PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 02 NOV 2020 5:52PM by PIB Hyderabad

  • కోలుకున్న 75 లక్షలకుపైగా కేసులతో ప్రపంచంలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్న భారత్‌
  • గడచిన రెండు నెలలుగా మొత్తం కేసులకుగాను చురుకైన కేసుల శాతంలో 3 రెట్లకుపైగా తగ్గుదల
  • మొత్తం 11 కోట్లకుపైగా నమూనాల పరీక్ష మైలురాయిని అధిగమించిన భారత్‌
  • కోలుకునేవారి జాతీయ సగటు 91.68 శాతానికి చేరిక.
  • దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో నిర్ధారిత కేసులు 45,321 కాగా, కోలుకున్నవారి సంఖ్య 53,285గా నమోదు
  • జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీలో కోవిడ్‌-19 పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సమీక్ష

#Unite2FightCorona

#IndiaFightsCorona

Image

Image

Image

కోలుకున్న 75 లక్షలకుపైగా కేసులతో ప్రపంచంలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్న భారత్; గత 2నెలలుగా చురుకైన కేసుల శాతంలో 3 రెట్లకుపైగా తగ్గుదల; మొత్తం 11 కోట్లకుపైగా నమూనాల పరీక్ష మైలురాయిని అధిగమించిన భారత్

కోవిడ్‌నుంచి కోలుకున్నవారి సంఖ్యరీత్యా భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మేరకు ఇప్పటిదాకా మహమ్మారినుంచి బయటపడినవారి సంఖ్య ఇవాళ 75 లక్షలు (75,44,798) దాటింది. కాగా, గత 24 గంటల్లో 53,285 మంది కోలుకున్నారు. మరోవైపు చికిత్స పొందేవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 5,61,908గా ఉంది. అంటే- దేశంలో నమోదైన మొత్తం కేసులకుగాను ఆస్పత్రులలో ఉన్నది 6.83 శాతం మాత్రమే. సెప్టెంబరు 3న చికిత్సపొందేవారి శాతం 21.16 కాగా కేవలం రెండు నెలల వ్యవధిలో 3 రెట్లకుపైగా తగ్గిపోవడం విశేషం. ఇక దేశంలో 2020 జనవరి నుంచి కోవిడ్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతూ రావడంతో బాధితుల సత్వర గుర్తింపు, సకాలంలో చికిత్స సాధ్యమైంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నిర్వహించిన పరీక్షల సంఖ్య ఇప్పటిదాకా 11 కోట్ల మైలురాయిని (11,07,43,103) దాటింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో దేశంలో ప్రయోగశాలల సంఖ్య భారీగా పెరిగి 2037కు చేరింది. మరోవైపు కోలుకునేవారి సంఖ్య అధికంగా ఉండటంతో కోలుకునేవారి జాతీయ సగటు నేడు 91.68 శాతానికి చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోలుకున్నవారిలో 78 శాతం 10 రాష్టాలకు చెందినవారు కాగా- కేరళ, కర్ణాటకలలో అత్యధికంగా 8 వేలమందికిపైగా ఉన్నారు. అటుపైన 4,000కుపైగా కోలుకున్న కేసులతో ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  గత 24 గంటలలో 45,321 మందికి కోవిడ్‌ సోకినట్లు నిర్థారణ కాగా, వీరిలో 80 శాతం పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని వారే. వీటిలో 7,025 కేసులతో కేరళ అగ్రస్థానంలో ఉండగా చెరో 5వేలకుపైగా కేసులతో ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 496  మరణాలు నమోదవగా వీటిలో 82 శాతం కేవలం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సంభవించాయి. నిన్నటి మరణాలలో 22 శాతం (113)  ఒక్క మహారాష్ట్రలో నమోదవగా 59 మరణాలతో పశ్చిమబెంగాల్ రెండో స్థానంలో ఉంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669451

జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీలో కోవిడ్-19 పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సమీక్ష

ఢిల్లీలో కోవిడ్-19 పరిస్థితిపై ఇవాళ కేంద్ర హోంశాఖ కార్యదర్శి శ్రీ అజయ్ భల్లా సమీక్షించారు. ఈ సందర్భంగా జాతీయ రాజధాని ప్రాంతంలో కోవిడ్‌-19 ప్రస్తుత పరిస్థితులపై GNCTD ఒక ప్రదర్శన ఇవ్వగా- కోవిడ్‌ కేసుల 3వ దశ పెరుగుదలను ఇది వివరించింది. కొత్త కేసులతోపాటు చురుకైన కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, పరిచయాల అన్వేషణ, చికిత్స ప్రక్రియలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది. కాగా, ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య పెరగడానికి పండుగ సీజన్ కారణంగా కనిపిస్తోంది. మరోవైపు కోవిడ్‌ రోగులకు ఉద్దేశించిన 15,789 పడకలలో 57శాతం ఖాళీగా ఉండటం ఒక సానుకూల అంశగా నివేదించబడింది. ఈ సందర్భంగా హోంశాఖ కార్యదర్శి మాట్లాడుతూ- ఢిల్లీలో కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధకం వ్యూహాలను కఠినంగా అమలు చేయాలని పునరుద్ఘాటించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669618

ఆయుష్‌ రంగాన్ని భవిష్యత్‌ అవసరాల మేరకు  సిద్ధం చేయడంలో ఆయుష్‌ మంత్రిత్వశాఖ చేపట్టిన చర్యల్లో ఒకటి… వ్యూహాత్మక విధాన విభాగం

“వ్యూహాత్మక విధాన-సౌలభ్య సంస్థ” ‍(ఎస్‌పీఎఫ్‌బీ) పేరిట వ్యూహాత్మక విధాన విభాగం ఏర్పాటు దిశగా కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ, ఇన్వెస్ట్‌ ఇండియా సంస్థలు జట్టుకట్టాయి. ఈ మేరకు ప్రణాళికాబద్ధ, వ్యవస్థీకృత పద్ధతుల్లో  ఆయుష్‌ రంగం ప్రగతి లక్ష్యంగా దీనికి రూపుదిద్దుతున్నాయి. ఆయుష్‌ రంగంలో పెట్టుబడి సంస్థలను ముందుకు తీసుకెళ్లగలిగే భవిష్యత్‌ నిర్ణయాల దిశగా ఆయుష్‌ మంత్రిత్వశాఖ చేపట్టిన చర్యల్లో ఇదొకటి. ఆయుష్‌ రంగ పెట్టుబడిదారులకు ఈ కేంద్రం సహాయకారిగా మారుతుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669344

కోవిడ్-19పై ప్రజా ఉద్యమంతో ఆయుష్ రంగంలో సానుకూల ప్రభావాలు

కోవిడ్-19పై చేపట్టిన ప్రజా ఉద్యమంలో వేలాదిగా ఆయుష్ నిపుణులు భాగస్వాములైన నేపథ్యంలో సంప్రదాయ వైద్యవిధానాలవైపు ప్రజల దృష్టి గణనీయంగా మళ్లింది. ఆయుష్ డిస్పెన్సరీలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, సంరక్షణ కేంద్రాలుసహా ఇతర విభాగాలకూ ఈ ఉద్యమం విస్తరించింది. ఆయుష్ నిపుణులు క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలిసి పనిచేస్తారు కాబట్టి, వారు ఈ అవగాహన ప్రచారంలో ప్రజల ప్రవర్తనను ప్రభావితం చేయడం ద్వారా ఉద్యమ విజయానికి మరింతగా దోహదపడుతున్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669196

సమీకృత ప్రాథమిక కోర్సు “ఆరంభ్‌” మలిదశలో భాగంగా శిక్షణలోగల సివిల్‌ సర్వీస్‌ అధికారులతో చర్చాగోష్ఠిలో సంభాషించిన ప్రధానమంత్రి

దేశంలో సివిల్‌ సర్వీసులకు ఎంపికై ముస్సోరీలోని ‘ఎల్‌బిఎస్‌ఎన్‌ఎ’లో శిక్షణ పొందుతున్న భారత సివిల్ సర్వీసెస్ అధికారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం గుజరాత్‌లోని కెవాడియా నుంచి దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. ఇది 2019లో తొలిసారి ప్రారంభించిన సమీకృత ప్రాథమిక కోర్సు “ఆరంభ్‌”లో ఇదొక భాగం. ఈ సందర్భంగా శిక్షణలోగల అధికారులు ఇచ్చిన ప్రదర్శలను ప్రధాని పరిశీలించారు. అనంతరం వారితో చర్చాగోష్ఠిలో మాట్లాడుతూ- “దేశ పౌరులకు సేవ చేయడం” అనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శాన్ని అనుసరించాలని వారిని కోరారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని, దేశ సమగ్రతను బలోపేతం చేయాలని శ్రీ మోదీ యువ అధికారులకు సూచించారు. పౌర సేవకుల నిర్ణయాలు తమ శాఖ పరిధిలో లేదా వారు పనిచేసే ప్రాంతానికి సంబంధించినవే అయినప్పటికీ అవి ఎల్లప్పుడూ సామాన్యుల ప్రయోజనాలు లక్ష్యంగానే ఉండాలని ఆకాక్షించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669100   

“ఆరంభ్‌-2020”లో సివిల్‌ సర్వీసెస్‌ ప్రొబేషనర్లతో ప్రధానమంత్రి చర్చాగోష్ఠి పూర్తి పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669285

అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరం-కెవడియాల మధ్య సముద్ర విమానం రాకపోకలకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం

కెవాడియాలో వాటర్ ఏరోడ్రోమ్‌తోపాటు అక్కడి ఐక్యతా విగ్రహాన్ని అనుసంధానించే సముద్ర విమాన సేవలను అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669102

గుజరాత్‌లోని కెవాడియాలో ఆరోగ్యవనం, ఆరోగ్య కుటీరం, ఐక్యతా మాల్, పిల్లల పౌష్టికాహార పార్కులకు ప్ర‌ధాన మంత్రి ప్రారంభోత్సవం

గుజరాత్‌లోని కెవాడియాలో సమీకృత అభివృద్ధి కార్యక్రమం కింద వివిధ ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యవనం, ఆరోగ్య కుటిరం, ఐక్యతా మాల్, పిల్లల పౌష్టికారహార పార్కులు తదితరాలున్నాయి. ఆరోగ్యవనంలో భాగంగా 17 ఎకరాల విస్తీర్ణంలో 380 జాతులకు చెందిన 5 లక్షల మొక్కలున్నాయి. కాగా, ఆరోగ్య కుటీరానికి శాంతిగిరి వెల్నెస్ సెంటర్ అనే సంప్రదాయ చికిత్స సౌకర్యం ఉండగా- ఇది ఆయుర్వేద, సిద్ధ, యోగా, పంచకర్మ తదితర పద్ధతుల్లో ఆరోగ్య సంరక్షణ సేవలందిస్తుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668863

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జూలాజికల్‌ పార్కును ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారంనాడు గుజరాత్‌లోని కెవాడియాలో నిర్మించిన సర్దార్‌ పటేల్‌ జూలాజికల్‌ పార్కుతోపాటు 'జియోడెసిక్ ఏవియరీ డోమ్‌'ను ప్రారంభించారు. అదేవిధంగా కెవాడియా సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన 17 ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేయడంసహా మరో 4 కొత్త పథకాలకు శంకుస్థాపన చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668956

ప్రజా సంక్షేమానికే ప్రభుత్వ పథకాలు; వీటి అమలు అత్యంత కీలకం: ఉప రాష్ట్రపతి

దేశంలోని సామాన్యుల అవసరాలకు తగినట్లు ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, క్రమబద్ధీకరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఐఐపీఏ 66వ వార్షిక సర్వసభ్య సమావేశానికి డిజిటల్‌ మాధ్యమంద్వారా అధ్యక్షత వహించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. సేవాప్రదానం, న్యాయప్రదానం, ప్రజా సమస్యలపై ప్రభుత్వ వ్యవస్థ స్పందిస్తున్న తీరు తదితరాల్లో మార్పులు తేవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ‘ఇలాంటి మార్పునే నేటి భారతం కోరుకుంటోంది’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో తమవంతు కృషిచేస్తూ- ప్రజా జీవనంలో మార్పు తెచ్చే దిశగా కృషి చేస్తున్న పౌర అధికారులు, వైద్యనిపుణులు, భద్రతా సిబ్బంది, ఉపాధ్యాయులుసహా వివిధరంగాల ప్రముఖుల సేవలను విస్మరించలేమని ఆయన కొనియాడారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669175

‘అత్యవసర క్రెడిట్ లైన్ హామీ’ పథకాన్ని నెలపాటు పొడిగించిన ప్రభుత్వం

‘అత్యవసర క్రెడిట్‌ లైన్‌ హామీ’ పథకాన్ని (ఇసిఎల్‌జిఎస్) కేంద్ర ప్రభుత్వం నెలపాటు… అంటే- 2020 నవంబర్ 30దాకా లేదా ఈ పథకం కింద రుణ మంజూరు మొత్తం రూ.3లక్షల కోట్లస్థాయికి చేరేదాకా ఏది ముందైతే ఆ తేదీవరకూ పొడిగించింది. ఈ పొడిగింపుతో  ఇప్పటిదాకా పథకం కింద లబ్ధిపొందని రుణగ్రహీతలకు అవకాశం అందుబాటులో ఉంటుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=16689449

విప్లవాత్మక ఈ-ఇన్వాయిస్‌ విధానానికి అక్టోబర్ 31తో ఒక నెల పూర్తి

దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన విప్లవాత్మక ‘ఈ-ఇన్వాయిస్’ విధానానికి అక్టోబరు 31తో ఒక నెల పూర్తయింది. వ్యాపారాల పరస్పర సమన్వయానికి ఈ విధానం ఎంతో ప్రయోజనకరం. కాగా,  కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి నెలలోనే తమ పోర్టల్‌లో 27,400 మంది పన్ను చెల్లింపుదారులు 495 లక్షలకు పైగా ‘ఈ-ఇన్‌వాయిస్‌’లను అప్‌లోడ్‌ చేసినట్లు ‘ఎన్ఐసి’ నివేదించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు, అంతకన్నా ఎక్కువ వార్షిక వ్యాపార పరిమాణంగల వ్యాపారాల కోసం జీఎస్టీ వ్యవస్థలో కీలకమైన ఈ విధానం 2020 అక్టోబర్ 1న ప్రవేశపెట్టబడింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669452

కోవిడ్ నేపథ్యంలో రోగనిరోధకత పెంపునిమిత్తం ప్రపంచమంతా యోగా, ఆయుర్వేదం, ప్రకృతివైద్యం తదితరాలపై దృష్టి సారించింది: డాక్టర్ జితేంద్ర సింగ్

కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో రోగ నిరోధకతను పెంచుకునే నిమిత్తం ప్రపంచమంతా యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం తదితరాలవైపు దృష్టి సారించింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రధాని కార్యాలయం, ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణువిద్యుత్, అంతరిక్ష శాఖల కేంద్ర సహాయమంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ వ్యాఖ్య చేశారు. అసోచామ్ నిర్వహించిన ‘ప్రపంచ ఆయుర్వేద మేళా’లో ప్రారంభోపన్యాసం సందర్భంగా ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. గత 4-5 నెలల్లో పాశ్చాత్య దేశాలు భారత్‌ అనుసరించే అత్యుత్తమ విధానాలలో ఒకటైన ప్రత్యామ్నాయ వైద్యంపై శ్రద్ధ చూపాయన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668955

వైద్యవిద్య సంస్కరణలలో కీలక చర్య; 2020 వార్షిక ఎంబీబీఎస్ ప్రవేశాలకు కనీస అర్హతలు ప్రకటించిన జాతీయ వైద్య కమిషన్

వైద్యవిద్య సులభ లభ్యత దిశగా జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్ఎంసి) తొలిసారిగా ప్రధాన నిబంధనలను ప్రకటించింది. ఈ మేరకు “2020 వార్షిక ఎంబీబీఎస్ ప్రవేశాలకు కనీస అర్హతలు” పేరిట జారీచేసిన ప్రకటనతో లోగడ “వైద్య కళాశాలలకు కనీస ప్రామాణిక నిబంధనలు” పేరిట భారత వైద్య మండలి (ఎంసీఐ) 1999లో విడుదల చేసిన ప్రకటన రద్దవుతుంది. తదనుగుణంగా కొత్తగా ఏర్పాటుకు ప్రతిపాదించిన అన్ని వైద్య కళాశాలలకూ ఈ కొత్త నియమావళి వర్తిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఏర్పాటై 2021-22 వార్షిక ప్రవేశాలకు ఎంబీబీఎస్ సీట్లు పెంచాలని భావిస్తున్న కళాశాలలకు కూడా ఇది వర్తిస్తుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669169

అక్టోబర్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1,05,155 కోట్లు

ఈ ఏడాది అక్టోబరులో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) స్థూల వసూళ్లు రూ.1,05,155 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.19,193 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.25,411 కోట్లు, కేంద్రీకృత జీఎస్టీ వ‌సూళ్లు (వస్తు‌ దిగుమతుల‌పై రాబట్టిన రూ.23,375 కోట్లుసహా) రూ.52,540 కోట్ల మేర ఉన్నాయి. మరోవైపు సెస్ రూపంలో వ‌సూలైన (వస్తు‌ దిగుమతులపై రాబట్టిన రూ.932 కోట్లుసహా) రాబడి రూ.8,011 కోట్లుగా న‌మోదైంది. నిరుడు ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ రాబడులు 10 శాతం అధికంగా నమోదవడం గమనార్హం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669315

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • మహారాష్ట్ర: ముంబై ప్రజల కోసం బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) పరిధిలోని 244 ప్రాంతాల్లో ఇవాళ్టినుంచి ఉచిత కోవిడ్‌-19 పరీక్ష సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలదాకా ఎవరైనా నేరుగా ఇక్కడ రోగనిర్ధారణ పరీక్ష చేయించుకోవచ్చు. ఈ కేంద్రాల్లో్ కొన్నిచోట్ల ఆర్టీ-పీసీఆర్, మరికొన్నిచోట్ల  యాంటిజెన్ ఆధారిత పరీక్ష సదుపాయం అందుబాటులో ఉంటుంది. మహారాష్ట్రలో ఆదివారం 5,633 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం రాష్ట్రంలో 1.25 లక్షలదాకా చురుకైన కేసులున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 90.24 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించారు.
  • గుజరాత్: రాష్ట్రంలో ఆదివారం 860 తాజా  కేసులు నమోదయ్యాయి. కాగా- శనివారం 935, శుక్రవారం 969 వంతున నమోదైన నేపథ్యంలో కొన్ని రోజులుగా కొత్త కేసులు తగ్గుతుండటాన్ని ఈ అంకెలు సూచిస్తున్నాయి. ఇక ఆదివారం నాటి కేసులలో 220 సూరత్‌ పరిధిలోనివి కాగా, వీటిలో 167 పట్టణ ప్రాంతాల్లో , 53 గ్రామీణ ప్రాంతాల్లో నమోదైనవి కావడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం కేసులు 1,73,804 కాగా, 5 తాజా మరణాలతో మృతుల సంఖ్య 3,724కు చేరగా, యాక్టివ్ కేసులు 12,833గా ఉన్నాయి.
  • రాజస్థాన్: కోవిడ్ మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో టపాకాయల అమ్మకాలను నిషేధించాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పాఠశాలలు/కళాశాలలను నవంబర్ 16దాకా మూసివేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను సమీక్షించడంతోపాటు “నో మాస్క్-నో ఎంట్రీ”… “శుభ్రత కోసం పోరు” ప్రచార కార్యక్రమాల ప్రభావాన్ని పరిశీలించారు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో నెలరోజులుగా ఒకరోజులో కోలుకునేవారి సంఖ్య నిత్యం నమోదయ్యే కొత్త కేసుల సంఖ్యను అధిగమిస్తూ వస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో కోలుకునేవారి సగటు 11 శాతంకన్నా ఎక్కువగా మెరుగుపడింది. ఇక ఆదివారం మధ్యప్రదేశ్‌లో 735 కొత్త కేసులు నమోదవగా వీటిలో భోపాల్ 100 కేసులతో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన 35 జిల్లాల్లో కొత్త కేసులు 10కన్నా తక్కువగా నమోదయ్యాయి.
  • గోవా: గోవాలో ఏటా నిర్వహించే అతిపెద్ద సంగీత-నృత్యోత్సవం ‘సన్‌బర్న్’ ఈసారి 20 శాతం సామర్థ్యంతో మాత్రమే సాగుతుంది. ఇది క్రిస్మస్ తర్వాత డిసెంబర్ 27-29 మధ్య ఉత్తర గోవాలోని వాగేటర్ బీచ్‌లో జరుగుతుంది. కాగా, కోవిడ్ మహమ్మారివల్ల ఈ సంవత్సరం స్పందన ఒక మోస్తరుగా ఉంది.
  • కేరళ: రాష్ట్రంలో కోవిడ్-19 విధివిధానాలకు అనుగుణంగా స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కోర్టు నోటీసుకు సమాధానంగా- రాష్ట్రంలోని అన్ని పార్టీలతో చర్చించామని, ఎన్నికల ఏర్పాట్లు ప్రస్తుతం చివరిదశలో ఉన్నాయని వివరించింది. కాగా, కేసుల పెరుగుదల నేపథ్యంలో పాఠశాలలను పాక్షికంగా తిరిగి తెరవడంపై రాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాలను పరిశీలిస్తోంది. కాగా, కొచ్చిలో ఒక మరణంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1513కు పెరిగింది. రాష్ట్రంలో నిన్న 7025 కొత్త కేసులు నమోదయ్యాయి.
  • తమిళనాడు: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఆర్‌.దొరైకణ్ను చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో కోవిడ్‌ వ్యాధికి చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా, ఆర్టీ-పీసీఆర్ కిట్‌లతో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు ప్రారంభించిన దాదాపు 9 నెలల తర్వాత తమిళనాడు ఆదివారం కోటి పరీక్షల మైలురాయిని దాటింది. ఇక కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రామాణిక విధాన ప్రక్రియల (ఎస్ఓపి) మేరకు నవంబర్ 10న రాష్ట్రంలోని థియేటర్లు, మల్టీప్లెక్సులు తిరిగి తెరవడానికి సిద్ధమయ్యాయి. పొరుగునగల పుదుచ్చేరికి బస్సులు నడిపేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
  • కర్ణాటక: రాష్ట్రంలో తాజాగా 8,053 మంది కోలుకోగా 3,652 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కర్ణాటకలో వరుసగా 18వ రోజు కొత్త కేసులకన్నా కోలుకున్న కేసులే అధికంగా నమోదవడం విశేషం. కేవలం 10 రోజుల్లో… అంటే- అక్టోబర్ 21 నుండి 31 మధ్య రాష్ట్రంలో చురుకైన కేసుల సంఖ్య దాదాపు సగం తగ్గింది. ఆ మేరకు అక్టోబర్ 21 న 1,00,440 కేసులుండగా అక్టోబర్ 31నాటికి 50,592కు తగ్గాయి.
  • ఆంధ్రప్రదేశ్: పాఠశాలలు/కళాశాలల పునఃప్రారంభంపై కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో 9, 10 తరగతులకు ప్రభుత్వ పాఠశాలలు కోవిడ్ ముందుజాగ్రత్తలను పాటిస్తూ తెరవబడ్డాయి. పాఠశాలలు రోజువిడిచి రోజు సగం రోజుపాటు మూడు దశలుగా నిర్వహించబడతాయి. అయితే- కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు తెరవలేదు. ఇక కరోనావైరస్ వల్ల 7 నెలలకుపైగా మూతపడిన ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా థియేటర్లు విజయవాడ, విశాఖపట్నంలలో తిరిగి ప్రారంభమయ్యాయి. ఇక మల్టీప్లెక్స్‌లు మాత్రం కాగిత రహిత టిక్కెట్లతో, నగదురహిత లావాదేవీలపై నడుస్తాయి. అన్ని థియేటర్లలో 50 శాతం సామర్థ్యంతో సీటింగ్ ఏర్పాట్లు చేస్తారు.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 922 కొత్త కేసులు, 7 మరణాలు నమోదవగా 1456 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 256 జీహెచ్‌ఎంసీ నుంచి పరిధిలోనివే. మొత్తం కేసులు: 2,40,970; క్రియాశీల కేసులు: 17,630; మరణాలు: 1348; డిశ్చార్జి: 2,21,992గా ఉన్నాయి. ఏడు నెలల తర్వాత అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంగీకారానికి వచ్చాయి. చాలాకాలం నుంచీ ఎదురుచూస్తున్న ‘ధరణి’ పోర్టల్‌ ఇవాళ్టినుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. దీంతో తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది.
  • అసోం: రాష్ట్రంలో 11,576 పరీక్షలు నిర్వహించగా 1.43 శాతంతో 166 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఇవాళ 730 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం మొత్తం కేసులు- 206517 కాగా, కోలుకున్న కేసుల సగటు 95.28 శాతం, క్రియాశీల కేసులు- 4.26 శాతంగా ఉన్నాయి.
  • మిజోరం: మిజోరం-అసోం సరిహద్దులో దిగ్బంధం ఐదో రోజులో ప్రవేశించింది. మిజోరం భూభాగంలో బంకర్ లాంటి నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు అసోం ప్రభుత్వం ఆరోపించింది.
  • నాగాలాండ్: రాష్ట్రంలో 28 కొత్త కేసులతో నాగాలాండ్‌లో మొత్తం కేసుల సంఖ్య 9,075కు చేరింది.
  • సిక్కిం: రాష్ట్రంలో కోవిడ్‌ మృతుల సంఖ్య 73కు చేరగా, మొత్తం కేసుల సంఖ్య 3,958కి చేరింది.

FACT CHECK

 

 

 

 

 

 

 

Image

***

 



(Release ID: 1669636) Visitor Counter : 187