నీతి ఆయోగ్

మంత్రిత్వశాఖలతో జట్టుకట్టిన అటల్ ఇన్నొవేషన్ మిషన్, కోవిడ్ పరిష్కారాలలో స్టార్టప్స్ కు మద్దతు

వర్చువల్ కోవిడ్ డెమోల నిర్వహణ

Posted On: 14 JUL 2020 6:41PM by PIB Hyderabad

కోవీడ్ సంక్షోభం ఒకవైపు, ఆర్థిక స్తంభన ఒకవైపు కుదిపేస్తుండగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లోపడింది. అయితే ఈ పరిస్థితిని నీతి ఆయోగ్ వారి కీలకమైన విభాగం అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎమ్)  సమర్థంగా ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా ఔత్సాహిక వ్యాపారుల స్ఫూర్తిని సమున్నతంగా ఉంచుతూ  ఇతర మంత్రిత్వశాఖలతో చేతులు కలిపి స్టార్టప్స్ కు మద్దతుగా నిలిచింది. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి, పరిష్కార మార్గాలు కనుక్కోవటానికి ప్రోత్సహించింది.
ఈ విషయంలో అటల్ ఇన్నొవేషన్ మిషన్ ఈరోజు కోవిడ్ మీద వర్చువల్ డెమో లను పూర్తి చేసింది. సమర్థవంతమైన స్టార్టప్స్ ను గుర్తించి అవి కోవిడ్ మీద పోరులో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేసేలా ప్రోత్సహించి తమ కార్యకలాపాను జాతీయ స్థాయిలో మరింతగా పెంచుకునేలా మద్దతు ఇవ్వటం ఈ కార్యక్రమం లక్ష్యం. 


ఈ కార్యక్రమాన్ని ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి చేపట్టారు. వాటిలోబయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టార్టప్ ఇండియా, అగ్ని, భారత ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారు డాక్టర్ విజయ్ రాఘవన్ పరిధిలోని  ఇతర మంత్రిత్వశాఖలు, నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వినోద్ పౌల్  ఉన్నారు.
కోవిడ్ నిరోధం, నియంత్రణ, సహకారం కోసం పనికొచ్చేలా ఆయా విభాగాలకు దాదాపు వెయ్యికి పైగా ఆవిష్కరణలతో స్టార్టప్స్ ముందుకు రాగా రెండు రౌండ్లలో వాటిని పరిశీలించి అంచనా వేసి వర్చువల్ డెమోల కోసం వాటిలో 70 స్టార్టప్స్ ను ఎంపిక చేశారు. ఈ స్టార్టప్స్ కు నిధులు సమకూర్చటం, తయారీకి కావాల్సిన సౌకర్యాలు కల్పించటం, సప్లై చెయిన్, లాజిస్టిక్స్ చూపటంతోబాటు సరైన కొనుగోలుదారులను, మార్గదర్శకులను కూడా చూపుతారు.
వైద్య పరికరాలు. పిపిఇ లు, శానిటైజేషన్, టెక్నాలజీ సొల్యూషన్స్ తదితరాలకు తొమ్మిది రోజులు కేటాయించారు. వీటికి మిషన్ డైరెక్టర్ నీతి ఆయోగ్ కు చెందిన ఆర్ రామన్ నేతృత్వం వహించారు. ఆయన తన అభిప్రాయాలను వెల్లడిస్తూ, ఉమ్మడి కృషి వలన కోవిడ్ మీద పోరులో భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అండ దొరికినట్టవుతున్నదన్నారు. కోవిడ్ నియంత్రణకు అవసరమైన ఉత్పత్తులు, సేవలు, పరిష్కార మార్గాలుకనుక్కోవటానికి తగిన ప్రోత్సాహం లభిస్తుందని, ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ సంక్షోభ సమయంలో వీరి పరిష్కార మార్గాల ఉత్తమ నాణ్యత, వాటి అనుసరణీయత చూస్తుంటే భారత ఔత్సాహిక వ్యాపారుల శక్తి సామర్థ్యాలు స్పష్టంగా తెలుస్తున్నాయన్నారు.
ముగింపు సందర్భంగా డిబిటి కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నవకల్పనల కోసం జరుగుతున్న ఉమ్మడి కృషి ప్రదర్శించటం కచ్చితంగా కోవిడ్ మీద పోరును మరింత బలోపేతం చేస్తుందన్నారు. డిఎస్ టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వ శాఖలు సరికొత్త ఆవిష్కరణలను ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చాయన్నారు. దీనివలన ఔత్సాహికులు ఎంతో ఉత్సాహంగా పనిచేసే వాతావరణం ఏర్పడిందని, ఇలాంటి సంక్షోభ సమయంలో అది ఎంతగానో ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వాతావరణం విజయం సాధించటాన్ని ఇప్పటికే 60 స్టార్టప్స్ నిరూపించాయని, అవి కోవిడ్ పై పోరుకు ఉత్పత్తుల తయారీలో ముందడుగు వేస్తున్నాయని చెప్పారు. 
ఇలా ఉండగా, వర్చువల్ డెమోల ఫలితంగా 50 కి పైగా స్టార్టప్స్ కు, రకరకాల పెట్టుబడి దారులకు మధ్య అనుబంధం ఏర్పడింది. నిర్వాహకులు కూడా స్టార్టప్స్ కు సహకారం అందిస్తూ, వారికి అవసరమైన అదనపు అంశాలను కూడా తెలియజేశారు. అనుమతులు పొందటానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, టెస్టింగ్ అవసరాలగురించి , మార్కెట్ కు చేరుకోవటం మీద, కొనుగోలు దారులను కలుసుకోవటం మీద, రిజిస్ట్రేషన్ లాంటి ప్రక్రియలు పూర్తి చేయటం మీద  అనేక సలహాలిచ్చి ప్రోత్సహించారు.
ఇండియన్ ఏంజెల్ నెట్ వర్క్  వెస్ట్ ఇండియా రీజినల్ హెడ్ కంచి దయా ప్రభుత్వ కృషిని అభినందిస్తూ , స్టార్టప్స్ ను సరైన సమయంలో ఆదరించి ప్రోత్సహించటానికి ఇలాంటి చర్యలు అవసరమన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించి ప్రభుత్వంలోని వివిధ శాఖలను ఒకచోట చేర్చి సహకరించటంచాలా గొప్ప విషయంగా అభివర్ణించారు.
స్టార్టప్స్ లో ఒకటైన్ మెక్ గీక్స్ మెకాట్రానిక్స్ కూడా తన అభిప్రాయం వెల్లడిస్తూ, ఇలాంటి డెమో లు అనేక విధాలుగా ఉపయోగపడ్డాయని పేర్కొంది. వాణిజ్య పరమైన ఉత్పత్తి ప్రారంభించటంలో ఎదురయ్యే అవరోధాలను తొలగించటానికి ఎంతగానో పనికొచ్చినట్టు చెప్పటం విశేషం. ఆసక్తి కరమైన సలహాలు అందుకోగలగటం, మరింత మెరుగు పరచటానికి దోహదపడే సూచనలు ఇవ్వటం చాలా ఉపయోగపడినట్టు దాని బాధ్యులు అభివర్ణించారు. ఈ కార్యక్రమం ద్వారా కొమ్తమంది పెట్టుబడి దారులను కలుసుకోగలిగామన్నారు. 


ఈ వర్చువల్ డెమో లలో నితి ఆయోగ్  లోని అటల్ ఇన్నొవేషన్ మిషన్  ప్రోగ్రామ్ డైరెక్టర్ ఇషితా అగర్వాల్, యు ఎన్ డి పి ఇన్ క్లూజివ్ గ్రోత్ అధిపతి అమిత్ కుమార్, యు ఎన్ డి పి ఆక్సిలేటర్ లాబ్ సొల్యూషన్స్ హెడ్ రోజితా సింగ్, నాస్కామ్  డైరెక్టర్ కృత్తికా మురుగేశన్, స్టార్టప్ ఇండియాకు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆస్థా గ్రోవర్, ఇన్వెస్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాహుల్ నయ్యర్ తదితరులు పాల్గొన్నారు.
 

****(Release ID: 1638610) Visitor Counter : 215