‌-19 రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, ఇతర ఆరోగ్య, వైద్య సిబ్బందికి మధ్యాహ్న భోజనం బాక్సులను పీఎఫ్‌సీ అందజేస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627264

బహుళ ప్రాచుర్యం పొందిన ‘కోవిడ్‌ కథ’ను హిందీలో విడుదల చేసిన ఎన్‌సీఎస్‌టీసీ

కోవిడ్‌-19పై ప్ర‌జ‌ల‌కు విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ల‌క్ష్యంగా  ఈ మ‌హ‌మ్మారి సంబంధిత ముఖ్య‌మైన స‌మాచారంతో “కోవిడ్ క‌థ‌” పేరిట బ‌హుళ ప్రాచుర్యం పొందిన మ‌ల్టీమీడియా క‌ర‌దీపికను కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ ప‌రిధిలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (NCSTC) హిందీలో రూపొందించి విడుద‌ల చేసింది. ఈ క‌ర‌దీపిక ఆంగ్ల భాషా ప్ర‌తిని ఈ నెలారంభంలోనే ఆవిష్క‌రించారు. ఈ నేపథ్యంలో దీని హిందీ ప్రతి కోసం హిందీ భాషాధిక్యంగల ప్రాంతాల నుంచి డిమాండ్‌ అధికంగా ఉండటంతో ‘కోవిడ్‌ కథ’ను మరికాస్త సవరించి ఆ పాఠకుల ప్రయోజనార్థం మరింత సమాచారంతో తీసుకొచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627261

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని కోవిడ్‌-19 నియంత్రణ జోన్లలో విధులు నిర్వర్తించే నగరపాలక, పోలీసు, ఆరోగ్యాధికారులుసహా ప్రభుత్వ సిబ్బంది అందరూ సముచిత వ్యక్తిగత రక్షణ సామగ్రిని తప్పక వాడాలని పాలనాధికారి ఆదేశాలిచ్చారు. అలాగే నియంత్రణ జోన్లలో నిత్యావసర వస్తువుల సరఫరాలో కొరతలేకుండా చూడాలని డిప్యూటీ కమిషనరును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు దాతలతోపాటు ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు కూడా పాలుపంచుకోవాలని కోరారు. నియంత్రణ జోన్లలో నిత్యం రోగకారకాల నిర్మూలన, పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌తోపాటు నగరపాలక సంస్థకు ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా నమూనాల సేకరణ కేంద్రాలవద్ద వ్యర్థాలను... ప్రత్యేకించి వైద్యవ్యర్థాలను సవ్యంగా తొలగించి, విసర్జించేలా చూడాలని సూచించారు. కాగా, శ్రామిక్‌ స్పెషల్‌ రైలులో ఉత్తరప్రదేశ్‌ వెళ్లడం కోసం ఇవాళ ఒక గర్భవతి తన భర్త, బిడ్డతో సహాయకేంద్రానికి వచ్చింది. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, రైల్వేస్టేషన్‌కు పంపగా, అక్కడ ఆమెకు ప్రసవ వేదన మొదలైంది. దీంతో ఆమెను అంబులెన్స్‌ద్వారా జీఎంసీహెచ్‌-32కు తరలించారు. అయితే, నొప్పులు తీవ్రంకావడంతో సమీపంలోని మణిమజ్రాలోగల ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె మగబిడ్డను ప్రసవించింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
  • పంజాబ్: విమాన, రైలు, రోడ్డు మార్గాల్లో రాష్ట్ర్రానికి వచ్చే దేశ/విదేశీ ప్రయాణికులందరికీ వర్తించేలా ఏకీకృత, సమగ్ర మార్గదర్శకాలను పంజాబ్‌ ప్రభుత్వం జారీచేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ముమ్మర నిర్ధారణ పరీక్షలు, సంబంధాన్వేషణ, ఏకాంతీకరణలే ఏకైక మార్గమని ఈ మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇక సాధారణ నిఘాలో భాగంగా దేశీయ ప్రయాణికులను యాదృచ్ఛిక ప్రాతిపదికన పరీక్షించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అమృత్‌సర్‌, మొహాలీ విమానాశ్రయాల్లో కొందరు దేశీయ ప్రయాణికులను యాదృచ్ఛిక ప్రాతిపదికన పరీక్షించారు.
  • హర్యానా: రాష్ట్రంలో కోవిడ్‌-19 నిరోధం, నియంత్రణలో దిగ్బంధం నిబంధనలకు ప్రజల మద్దతు, వాటిని పాటించడంలో చూపిన సహనం, రాష్ట్ర ప్రభుత్వ సమర్థ చర్యలు ఎంతగానో తోడ్పడినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
  • హిమాచల్ ప్రదేశ్: కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాష్ట్రంలో 2020 మార్చి 24 నుంచి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 144 కింద 2020 జూన్ 30 వరకు దీన్ని కొనసాగించాలని 2020 మే 23నాటి మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. అయితే, ఇలా పొడిగించడంపై నిర్ణయాధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ తీర్మానించింది.
  • కేరళ: రాష్ట్రంలో వివిధ వర్గాల విస్తృత నిరసన నేపథ్యంలో చెల్లింపు సంస్థాగత నిర్బంధవైద్య పర్యవేక్షణ సంబంధిత నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. కాగా, దిగ్బంధం నిబంధనల సడలింపును ప్రజలు విస్తృతంగా దుర్వినియోగం చేస్తున్నారని రాష్ట్ర మంత్రిమండలి తేల్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం 415 కేసులుండగా నిన్న ఒకేరోజు 67సహా గడచిన నాలుగు రోజుల్లో మొత్తం 231 నమోదయ్యాయి. వీరిలో 133 మంది విదేశాల నుంచి, 178 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు. ఇక విదేశాల నుంచి తిరిగివచ్చేందుకు నమోదు చేసుకున్న 1.35 లక్షల మందిలో ఇప్పటిదాకా 11,189 మంది మాత్రమే రాష్ట్రానికి చేరుకున్నారు.
  • తమిళనాడు: రాష్ట్రంలో దాదాపు రూ.15,128కోట్ల విలువైన పెట్టుబడులపై 17అవగాహన ఒప్పందాలపై సంతకాలు పూర్తయిన నేపథ్యంలో వీటిద్వారా 47,150 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. కాగా, చెన్నైలోని బిల్‌రోత్ హాస్పిటల్స్ లిమిటెడ్‌ భవనంలో ఎగువనగల నాలుగు అంతస్తులను కోవిడ్-19 రోగుల చికిత్స కోసం ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆ భవనంలో అనుమతుల్లేకుండా నిర్మించిన  ఎనిమిది అంతస్తుల సముదాయంలోని తొలి ఐదు అంతస్తులను కూల్చివేయాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది. తిరుచ్చి సెంట్రల్ జైలులో ఒక ఖైదీకి కోవిడ్‌-19 నిర్ధారణ అయింది; దీంతో అదే బ్లాక్‌లోగల మరో 28 మంది ఖైదీలను అధికారులు వేరుగా ఉంచారు. రాష్ట్రంలో నిన్నటిదాకా మొత్తం కేసులు: 17,728, యాక్టివ్ కేసులు: 8,256, మరణాలు: 127, డిశ్చార్జ్: 9342. చెన్నైలో యాక్టివ్ కేసులు 6056గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు 122 కొత్త కేసులు రాగా, ఒకరు మరణించారు... మరో 14మంది ఆస్పత్రుల నుంచి విడుదలయ్యారు. కొత్త కేసులలో కల్బుర్గి 28, యాదగిరి 16, హసన్ 15, బీదర్ 12, దక్షిణ కన్నడ 11, ఉడిపి 9, ఉత్తర కన్నడ 6, రాయచూర్ 5, బెళగావి 4, చిక్కమగళూరు 3, విజయపుర 2; మాండ్యా, తుమ్కూర్, బళ్లారిలలో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 2405కి చేరగా, వీటిలో క్రియాశీల కేసులు: 1596, కోలుకున్నవి: 762, మరణాలు: 45గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో దిగ్బంధం నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా నియంత్రణ జోన్లుమినహా మిగిలిన ప్రాంతాల్లో ఆహారశాలలు, వస్త్ర, ఆభరణాల దుకాణాలను తిరిగి తెరవడానికి ఆంధ్ర్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 68 కొత్త కేసులు నమోదవగా, 9664 నమూనాల పరీక్ష తర్వాత గడచిన 24 గంటల్లో 10మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో ఇవాళ ఒక మరణం నమోదవగా, ప్రస్తుతం మొత్తం కేసులు: 2787. యాక్టివ్: 816, రికవరీ: 1913, మరణాలు: 58. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 219 కేసులుండగా వీటిలో 75 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక విదేశాల నుంచి వచ్చినవారిలో కేసుల సంఖ్య 111గా నమోదైంది.
  • తెలంగాణ: మిడుతల దండు దాడి నేపథ్యంలో మహారాష్ట్రతో తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. సామాజిక నిర్లక్ష్యం ఫలితంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ మేరకు మే 27నాటికి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1991 కాగా, నిన్నటివరకూ వలసదారులలో సుమారు 172 మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో 42 మందికి రోగ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో 2,091 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 54,758కి చేరింది. వీటిలో 36,004 యాక్టివ్‌ కేసులున్నాయి. హాట్‌స్పాట్ ముంబైలో 1,002 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 32,791కి చేరింది. మహారాష్ట్రలో 72 ప్రయోగశాలల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో 27 కొత్త ప్రయోగశాలలు అందుబాటులోకి రానున్నాయి. కాగా రాష్ట్రంలో కోవిడ్ కేసుల రెట్టింపు వ్యవధి 14 రోజులకు పెరగ్గా, మరణాల శాతం 3.27కు తగ్గింది.
  • గుజరాత్: రాష్ట్రంలోని 19 జిల్లాలనుంచి 361 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 14,829కి చేరింది. వీటిలో 6,777 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 144 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 7680కి చేరగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 4341గా నమోదైంది. ఇక నేటిదాకా 172 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 సీరో-సర్వే నిర్వహించే ఐసీఎంఆర్‌ నగరాల జాబితాలో జైపూర్ కూడా చేరింది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 165 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7,024కు చేరింది. వీటిలో 3030 యాక్టివ్‌ కేసులుకాగా, హాట్‌స్పాట్ ఇండోర్‌లో నేటిదాకా నిర్ధారిత కేసుల సంఖ్య 3103గా నమోదైంది. దిగ్బంధం నిబంధనలు భిన్నరకాలుగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ భోపాల్‌లో దుకాణాలు, వ్యాపార సంస్థలు పునఃప్రారంభమయ్యాయి. కాగా, ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటలదాకా దుకాణాలను తెరిచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో 50 కొత్త కేసుల నమోదుతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 271కి చేరింది. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి నిరోధం దిశగా ప్రభుత్వం 13 డెవలప్‌మెంట్ బ్లాక్‌లను రెడ్ జోన్‌గా, 39ని ఆరెంజ్ జోన్‌గా ప్రకటించింది. ఇవేకాకుండా ఇప్పటికే కోవిడ్‌-19 కేసులు బయల్పడిన మరో 95 ప్రాంతాలు ఇప్పటికే నియంత్రణ జోన్లుగా ప్రకటించబడ్డాయి.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో మే, జూన్ నెలల్లో పంపిణీ కోసం 313.956 టన్నుల పప్పుదినుసులను నాఫెడ్ అరుణాచల్ ప్రదేశ్‌కు సరఫరా చేసింది.
  • అసోం: రాష్ట్రంలో కోవిడ్‌-19 రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సోనాపూర్ జిల్లా ఆస్పత్రి 108 పడకలతో అందుబాటులోకి వచ్చిందని అసోం ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. కాగా, రాష్ట్రంలో 18 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 704కు చేరింది. ఇందులో యాక్టివ్‌ 635, కోలుకున్నవారు 62, మరణాలు 4 వంతున నమోదైనట్లు ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా పేర్కొన్నారు.
  • మణిపూర్: కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దుర్బలవర్గాలకు తోడ్పాటు దిశగా ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం, ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ పథకం, ఇందిరా గాంధీ జాతీయ దివ్యాంగ పెన్షన్ పథకం లబ్ధిదారులకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్‌ యోజనకింద ప్రభుత్వం రూ.500 వంతున పంపిణీ చేసేందుకు నిధులు విడుదల చేసింది.
  • మిజోరం: రాష్ట్రంలో హెచ్ఎస్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, హెచ్ఎస్ఎల్సీ (కంపార్ట్‌మెంటల్‌)-2020 పరీక్షలను జూన్ 16నుంచి 11 కేంద్రాల్లో తిరిగి నిర్వహించాలని మిజోరం బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది.
  • నాగాలాండ్: ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న రాష్ట్ర పౌరులను వెనక్కు తీసుకురావడం కోసం నాగాలాండ్‌ ప్రభుత్వం గోవా, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, రాజస్థాన్‌ల నుంచి ‘శ్రామిక్‌ స్పెషల్‌’ ప్రత్యేక రైళ్లను;  పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, పంజాబ్, డామన్-డయ్యూ, లక్నోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. కాగా, కోవిడ్‌-19 ప్రత్యేక ఉద్యాన కార్యక్రమ బృందం దిగ్బంధం సమయంలో “అధిక సాగు... అధికోత్పత్తి... అధికార్జన” ఇతివృత్తంగా వ్యవసాయ-ఉద్యాన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

 

PIB FACT CHECK

 

*****



(Release ID: 1627279) Visitor Counter : 318