ప్రధాన మంత్రి కార్యాలయం

ఆరంభ్-2020 సందర్భంగా సివిల్ సర్వీస్ ప్రొబెషనర్లతో ప్రధానమంత్రి సంభాషణ పూర్తిపాఠం


Posted On: 31 OCT 2020 4:46PM by PIB Hyderabad

కార్యనిర్వాహక వ్యవస్థలో ప్రధాన భూమిక పోషిస్తున్న మన యువతరం వినూత్నమైన, విభిన్నమైన ఆలోచనలకోసం సిద్ధంగా ఉంది. సరికొత్తగా ప్రయత్నించాలని అనుకుంటుంది. ఇది నాలో సరికొత్త ఆశలు కల్పిస్తోంది. అందుకే మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. గతేడాది సరిగ్గా ఇదేరోజు కేవడియాలో మీ ముందు బ్యాచ్ శిక్షణ అధికారులతో సవిస్తారంగా నా ఆలోచనలను పంచుకున్నాను. అప్పటినుంచి ప్రతి ఏడాది ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని సర్దార్ పటేల్ విగ్రహం వద్ద, నర్మదానది ఒడ్డున యువ అధికారులతో కలవాలని.. రోజంతా మీతోనే ఉండి మీ ఆలోచనలు తెలుసుకోవాలని.. ప్రారంభంలోనే మీ ఆలోచనలకు ఓ ప్రత్యేక రూపాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించాం. అయితే ఈసారి కరోనా మహమ్మారి కారణంగా.. మీతో నేరుగా సమావేశమవడం కుదరలేదు. ఈసారి మీరంతా ముస్సోరీ నుంచి వర్చువల్ వేదిక ద్వారా అనుసంధానమై ఉన్నారు. ఇవాళ్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ.. నేను చెబుతున్న దొక్కటే.. కరోనా ప్రభావం కాస్త తగ్గిన తర్వాత మీరంతా కలిసి సర్దార్ పటేల్ భవ్యమైన ఈ విగ్రహం వద్ద ఓ క్యాంప్ ఏర్పాటుచేసుకోండి. కొంతసమయం ఇక్కడ గడపండి.. భారతదేశంలోని ఈ ప్రత్యేకమైన, ఓ చక్కటి పర్యాటక కేంద్రం ఎలా అభివృద్ధి చెందుతుందో మీరు కూడా తెలుసుకోండి.

మిత్రులారా, ఏడాదిక్రితం ఉన్న పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు చాలా తేడా ఉంది. సంకట సమయంలో దేశం ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టింది? దేశ వ్యవస్థ ఏ విధమైన పనులు చేసింది? అనే విషయాలనుంచి చాలా నేర్చుకుంటారనే విశ్వాసం నాకుంది. మీరు కేవలం చూడటం మాత్రమే కాదు. అనుభవం ద్వారా నేర్చుకుని ఉంటారని భావిస్తున్నాను. కరోనాతో పోరాటం సందర్భంగా భారతదేశం చాలా అంశాల్లో ఇతరులపై ఆధారపడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. సంకల్పంతో ఏదైనా సిద్ధిస్తుంది అనడానికి ఇదోక మంచి ఉదాహరణ.

మిత్రులారా, భారతదేశం ప్రగతిపథంలో దూసుకుపోతున్న ఈ తరుణంలో.. మీరు అధికారులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇది చాలా ప్రత్యేకమైన సమయం. మీ బ్యాచ్ కార్యక్షేత్రంలోకి వెళ్లి పని ప్రారంభించే సమయంలో.. భారతదేశం 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటుంది. అధికారులుగా మీ బాధ్యతలు ప్రారంభించిన సమయం, 75వ స్వాతంత్ర్య వేడులకు జరుపుకునే సమయం ఒకేసారి వచ్చిన ఓ అద్భుతమైన సమయంలో.. నేను  చెప్పే ఓ మాటలను గుర్తుంచుకోండి. అవసరమైతే డైరీలో రాసిపెట్టుకోండి. మీరు దేశ సేవలో ఉన్నప్పుడు, మీ కెరీర్.. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి 100వ స్వాతంత్ర్య వేడుకల మధ్య కొనసాగుతుంది. భారతదేశాభివృద్ధిలో అత్యంత కీలకమైన ఈ సమయంలో మీరు దేశ సేవలో ఉండటం నిజంగా మీ అదృష్టం. 25 ఏళ్లపాటు దేశ రక్షణ, పేదల సంక్షేమం, రైతు సంక్షేమం, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడం వంటి చాలా కీలకమైన పాత్రలను సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మీపై ఉంది. మనలో చాలా మంది అప్పటివరకు మీతోనే ఉండకపోవచ్చు. కానీ మీ సంకల్పం, మీ సంకల్ప సిద్ధది మీతోనే ఉంటుంది. అందుకే ఈ పవిత్రమైన సందర్భంలో మీకు మీరే ఎన్నో ప్రమాణాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రమాణాలకు మీకు మీరే సాక్షులు. మీ ఆత్మే సాక్షి. మీకు ఓ విన్నపం. ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఓ అరగంట మీకోసం కేటాయించుకోండి. మీ ఆలోచనలను, మీ కర్తవ్యాలను, మీ బాధ్యతలతోపాటు మీ ప్రమాణం గురించి కూడా సమీక్షించుకోండి. దాన్ని రాసిపెట్టుకోండి.

మిత్రులారా, మీ సంకల్పాన్ని రాసిపెట్టుకుంటున్న కాగితానికి మీ కలల రూపాన్ని ఇవ్వండి. అది కాగితం ముక్కమాత్రమే కాదు. మీ హృదయస్పందన కావాలి. ఈ కాగితం ముక్కే జీవితాంతం.. మీ శరీరంలో హృదయ స్పందన ఎలాంటిదో.. అలాగే మీ సంకల్పానికి నిరంతరం బలాన్ని ఇచ్చేలా ఉండాలి. మీ ఆలోచనలకు గతిని ఇచ్చేలా, మార్గదర్శనం చేసేలా ఉండాలి. ప్రతి కలను సంకల్పంగా.. సంకల్పాన్ని సిద్ధించుకునేందుకు ఓ ప్రవాహాన్ని ఏర్పాటుచేసుకుని అందులో ముందుకు సాగుతూ ఉండాలి. అలాంటప్పుడు మీకు ఎలాంటి ప్రత్యేకమైన ప్రేరణ, పాఠాల అవసరమే ఉండదు. మీకు మీరే రాసుకున్న ఈ కాగితం.. మీ హృదయ భాషను వెల్లడిస్తుంది. ఇది నిరంతరం మీ సంకల్పాన్ని మీకు గుర్తు చేస్తూనే ఉంటుంది.

మిత్రులారా, మన దేశంలో సివిల్ సర్వీసెస్ ప్రారంభానికి సర్దార్ పటేల్ ముఖ్య కారకులు. 1947, ఏప్రిల్ 21న అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారుల మొదటి బ్యాచ్ ను ఉద్దేశించి సర్దార్ పటేల్ ప్రసంగిస్తూ.. సివిల్ సర్వీసెస్ మన దేశానికి ఓ ఉక్కు కవచం వంటిదని అభివర్ణించారు. దేశ ప్రజల సేవే మీకు సర్వోన్నత బాధ్యత కావాలని సూచించారు. నేను కూడా ఇదే  సూచిస్తాను. సివిల్ సర్వెంట్లుగా మీరు తీసుకునే నిర్ణయాలు.. అవి దేశహితానికి సంబంధించినవి, దేశ సమగ్రతను బలపరిచేవి, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించేలా ఉండాలి. మీ క్షేత్రం చిన్నదైనా సరే.. మీరు బాధ్యతలు చేపట్టే బాధ్యత చిన్నదయినా.. మీ నిర్ణయాన్నీ దేశ హితాన్ని కాంక్షించేవిధంగానే ఉండాలి. జాతీయవాదాన్ని ప్రతిబింబించాలి.

మిత్రులారా, ఉక్కు కవచం పని.. కేవలం ఆధారాన్ని ఇవ్వడమే. ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడమే. ఎంత పెద్ద సమస్య ఎదురైనా దాన్ని మీరు ఓ బలమైన శక్తిగా మారి సంకట పరిస్థితులనుంచి బయటపడేయడమే. అనుసంధానకర్తగా మీ ఫలప్రదమైన మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలి. కార్యక్షేత్రంలోకి వెళ్లిన తర్వాత విభిన్నమైన వ్యక్తిత్వాల మధ్య కూడా మీ సంకల్పాన్ని ఎప్పుడూ మరువకూడదు. ఫ్రేమ్ ఏదైనా.. అది బండి చట్రమైనా, కళ్లద్దాల ఫ్రేమ్ అయినా.. ఏదైనా చిత్రపటం ఫ్రేమ్ అయినా.. అది బలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఉక్కు కవచంలో ఉన్న మీ బాధ్యతలుమరింత కీలకమైనవి. మీరంతా ఒక బృందంగా ఉన్నప్పుడే మీరు అనుకున్న లక్ష్యలను సాధించగలరు. మీరు వెళ్లగానే  జిల్లాల బాధ్యతలను చూసుకోవాలి. విభిన్న విభాగాల బాధ్యతలు చూసుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలు మొత్తం రాష్ట్రంపై ప్రభావం చూపేలా ఉండాలి. అలాంటప్పుడు మీ ఈ బృంద భావనే మీకు చాలా సహాయకారిగా ఉంటుంది. దేశ హితాన్ని దృష్టిలో ఉంచుకుని.. మీ సంకల్పాలకు అనుగుణంగా పనిచేయండి. మీరు ఏ సర్వీసులో ఉన్నా.. ఓ బృందంలాగా అందరినీ కలుపుకుని ముందుకెళ్లండి. అలాంటప్పుడు మీరెప్పుడూ వెనుకడువేయడమో. విఫలమవడమో జరగదు. ఎప్పుడు విజయాలు సాధిస్తూనే ఉంటారని సంపూర్ణ వివ్వాసంతో చెబుతున్నాను.

మిత్రులారా, సర్దార్ పటేల్ ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ స్వప్నాన్ని చూశారు. నాటి వారి స్వప్నమే.. నేటి ‘ఆత్మనిర్భర్ భారత్’తో అనుసంధానమై ఉంది. కరోనా మహమ్మారి సమయంలోనూ మనం చాలా పాఠాలు నేర్చుకున్నాం. అవన్నీ ఆత్మనిర్భరతను బలపరిచేవే. నేటు ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ భావన, ఆత్మనిర్భర భారత్ భావన, నవభారత నిర్మాణ భావనను నిజం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నాం. కొత్తదనానికి ఎన్నో అర్థాలుంటాయి. నా దృష్టిలో కొత్తదనమంటే.. పాతదనాన్ని పక్కనపెట్టి కొత్తగా ముందుకెళ్లడం అని కాదు. పునర్ యవనాన్ని పొందడం, సృజనాత్మకతతో ఆలోచించడం, ఫ్రెష్ కావడం, సరికొత్త శక్తిని పొందడం అని అర్థం. పాతదానికి మరింత ప్రాముఖ్యతను ఇస్తూ.. అనవసరమైన వాటిని పక్కనపెడుతూ ముందుకెళ్లాలి. కొన్నింటిని వదులుకునేందుకు కూడా ధైర్యం కావాలి. అందుకోసం ఈరోజు నవ, శ్రేష్ఠ, ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించేందుకు అవసరమైన వాటికోసం నిరంతరం సమీక్ష జరగాలి. మిత్రులారా, ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించేందుకు మనకు శాస్త్ర, సాంకేతికత అవసరం చాలా ఉంది.  దీంతోపాటుగా వనరులు, ఆర్థిక వనరుల అవసరం కూడా ఉంది. కానీ ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో సివిల్ సర్వెంట్లుగా మీ మహత్వపూర్ణ బాధ్యత ఏంటనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రజల ఆకాంక్షలను పూర్తిచేయడంలో మీ పని సామర్థ్యం, పనివేగంతో ముందుకెళ్లేందుకు 24 గంటలపాటు దృష్టిసారించాల్సి ఉంటుంది.

మిత్రులారా, దేశంలో మార్పు తీసుకువచ్చేందుకు, కొత్త లక్ష్యాలను  చేరుకునేందుకు కొత్త మార్గాలను, కొత్త పద్ధతులను నేర్చుకునేందుకు ‘శిక్షణ’ పాత్ర చాలా కీలకం. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధిపై దృష్టిపెట్టడం అవసరం. గతంలో దీనిపై పెద్దగా దృష్టిపెట్టేవారు కాదు. శిక్షణలో ఆధునీకరణను ఎలా జోడించాలనేదిపై పెద్దగా ఆలోచించలేదు. కానీ నేటి పరిస్థితుల్లో దేశంలోని మానవవనరులకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడంపైనా మరింత శ్రద్ధ వహించాలి. గత మూడు-నాలుగేళ్లుగా సివిల్ సర్వెంట్ల శిక్షణలోనూ ఎలాంటి మార్పులు వచ్చాయో మీరు గమనించే ఉంటారు. ‘ఆరంభం’ కేవలం ఆరంభం మాత్రమే కాదు. ఇదో సరికొత్త పరంపరకు ప్రతీక. ఇందులో భాగంగానే ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానిపేరే ‘మిషన్  కర్మయోగి’. దేశంలో సామర్థ్య నిర్మాణం దిశగా చేపట్టిన ఓ ప్రయోగం ఇది. ఈ మిషన్ ద్వారా ప్రభుత్వాధికారులకు మరింత అధునాతనమైన శిక్షణను అందించడంతోపాటు వారి ఆలోచనలో, కార్యశైలిలో మార్పు తీసుకొచ్చేందుకు వారి స్కిల్-సెట్ ను మరింత పెంచేందుకు.. వారిని కర్మయోగులుగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతోంది.

మిత్రులారా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘యజ్ఞ్ అర్థాత్ కర్మణ: అన్యత్ర లోక: అయమ్ కర్మ బంధన:’ అని చెబుతారు. అంటే.. యజ్ఞం లేదా సేవకు బదులుగా.. స్వార్థం కోసం చేసిన పనులు కర్తవ్యం గా కీర్తించబడవు. అవి మనల్ని బంధనంలో, ఉచ్చులో చిక్కుకునేలా చేస్తాయనేది దానర్థం. ఓ దీర్ఘదృష్టితో, ఓ పెద్ద లక్ష్యాని ముందుంచుకుని మనం చేసేదే కర్మ అనిపించుకుంటుంది. ఈ కర్మతో మనమంతా కర్మయోగిగా మారాల్సిన అవసరముంది. మిత్రులారా, మీరంతా ఏ సుదీర్ఘమైన ప్రయాణానికి బయలుదేరుతున్నారో.. అందులో నియమ నిబంధనల పాత్ర కీలకం. వీటితోపాటు మీ పాత్రను కూడా గుర్తెరిగి నడవాల్సి ఉంటుంది. నియమ నిబంధనలకు, మన పాత్రకు మధ్య చాలా సంఘర్షణ ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది. నిబంధనలకు మహత్వమైవని.. మన పాత్ర మహత్వపూర్ణమైనది. ఈ రెండింటి మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఇది ఓ బిగుతుగా ఉన్న తాడుపై నడిచే ఆటలాంటిది. కొంతకాలంగా ప్రభుత్వం కూడా పాత్ర ఆధారిత విధానంపై ఎక్కువ దృష్టి పెట్టింది. దీని ఫలితం కూడా స్పష్టంగా కనబడుతోంది. ముందుగా సివిల్ సర్వీసెస్ లో సామర్థ్యం, యోగ్యత, సృజనాత్మకతకు అవసరమైన సరికొత్త ఆర్కిటెక్చర్ నిర్మితమైంది. రెండోది.. నేర్చుకునే విధానాలు ప్రజాస్వామ్య బద్ధమయ్యాయి. మూడోది.. ప్రతి అధికారికీ తన సామర్థ్యం, ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పోస్టింగ్ ఇవ్వాలనేది నిర్ణయమవుతోంది. మీకు ఇచ్చిన బాధ్యతలను మీరు సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మీ సంపూర్ణ జీవితం సానుకూలంగా ముందుకెళ్తుందనేదే.. ఈ ఆలోచన వెనక ముఖ్యోద్దేశం. ఈ సానకూలతే.. విజయమార్గాన్ని చూపిస్తుంది. ఓ కర్మయోగిగా మీ సంతోషానికి బాటలు వేస్తుంది.

మిత్రులారా మానవ జీవితం ఒక సవాళ్ళతో నిండి ఉన్నదని అందరూ అంటారు. అలాగే పరిపాలన సైతం సవాళ్ళతో ముందుకు సాగుతుంది. అందువల్ల మేము బాధ్యతాయుతమైన  ప్రభుత్వం గురించి మాట్లాడుతాము.ఒక సివిల్ సర్వెంట్ కోసం, మొదట మీరు దేశంలోని సాధారణ ప్రజలతో ప్రతీనిత్యం అనుసంధానమై ఏండడం చాలా అవసరం. మీరు ప్రజలతో కలిసిపోయినప్పుడే, ప్రజాస్వామ్యంలో సమర్థవంతంగా పనిచేయడం సులభతరం అవుతుంది. మీరంతా ఫౌండేషన్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ ట్రైనింగ్  పూర్తయిన తర్వాత క్షేత్రస్థాయిలో శిక్షణ కోసం వెళతారు. మీరు క్షేత్రస్థాయిలో ప్రజలతొ మమేకం కావాలి… ఎప్పూడూ ప్రజలకు దూరం అవ్వద్దని నేను మీకు సలహా ఇస్తున్నాను. నేనే గొప్ప అనే ఆలోచనలు ఎప్పుడూ మీ మనసుల్లోకి రానివ్వకండి. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో, ఏ కుటుంబ నేపథ్యం, ఏ సమాజం నుంచి వచ్చారో వాటిని ఎప్పటికీ మరిచిపోకండి. సమాజంతో కలిసి ముందుకు వెళ్ళండి. ఒక విధంగా, సమాజం జీవితంలో విలీనం అవుతుంది. సమాజం మీ శక్తికి మరింత బలాన్ని అందిస్తుంది. సమాజం మీ వెంట ఉంటే మీ రెండు చేతులు కాస్తా వేలాది చేతులుగా మారుతాయి.  ఈ వేలాది చేతులు మీ బలంగా మారిన తర్వాత , వారిని అర్థం చేసుకోవడం, వారి నుండి నేర్చుకొనేందుకు ఎప్పుడూ ప్రయత్నించాలి. ప్రభుత్వం ఎప్పుడూ పైన ఉండే వారితో నడవదని నేను తరచుగా చెబుతున్నాను. ఏ ప్రజల కోసమైతే ముఖ్యమైన విధానాలను తయారుచేస్తున్నారో, అలాంటి వారితో సమావేశాలు నిర్వహించడం చాలా ముఖ్యం.  ప్రజలు కేవలం  ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను స్వీకరించేవారు మాత్రమే కాదు..వారే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళే నిజమైన చోదక శక్తి, కాబట్టే మన లక్ష్యం ప్రభుత్వం అనే ఆలోచన నుంచి పాలనకు మారాలి.

మిత్రులారా, మీరు ఈ అకాడమీని విడిచిపెట్టి ముందుకు వెళ్ళినప్పుడు, మీ ముందు రెండు మార్గాలు ఉంటాయి. ఒక మార్గం ఎంతో సులభంగా, అనేక సౌకర్యాలతో,  మీకు పేరు - కీర్తి తీసుకొచ్చే మార్గం. మరొకటి అనేక సవాళ్లు ఉండే మార్గం. ఇందులో అనేక ఇబ్బందులు ఉంటాయి. విభేదాలు ఉంటాయి.. సమస్యలు ఉంటాయి. నా అనుభవం నుంచి ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే సులువైన మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకుంటారో అప్పుడే మీకు నిజమైన కష్టం ఎదురవుతుంది. ఎప్పుడైతే ఏదైనా రహదారి ఎలాంటి మలుపులు లేకుండా ఉంటుందో, అలాంటి రహదారిలోనే అకస్మాత్తుగా ఎదురయ్యే సమస్యలు ఉంటాయని మీరు గమనించి ఉండాలి. కానీ మలుపులు ఉన్న రహదారిలో, డ్రైవర్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. ప్రమాదాలు సైతం తక్కువగా  జరుగుతాయి. అందువల్ల సూటిగా ఉండే మార్గం కొన్నిసార్లు చాలా కష్టంతరంగా ఉంటుంది.  దేశ నిర్మాణ, స్వావలంబన భారతదేశం అనే లక్ష్యం వైపు ఎప్పుడైతే మీరు అడుగుపెడ్తారో, అప్పుడు మీకు సులభతరమైన మార్గం లభిస్తుందని మీరు మీ మనస్సులో ఎప్పుడూ  కోరుకోకూడదు. అందువల్ల, మీరు మీకు ఎదురయ్యే  ప్రతీ సవాలును పరిష్కరిస్తూ ముందుకు సాగినప్పుడు, ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచడానికి మీరు నిరంతరం కృషి చేసినప్పుడు , దీని కారణంగా కేవలం మీరు మాత్రమే కాదు.. దేశం మొత్తం వీటి ప్రయోజనాన్ని పొందుతుంది. దేశం స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాల నుంచి 100 ఏళ్ళ వైపు సాగుతున్న పయనం మీ ముందు కనిపించడానికి మీకు కొంత సమయం ఉంటుంది. . ఈ రోజు దేశంలో పనిచేస్తున్న తీరులో మీలాంటి అధికారుల పాత్ర కనీస ప్రభుత్వం.. అత్యధిక పాలన అనే విధంగా ఉండాలి.  పౌరుల జీవితాల్లో ఏరకంగా  మీ జోక్యం తగ్గుతుందో, సాధారణ మానవునికి సాధికారత ఎలా సాధ్యమౌతుందనే విషయంపై మీరు దృష్టిసారించాల్సి ఉంటుంది. 

'న తత్ ద్వతీయం అస్తి'. మన ఉపనిషత్తుల్లో చెప్పారు. అంటే నాకు భిన్నంగా మరొకరు ఎవరూ లేరు. మీరు ఏ పని చేసినా, ఎవరి కోసం చేసినా, మన పని అనుకొని చేయండి. నా స్వానుభవంతో మీకొక విషయం చెప్తాను. మీరు మీ విభాగంతో, సాధారణ వ్యక్తులను  మీ కుటుంబంగా  భావించి పనిచేసినప్పుడు మీరు ఎప్పటికీ అలసిపోరు. ఎల్లప్పుడూ మీరు నూతన శక్తితో ముందుకు సాగుతారు. మిత్రులారా, ఫీల్డ్ పోస్టింగ్ సమయంలో, అధికారులు భిన్నంగా ఏమి చేస్తున్నారో, ఏమి జరుగుతుందో అన్నదానితో వారికి గుర్తింపు వస్తుంది. మీరు కూడా ఈ రంగంలో ఉన్నారు.  ఫైళ్ళ నుండి బయటికి వచ్చి, రోజువారి కార్యక్రమాలకు దూరంగా, మీరు పనిచేస్తున్న ప్రాంతం అభివృద్ధి కోసం, అక్కడి  ప్రజల కోసం చేసే పనుల ప్రభావం ఎంతో భిన్నంగా ఉంటుంది, ఫలితం కూడా  భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు పనిచేసే జిల్లాల్లో, బ్లాకులలో  ప్రపంచ స్థాయి ఉన్న ఉత్పత్తులు అనేకం ఉంటాయి. అలాంటి ఆ ఉత్పత్తులకు స్థానిక మద్దతు ఇవ్వడంతో పాటు,  ఆ కళలు, ఆ కళాకారులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేందుకు మీరు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వాలి.  ఈ దృష్టిలో మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే, మీరు మీ ప్రాంతంలోని ఒక స్థానిక ఆవిష్కర్తను వెతకడమే కాకుండా, వారి పనిలో భాగస్వామిగా సహాయపడవచ్చు. బహుశా మీ సహకారంతో, ఆ ఆవిష్కరణ సమాజానికి ఎంతగానో ఉపయోగకరంగా మారుతుంది. అయితే ఈ కార్యక్రమాలు చేస్తున్న మధ్యలో మీకు బదిలీ అయితే ఏం జరుగుతుంది? అనేది మీరు ప్రస్తుతం ఆలోచిస్తూ ఉండాలి. అందుకే నేను ప్రారంభంలో  టీమ్ స్పిరిట్  గురించి మాట్లాడాను.  మీరు ఈ రోజు ఒక ప్రదేశంలో ఉంటే, రేపు మీరు మరొక ప్రదేశంలో ఉంటారు. అయినప్పటికీ మీరు ఆ ప్రాంతంలో మీ ప్రయత్నాలను వదులుకోవద్దు. మీ లక్ష్యాలను మర్చిపోకండి. మీ తర్వాత అక్కడికి వస్తున్నవారిని నమ్మండి. వారి విశ్వాసాన్ని పెంచుకోండి, వారిని ప్రోత్సహించండి. వారు ఎక్కడ ఉన్నా వారికి సహాయం చేస్తూ ఉండండి. మీ కలలు మీ తరువాతి తరాల ద్వారా కూడా నెరవేరుతాయి. మీరు మీ లక్ష్యాల్లో నూతన అధికారులను భాగస్వామ్యం కూడా చేయొచ్చు.

మిత్రులారా, మీరు ఎక్కడికి వెళ్లినా, మరో విషయం గుర్తుంచుకోవాలి. మీరు మీ కార్యాలయ బోర్డులో ఉన్న పదవీకాలం ద్వారా గుర్తుండేలా ఉండకూడదు. మీరు ఖచ్చితంగా మీరు చేసిన పనితో గుర్తింపు తెచ్చుకోవాలి. అవును, పెరుగుతున్న గుర్తింపులో, మీడియా, సోషల్ మీడియా కూడా మిమ్మల్ని చాలా ఆకర్షిస్తాయి. పని కారణంగా మీడియాలో చర్చ జరగడం అనేది ఒక విషయం అయితే, మీడియాలో చర్చ జరగడం కోసం మాత్రమే పనిచేయడం అనేది మరొక విషయం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు ముందుకు సాగాలి. ఎవరి దృష్టిలో పడకుండా పనిచేయడం అనేది ఒక సివిల్ సర్వెంట్ బాధ్యత అని మీరు గుర్తుంచుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎవరైతే తమ పని కారణంగా పేరు తెచ్చుకొన్న అధికారులు ఉన్నారో, వారు తన పదవీకాలమంతా అనామకంగానే, ఎవరి దృష్టిలో పడకుండానే ఉన్నారు. ఎవరికీ వారి పేరు కనీసం తెలియదు. పదవీ విరమణ చేసిన తరువాత, అప్పుడు ఈ అధికారి దేశానికి ఇంత పెద్ద పనిచేశారని ఎవరో ఏదో రాశారు, అప్పుడే వారి పేరు అందరికీ  తెలిసింది. అదే ఇప్పుడు మీకు ఆదర్శంగా నిలవాలి. మీకు ముందు 4-5 దశాబ్దాలలో మీ సీనియర్లుగా ఉన్నవారు దానిని గొప్ప క్రమశిక్షణతో అనుసరించారు. మీరు సైతం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మిత్రులారా, నేను ఎప్పుడైనా యువ రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే, ఎంపిలుగా ఉన్నారో వారికి ఒక విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడుతాను. ప్రచారంలో భాగమైన కనిపించడం, ప్రచురణ అనే రెండు రోగాలకు దూరంగా ఉండాలని చెబుతుంటాను. మీకు సైతం అదే విషయం చెప్పాలనుకుంటున్నాను. టీవీల్లో కనిపించడం, పత్రికల్లో ప్రచురణ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రెండు రోగాల కారణంగా మీరు మీ ముందున్న లక్ష్యాలను పూర్తి చేయలేరు. ఆ లక్ష్యాలను పూర్తిచేసేందుకే మీరు సివిల్ సర్వీసెంట్‌‌గా మారారు.

మిత్రులారా, మీరందరూ, మీ సేవతో, మీ అంకితభావంతో, దేశ అభివృద్ధి ప్రయాణంలో, దేశాన్ని స్వావలంబనగా మార్చడంలో పూర్తి సహకారం అందిస్తారని నాకు తెలుసు. నా ప్రసంగాన్ని ముగించే ముందు, నేను మీకు ఒక పని అప్పగించాలనుకుంటున్నాను. మీరు అందరూ చేతులు పైకెత్తితే, మీరు ఆ పని చేస్తారని నేను అనుకుంటాను. అందరు తమ చేతులు పైకి లేపుతారా...  అయితే ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. మీకు కూడా వోకల్ ఫర్ లోకల్ అంటే ఇష్టమే అనుకుంటాను. ఖచ్చితంగా మీకు ఇష్టమై ఉంటుంది. మీరంతా ఒక పని చేయాలి. మీరు వచ్చే మూడు నాలుగు రోజుల్లో మీ చుట్టుపక్కల ఉన్నవాటిలో ఏ వస్తువులైతే రోజువారీ ఉపయోగంలో ఉన్నాయో.. వాటిలో ఎన్నింటికి  భారతీయ ఉంది… ఎన్నింటిలో మన సంస్కృతి ఉందనే విషయాన్ని గుర్తించండి. ఇందులో భారత యువత ప్రతిభ కనిపిస్తుంది. ఆ విషయాల జాబితాను తయారు చేసి, మీ గదిలో ఏ విదేశీ వస్తువులు ఉన్నాయో, మీ బూట్ల నుంచి మీ జుట్టు వరకు మరొక జాబితాను తయారు చేయండి. మీరు ఏం వాడుతున్నారనే స్పష్టత మీకు వస్తుంది. మీరు వాడుతున్న వస్తువుల్లో ఈ రోజు భారతదేశంలో అందుబాటులో లేని వస్తువులు సైతం ఖచ్చితంగా ఉంటాయనే విషయాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. కానీ మీరు ఉపయోగించడం విషయమై మీ మనస్సులో ఒక విషయాన్ని నిర్ణయించుకోండి. మీరు వాడుతున్న వస్తువుల్లో కనీసం 30 నుంచి 50 వస్తువులు మన స్థానికులు, మన దేశంలో తయారవుతున్నవి అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని గుర్తించండి. బహుశా ఇంతకాలం వారి ప్రచార ప్రభావంలోకి మీరు రాలేదు. ఇప్పటికైనా ఇలాంటి విషయంలో వాటిని ఎంత తగ్గించగలను అనే విషయాన్ని మీరు ఆలోచించుకోవాలి. 

చూడండి, స్వావలంబన అనేది మనతోనే ప్రారంభం కావాలి. స్థానిక అవకాశాలను పెంచేందుకు మీరు ఏం చేస్తున్నారనే విషయంపై స్పష్టత ఉండాలి. అంతేగాక రెండవ విషయం - లాల్ బహదూర్ శాస్త్రితో సంబంధం ఉన్న మీ సంస్థలో , మీ క్యాంపస్‌లో, మీ ఆడిటోరియంలో, మీ తరగతి గదిలో, మొత్తం క్యాంపస్‌లో ఎన్ని విదేశీ వస్తువులు ఉన్నాయో ఒక జాబితా తయారు చేయండి. మేము దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకే ఇక్కడికి వచ్చామని మీరు నిర్ణయించుకోవాలి. ఇక్కడి నుంచే దేశానికి నాయకత్వం వహిస్తున్న ఒక తరం తయారు అవుతోందని గుర్తుంచుకోవాలి.  అలాంటి ఈ ప్రదేశంలో వోకల్ ఫల్ లోకల్ మన జీవితంలో ఒక భాగస్వామ్యం అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఈ విషయంపై మీరు దృష్టిపెడితే మీకు ఖచ్చితంగా ఆనందం కలుగుతుంది.  మీ సహోద్యోగుల కోసం కూడా మీరు ఈ మార్గాన్ని తెరవాలని నేను చెప్పట్లేదు. అది మీ కోసమే. మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి… ఎలాంటి కారణంలేకుండానే మన దేశంలో అలాంటి వస్తువులు దొరుకుతున్నప్పటికీ మీరు అనేక విదేశీ వస్తువులు ఉపయోగిస్తుండాలి.  అది విదేశీ వస్తువని మీకు తెలిసి ఉండదు.. చూడండి, భారతదేశాన్ని స్వావలంబనగా తయారు చేయడానికి, మనమందరం మొదట మార్పును మన నుంచే ప్రారంభించాలి. అప్పుడే దేశం ఆత్మనిర్భరంగా మారుతుంది. 

నా ప్రియమైన స్నేహితులారా..  నా యువ స్నేహితుల్లారా.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యేనాటికి, 100 సంవత్సరాల స్వాతంత్య్ర కలలు, 100 సంవత్సరాల స్వాతంత్య్ర సంకల్పంతో పాటు రాబోయే తరాల స్వాతంత్య్రాన్ని,స్వేచ్ఛను మీ చేతుల్లోకి అప్పగిస్తున్నారు. రాబోయే 25-35 సంవత్సరాలను దేశం మీకు అప్పగిస్తోంది. మీరు ఇంత పెద్ద బహుమతిని పొందుతున్నారు. దీన్ని జీవితంలో గొప్ప అదృష్టంగా భావించి మీ చేతుల్లోకి తీసుకోండి, కర్మయోగిగా మారి దేశాన్ని అభివృద్ధిపథంలో దూసుకెళ్ళేలా బాధ్యతను స్వీకరించండి.

కర్మయోగ మార్గంలో కొనసాగడానికి, మీరు ముందుకు సాగండి . ఈ విషయంలో మీరు ముందుకు సాగేందుకు మిమ్మల్ని మరోసారి అభినందిస్తున్నాను. నేను మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నేను ప్రతి క్షణం మీతో ఉన్నానని మీకు భరోసా ఇస్తున్నాను. నేను ప్రతి సెకను మీతో ఉన్నాను. అవసరమైనప్పుడు మీరు నా తలుపు తట్టవచ్చు. నేను ఎక్కడ ఉన్నా, నేను మీ స్నేహితుడిని, నేను మీ భాగస్వామిని, 100 సంవత్సరాల స్వాతంత్య్ర కలను సాకారం చేసుకోవడానికి మనమందరం కలిసి పనిచేయడం ప్రారంభిద్దాం. మనమందరం కలిసి ముందుకు వెళ్దాం. దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా తయారుచేసేందుకు సర్వశక్తులు ఒడ్డి పనిచేద్దాం.  

 

అందరికీ ధన్యవాదాలు.

****



(Release ID: 1669285) Visitor Counter : 254