ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
15 JUL 2020 12:04PM by PIB Hyderabad
నమస్కార్!
నా యువ మిత్రులకు శుభాకాంక్షలు!
ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా యువజనులందరికీ నా శుభాకాంక్షలు!
ఈ రోజు, మీ నైపుణ్యాలకు అంకితమైన రోజు. 21 వ శతాబ్దపు సహస్రాబ్ది తరం నైపుణ్యం, నైపుణ్యాలు పొందేందుకు వారికిగల సామర్ద్యం వారికిగల గొప్ప శక్తిగా మనం చెప్పుకోవచ్చు.
మిత్రులారా,
కరోనా సంక్షోభం ఉద్యోగాల స్వభావాన్ని అలాగే ప్రపంచ సంస్కృతిని మార్చేసింది. అలాగే ఎప్పటికప్పుడు మారుతున్నసాంకేతిక పరిజ్ఞానం కూడా దీనిని ప్రభావితం చేసింది. కొత్త పని సంస్కృతిని చూసి, కొత్త ఉద్యోగాల స్వభావాన్ని గమనించి మన యువత కొత్త నైపుణ్యాలను బాగా అందిపుచ్చుకుంటున్నారు.
అలాగే , మిత్రులరా, చాలామంది, ప్రస్తుత పరిస్థితులలో వ్యాపారాలు, మార్కెట్లు చాలా త్వరగా మారిపొతున్నాయని, తమ ప్రాధాన్యతను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని నన్ను అడుగుతుంటారు. ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితులలో ఈ ప్రశ్న మరింత కీలకమైనదిగా మారింది.
మిత్రులారా,
ఈ ప్రశ్నకు నేనెప్పుడూ ఒక సమాధానం ఇస్తుంటాను. ప్రాధాన్యత కలిగిఉండాలంటే అందుకు మంత్రం ఒక్కటే - నైపుణ్యం, పునర్ నైపుణ్యం, నైపుణ్యాల స్థాయిని పెంచుకోవడం. నైపుణ్యం అంటే మీరు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. ఉదాహరణకు మీరు ఒక చెక్కముక్కతో కుర్చీ తయారు చేయడం నేర్చుకున్నారనుకుందాం. అది మీ నైపుణ్యం. మీరు ఆ చెక్క ముక్క ధరను కూడా పెంచారనుకుందాం. అంటే విలువను జోడించారన్న మాట.అయితే ఈ ధరను కాపాడాలంటే ప్రతి రోజూ ఏదో ఒకటి కొత్తది దానికి జోడించాలి. అంటే కొ్త్త స్టయిల్ లేదా కొత్త డిజైన్ ఇలా . ఒకటి తయారు చేయడం నేర్చుకున్న వారు దానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చు కుంటూ ఉండాలి. అది పునర్ నైపుణ్యం. ఈ నైపుణ్యాలను మరింతగా ఉన్నత స్థాయి కి తీసుకుపొవడం - నైపుణ్యాల స్థాయి పెంపు. తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, దానిని అనుసరించడం ఇదే నైపుణ్యానికి, పునర్ నైపుణ్యానికి, నైపుణ్య స్థాయిపెంపునకు మంత్రం. మనందరి జీవితాలలో నైపుణ్యం అనేది అత్యంత ముఖ్యమైనది.
ఆ విధంగా, నేను నైపుణ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక వ్యక్తి ఎప్పుడూ గుర్తుకు వస్తుంటారు. అతని గురించి నా పాత మిత్రుడు ఒకరు చెబుతుండేవారు. అతను నాకు వ్యక్తిగతంగా కూడా తెలియదు. అతను అంతగా చదువుకున్న వాడు కాదు. అయితే అతని చేతి రాత చాలా బాగుండేది. కొంత కాలానికి అతను తన చేతి రాతకు పలురకాల శైలులను జోడించాడు. అంటే అతను తనకు తాను పునర్ నైపుణ్యం సాధించడాన్న మాట.అతని నైపుణ్యాల కారణంగా ప్రజలు అతని వద్దకు రావడం మొదలు పెట్టారు. ప్రత్యేక సందర్భాలకు సంబంధించి ఆహ్వాన పత్రాలు రాయమని ప్రజలు అతనిని కోరేవారు. ఆ తర్వాత అతను పునర్ నైపుణ్యాలు , నైపుణ్యాల స్థాయి పెంపును సాధించాడు. మరి కొన్ని భాషలు నేర్చుకున్న తర్వాత చాలా భాషలలొ రాయడం మొదలుపెట్టాడు. ఈరకంగా కాలానుగుణంగా అతని వ్యాపారం పుంజుకుంది. ప్రజలు తమ పనులు చేయించుకునేందుకు అతనివద్దకు తరచూ రావడం మొదలుపెట్టారు. కేవలం ఒక అభిరుచిగా మొదలైన నైపుణ్యం ఆ తర్వాత జీవనొపాధి మార్గంగా , ఒక గౌరవంగా మారింది.
మిత్రులారా,
నైపుణ్యం అనేది మనకు మనం బహుమతిగా ఇచ్చుకునేది. ఇది మన అనుభవంతోపాటు పెరుగుతుంది. నైపుణ్యం కాలాతీతమైనది. కాలంతోపాటు మరింత మెరుగుపడుతూ ఉంటుంది. నైపుణ్యం ప్రత్యేకమైనది.ఇది మిమ్మల్ని ఇతరులకంటే భిన్నమైనవారిగా చేస్తుంది. నైపుణ్యం అనేది ఎవరూ తీసుకుపోలేని ఒక నిధి. అంతేకాదు, నైపుణ్యం అనేది స్వావలంబన, ఇది ఉపాధి కల్పించడమే కాదు స్వయం ఉపాధి కల్పిస్తుంది. ఈ రకంగా నైపుణ్యానికి గల శక్తి ఆ వ్యక్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.
మిత్రులారా,
విజయవంతమైన ఏ వ్యక్తి లక్షణమైనా , తన నైపుణ్యాన్ని పెంపొందించుకొవడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకపోవడం. అంతేకాదు, అతను కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుంటాడు. నీకు నైపుణ్యం పట్ల ఏ ఆసక్తి లేకపోయినట్టయితే, ఏదీ నేర్చుకోవడానికి కోరిక లేనట్టయితే అది మీ జీవితాన్ని ముందుకు పోకుండా చేస్తుంది. ఇది ఒక అవరోధంగా మారుతుంది. ఆ రకంగా అతను తన వ్యక్తిత్వాన్ని తనకు తానే భారంగా చేసుకుంటాడు. అది మనకు మాత్రమే భారం కాదు, మన బంధువులకూ భారమే. మరోవైపు నైపుణ్యం పట్ల ఆసక్తి ఒక కొత్త బలాన్నిస్తుంది. జీవితానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. నైపుణ్యం అంటే కేవలం తినడానికి సంపాదించుకునే మార్గం కాదు,. మనం బతకడానికి ఆశ, ఉత్సాహం అవసరం , నైపుణ్యం మనకు చోదకశక్తిగా పనికివస్తుంది. ఇది మనకు నూతన ప్రేరణనిస్తుంది. కొత్త ఉత్సాహాన్నిస్తుంది. దీనికి వయసుతొ నిమిత్తం లేదు. మీరు యువకులా లేక వయోధికులా అన్నదానితో సంబంధం లేదు. మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నారంటే, జీవితంపట్ల ఉత్సాహం ఎన్నటికీ తగ్గదు.
మిత్రులారా,
నైపుణ్యాల శక్తి గురించి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అనుభవం తప్పక ఉండే ఉంటుంది. ఇవాళ , మీతో మాట్లాడుతుంటే, నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. నేను యువకుడిగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలో వాలంటీర్‌గా పనిచేసే రోజులు అవి. నేను కొన్ని సంస్థలతో కలసి పనిచేసేవాడిని. అలా ఒకసారి ఒక సంస్థకు చెందిన వారితో వారి జీపులో వెళ్ళాల్సి వచ్చింది. అయితే జీపు ఆ ఉదయం కదలలేదు .దానతో ప్రతిఒక్కరూ దానిని కదిలించడానికి ఎంతో ప్రయత్నించారు. దానిని నెట్టారు. చేయాల్సినదంతా చేశారు. అయినా జీపు కదలలేదు. ఉదయం 7 గంటలు లేదా 8 గంటల ప్రాంతంలో మెకానిక్‌ను పిలిపించారు. అతను వచ్చి ఏదో చేసి రెండు నిమిషాలలో సరిచేశాడు. అప్పడు అతనిని మేం ఎంత ఇవ్వమంటావని అడిగాం. అతను రూ 20లు అని చెప్పాడు. అప్పట్లో రూ 20 లు అంటే చాలా ఎక్కువ. అయితే ఇందులో మా బృందంలోని సభ్యుడు ఒకరు అన్నారు. బ్రదర్, పట్టుమని రెండు నిమిషాల పనికి 20 రూపాయలు అడుగుతున్నావే? అని . దానికి అతను ఇచ్చిన సమాధానం ఇప్పటికీ నాకు ప్రేరణగా నిలిచి నా మనసు మీద గట్టి ప్రభావాన్ని చూపుతుంటుంది. చదువురాని ఆ మెకానిక్ ఏమన్నాడంటే, సర్, రెండు నిమిషాల పనికి నేను 20 రూపాయలు తీసుకోవడం లేదు. 20 సంవత్సరాలుగా నేను నేర్చుకున్న నైపుణ్యానికి తీసుకుంటున్నాను , 20 సంవత్సరాలుగా నేను సంపాదించిన అనుభవం విలువ 20 రూపాయలు అవుతుంది, అని . ఇది నైపుణ్యం నుంచి వచ్చిన బలం అని నేను విశ్వసిస్తాను. నైపుణ్యం మీ పనిమీదే కాదు మీ ప్రతిభ మీద , మీ మీద ప్రభావం చూపుతుంది.
మిత్రులారా,
ఇక్కడ మరో విషయం అర్థం చేసుకోవడం కూడా అవసరం. కొంతమంది విజ్ఞానం ,నైపుణ్యం వీటి విషయంలో గందరగోళ పడుతుంటారు. లేదా దానిమీద గందరగోళం సృష్టిస్తారు. ఇలాంటి వారికి నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మీరు పుస్తకాలు చదవచ్చు, సైకిల్ ఎలా నడపాలో యూట్యూబ్‌లో వీడియోలు చూడవచ్చు. సైకిల్ పై ఎలా కూర్చోవాలో, సైకిల్ ఎలా పనిచేస్తుందో, అందులోని ప్రతి విభాగం ఎలా పనిచేస్తుందో , హ్యాండిల్ ను ఎలా పట్టుకోవాలో, బ్రేక్‌లు ఎలా వేయాలో ఇవన్నీ చూస్తుంటారు.ఇదంతా జ్ఞానం. అయితే మీకు ఈ జ్ఞానం ఉంది కనుక మీరు సైకిల్ ను నడపగలరన్న గ్యారంటీ లేదు. వాస్తవానికి నైపుణ్యం సైకిల్ నడపడానికి మీకు దోహదపడుతుంది. మీరు క్రమంగా మీకై మీరే సైకిల్ తొక్కడం నేర్చుకుంటారు. ఇక అప్పటినుంచి సైకిల్ తొక్కడాన్ని ఎంతో ఆనందిస్తారు. మీరు అలా సైకిల్ తొక్కుతూనే ఉంటారు. ఏ సమస్యా ఉండదు. మీరు దీనిని నేర్చుకున్న వెంటనే మీరు ఈ నైపుణ్యాన్ని ఈ ప్రతిభను సాధించినట్టు. ఇక ఆ తర్వాత మీరు మీ మైండ్ ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. సమాజం నుంచి పాలన వరకు ప్రతి స్థాయిలో దీని తేడాను అర్థం చేసుకోవడం చాలా అవసరం . ఇవాళ భారతదేశం జ్ఞానం, నైపుణ్యం వీటి మధ్య తేడాను అర్థం చేసుకుంటూ ముందుకు ప్రగతిపథంలో సాగిపోతున్నది. ఐదు సంవత్సరాల క్రితం ఈరోజు, స్కిల్ ఇండియా మిషన్‌ను ఇదే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. యువత జ్ఞానంతోపాటు నైపుణ్యాలు అలవరచుకోవాలన్న ఉద్దేశంతో దీనిని ప్రారంభించడం జరిగింది. ఇందుకు దేశవ్యాప్తంగా వందలాదిగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఐటిఐ ల సంఖ్యను పెంచి, లక్షలాది కొత్త సీట్లను కల్పించాం. ఈ సమయంలోనే 5 కోట్ల మంది ప్రజల నైపుణ్యాలను పెంచాం. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతున్నది.
మిత్రులారా,
శరవేగంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచంలో, చాలా రంగాలలో లక్షలాది మంది నైపుణ్యంగల వారు కావాలి. ఆరోగ్య సేవల రంగంలో ముఖ్యంగా చాలా అవకాశాలు ఉన్నాయి.దీనిని గుర్తించి, నైపుణ్యాల అభివృద్ది మంత్రిత్వశాఖ ప్రపంచ వ్యాప్తంగా లభించగల అవకాశాలను పరిశీలిస్తున్నది. ఇతర దేశాల అవసరాలకు సంబంధించి బారతీయ యువతకు ఖచ్చితమైన , సరైన సమాచారం అందేలా మేం ప్రయత్నిస్తున్నాం. లేదా ఏ దేశంలో ఆరొగ్య రంగంలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తున్నారో లేదా ఏ సేవా రంగంలో ఏరకమైన డిమాండ్ ఏర్పడబోతున్నదో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. వీటికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం దేశ యువతకు సత్వరం అందుబాటులోకి రానున్నది.
ఉదాహరణకు మర్చంట్ నావీ గురించి తీసుకోండి. ఇండియాతో సహా ప్రపంచం మొత్తానికి నావికుల డిమాండ్ ఎక్కువగా ఉంది. మనకు 7500 కిలోమీటర్ల కోస్తా తీరప్రాంతం ఉంది. మన దేశంలోని చాలామంది యువతకు కోస్తా వాతావరణంతో , సముద్రంతో పరిచయముంది. ఈ రంగంలో నైపుణ్యాలు పెంచేందుకు మనం ప్రయత్నించినట్టయితే మనం లక్షలాది మంది నైపుణ్యం గల నావికులను తయారు చేసి ప్రపంచానికి అందించగలం. అంతేకాదు మన దేశ తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థనుకూడా బలోపేతం చేసుకోగలం.
దీనిని గుర్తించడం వల్ల , ఇందుకు సంబంధించిన సమాచారం ఇచ్చే పని సులభం అవుతుంది. దీనికితోడు, నాలుగైదు రోజుల క్రితం, కార్మికుల నైపుణ్యాలను గుర్తించి తెలియజేసే ఒక పోర్టల్‌ను ప్రారంభించడం జరిగింది. నైపుణ్యంగల ప్రజలను,,నైపుణ్యంగల కార్మికులను గుర్తించడంలో ఈ పోర్టల్ కీలక పాత్ర పోషించనుంది. దీనితో , ఒక్క క్లిక్‌తో యజమానులు నైపుణ్యంగల కార్మికులను తెలుసుకొవడానికి వీలు కలుగుతుంది. ప్రత్యేకించి ఇటీవల నగరాల నుంచి గ్రామాలకు వెళ్ళిన కార్మికులు దీనివల్ల ప్రయోజనం పొందుతారు. ప్రత్యేకనైపుణ్యాలు కలిగిన వారు గ్రామాలకు తిరిగివచ్చి గ్రామాలలో ఎలా చైతన్యం నింపుతున్నారో మీరు చూసే ఉంటారు. కొందరు పాఠశాలలకు పెయింట్ వేస్తున్నారు, కొందరు కొత్త డిజైన్లలో ఇళ్లు నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్క నైపుణ్యం అది చిన్నదైనా, పెద్ద దైనా స్వావలంబిత భారతదేశానికి అదొక పెద్ద బలం.
ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్బంగా నేను మరోసారి దేశ యువతను అభినందిస్తున్నాను.
ప్రపంచం మహమ్మారి గుప్పిట్లో చిక్కుకుని ఉంది. అందువల్ల ఒక విషయాన్ని పదే పదే చెప్పడం నా బాధ్యత. నేనే కాదు, మీరు కూడా దానిని పదే పదే చెప్పాలి. మరి అదేమిటి? ముందుగా మీరంతా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఇక రెండవది, మీరందరూ రెండు గజాల దూరం లేదా సామాజిక దూరం పాటించాల్సిందిగా కోరుతున్నాను. మాస్కు ధరించడం మరిచిపోవద్దు. ఉమ్మివేసే అలవాటును మానుకోమని ప్రజలకు వివరించండి. అలాగే మనం ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో ఆ మంత్రాన్ని ఎప్పుడూ గుర్తుంచకోండి. మీరు ఎంత చదువుకున్నారన్నదానితో సంబంధంలేదు. మీకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయన్నదానితో సంబంధం లేదు. నైపుణ్యాన్ని నిరంతరాయంగా పెంచుకుంటూ , దానిని పై స్థాయికి తీసుకెళుతుండాలి. ప్రతివారూ కొత్త నైపుణ్యాలు సంతరించుకునేందుకు నిరంతరం సిద్దంగా ఉండాలి. దీనివల్ల మీరు జీవితాన్ని ఆనందించడం మొదలుపెడతారు. జీవితంలో మీకు కొత్త అవకాశాలు వచ్చిసంతోషం కలిగిస్తాయి. ఒక నైపుణ్యంతో మీ చేతులు, మీ వేళ్లు, మీ గుండె, మీ మనసు బలాన్ని మీరు తప్పకుండా పెంచగలరని భావిస్తున్నాను. ఆరకంగా మీరు మరింత ముందుకు సాగిపోతూ దేశం ప్రగతిపథంలో పయనించడానికి సాయపడగలరని నేను గట్టిగా విశ్విసిస్తున్నాను.
ధన్యవాదాలు!
మీ అందరికీ శుభాకాంక్షలు.
***
(Release ID: 1638895)
Visitor Counter : 478
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam