సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్ నేపథ్యంలో రోగనిరోధకత కోసం ప్రపంచమంతా యోగా, ఆయుర్వేదం, నేచురోపతి వైపు చూసింది: డాక్టర్ జితేంద్ర సింగ్


Posted On: 30 OCT 2020 5:36PM by PIB Hyderabad

కోవిడ్ వలన ప్రపంచమంతా యోగా, ఆయుర్వేదణ్, నేచరోపతి వైపు దృష్టి సారించి, రోగనిరోధకశక్తి పెంచుకోవాలన్న ఆలోచనతో సాగిందని ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రధాని కార్యాలయం, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణువిద్యుత్, అంతరిక్ష శాఖల కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి) డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆ విధంగా వారు ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం ప్రయత్నించామన్నారు. అసోచామ్ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ ఆయుష్ మేలా లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. గడిచిన 4-5 నెలల్లో పాశ్చాత్య దేశాలు భారత్ లో పాటించే అత్యుత్తమ విధానాలలో ఒకటైన ప్రత్యామ్నాయ వైద్యం కోసం చూశాయన్నారు.

సరికొత్త భారత్ లో వైద్యరంగం ఆత్మనిర్భర్ కావటంతోబాటు ప్రపంచదేశాలకు కూడా సంప్రధాయ వైద్య విధానం ద్వారా రోగనిరోధకత పెంచే ఔషధాలను అందించగలుగుతుందన్నారు. సమీకృత వైద్య విధానపు అవసరాన్ని కోవిడ్ మరోమారు నొక్కి చెప్పిందన్నారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా అన్ని వైద్య విధానాలలో భాగం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ  స్వదేశీ వైద్య విధానాన్ని కీలకం చేశారని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. యావత్ ప్రపంచం అంతర్జాతీయ యోగా దినోత్సవం పాటించేలా ఐక్యరాజ్యసమితిలో ఏకగ్రీవ తీర్మానం చేయించిన ఘనత ఆయనదేనన్నారు. దీనివల్లనే యోగా ప్రపంచమంతటా ఇంటింటికీ చేరిందని వ్యాఖ్యానించారు. స్వదేశీ వైద్య విధానానికి ప్రాధాన్యాన్ని గుర్తించటం వల్లనే ప్రధాని ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారన్నారు.

హిమాలయాలు, ఏశాన్య ప్రాంత రాష్టాలు సుసంపన్నమైన మూలికలకు ఆలవాలమని మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. అందరూ ఈ అవకాశాన్ని వాడుకుంటూ, అంతర్జాతీయ స్థాయిలో మూలికా ఔషధాలను ప్రోత్సహించటానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.  పరిశ్రమల యాజమాన్య సంస్థ అయిన అసీసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా( అసోచామ్) అధ్యక్షుడు డాక్టర్ నిరంజన్ హీరనందానిని, కార్యదర్శి దీపక్ సూద్ ను ఈ అంతర్జాతీయ ఆయుష్ మేలా ఏర్పాటు చేసినందుకు మంత్రి అభినందించారు. ఈ కరోనా సమయంలో దీన్ని వర్చువల్ పద్ధతిలో నిజమైన అంతర్జాతీయ వేదికగా మలచాలని సూచించారు.

ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ కొటెచా మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రభుత్వం రూ. 4 వేల కోట్ల వ్యయంతో 10 లక్షల హెక్టార్లలో ఔషధ మొక్కలు పెంచాలన్న ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తున్నదని చెప్పారు.

ఆయుర్వేదాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు తమ పతంజలి సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని ఆచార్య బాలకృష్ణ చెప్పారు. ఇందుకు సంబంధించినవారంతా సహకరించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా అసోచామ్-నాబార్డ్  ఔషధ మొక్కలమీద రూపొందించిన సమాచార నివేదికను ఆవిష్కరించారు. గుజరాత్ లో యూసఫ్ షేక్ కు చెందిన కుద్రతి ఆయుర్వేద తయారీ విభాగాన్ని వర్చువల్ గా ప్రారంభించారు.

బెంగళూరుకు చెందిన యోగా థెరపిస్ట్, విద్యావేత్త, రచయిత, స్వామి వివేకానంద యోగ అనుసంధాన సంస్థాన (ఎస్-వ్యాస) అనే డీమ్డ్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ చాన్సలర్  అయిన పద్మశ్రీ హెచ్ ఆర్ నాగేంద్ర, సమి-సబెన గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ముహమ్మద్ మజీద్, పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమం జరిగిన వెబినార్ లో పాల్గొన్నారు.

 

***



(Release ID: 1668955) Visitor Counter : 204