మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, సదుపాయాల కల్పనకు కేంద్రం కట్టుబడి ఉంది: మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌

సిక్కిం కేంద్ర విశ్వవిద్యాలయం శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటుకు రూ.986.47 కోట్లు: రమేశ్‌ పోఖ్రియాల్‌
ఆరు ఎన్‌ఐటీల శాశ్వత క్యాంపస్‌ల కోసం రూ.4371.90 నిధుల విడుదలకు కేంద్రం సమ్మతి

Posted On: 26 MAY 2020 6:43PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు  కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ చెప్పారు. ఈ ఏడాది కేంద్రం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. యాంగ్యాంగ్‌లో సిక్కిం విశ్వవిద్యాలయానికి ( కేంద్ర విశ్వవిద్యాలయం) శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఇందుకు రూ.986.47 కోట్లు ఖర్చవుతుందన్నారు. విశ్వవిద్యాలయం కోసం సిక్కిం ప్రభుత్వం 15 కోట్ల రూపాయల విలువైన 300 ఎకరాలను కేటాయించిందని, ఇందులో 265.94 ఎకరాలను ఇప్పటికే విశ్వవిద్యాలయానికి అప్పగించిందన్నారు. మిగిలిన భూమిని అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. 

    అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్‌, దిల్లీ, పుదుచ్చేరిలో 6 ఎన్‌ఐటీల శాశ్వత క్యాంపస్‌ల కోసం, రూ.4371.90 ఖర్చుతో సవరించిన వ్యయ అంచనాలకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపిందని మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు. ఈ నిధులతో, ఈ ఆరు ఎన్‌ఐటీలు, 2022 మార్చి 31 నాటికి వాటి శాశ్వత క్యాంపస్‌ల నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు చేపడతాయన్నారు. ఈ క్యాంపస్‌లలో 6,320 మంది విద్యార్థులు చదువుతారని మంత్రి తెలిపారు.



(Release ID: 1627095) Visitor Counter : 235