యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
నెహ్రూయువ కేంద్ర సంఘటన్(ఎన్.వై.కె.ఎస్), జాతీయ సేవా పథకం(ఎన్.ఎస్.ఎస్) వలంటీర్లద్వారా ఆత్మనిర్భర్ భారత్‌పై రాష్ట్రప్రభుత్వాలు అవగాహన కల్పించాలని కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖమంత్రి శ్రీ కిరణ్ రిజ్జు పిలుపు
ఒలింపిక్ కీర్తి పొందేందుకు ఒక మార్గంగా , ఒక రాష్ట్రం , ఒక క్రీడ విధానం పై రాష్ట్రాల ప్రశంసలు
18 రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలకు చెందిన క్రీడా,యువజన వ్యవహారాలశాఖ మంత్రులు,సీనియర్ అదికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్సుద్వారా సమావేశమైన కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జు.
Posted On:
14 JUL 2020 6:29PM by PIB Hyderabad
కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజ్జు, ఈరోజు 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రులు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమయ్యారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో తొలి విడత సమావేశం ఈరోజు జరిగింది. కోవిడ్ -19 అనంతర కాలంలో తిరిగి క్రీడా కార్యక్రమాలను పునరుద్ధరించేందుకు తీసుకోవలసిన చర్యలకు సంబంధించిన మార్గనిర్దేశంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ సమావేశంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయనున్నాయి. అలాగే రాష్ట్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు నెహ్రూ యువ కేంద్ర సంఘటన్(ఎన్‌వైకెఎస్). నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్.ఎస్.ఎస్ ) వలంటీర్లను ఎక్కువమందిని వినియోగించే విషయం కూడా ఈ సమావేశాలలో చర్చిస్తున్నారు.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ కిరన్ రిజ్జు, “ కోవిడ్ -19 సమయంలో ఎన్.వై.కె.ఎస్, ఎన్.ఎస్.ఎస్ వలంటీర్లు పౌర యంత్రాంగంతోపాటు అద్భుతమైన సేవలు అందించారు.ప్రస్తుతం 75 లక్షల వలంటీర్లు ఉన్నారు. అన్ లాక్ -2లో వీరి సంఖ్యను కోటికి తీసుకు వెళ్ళదలచాం.ప్రధానమంత్రి ఇప్పటికే ఆత్మనిర్భర భారత్ ప్రకటించారు. దేశంలో కార్యకలాపాలు ఊపందుకోగానే మన వలంటీర్లు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అంటే రైతులు, చిన్న వ్యాపారాల యజమానులు, ఇతర వర్గాల వారికి స్వావలంబన వల్ల వారికి కలిగే ప్రత్యక్ష ప్రయోజానాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ వలంటీర్లను ప్రోత్సహించాల్సిందిగా, వారు మరింతగా పనిచేయడానికి మద్దతు నివ్వాల్సిందిగా కోరుతున్నాను. వారు నేరుగా జిల్లా పాలనా యంత్రాంగం తోడ్పాటుతో కేంద్రం నుంచి కనీస జోక్యంతో పనిచేయనున్నారు” అని ఆయన అన్నారు.
సమావేశ సంక్షిప్త అజెండాలో చేర్చిన అంశాలపై చర్చిస్తూ, అన్ని రాష్ట్రాలలో ఒలింపిక్ స్థాయి శిక్షణనివ్వడం, క్షేత్రస్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ తీసుకుంటున్న చర్యలను ఎక్కువ సంఖ్యలో రాష్ట్రాల ప్రతినిధులు అభినందించారు.ప్రతి రాష్ట్రంలో ఒక ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఎక్సలెన్స్ (కెఐఎస్‌సిఇ) ఏర్పాటు, ఒక రాష్ట్రం ఒక క్రీడ విధానానికి రాష్ట్రాలు మద్దతు పలికాయి. సంప్రదాయంగా తమ తమ రాష్ట్రాలలో బలంగా ఉన్న క్రీడను ఎంపిక చేసుకునేందుకు రాష్ట్రాల మంత్రులు , అధికారులు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా శ్రీ కిరణ్ రిజ్జు మాట్లాడుతూ, “ ఒకటి , రెండు క్రీడలలో ప్రతిభా నైపుణ్యాలు సాధించేలా రాష్ట్రాలనుప్రోత్సహించేందుకు మా మంత్రిత్వశాఖ సహాయపడుతుంది. కె.ఐఎస్‌సిఇ లు ఆయా ప్రత్యేక క్రీడలకు నోడల్ సెంటర్లుగా ఉంటాయి. ఇక్కడ ఒలింపిక్ క్రీడలకు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఎదిగేందుకు వీలు కల్పిస్తారు. రాష్ట్రాలు ఇతర సంప్రదాయ క్రీడలలో కూడా క్రీడా కారులకు శిక్షణ ఇవ్వవచ్చు. అయితే ప్రధాన దృష్టి ఒకటి రెండు క్రీడలపై ఉండాలి. ” అని ఆయన అన్నారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో 1000 ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ప్రతిభను ఉపయోగించుకోవడానికి అవకాశం కలగడమే కాకుండా, దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి ఉపకరిస్తుందని అన్నారు. పలు రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో క్రీడల ప్రోత్సాహానికి సంబంధించి తమ స్వీయ విజయగాధలను ఈ సమావేశంలో తెలియజేశాయి.
ఫిట్ ఇండియా ఉద్యమం వంటి కార్యక్రమాలలలో రాష్ట్రాలు పాల్గొనడం ప్రోత్సాహకరంగా ఉందని మంత్రి చెప్పారు. ఫిట్ ఇండియా పాఠశాలలుగా మారేందుకు దేశవ్యాప్తంగా 2.5 లక్షల పాఠశాలలు పేర్లు నమోదు చేసుకున్నాయని ఆయన తెలిపారు.
“ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని అన్ని పాఠశాలలను ఫిట్ ఇండియా పాఠశాలలుగా రిజిస్టర్ చేయించేందుకు చొరవచూపాలని తద్వారా ఫిట్‌నెస్ అనేది యువతకు ఒక జీవన విధానంగా ఉంటుంద”ని కేంద్ర మంత్రి అన్నారు.
రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశమైన అనంతరం మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజు, “ ఇది ఎంతో విజయవంతమైన సమావేశం. క్రీడలకు, యువజన వ్యవహారాలకు సంబంధించి మంత్రులు, అధికారులు అత్యంత విలువైన కొన్ని సూచనలు చేశారు. కోవిడ్ అనంతర పరిస్థితులలో క్రీడల ఈవెంట్‌లను ప్రారంభించడానికి, క్రీడాకారులకు శిక్షణను అందించడానికి వారు చే్స్తున్న ఏర్పాట్ల గురించి నాకు వివరించారు. రాష్ట్రాలు మంచి పని చేస్తున్నాయి. మంత్రిత్వశాఖ వీటితో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నది. ఈ సమావేశం చివరినాటికి ఒక రోడ్‌మ్యాప్‌తో ముందుకు రాగలమని నాకు గట్టి నమ్మకముంది” అని ఆయన అన్నారు.
తొలిరోజు సమావేశంలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌ఘడ్, గుజరాత్, హర్యానా,హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, కర్ణాటక, కేరళ, లద్దాక్, మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణా, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ లు పాల్గొన్నాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిగ ప్రాంతాలు 2020 జూలై 15న జరిగే సమావేశంలో పాల్గొంటాయి.
***
(Release ID: 1638623)
Visitor Counter : 267