ప్రధాన మంత్రి కార్యాలయం

ఇంటిగ్రేటెడ్ ఫౌండేషన్ కోర్సు "ఆరంభ్‌" రెండో దశలో భాగంగా, శిక్షణలో ఉన్న సివిల్‌ సర్వీస్‌ అధికారులతో మాట్లాడిన ప్రధాని


దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచన

"ఆరంభ్‌" అనేది ప్రారంభం మాత్రమే కాదు, కొత్త సంప్రదాయానికి గుర్తు: ప్రధాని

ఆత్మనిర్భర్‌గా అవతరించడానికి దేశం చేస్తున్న ప్రయత్నాల్లో "వోకల్‌ ఫర్‌ లోకల్‌"కు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని సూచన

Posted On: 31 OCT 2020 1:40PM by PIB Hyderabad

సవిల్‌ సర్వీసులకు ఎంపికై ముస్సోరిలో శిక్షణ పొందుతున్న అధికారులతో , గుజరాత్‌లోని కేవాడియా నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. ఇంటిగ్రేటెడ్‌ ఫౌండేషన్‌ కోర్సు "ఆరంభ్‌"లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

 

శిక్షణలో ఉన్న అధికారులు ఇచ్చిన ప్రదర్శనలను ప్రధాని తిలకించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నమ్మిన "పౌరులకు సేవ చేయడమే ఒక పౌర సేవకుడి అత్యున్నత విధి" అన్న సిద్ధాంతాన్ని పాటించాలని వారికి సూచించారు.

దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఐకమత్యాన్ని, సమగ్రతను బలోపేతం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని ఉద్బోధించారు. సామాన్యుడి ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు ఉండాలి తప్ప, తాము పనిచేస్తున్న విభాగం లేదా ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోకూడదన్నారు. రోజువారీ వ్యవహారాల నిర్వహణపై మాత్రమేగాక దేశాభివృద్ధిపైనా దృష్టి పెట్టాలని, సంక్షోభ పరిస్థితుల్లో ఇదే అతి ముఖ్యాంశంగా మారుతుందని ప్రధాని స్పష్టం చేశారు.

దేశంలో కొత్త విధానాలు, మార్గాల అనుసరణకు, కొత్త లక్ష్యాల సాధన కోసం నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో శిక్షణకున్న ప్రాధాన్యతను మోదీ వివరించారు. గతంలోలా కాకుండా, మానవ వనరుల శిక్షణలో ఆధునిక పద్ధతులు వచ్చాయన్నారు. గత రెండు, మూడేళ్లలో సివిల్‌ సర్వెంట్ల శిక్షణ పద్ధతుల్లో వచ్చిన మార్పులను ప్రస్తావించారు. "ఆరంభ్‌" అనేది ప్రారంభం మాత్రమే కాదని, కొత్త సంప్రదాయానికి గుర్తుగా అభివర్ణించారు. సివిల్‌ సర్వీసెస్‌లో ఇటీవల వచ్చిన సంస్కరణ అయిన 'మిషన్‌ కర్మయోగి'ని గుర్తు చేసిన ప్రధాని; సివిల్‌ సర్వెంట్ల సామర్థ్యం మరింత సృజనాత్మకంగా మారేలా, విశ్వాసం పెరిగేలా చేసేందుకు చేపట్టిన ప్రయత్నంగా చెప్పారు.

పైస్థాయి తర్వాతే కింది స్థాయి అన్న విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహించదన్న ప్రధాని; ఎవరి కోసమైతే విధానాలను రూపొందించామో, ఆ ప్రజలకు ప్రాధాన్యతనివ్వడం చాలా ముఖ్యమని అన్నారు. ప్రభుత్వం వెనుకున్న నిజమైన ప్రేరణ శక్తి ప్రజలేనని మోదీ చెప్పారు.

దేశ ప్రస్తుత పని విధానంలో, 'కనిష్ట ప్రభుత్వం-గరిష్ట పాలన' ఉండేలా చూడడమే అధికారుల పాత్రగా మోదీ చెప్పారు. పౌరుల జీవితాల్లో జోక్యాన్ని తగ్గించి, సామాన్యుడిని బలోపేతం చేసేలా ఉండాలని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్‌గా అవతరించడానికి దేశం చేస్తున్న ప్రయత్నాల్లో "వోకల్‌ ఫర్‌ లోకల్‌"కు ప్రాధాన్యమివ్వాలని శిక్షణలో ఉన్న అధికారులకు ప్రధాని మోదీ సూచించారు.

***



(Release ID: 1669100) Visitor Counter : 239