ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వైద్య విద్యా సంస్కరణలలో కీలక పురోగతి


2020 వార్షిక ఎంబీబీఎస్ ప్రవేశాలకు కనీస అర్హతలు ప్రకటించిన నేషనల్ మెడికల్ కమిషన్

Posted On: 31 OCT 2020 4:48PM by PIB Hyderabad

అందుబాటులో వైద్య విద్య దిశగా  నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) తొలి నియమావళిని ప్రకటించింది. “2020 వార్షిక ఎంబీబీఎస్ ప్రవేశాలకు కనీస అర్హతలు” పేరుతో ఇచ్చిన ఈ నోటిఫికేషన్ వలన అంతకుముందు భారత వైద్య మండలి (ఎంసిఐ)1999 లో విడుదలచేసిన వైద్యకళాశాలలకు కనీస ప్రామాణిక అవసరాలు” రద్దవుతుంది.

కొత్తగా ఏర్పాటు చేయటానికి ప్రతిపాదించిన అన్ని వైద్య కళాశాలలకూ ఈ కొత్త నియమావళి వర్తిస్తుంది.  అదే విధంగా ఇప్పటికే ఏర్పాటై, కొత్తగా 2021-22 వార్షిక ప్రవేశాలకు ఎంబీబీఎస్ సీట్లు పెంచాలనుకుంటున్న కళాశాలలకు కూడా వర్తిస్తుంది.  ఈ సంధి కాలంలో ఇప్పటికే ఏర్పాటైన వైద్య కళాశాలలు కొత్త నోటిఫికేషన్ కు ముందున్న నియమాల ప్రకారం నడుచుకుంటాయి.

సంస్థల ఆచరణకు సంబంధించిన ఈ కొత్త ప్రమాణాలు ఆ సంస్థల అవసరాలకు అనుగుణంగా నిర్వచించారు. దీనివలన సంస్థలు తక్కువ వనరులు ఉన్నప్పుడు కూడా తమకు అందుబాటులో ఉన్న వనరులను, ఆధునిక విద్యా సాంకేతికపరిజ్ఞానాలను వినియోగించుకోవటం ద్వారా నాణ్యమైన విద్యకు దోహదం చేయగలుగుతాయి.   

కీలక మార్పులు:

కొత్త నిబంధనల ప్రకారం వైద్య కళాశాల, దాని అనుబంధ ఆస్పత్రుల నిర్మాణానికి అవసరమైన భూమి పరిమాణాన్ని తొలగించింది. అయితే, భవనాలు మాత్రం ఇప్పుడున్న ఉపనియమాలకు కట్టుబడి ఉండాలి. సంస్థ ఆవరణలో విద్యార్థి సంబంధ కార్యకలాపాలకు  అవసరమైన స్థలాన్ని ఈ నోటిఫికేషన్ లో స్పష్టంగా నిర్దేశించారు. అన్ని విభాగాలు వాడుకునే స్థలం విషయంలో గతంలో నిబంధనలు కఠినంగా ఉండగా ఇప్పుడు ఆ ప్రమాణాలలో తగిన సడలింపులు ఇచ్చారు. దీనివలన ఈ-అభ్యసనం కోసం కేటాయించిన స్థలాన్ని పంచుకోవటం సాధ్యమవుతుంది. అదే విధంగా పరస్పరం డిజిటల్ రూపంలో ఇవి అనుసంధానమవుతాయి.

కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థుల శిక్షణ కోసం సకల సౌకర్యాలున్న నైపుణ్యాల ప్రయోగశాల ఏర్పాటు తప్పనిసరి. అదే విధంగా విద్య విద్యా బోధనకు సంబంధించి అధ్యాపకుల కోసం ఒక వైద్య విద్యా విభాగం ఏర్పాటును కూడా నిర్వచించింది. గ్రంధాలయం ఏర్పాటుకు అవసరమైన స్థలపరిమాణాన్ని, పుస్తకాల సంఖ్యను కూడా హేతుబద్ధం చేసింది. ఇటీవలి కాలంలో వైద్య విద్యార్థులలో పెరుగుతున్న వత్తిడిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు కౌన్సిలింగ్ తప్పనిసరి చేశారు.

వైద్య శిక్షణకు బాగా పనిచేసే ఆస్పత్రి అనేది చాలా అవసరమని గుర్తించటం వలన కొత్త మార్గదర్శకాలు కూడా ఇప్పుడు ఎవరైనా కొత్త వైద్య కళాడ్శాల ఏర్పాటు చేయటానికి దరఖాస్తు చేసుకుంటే కనీసం 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి రెండేళ్ళుగా నడుపుతూ ఉండాలనే నిబంధన పెట్టింది. అంతకు ముందు కూడా ఇలాంటి నిబంధన ఉన్నప్పటికీ, ఎంతకాలంగ పనిచేస్తూ ఉందాలనే విషయం అందులో లేదు.  బోధనాస్పత్రులలో వివిధ విభాగాలలో ఉండాల్సిన పడకల సంఖ్యను కూడా హేతుబద్ధం చేసి వార్షిక విద్యార్థి ప్రవేశాలు, ఆయా ప్రత్యేక విభాగాలలో వెచ్చించే బోధనాసమయం,  ఎంబీబీఎస్ డిగ్రీ విద్యార్థుల అవసరమైన కనీస చికిత్సాపరికరాలు ఆధారంగా నిర్ణయించారు. దీనివలన ఇంతకుముందు నిబంధనలతో పోల్చుకుంటే 10శాతం పడకల అవసరం తగ్గింది.  

బోధనకు అవసరమైన మానవ వనరులను కూడా కొత్త నియమావళిలో హేతుబద్ధం చేశారు. కనీస సిబ్బందికి తోడు అదనంగా విజిటింగ్ అధ్యాపకులకు కూడా అవకాశమివ్వటం ద్వారా శిక్షణలో నాణ్యతను మరింత మెరుగు పరచదలచారు.

ఎం బీ బీ ఎస్ వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చే అన్ని వైద్య కళాశాలలలో రెండు కొత్త బోధనావిభాగాలను తప్పనిసరి చేశారు. వాటిలో  అత్యవసర వైద్య విభాగం ( అంతకుముందు కాజువాలిటీ అనే వారు) ఒకటి. అత్యవసర పరిస్థితులకు తగినట్టు వేగంగా స్పందించటం దీనిపని. అదే విధంగా సమగ్రమైన పునరావాస చికిత్స అవసరమైనవారికోసం ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ విభాగం ఏర్పాటు చేయాలి.

కనీస అవసరాలే కాకుండా “ఉంటే మంచిది”, “ఉండాలన్న ఆకాంక్ష” అనే లక్ష్యాలు కూడా  ప్రమాణాలలో పేర్కొన్నారు. దీనివలన నాణ్యత కోసం పాటుపడేవారికి ఇదొక ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. దేశంలోని వైద్య సంస్థలకు రేటింగ్ ఇవ్వటానికి జాతీయ మెడికల్ కమిషన్ ఈ అంశాలను వాడుకుంటుంది.

****



(Release ID: 1669169) Visitor Counter : 213