గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పై ఆరు రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖామంత్రి సమీక్ష
కోవిడ్ సంక్షోభంలో జీవనోపాధి కల్పన ద్వారా
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఊతం: మంత్రి తోమార్
Posted On:
14 JUL 2020 8:25PM by PIB Hyderabad
గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పురోగతి మీద కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖామంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ ఆరు రాష్ట్రాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఆ రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖామంత్రులతోబాటు సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలొ పాల్గొన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 2020 జూన్ 20న ప్రారంభించిన గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 116 జిల్లల్లో అమలు జరుగుతుంది. ఈ పథకం 125 రోజులు కొనసాగుతుంది. 11 మంత్రిత్వశాఖల పరిధిలోని 25 పనులు గుర్తించి దీనికిందికి తెచ్చారు. ఈ పథకం బాగా కొనసాగుతున్నట్టు, సమర్థవంతమైన పర్యవేక్షణలో ఉన్నట్టు చెప్పారు.
కేంద్ర మంత్రి రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడుతూ, వలస వెళ్ళి తిరిగి వచ్చిన కార్మికులకు తమ ఊళ్ళలోనే ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని నిర్దేశించారన్నారు. కేవలం వలస కార్మికులే కాకుండా బాధిత ప్రజలందరికీ వర్తిస్తుందని చెబుతూ, దీని ద్వారా రోడ్లు, గృహ నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయితీ భవనాలు, జీవనోపాధి ఆస్తులు, కమ్యూనిటీ సముదాయాల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంతో ఈ పథకం అమలులో పురోగతి సంతృప్తికరంగా ఉందన్నారు. గరిష్ఠ స్థాయిలో మౌలిక సదుపాయాల సృష్టిలో ఈ పథకం వేగం పుంజుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు రాష్ట్రాలు పోటాపోటీగా పనిచేయాలని మంత్రి శ్రీ తోమార్ పిలుపునిచ్చారు. అమలులో వివిధ మంత్రిత్వశాఖలనుంచి ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగాలని కోరారు. అప్పుడే సులభంగా నిర్దిష్ట గడువులోగా లక్ష్యాన్ని సాధించగలరని చెప్పారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మూడో దశ గ్రామీణ రహదారులకు నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. దీనివలన గ్రామాలలో ఉపాధి అవకాశాలు బాగా మెరుగవుతాయన్నారు.
కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వం తీసుకున్న కీలక చర్యల గురించి మంత్రి శ్రీ తోమార్ వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీన ఉపాధి హామీ పథకం కింద అదనంగా రూ.40,000 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద రూ. 20 లక్షల కోట్ల పాకేజ్ ప్రకటించటం కూడా కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో భాగమన్నారు. పేదలకు దాదాపు ఎనిమిది నెలల పాటు ఉచితంగా నిత్యావసరాలు అందజేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఆరు రాష్ట్రాల ప్రతినిధులు గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన ఇచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సమర్థంగా అమలు చేయటానికి అనేక సూచనలు కూడా చేశారు. ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ ఆనంద్ స్వరూప్ శుక్లా తమ రాష్ట్రంలో లక్ష్యాలన్నీ సాధిస్తామని భరోసా ఇచ్చారు. ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి బీహార్ మంత్రి శ్రావణ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. ఖగారియా జిల్లా సహా బీహార్ లో గరిష్ఠంగా 32 జిల్లాలకు వర్తింపజేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. నిజంగా ఈ పథకం ఊళ్ళకు తిరిగొచ్చిన వలస కార్మికులకు వరం లాంటిదన్నారు. ఈ సలహాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి శ్రీ తోమార్ హామీ ఇచ్చారు.
****
(Release ID: 1638655)
Visitor Counter : 189