PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 17 SEP 2020 6:29PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • గత 24 గంటల్లో 82,961మందికి వ్యాధి నయం; కోలుకునేవారి సగటు 78.64 శాతంగా నమోదు.
  • దేశంలో ఇప్పటిదాకా 40 లక్షల మందికిపైగా (40,25,079) కోవిడ్‌ బాధితులకు వ్యాధి నయం.
  • ప్రస్తుతం 10 లక్షలమందికిపైగా (10,09,976) చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.
  • మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే క్రియాశీల కేసులలో దాదాపు సగం (48.45 శాతం).
  • దేశంలో 2024 మార్చినాటికి 10,500కు పెరగనున్న జనౌషధి కేంద్రాల సంఖ్య.
  • కోవిడ్‌ మహమ్మారి కారణంగా పాఠశాలలు మూసివేసిన నేపథ్యంలో అర్హతగల బాలబాలికలు అందరికీ ఆహార  ధాన్యాలు, పప్పుదినుసులు, నూనె తదితరాలను (వంట ఖర్చుతో సమానంగా) ఆహార భద్రత భత్యం  కింద అందజేయాలని రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచన.

భారత్‌లో వరుసగా రెండోరోజు 82,000 మందికిపైగా కోలుకున్న పీడితులు; ఇప్పటిదాకా 40 లక్షల మందికిపైగా వ్యాధినయం; చురుకైన కేసులకన్నా 30 లక్షలు అధికంగా కోలుకున్న కేసులు

భారత్‌లో ఇవాళ వరుసగా రెండోరోజు 82,000 మందికిపైగా కోవిడ్‌ రోగులు కోలుకున్నారు. ఈ మేరకు గత 24 గంటల్లో 82,961 మందికి వ్యాధి నయం కాగా, కోలుకునేవారి జాతీయ సగటు 78.64 శాతానికి దూసుకెళ్లింది. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 40 లక్షలు (40,25,079) దాటింది. తదనుగుణంగా కోలుకున్నవారి సంఖ్య ప్రస్తుతం చికిత్స పొందేవారికన్నా ఇవాళ 30 లక్షలు (30,15,103) దాటి నాలుగు రెట్లు అధికంగా నమోదైంది. దీనివల్ల గత నెలరోజులతో పోలిస్తే కోలుకునేవారి సంఖ్య 100 శాతం పెరిగింది. ఇవాళ ఆస్పత్రులనుంచి ఇళ్లకు వెళ్లినవారిలో ఐదో వంతు (21.22 శాతం) మహారాష్ట్ర (17,559)లోనే ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ (10,845), కర్ణాటక (6,580), ఉత్తర ప్రదేశ్ (6,476), తమిళనాడు (5,768) రాష్ట్రాల్లో గత 24 గంటల్లో 35.87 శాతం కోలుకున్నారు. మొత్తం మీద కొత్తగా కోలుకున్నవారిలో దాదాపు 57.1 శాతం ఈ ఐదు రాష్ట్రాలకు చెందినవారే. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 10 లక్షలు (10,09,976) దాటగా దాదాపు సగం (48.45 శాతం) మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలోనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌, తమిళనాడులతో కలిపి మొత్తం ఈ ఐదు రాష్ట్రాల్లో చురుకైన కేసులు దాదాపు 60 శాతంగా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1132 మరణాలు సంభవించగా వీటిలో ఒక్క మహారాష్ట్రలోనే 474 మంది (40శాతం) ఉన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌ (86), పంజాబ్‌ (78), ఆంధ్రప్రదేశ్ (64), పశ్చిమబెంగాల్‌ (61) రాష్ట్రాల్లో 25.5 శాతం మరణాలు నమోదయ్యాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655517

దేశంలో 2024 మార్చినాటికి జనౌషధి కేంద్రాలను 10500కు పెంచాలని నిర్దేశించుకున్న కేంద్ర ప్రభుత్వం 

దేశంలోని జనౌషధి కేంద్రాల సంఖ్యను 2024 మార్చి ఆఖరుకల్లా 10,500కు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకుంటే దేశంలోని అన్ని జిల్లాల్లో జనౌషధి కేంద్రాలు ఉంటాయని, ఒకవిధంగా ప్రతి మూలమూలనా ప్రజలకు సరసమైన ధరలో ఔషధాలు అందుబాటులో ఉంటాయన్నారు. కాగా, 2020 సెప్టెంబర్ 15 నాటికి దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాల సంఖ్య 6603కు పెరిగింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655662

అవసరమైన వైద్య పరికరాల లభ్యతకు భరోసా ఇస్తూ మోకాలి మార్పిడి పరికరాల ధరలపై పరిమితిని 2021 సెప్టెంబర్ 14దాకా పొడిగించిన ఎన్‌పీపీఏ

దేశంలోని సామాన్యులకు వాస్తవ ధరతో అవసరమైన వైద్య పరికరాల లభ్యతకు భరోసా ఇస్తూ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ‘నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) మోకాలి మార్పిడి పరికరాల ధరలపై పరిమితిని మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు 2021 సెప్టెంబరు 14 వరకు ఇది అమలులో ఉంటుందని, తద్వారా సామాన్యులకు రూ.1500 కోట్లదాకా ఆదా అవుతుందని ఎన్‌పీపీఏ పేర్కొంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655518

కోవిడ్‌-19 సమయంలో పెన్షనర్ల సంక్షేమానికి చర్యలు

కోవిడ్‌-19 సమయంలో పెన్షనర్ల ప్రయోజనం కోసం పలు చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఈశాన్యప్రాంత అభివృద్ధి, పీఎంవో, ప్రజా సమస్యలు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్షం తదితర శాఖల కేంద్ర (స్వతంత్ర బాధ్యత) సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మేరకు ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక జవాబిచ్చారు. పెన్షన్, రిటైర్మెంట్‌ ప్రయోజనాలను సకాలంలో పరిష్కరించేందుకు, పెన్షనర్లను ఆరోగ్యంగా, అవగాహనతో ఉంచడానికి వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655871

దేశంలోని అంగన్‌వాడీ కార్యకర్తలపై కోవిడ్‌-19 ప్రభావం

దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 ప్రభావం, దిగ్బంధం నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలన్నీ  మూతపడ్డాయి. అయితే, లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు వారికి ఇళ్లవద్దనే అనుబంధ పోషకాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా 15 రోజులకు ఒకసారి లబ్ధిదారుల ఇంటికే ఆహార పదార్థాల పంపిణీ పోషకాహార సహాయం అందించాలని మహిళాశిశు సంక్షేమ మంత్రిత్వశాఖ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655817

కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో విద్యార్థుల చదువు కొనసాగేలా పలు చర్యలు తీసుకున్న కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ

కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ వివిధ స్థాయులలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలతో అనేక సంప్రదింపులు చేపట్టింది. ఆ మేరకు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు చదువులో వెనుకబడకుండా పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘డిజిటల్‌/ఆన్‌లైన్‌/ఆన్‌-ఎయిర్‌’ మార్గాల్లో బహుళ విద్యావకాశాలనూ ఏకీకృతం చేసే ‘పీఎం ఈవిద్య’ (PM eVIDYA)ను ప్రవేశపెట్టింది. అలాగే 1 నుంచి 12 తరగతుల వారికోసం వారాలవారీ ప్రణాళికను ఎన్‌సీఈఆర్‌టీ మూడు భాషల్లో రూపొందించింది. ఇలా వివిధ వర్గాల విద్యార్థులకు తగిన రీతితో ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారం తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655697

కోవిడ్‌-19 సమయంలో గిరిజనులకు మద్దతుగా పలు చర్యలు చేపట్టిన ప్రభుత్వం

కోవిడ్ -19 మహమ్మారి అనంతర ఆర్థిక వ్యవస్థలో వృద్ధి పునరుద్ధరణకు మార్గ ప్రణాళిక  సిద్ధం చేయడంతోపాటు సంబంధిత చర్యల అమలు/సాకారం దిశగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. అలాగే సూక్ష్మ అటవీ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను కూడా మంత్రిత్వశాఖ సవరించింది. ఈ ఉత్పత్తుల సేకరణద్వారా గిరిజనులకు ఆదాయార్జన సమకూరేవిధంగా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలను కూడా జారీచేసింది. దీంతోపాటు తమ శాఖ తీసుకున్న ఇతరత్రా చర్యల గురించి రాజ్యసభలో ఇవాళ ఒక ప్రశ్నకు జవాబుగా ఇచ్చిన లిఖితపూర్వక సమాచారంలో కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి శ్రీమతి రేణుకా సింగ్ సరుటా ఈ అంశాలను వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655895

దిగ్బంధ కాలంలో విద్యార్థులకు ఆహార సరఫరా

కోవిడ్ మహమ్మారి కారణంగా దేశమంతటా పాఠశాలలు మూసివేసిన నేపథ్యంలో అర్హతగల బాలలందరికీ ఆహార  ధాన్యాలు, పప్పుదినుసులు, నూనె తదితరాలను (వంట ఖర్చుతో సమానంగా) ఆహార భద్రత భత్యం కింద అందజేయాలని రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. రాజ్యసభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన సందర్భంగా కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ దీనికి సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655718

దిగ్బంధం సమయంలో మహిళలపై గృహ హింస

దేశంలో ఏప్రిల్ 2020 నుంచి జూన్ నెలల మధ్య 2878 గృహహింస కేసులలో న్యాయ సహాయం అందించినట్లు జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ (NALSA) ఇచ్చిన నివేదిక పేర్కొంది. మరోవైపు గృహహింస నుంచి మహిళలకు రక్షణ చట్టం-2005 కింద 452 కేసులలో ఫిర్యాదులు దాఖలైనట్లు తెలిపింది. ఇక మరో 694 కేసులను సలహాలు/ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించినట్లు వివరించింది. మొత్తంమీద మహిళలకు రక్షణ, సహాయం దిశగా చేపట్టిన అనేక చర్యల గురించి రాజ్యసభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన సందర్భంగా కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655826

కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో విమానయాన పరిశ్రమ పునరుద్ధరణకు చర్యలు

దేశంలో విమానయాన రంగంపై కోవిడ్‌-19 ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. మహమ్మారి కారణంగా దేశీయ విమాన సేవలను దశలవారీగా పునఃప్రారంభించారు. ఆ మేరకు తొలుత 2020 వేసవి షెడ్యూల్‌లో మూడింట ఒక వంతు మాత్రమే నడిపేందుకు అనుమతించగా 2020 జూన్ 26న 45 శాతానికి, 2020 సెప్టెంబర్ 2న 60 శాతానికి పెంచారు. ప్రాంతీయ అనుసంధాన పథకం కింద ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉడాన్ విమానాలు నడిపేందుకు అనుమతి లభించింది. దీంతోపాటు ఇతర దేశాలకు విమానాలు నడిపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ మేరకు ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాచారమిచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655672

వందేభారత్‌ మిషన్‌ కింద స్వదేశానికి చేర్చిన భారతీయుల వివరాలు

వందే భారత్ మిషన్‌లో భాగంగా భారత విమానయాన సంస్థల అధికారిక విమానాలతోపాటు విదేశీ సంస్థలు ప్రత్యేక విమానాలను కూడా నడిపాయి. ఈ మేరకు కోవిడ్‌ మహమ్మారి సమయంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన పౌరులను స్వదేశం చేర్చాయి. దీనిపై విదేశాంగ మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాచారం మేరకు- 31.08.2020 నాటికి మొత్తం 5817 విమానాలు (భారతదేశానికి వచ్చేవి) నడిచాయి. పౌర విమానయాన శాఖ సహాయమంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి నిన్న రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655029

కోవిడ్‌-19 వేళ క్రీడాకారులు, శిక్షకుల కోసం పలు చర్యలు తీసుకున్న ప్రభుత్వం

కోవిడ్‌-19 సమయంలో దేశంలోని క్రీడాకారులు, శిక్షకులకు అన్నివిధాలా మద్దతిచ్చినట్లు భారత క్రీడా ప్రాధికార సంస్థ (SAI) తెలిపింది. ఈ మేరకు వారిపై ఆర్థికంగా ఎలాంటి నియంత్రణలు విధించలేదని పేర్కొంది. అలాగే దిగ్బంధం సమయంలో వారి క్రీడాభ్యాసం, శిక్షణ కోసం అన్ని సదుపాయాలూ కల్పించినట్లు వివరించింది. కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖ సహాయ (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజు లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655029

కోవిడ్‌-19 మహమ్మారివల్ల గోవాలో నిర్వహించాల్సిన  36వ జాతీయ క్రీడోత్సవాలు వాయిదా

ఈ ఏడాది 36వ జాతీయ క్రీడోత్సవాలను గోవా నిర్వహించాల్సి ఉండగా కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా వాయిదాపడ్డాయి. వాస్తవానికి మొదట నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం 20.10.2020 నుంచి 04.11.2020దాకా ఈ క్రీడలను నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.97.80 కోట్ల ఆర్థిక సహాయాన్ని కూడా విడుదల చేసింది. కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖ సహాయ (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజు లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655887

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో వృద్ధులకు కోవిడ్‌ ముప్పున్న దృష్ట్యా నిర్దేశించిన మార్గదర్శకాలను వారు తూచా తప్పకుండా పాటించడంపై పాలన యంత్రాంగాధిపతి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇతర పౌరులు కూడా కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ స్వీయ సంయమనం పాటించాలని సూచించారు. అలాగే పరిశుభ్రత, ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించడం, మాస్కు ధరించడం వంటివి అనుసరించడంపై పౌరులకు అవగాహన కల్పించడానికి మరిన్ని చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
  • పంజాబ్: రాష్ట్రంలోని కోవిడ్‌ రోగుల కోసం ఎప్పుడూ 200 సిలిండర్లు అందుబాటులో ఉండేలా చూడాలని పంజాబ్‌ వైద్యవిద్య-పరిశోధన శాఖ మంత్రి మూడు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఈ దిశగా సరఫరా శృంఖలాన్ని బలోపేతం చేసేందుకు సిలిండర్ల అందుబాటు జాబితాను రూపొందించాలని కోరారు. అలాగే ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సజావుగా సరఫరా అయ్యేలా చూడాలని ఫోన్‌ద్వారా సరఫరాదారులను ఆదేశించారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 2020 సెప్టెంబరు 15 నుంచి బార్లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని నిబంధనలూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఆ మేరకు జారీచేసిన ప్రామాణిక విధివిధానాల్లో భాగంగా సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్లు సిద్ధంగా ఉంచాలని, థర్మల్ స్ర్రీనింగ్‌ సదుపాయం కల్పించాలని నిర్దేశించింది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 221 కొత్త కేసుల నమోదుతోపాటు 129 మంది డిశ్చార్జ్ అయ్యారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రస్తుతం 1892 క్రియాశీల కేసులుండగా ఇప్పటివరకూ మొత్తం 4787మందికి వ్యాధి నయమైంది. మరోవైపు మరణించినవారి సంఖ్య 13గా ఉంది.
  • అసోం: రాష్ట్రంలో నిన్న 2394 మందికి కోవిడ్‌ నిర్ధారణ కాగా, మరోవైపు 2464 మంది డిశ్చార్జ్ అయ్యారు, ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 29,091 కాగా, ఇప్పటిదాకా 119364 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 1,48,968, మరణాలు 511గా ఉన్నాయి.
  • మణిపూర్: రాష్ట్రంలో 110 కొత్త కేసులు నమోదవగా 78 శాతం కోలుకునే సగటుతో 103 మందికి వ్యాధి నయమైంది. మణిపూర్‌లో 1751 క్రియాశీల కేసులుండగా మృతుల సంఖ్య 48గా ఉంది.
  • నాగాలాండ్: రాష్ట్రంలో ఇవాళ 43 కొత్త కేసులు నమోదవగా, 111 మందికి వ్యాధి నయమైంది. కాగా, దిమాపూర్ జిల్లా ఆస్పత్రి సెప్టెంబర్ 21 నుంచి కోవిడేతర వైద్య సేవలను తిరిగి ప్రారంభిస్తుంది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో బుధవారం ఒకేరోజు 23,365 కొత్త కేసులతో  మొత్తం కేసుల సంఖ్య 11.21 లక్షలకు పెరిగినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే 474 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 30,883కు పెరిగినట్లు పేర్కొంది. దిగ్బంధ విముక్తి ప్రక్రియను సజావుగా అనుసరించకపోవడం, ప్రజలు నిబంధనలను పాటించకపోవడమే కేసుల విజృంభణకు కారణమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే అన్నారు.
  • గుజరాత్: రాష్ట్రంలో ప్రైవేట్ ప్రయోగశాలలలో కోవిడ్-19 నిర్ధారణ కోసం ఆర్టీ-పీసీఆర్ పరీక్ష రుసుమును ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు ఇకపై రూ.2,500కు బదులు రూ.1,500 మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. అయితే, ఇంటివద్ద సేకరించే నమూనాలకు రూ.2,000గా ధర నిర్ణయించింది. గత 24 గంటల్లో గుజరాత్‌లో 1,364 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 1.17 లక్షలు దాటాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 16,294గా ఉంది.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో బుధవారం 3189 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 73,966కు పెరిగాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో 37,470 క్రియాశీల కేసులున్నాయి. వివిధ ఆస్పత్రులనుంచి 689 మంది డిశ్చార్జితో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 30,611కు పెరిగింది.
  • కేరళ: కోవిడ్-19తో వలస వచ్చిన కార్మికులు లక్షణరహితంగా ఉంటే కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో పని చేయడానికి అనుమతిస్తూ జారీచేసిన ఉత్తర్వును సరిదిద్దాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర్వును ఒక వర్గం వైద్యులు వ్యతిరేకించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మత్రి కె.టి.జలీల్‌ రాజీనామా డిమాండ్‌తో వివిధ పార్టీలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఇవాళ వరుసగా ఐదోరోజు హింసాత్మక నిరసనలతో కోవిడ్‌ నిబంధనలను నిరసకారులు పూర్తిగా ఉల్లంఘించారు. చాలా చోట్ల పోలీసులు లాఠీచార్జి చేయడంతోపాటు జలఫిరంగులు ప్రయోగించారు. కేరళలో నిన్న అత్యధికంగా 3,830 కోవిడ్ కేసులు నమోదవగా చికిత్స పొందే రోగుల సంఖ్య 32,709కి చేరింది. ప్రస్తుతం 2,11,037 మంది రాష్ట్రవ్యాప్తంగా పరిశీలనలో ఉండగా మరణాల సంఖ్య 480గా ఉంది.
  • తమిళనాడు: రాష్ట్రంలో ఇ-పాస్ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై మద్రాస్‌ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసు జారీచేసింది. కాగా, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల మధ్య రాకపోకలను నియంత్రింరాదు. కాగా, తమిళనాడు ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ రూపొందించిన అంతర్గత నివేదికలోని కొంత భాగం బహిరంగంగా లభ్యమయ్యే కోవిడ్‌ ప్రకటనలోని వివరాలకు భిన్నంగా ఉందని మాధ్యమ కథనాలు పేర్కొన్నాయి. అయితే, వివరాల నమోదులో పొరపాట్లవల్ల ఈ తేడా కనిపిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి జె.రాధాకృష్ణన్ చెప్పారు. రాష్ట్రంలో నిన్న 5,652 తాజా కేసులు, 57 మరణాలు సంభవించాయి. కేసుల సంఖ్య 5,19,860కి చేరింది. అలాగే 5,768 మంది డిశ్చార్జ్ కాగా, చెన్నైలో 983 తాజా కేసులు నమోదయ్యాయి.
  • కర్ణాటక: ఈ ఏడాది వివిధ రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల కింద వ్యవసాయ, వ్యవసాయేతర కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.39,300 కోట్ల ఆర్థిక సహాయం అందజేస్తుందని ముఖ్యమంత్రి బి.ఎస్.యెడియూరప్ప తెలిపారు. కాగా, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కోవిడ్‌ రోగులకు 50 శాతం పడకలను కేటాయించని 36 ప్రైవేట్ ఆసుపత్రులకు బిబిఎంపీ నోటీసు జారీచేసింది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన దిగ్బంధ విముక్తి-4.0 ఆదేశాల మేరకు పాఠశాలల పునఃప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ విభాగాలు తమ పరిధిలోని పాఠశాలలను సెప్టెంబర్ 21నుంచి ప్రారంభించడంపై దృష్టి సారించాయి. 'నియంత్రణ' జోన్ల వెలుపల ప్రభుత్వ-ప్రైవేట్, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు మాత్రమే తెరవబడతాయి. ఆన్‌లైన్ బోధన, టెలి-కౌన్సెలింగ్, విద్య మొదలైనవాటికి 50శాతం ఉపాధ్యాయులు హాజరుకావచ్చు. రాష్ట్ర శాసనసభలో ఇప్పటిదాకా మొత్తం 157 మంది ఉద్యోగులకు కోవిడ్‌ నిర్ధారణ అయింది. కాగా, బుధవారం 18 మంది వైరస్ బారిన పడ్డారు.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2159 కొత్త కేసులు, 9 మరణాలు నమోదవగా 2108 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. కొత్త కేసులలో 318 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,65,003; క్రియాశీల కేసులు: 30,443; మరణాలు: 1005; డిశ్చార్జి: 1,33,555గా ఉన్నాయి. కోవిడ్-19 వ్యాప్తి మధ్య ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, శాసనసభ సిబ్బంది, పోలీసు సిబ్బంది భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర శాసనమండలి, శాసనసభల వర్షాకాల సమావేశాలు బుధవారం నిరవధికంగా వాయిదాపడ్డాయి.

***


(Release ID: 1655910) Visitor Counter : 228