ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ప్రజాసంక్షేమం కోసం ప్రవేశ పెట్టే ప్రభుత్వ పథకాల అమలే అత్యంత కీలకం: ఉపరాష్ట్రపతి


పథకాల పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా సామాన్యుడి పురోగతి, సంక్షేమంపై మరింత దృష్టిపెట్టాలని సూచన

సుపరిపాలన క్షేత్రస్థాయికి చేరినప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం

వ్యూహాత్మక అప్రమత్తత, సరైన సమయంలో సరైన నిర్ణయాలతో కరోనాపై పోరులో భారత్ ముందుకెళ్తోంది

66వ ఐఐపీఏ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

ఈ సందర్భంగా ఐఐపీఏలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

పటేల్ ఓ కర్మయోగి, దీర్ఘదృష్టి గల పరిపాలనాసమర్థుడని ప్రశంస

దేశంలో ప్రభుత్వ సంస్కరణల్లో సరికొత్త మార్పులకు క్రియాశీలకంగా మారాలని ఐఐపీఏకు ఉపరాష్ట్రపతి సూచన

Posted On: 31 OCT 2020 6:12PM by PIB Hyderabad

దేశంలోని సామాన్య ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శనివారం ఐఐపీఏ 66వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)ను అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రజా సేవల పంపిణీ వ్యవస్థతోపాటు ప్రజలకు న్యాయం చేయడం, ప్రజల సమస్యలకు ప్రభుత్వ వ్యవస్థ స్పందిస్తున్న తీరు తదితర అంశాల్లో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ‘అలాంటి మార్పునే నేటి భారతం కోరుకుంటోంది’ అని పేర్కొన్నారు.

భారతదేశం శరవేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తోందన్న ఉపరాష్ట్రపతి, అందుకు తగినట్లుగానే, ప్రజల జీవితాల్లో మరింత సానుకూల మార్పు తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం సరికొత్త పథకాలు, వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోందన్నారు. అయితే ఈ పథకాలు, కార్యక్రమాల లక్ష్యం పరిపూర్ణం కావాలంటే అధికారులు, నిపుణులు అనుసరించాల్సిన తీరు మరింత క్రియాశీలంగా, సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో తమవంతు కృషిచేస్తూ.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్న సివిల్ సర్వెంట్లు, వైద్యనిపుణులు, భద్రతా సిబ్బంది, ఉపాధ్యాయులతో పాటు వివిధరంగాల ప్రముఖుల సేవలను విస్మరించలేమన్న ఆయన, ఈ దిశగా మరింత కృషి జరగాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.

ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుకు పరిపాలనా రంగంలోని వారు, వివిధ రంగాల నిపుణులు తమ పాత్రను పోషించేందుకు చొరవతీసుకోవాలని సూచించిన ఉపరాష్ట్రపతి, గ్రామీణ స్థాయి సుపరిపాలన అందేలా వ్యవస్థలో మార్పులను సూచించాలన్నారు. ఐఐపీఏ వంటి సంస్థలు ఈ లక్ష్యంతోనే ముందుకెళ్లాలని తెలిపారు. కరోనా సమయంలోనూ ఆన్ లైన్ ద్వారా శిక్షణాకార్యక్రమాలను నిర్వహించడంలో ఐఐపీఏ తీసుకున్న చొరవను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రశంసించారు.

కరోనా మహమ్మారిని.. భారతదేశం వ్యూహాత్మక అప్రమత్తత, సరైన సమయంలో సరైన నిర్ణయాల కారణంగా సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్న ఉపరాష్ట్రపతి, ఈ విషయంలో భారతదేశ  ప్రయత్నాలను ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితులను మన దేశం అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటూ ముందుకెళ్తోందని.. ఈ దిశగా ప్రజారోగ్య మౌలికవసతులను ఆధునీకరించడం, వైద్య పరికరాల ఉత్పత్తిని మరింత పెంచడం, దేశీయ సంస్థలను ప్రోత్సహించేలా అవసరమైన మందుల తయారీపై దృష్టిపెట్టడం ద్వారా ఆత్మనిర్భర భారత నిర్మాణానికి మార్గం సుగమమౌతోందని తెలిపారు.

ఈ సందర్భంగా ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి ఆన్ లైన్ ద్వారా ఆవిష్కరించారు. సర్దార్ పటేల్ స్ఫూర్తితో భారతదేశ పరిపాలన వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దే దిశగా ఐఐపీఏ మరింత పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

‘సర్దార్ పటేల్ ఓ  కర్మయోగి. దీర్ఘదృష్టితో భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు వారు చేసిన అవిరళ కృషి.. జాతీయవాదం మనందరికీ స్ఫూర్తి మంత్రం. వారు నడిచినమార్గం, వారి ఆలోచనలను అర్థం చేసుకుని వాటి నుంచి ప్రేరణతో నేటి యువతరం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ప్రజాసేవల వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని ‘మిషన్ కర్మయోగి’గా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి.. సివిల్ సర్వెంట్లకు శిక్షణనిచ్చేందుకు ఐఐపీఏ సాంకేతిక ఆధారిత సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. గత ఐదేళ్లుగా.. నాణ్యతలో రాజీ లేకుండానే ఖర్చు తగ్గించుకునే దిశగా ఐఐపీఏ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

రాష్ట్ర, క్షేత్రస్థాయిలో బలమైన వ్యవస్థను ఏర్పర్చుకున్న ఐఐపీఏను అభినందిస్తూ.. మరింత బలోపేతమైన వ్యవస్థను సృష్టించుంటూ.. రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలను కూడా క్రియాశీల భాగస్వాములుగా మార్చేందుకు ప్రయత్నించాలని ఐఐపీఏకు సూచించారు.

ఇటీవలే ఐఐపీఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను ఈ సందర్బంగా ఉపరాష్ట్రపతి అభినందించారు. డాక్టర్ జితేంద్ర సింగ్ అనుభవం, సమర్థతతో.. ఐఐపీఏ మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఐపీఏలో జీవిత కాల సభ్యత్వాన్ని ప్రారంభించాలన్న కేంద్ర మంత్రి నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. పదవీ విరమణ పొందిన సివిల్ సర్వీసు అధికారులు, విద్యావేత్తలు, ఐఐపీఏలో సభ్యులుగా చేరడం ద్వారా సంస్థ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలవుతుందన్నారు.

ఈ ఏడాది జనవరిలో దివంగతులైన ఐఐపీఏ మాజీ చైర్మన్ శ్రీ టి.ఎన్. చతుర్వేదికి ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. వారి సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఐఐపీఏ డైరెక్టర్ శ్రీ ఎస్.ఎన్. త్రిపాఠి, మాజీ గవర్నర్ శ్రీ శేఖర్ దత్ సహా పలువురు ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా హాజరయ్యారు.

****



(Release ID: 1669175) Visitor Counter : 186