PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 15 JUL 2020 6:27PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • 24 గంటల్లో 20,000 మందికిపైగా కోవిడ్‌-19 నుంచి కోలుకోగా, కోలుకునేవారి శాతం 63.24కు చేరిక.
  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 లక్షలకు చేరువగా కోలుకున్నవారి సంఖ్య.
  • దేశంలో ఇవాళ్టికి చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,19,840.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా మేరకు మొత్తం 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే ప్రతి 10 లక్షల జనాభాకు రోజువారీ 140 అంతకన్నా ఎక్కువగా రోగ నిర్ధారణ పరీక్ష.
  • కోవిడ్‌-19 నిర్ధారణ కోసం ఐఐటీ-ఢిల్లీ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత అందుబాటు ధరగల ‘కొరోష్యూర్‌’ కిట్‌ను విడుదల చేసిన హెచ్‌ఆర్‌డి మంత్రి.
  • కోవిడ్‌-19 పరిష్కార సంబంధిత అంకుర సంస్థలకు మద్దతిచ్చే మంత్రిత్వశాఖలు, భాగస్వాములతో అటల్‌ ఇన్నొవేషన్‌ మిషన్‌ భాగస్వామ్యం.

Image

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం; 24 గంటల్లో 20,000 మందికిపైగా కోలుకోగా, కోలుకునేవారి శాతం 63.24కు చేరిక; కోలుకున్న కేసులు 6 లక్షలకు చేరువ; యాక్టివ్ కేసులు 3,19,840 మాత్రమే

దేశ‌వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 20,572 మంది కోలుకోగా ఇప్ప‌టివ‌ర‌కూ వ్యాధి న‌య‌మైన‌వారి సంఖ్య 5,92,031కి పెరిగింది. దీనికి అనుగుణంగా  కోలుకునేవారి జాతీయ సగటు 63.24 శాతానికి చేరింది. దేశమంతటా ముమ్మర పరీక్షలు, సకాలంలో రోగ నిర్ధారణ, రోగులకు ఆస్పత్రులు, సంరక్షణ కేంద్రాలుసహా ఏకాంత గృహవాసంలో సమర్థ వైద్య పర్యవేక్షణ-నిర్వహణ కారణంగా కోలుకునేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆ మేరకు ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య కేవలం 3,19,840గా మాత్రమే ఉంది. ఏకాంత గృహవాస చికిత్సకు సంబంధించి ఆక్సీమీటర్ల వినియోగంసహా నిబంధనలు-ప్రమాణాలనునిర్దేశించిన నేపథ్యంలో రోగలక్షణాలు లేని, స్వల్ప లక్షణాలుగల రోగులవల్ల ఆస్పత్రులపై భారం పడకుండా చికిత్స కొనసాగుతోంది. ఈ చర్యలన్నిటి కారణంగా చికిత్సలో ఉన్నవారికన్నా కోలుకున్నవారి మధ్య అంతరం క్రమేణా పెరుగుతూ ప్రస్తుతం 2,72,191 మేర అధికంగా న‌మోదైంది. మొత్తం కేసులలో యాక్టివ్‌కన్నా, కోలుకున్న కేసుల సగటు 1.85 మేర ఎక్కువగా ఉంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638843

ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా నేపథ్యంలో 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే ప్రతి 10 లక్షల జనాభాకు రోజువారీ 140 అంతకన్నా ఎక్కువగా పరీక్షలు; ప్రతి 10 లక్షలకూ 8,994గా నమోదైన సగటు

“కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రజారోగ్యాంశాల రీత్యా ప్రజారోగ్య-సామాజిక చర్యల సర్దుబాటు”పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ మార్గదర్శక పత్రం జారీచేసింది. ముఖ్యంగా అనుమానిత కేసులపై సమగ్ర నిఘా అవసరమని సలహా ఇచ్చింది. ఇందులో భాగంగా అన్ని దేశాల్లోనూ ప్రతి 10 లక్షల జనాభాకు రోజువారీ కనీసం 140 రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. అయితే, కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు చేపట్టిన కారణంగా భారత్‌లోని 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే నిత్యం ప్రతి పది లక్షల జనాభాకు 140కిపైగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 

States testing more than 140 per day per million.jpg

తదనుగుణంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగంలో 865, ప్రైవేట్‌ రంగంలో 358వంతున మొత్తం 1,223 ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. గత 24 గంటల్లో 3,20,161 పరీక్షలు నిర్వహించగా ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం నమూనాల సంఖ్య 1,24,12,664కు చేరింది. భారతదేశంలో ప్రతి పది లక్షల జనాభాకు నిర్వహించే పరీక్షల సంఖ్య స్థిరంగా పెరుగుతూ నేటికి 8,994.7కు చేరింది, ఒక్కరోజులో 3.2 లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించడం ఇందుకు నిదర్శనం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638764

కోవిడ్‌-19 నిర్ధారణ కోసం ఐఐటీ-ఢిల్లీ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత అందుబాటు ధరగల కొరోష్యూర్‌కిట్‌ను విడుదల చేసిన హెచ్‌ఆర్‌డి మంత్రి

కోవిడ్‌-19 నిర్ధారణకు ప్రపంచంలోనే అత్యంత అందుబాటు ధరగల కొరోష్యూర్‌కిట్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఇవాళ ఆన్‌లైన్‌ మాధ్యమంద్వారా న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఈ ఆర్‌టీ-పీసీఆర్ ఆధారిత కిట్‌ను ఐఐటీ-ఢిల్లీ రూపొందించగా దీనికి ఐసీఎంఆర్‌, డీసీజీఐ ఆమోదం కూడా లభించింది. ఈ సందర్భంగా శ్రీ పోఖ్రియాల్‌ మాట్లాడుతూ- ప్రధానమంత్రి పిలుపునిచ్చిన స్వావలంబన భారతం దిశగా ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రూపొందించిన ఈ కోవిడ్-19 నిర్ధారణ కిట్‌ ‘కొరోష్యూర్‌’ ఒక ముందడుగని పేర్కొన్నారు. మహమ్మారి నియంత్రణ కృషిలో సాయపడగల చౌకైన, విశ్వసనీయమైన పరీక్ష విధానం దేశానికెంతో అవసరమన్నారు. దేశీయంగా లభ్యమయ్యే సామగ్రితో స్వదేశంలో రూపొందించిన ‘కొరోష్యూర్‌’ ఇతర పరీక్ష కిట్లకన్నా ఎంతో చౌకైనదని మంత్రి చెప్పారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638874

ప్ర‌పంచ యువ‌జన నైపుణ్య దినోత్స‌వం నేపథ్యంలో ‘నైపుణ్య సాధ‌న‌.. మెరుగు.. ప్రావీణ్య స‌ముపార్జ‌న’ ‌దిశ‌గా సాగాలని యువ‌త‌రానికి ప్ర‌ధాన‌మంత్రి పిలుపు

ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవంతోపాటు నైపుణ్య భారతంకార్యక్రమ ఐదో వార్షికోత్సవం నేపథ్యంలో ఇవాళ నిర్వహించిన “డిజిటల్ స్కిల్స్ కాన్‌క్లేవ్‌’కు ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఒక సందేశం పంపారు. ప్రపంచంలో శరవేగంగా పరిణామం చెందుతున్న నేటి వాణిజ్య వాతావరణం-విపణి పరిస్థితుల నడుమ తదనుగుణంగా ముందడుగు వేయాలంటే ‘నైపుణ్య సాధ‌న‌.. మెరుగు.. ప్రావీణ్య స‌ముపార్జ‌న’ ‌దిశ‌గా సాగాలని యువతకు పిలుపునిచ్చారు. ఏ వేళనైనా కొత్త నైపుణ్యాలు సాధించగల సామర్థ్యం యువతకు ఉన్నందువల్ల ప్రస్తుత ప్రపంచం వారిదేనని ఆయన పేర్కొన్నారు. ‘నైపుణ్య భారతం’ కార్యక్రమం ఐదేళ్ల కిందట ఇదేరోజు ప్రారంభమైందని గుర్తుచేశారు. తద్వారా నేడది నైపుణ్య సాధనకు, నిపుణతను మెరుగుపరచుకునేందుకు, ప్రావీణ్య సముపార్జనకు అనువైన విస్తృత మౌలిక సదుపాయాలను కల్పించిందని పేర్కొన్నారు. దీనివల్ల జాతీయంగా, అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలను మరింతగా అందుకునే వీలు కల్పించిందని ఆయన వివరించారు. ఇది నిపుణులైన శ్రామికులు, స్వస్థలాలకు తిరిగివచ్చిన వలస కార్మికులు సులభంగా ఉపాధి అవకాశాలు పొందే వీలు కలుగుతుందని వివరించారు. ఆ మేరకు ఉద్యోగార్థులు, యాజమాన్యాలు ఒక్క కంప్యూటర్ మౌస్ క్లిక్‌తో ఒకరినొకరు సంప్రదించుకోవచ్చునని తెలిపారు. వలస కార్మికుల నైపుణ్యాలతో స్థానిక ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చడంలోనూ సాయపడగలవని ఆయన ఉద్ఘాటించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638788

ప్ర‌పంచ యువ‌జన నైపుణ్య దినోత్స‌వం నేపథ్యంలో ప్రధాని ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638895

భారత-ఐరోపా సమాఖ్య 15వ (వాస్తవిక సాదృశ) సదస్సు: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638783

ఆల్కహాల్‌ ఆధారిత పరిశుభ్రకాలపై జీఎస్టీ విధింపు శాతం గురించి వివరణ

ఆల్కహాల్‌ ఆధారిత హస్త పరిశుభ్రకాలకు కూడా 18 శాతం వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వర్తిస్తుండటంపై కొన్ని మాధ్యమాలలో వార్తలు వెలువడ్డాయి. ఆ మేరకు హస్త పరిశుభ్రకాలు కూడా సబ్బులు, బ్యాక్టీరియా నిర్మూలక ద్రావకాలు, డెట్టాల్‌ వంటి సూక్ష్మజీవి నాశకాలు కాబట్టి 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. వివిధ వస్తువులపై పన్ను విధింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన అనంతరమే జీఎస్టీ మండలి నిర్ణయిస్తుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638841

కోవిడ్‌-19 పరిష్కార సంబంధిత అంకుర సంస్థలకు మద్దతిచ్చే మంత్రిత్వశాఖలు, భాగస్వాములతో అటల్‌ ఇన్నొవేషన్‌ మిషన్‌ భాగస్వామ్యం

కో‌విడ్ సంక్షోభం, ఆర్థిక వ్యవస్థల స్తంభన ఒకవైపు ప్రపంచాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని ప్రతిష్ఠాత్మక విభాగం “అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎమ్) ఇనుమడించిన ఉత్సాహంతో ముందడుగు వేయడం విశేషం. ఆ మేరకు దేశవ్యాప్తంగాగల ఔత్సాహిక వ్యాపార స్ఫూర్తిని సమున్నతంగా ఉంచుతూ కోవిడ్‌-19 పరిష్కారం దిశగా వినూత్న ఆవిష్కరణలకు యత్నించే ఇతర మంత్రిత్వశాఖలు, భాగస్వాములతో అంకుర సంస్థలకు మద్దతిచ్చేలా అవగాహన కుదుర్చుకుంది. ఈ మేరకు కోవిడ్ నిరోధం-నియంత్రణ, సహకారానికి వీలుగా ఆయా విభాగాలకు దాదాపు వెయ్యికి పైగా ఆవిష్కరణలతో అంకుర సంస్థలు ముందుకొచ్చాయి. రెండు దశలలో వీటిని పరిశీలించిన తర్వాత వాస్తవిక సాదృశ నమూనాల ప్రదర్శన కోసం 70 ప్రతిపాదనలను ఎంపిక చేశారు. అంతిమంగా ఎంపికైన ఈ అంకుర సంస్థలు నిధులు, తయారీ సౌకర్యాలు, సరఫరా గొలుసులు, మౌలిక సదుపాయాలు సమకూర్చడంసహా సముచిత మార్గనిర్దేశకులను,  కొనుగోలుదారులను కూడా కలుపుతుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638610

ప్రపంచ స్థిరత్వం.. భద్రత.. ఆర్థిక శ్రేయస్సు ఉమ్మడి ప్రయోజన చోదకాలుగా భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో అసాధారణ వేగం: పీయూష్ గోయల్

భారత-అమెరికా సీఈవోల వేదిక 2020 జూలై 14న దూరవాణి మాధ్యమంద్వారా సమావేశమైంది. కేంద్ర వాణిజ్య-పరిశ్రమలు, రైల్వే శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్‌తోపాటు అమెరికా వాణిజ్యశాఖ మంత్రి విలియం రాస్ దీనికి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్ఠానికేగాక సమావేశంలో పాల్గొని చొరవ చూపిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు, సమావేశానికి సహాధ్యక్షత వహించిన అధికారులకు అమెరికా వాణిజ్య మంత్రి రాస్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకించి కోవిడ్-19 మహమ్మారి ప్రబలిన సంక్షోభ సమయాన చొరవ చూపినందుకుగాను ధన్యవాదాలు తెలియజేశారు. ఔషధాలు, వైద్య పరికరాల తయారీ, సరఫరా రంగంలో పరస్పర సహకారంద్వారా రెండు దేశాలూ మరింత చేరువయ్యేందుకు ఈ సమావేశం ఒక అవకాశం కల్పించిందని రాస్ అన్నారు. కాగా, ప్రపంచ స్థిరత్వం..  భద్రత.. ఆర్థిక శ్రేయస్సు ఉమ్మడి ప్రయోజన చోదకాలుగా భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో అసాధారణ వేగం కనిపిస్తున్నదని శ్రీ పీయూష్ గోయల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలలో చిన్న వ్యాపారాలకుగల ప్రాముఖ్యాన్ని ఈ రంగంలో ఉపాధి అవకాశాలను, నైపుణ్యాలను పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ అనంతర ప్రపంచంలో అనుసరించాల్సిన నవ్యపథ రూపకల్పనలో సీఈవోల వేదిక ముందుండి నడపాలని ఆయన సూచించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638770

పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సీబీఎస్‌ఈ; ఉత్తీర్ణతలో త్రివేండ్రం అగ్రస్థానం

కేంద్ర మాధ్యమిక విద్యాబోర్డు (సీబీఎస్‌ఈ) ఇవాళ పదో తరగతి ఫలితాలను ప్రకటించింది. కేరళ రాజధాని త్రివేండ్రం ఈ పరీక్షలలో 99.28 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక చెన్నై 98.95 శాతం, బెంగళూరు 98.23 శాతంతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638877

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ ప్రగతిపై ఆరు రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ సమీక్ష

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ ప్రగతిపై ఆరు రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, సీనియర్‌ అధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిషా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ కార్యక్రమం 2020 జూన్‌ 20న ప్రారంభమైంది. దీనికింద 125 రోజులపాటు ఆయా జిల్లాల్లో సాగే 25 రకాల పనుల ప్రగతిని కేంద్రమంత్రి సమీక్షించారు. పనులను మరింత వేగిరపరచాలని, సాధ్యమైనంత విస్తృతంగా మౌలిక సదుపాయాల సృష్టి జరగాలని ఆయన నొక్కిచెప్పారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638655

స్వయం సమృద్ధ భారతంపై ఎన్‌వైకేఎస్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలద్వారా అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు శ్రీ కిరణ్‌ రిజిజు పిలుపు

కేంద్ర క్రీడ‌లు-యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి  శ్రీ కిర‌ణ్ రిజిజు నిన్న 18 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల‌ క్రీడ‌లు-యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రులు, సీనియ‌ర్ అధికారుల‌తో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు. కోవిడ్-19 అనంత‌ర కాలంలో క్రీడా కార్యకలాపాల పునరుద్ధరణ దిశగా మార్గ ప్రణాళిక రూపకల్పనపై చర్చ నిమిత్తం ఈ భేటీ నిర్వహించారు. అలాగే రాష్ట్రాల స్థాయిలో వివిధ పథకాలను ప్రోత్స‌హించడంపై నెహ్రూ యువ కేంద్ర సంఘ‌ట‌న్(ఎన్‌వైకెఎస్‌), నేష‌న‌ల్ సోషల్‌ స‌ర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్ ) కార్యకర్తలను భాగస్వాములను చేయడంపైనా ఈ సందర్భంగా చర్చించారు. కాగా, కోవిడ్-19 స‌మ‌యంలో పౌర యంత్రాంగంతోపాటు ఎన్‌వైకెఎస్‌, ఎన్‌ఎస్ఎస్ కార్యకర్తలు దాదాపు 75వేల మంది విశేష రీతిలో సేవ‌లందించారని కిరణ్‌ రిజిజు తన ప్రసంగంలో కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత దిగ్బంధ విముక్తి రెండో దశలో వారి సంఖ్యను కోటిదాకా పెంచాలని తమ మంత్రిత్వశాఖ యోచిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638623

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో కోవిడ్ చికిత్స పొంది కోలుకుని వచ్చే ఉద్యోగులను విధుల్లో చేర్చుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తిరస్కరించకుండా చూడాలని  కార్మికశాఖ కార్యదర్శిని నగరపాలన యంత్రాంగం అధినేత ఆదేశించారు. చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నవారికి మళ్లీ కరోనా సంక్రమించే అవకాశం లేనందువల్ల ఆ వ్యక్తులు సురక్షితంగా ఉన్నట్లేనని పేర్కొన్నారు.
  • పంజాబ్: పంజాబ్‌లో 72 గంటలలోగా పనిచూసుకుని తిరిగివెళ్లేవారికి తప్పనిసరి గృహ నిర్బంధంనుంచి  ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆ మేరకు వారు సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద స్వీయ బాధ్యత పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షలు లేదా వ్యాపార అవసరాల నిమిత్తం వచ్చే ప్రయాణికులు కోసం ఈ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. వారు రాష్ట్రంలో బసచేసే సమయంలో తమ ఆరోగ్యంపై పర్యవేక్షణతోపాటు చుట్టుపక్కల వారినుంచి సామాజిక దూరం పాటించాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. ఒకవేళ వారు కోవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతుంటే, నిర్దిష్ట నిఘా బృందంతో సంప్రదించి, వెంటనే 104 నంబరుకు కాల్‌ చేయాల్సి ఉంటుంది.
  • హర్యానా: రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 సవాలును ఒక అవకాశంగా మలచుకుని వివిధ పారిశ్రామిక, ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిందని, దీంతో 60కిపైగా పెద్ద కంపెనీలు హర్యానాలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయని ముఖ్యమంత్రి చెప్పారు. అంతేకాకుండా కరోనా అనంతర కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణు ప్రభుత్వం మార్గ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది, దీనికింద వివిధ రంగాల ప్రముఖులతో అనేక కార్యాచరణ బృందాలు ఏర్పాటయ్యాయి.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 నియంత్రణకు ప్రభుత్వం సమర్థ చర్యలు తీసుకుంటున్నదని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. దిగ్బంధ విముక్తి ప్రక్రియ తర్వాత రాష్ట్రంలో వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఏదేమైనా, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చేవారివల్ల కేసుల పెరుగుదల దృష్ట్యా పారిశ్రామిక కార్మికులను సంస్థాగత నిర్బంధం లేదా గృహ నిర్బంధంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కోవిడ్‌-19 సోకలేదని నిర్ధారణ అయినవారిని మాత్రం పనికి అనుమతిస్తారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,741 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,67,655కు చేరింది. ఇప్పటిదాకా 1.49 లక్షలమంది కోలుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,07,963గా ఉంది. ఇక ముంబైలో మంగళవారం 969 మంది కొత్త కేసులు నమోదవగా 1011 మంది కోలుకున్నారు... 70 మంది మరణించారు. దీంతో ముంబైలో కేసుల సంఖ్య 94,863కు పెరిగింది; కోలుకున్నవారి సంఖ్య 66,633; మరణాల సంఖ్య 5402గా ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో 22,828 యాక్టివ్‌ కేసులుండగా కోవిడ్-19 కేసుల రెట్టింపు వ్యవధి 52 రోజులకు చేరింది.
  • గుజరాత్: రాష్ట్రంలో 951 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 43,723కు చేరాయి. మంగళవారం 14 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 2071కి చేరింది. సూరత్ జిల్లాలో 291, అహ్మదాబాద్‌లో 154 వంతున అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక దుకాణాలు, మార్కెట్లు, పారిశ్రామిక యూనిట్లుసహా సూరత్ వస్త్ర-వజ్రాల కేంద్రం స్వచ్ఛందంగా వ్యాపారాలను మూసివేశారు. కాగా, 35,000కుపైగా దుకాణాలున్న 25కుపైగా వస్త్ర మార్కెట్లు జూలై 20 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయం వరకూ 235 కొత్త కేసులతో మొత్తం కేసులు 25,806కు పెరిగాయి. ఇప్పటిదాకా 19,199మంది కోలుకోగా ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 6,080 మాత్రమే కావడం విశేషం. ఇక రాజస్థాన్‌లో మృతుల సంఖ్య 527గా ఉంది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో మంగళవారం ఒకేరోజు అత్యధికంగా 798 కేసులు నమోదవగా మొత్తం కేసులు 19,005కు పెరిగాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో 4757 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకూ 13,575 మంది కోలుకున్నారు. ఒకమృతుల సంఖ్య 673గా ఉంది. కొత్త కేసులలో గరిష్టంగా గ్వాలియర్‌లో 190, భోపాల్‌లో 103, మొరెనాలో 98 వంతున నమోదయ్యాయి.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో 105 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 4,379కి చేరాయి. ప్రస్తుతం 1,084 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
  • గోవా: గోవాలో మంగళవారం 170 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 2,753కు చేరాయి. ఇప్పటిదాకా 1,607 మంది కోలుకోగా మృతుల సంఖ్య 18గా ఉంది. ప్రస్తుతం 1,128 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా శుక్రవారం నుంచి గోవాలో మూడు రోజుల దిగ్బంధం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం ప్రకటించారు. ఆగస్టు 10వ తేదీవరకూ గోవాలో రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించబడుతుంది. ఆ సమయంలో వైద్య సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి నామ్‌సాయ్ జిల్లా యంత్రాంగం ఈ రాత్రి 10 గంటల నుంచి జూలై 23 వరకు  తొమ్మిది రోజులపాటు దిగ్బంధం విధించింది. ఇటానగర్‌లోని న్యూ ఎమ్మెల్యే అపార్టుమెంటులలో ప్రతిపాదిత దిగ్బంధవైద్య కేంద్రం కేవలం కోవిడ్‌-19 రోగులకు మాత్రమేగాక విషమ స్థితిలోగల అన్నిరకాల రోగులకూ సేవలందిస్తుందని అరుణాచల్ ప్రదేశ్ ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రకటించారు.
  • అసోం: రాష్ట్రంలోని టియోక్‌ రాజబరి హెచ్‌ఎస్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరంలోగల వరద బాధితులతో అసోం ముఖ్యమంత్రి శ్రీ సర్వానంద సోనోవాల్ ఇవాళ కొద్దిసేపు ముచ్చటించారు. కాగా, రాష్ట్రంలోని వివిధ వరద బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 198 సహాయ శిబిరాల్లో ప్రస్తుతం 44,000 మంది తలదాచుకున్నారు.
  • మణిపూర్: రాష్ట్రంలోని కాక్‌చింగ్‌ జిల్లాలోని పల్లేల్‌ బజార్‌లో మాదకద్రవ్యాలు-మద్యం వ్యతిరేక కూటమి జిల్లా కమిటీ, యునైటెడ్ పీపుల్స్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ సంయుక్తంగా కోవిడ్‌-19పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
  • మిజోరం: మిజోరం బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఎంబిఎస్‌ఇ) నిన్న 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 78.52 శాతం పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.
  • కేరళ: కేరళలో జూలై 31 వరకు నిరసనలు, సమ్మెలు, ప్రదర్శనలపై హైకోర్టు ఇవాళ నిషేధించింది. అలాగే కోవిడ్-19 మహమ్మారిపై కేంద్రం సూచనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోళికోడ్‌లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో తదుపరి ఆదేశాలిచ్చేదాకా ఆదివారాల్లో పూర్తి దిగ్బంధం పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే కోళికోడ్‌లోని తునేరిలో ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ నిన్న 53 కేసులు నమోదవగా ఇవాళ మరో 43 నమోదవడం గమనార్హం. మరోవైపు రెండు నౌకాశ్రయాలు కూడా మూసివేయబడ్డాయి. రాష్ట్రంలో ఇవాళ రొకరు మరణించడంతో మొత్తం మరణాలు 35కు చేరాయి. రాష్ట్రంలో నిన్న 608 కొత్త కేసులు నమోదవగా వాటిలో 396 పరిచయాల కేసులుగా తేలాయి. ప్రస్తుతం 4,454 మంది చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 1,81,847 మంది నిఘాలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 67 కొత్త కేసుల నమోదుతోపాటు ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,596కు చేరింది. చెన్నైలోని ఐసీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్‌లో బీసీజీ వ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షలకు తమిళనాడు ప్రభుత్వం సమ్మతి తెలిపింది. దీనిపై ఆరోగ్య మంత్రి సి.విజయభాస్కర్ మాట్లాడుతూ- వృద్ధులకు బీసీజీ టీకాలు వేయడంవల్ల కోవిడ్-19 తీవ్రత తగ్గుతుందని, అలాగే ఆస్పత్రులలో మరణాల శాతం తగ్గడంతోపాటు కొత్త కేసులు రావడం కూడా గణనీయంగా తగ్గుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాల్లో కేసులు పెరుగుతుంటే, చెన్నైలో నియంత్రణలోకి రావడం గమనార్హం. ఈ మేరకు మదురై, తిరువళ్లూరు, విరుద్‌నగర్‌లలో నిన్న 450, 360, 328 వంతున కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్రవ్యాప్తంగా 4526 కొత్త కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి. చెన్నైలో 1078 కొత్త కేసులున్నాయి. ఇప్పటిదాకా మొత్తం కేసులు: 1,47,324; యాక్టివ్‌ కేసులు: 47,912; చెన్నైలో యాక్టివ్ కేసులు: 15,814గా ఉన్నాయి.
  • కర్ణాటక: బెంగళూరు పట్టణ- గ్రామీణ జిల్లాల్లో 7 రోజుల దిగ్బంధం కచ్చితంగా అమలవుతోంది. అలాగే రేపటినుంచి శివమోగా జిల్లాలోనూ తదుపరి ఆదేశాలవరకు దిగ్బంధం అమలు చేస్తారు. ప్రైవేటు ఆసుపత్రులలో పడకల లభ్యతపై బోర్డులో తప్పనిసరిగా ప్రదర్శించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది; ఈ ఆదేశాలను పాటించకపోతే శిక్ష తప్పదని హెచ్చరించింది. కాగా, దిగ్బంధం సమయంలో విధులు నిర్వర్తించిన ప్రభుత్వ ఉద్యోగులకు కోవిడ్ పరీక్ష నిర్వహణ కోసం ప్రత్యేక సౌకర్యంపై రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో 1419 మంది నర్సులు, 506 ల్యాబ్ టెక్నీషియన్లు, 916 మంది ఫార్మసిస్టులు, డి-గ్రూప్ ఖాళీలను ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనుంది. కర్ణాటకలో నిన్న 2496 కొత్త కేసులు, 87 మరణాలు నమోదయ్యాయి. వీటిలో ఒక్క బెంగళూరులోనే 1267 కేసులున్నాయి ప్రస్తుతం మొత్తం కేసులు: 44,077; యాక్టివ్‌ కేసులు: 25,839; మరణాలు: 842గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని తిరుపతిలోగల స్విమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య, పారామెడికల్ సిబ్బందిసహా 40 మందికిపైగా కోవిడ్‌-19 బారినపడినట్లు నిర్ధారణ కావడంతో అవుట్-పేషెంట్ సేవలను ఐదు రోజులపాటు నిలిపివేశారు. తిరుపతిలో నిత్యం 100కుపైగా  కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పౌరపాలన యంత్రాంగం 18 డివిజన్లలో సంపూర్ణ దిగ్బంధం విధించింది. మరోవైపు కరోనావైరస్‌ వ్యాప్తిపై కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేస్తుండటంతో డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం దిశగా ఇటీవల ప్రవేశపెట్టిన కండక్టర్ రహిత బస్సు సేవలను ఆర్టీసీ నిలిపివేసింది. ఇక విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో విధుల్లోగల 26 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, వారు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నిన్న 1916 కొత్త కేసులు నమోదవగా, 952 మంది కోలుకున్నారు... 43 మంది మరణించారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 33,019; యాక్టివ్‌ కేసులు: 15,144; మరణాలు: 408గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో కోవిడ్‌-19 రోగులకు జిల్లా ఆస్పత్రులతోపాటు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కూడా ఇకపై చికిత్స అందించనుంది. మరోవైపు కరోనా వైరస్‌ ప్రతిపాదిత టీకా ‘కోవాక్సిన్’పై హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్) వైద్య ప్రయోగ పరీక్షలు ప్రారంభించనుంది. తొట్టతొలి దేశీయ కోవిడ్-19 టీకా ‘కోవాక్సిన్’ను ఐసీఎంఆర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో ‘భారత్ బయోటెక్’ సంస్థ అభివృద్ధి చేసింది. ఇక తెలంగాణలో నిన్న కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో మొత్తం కేసులు: 37,745కు చేరాయి. వీటిలో యాక్టివ్‌ కేసులు: 12,531 కాగా, మరణాలు 375; డిశ్చార్జ్: 24,840గా ఉన్నాయి.

*****



(Release ID: 1638928) Visitor Counter : 256