PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
08 JUL 2020 6:33PM by PIB Hyderabad
పత్రికా సమాచార సంస్థ
సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: స్థిరంగా మెరుగుపడుతున్న కోలుకున్నవారి జాతీయ సగటు- 61.53 శాతానికి చేరిక
దేశవ్యాప్తంగా కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఈ మేరకు గత 24 గంటల్లో 2,62,679 పరీక్షలు నిర్వహించగా, వీటిలో 53,000కుపైగా ప్రైవేటు ప్రయోగశాలల్లో పరీక్షించినవి కావడం గమనార్హం. మొత్తం మీద ఇప్పటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య 1,04,73,771కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రత్యేక రోగ నిర్ధారణ ప్రయోగశాలల సంఖ్య 1119కి చేరగా- ప్రభుత్వ రంగంలో 795, ప్రైవేటు రంగంలో 324 ఉన్నాయి. ఇక కోవిడ్-19 నయమైనవారి సంఖ్య మరింత పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత యాక్టివ్ కేసులతో పోలిస్తే కోలుకున్నవారి సంఖ్య 1,91,866 అధికంగా నమోదైంది. ఈ మేరకు గత 24 గంటల్లో 16,883 మందికి వ్యాధి నయం కాగా, ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 4,56,830కి పెరిగింది. దీంతో కోలుకుంటున్నవారి జాతీయ సగటు ఇవాళ 61.53 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 2,64,944 మంది కోవిడ్ బాధితులు చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలకు
కోవిడ్ మరణాల తగ్గింపు కృషిలో కేంద్రానికి ఎయిమ్స్ చేయూత: రాష్ట్రాల్లోని డాక్టర్లకు టెలి-కన్సల్టేషన్‌లో ఢిల్లీ ఎయిమ్స్ మార్గనిర్దేశం ప్రారంభం
దేశంలోని వివిధ రాష్ట్రాల ఆస్పత్రులలోగల ఐసీయూలలో కోవిడ్ నిర్వహణపై డాక్టర్లకు మార్గనిర్దేశం కోసం ఢిల్లీలోని అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ (AIIMS)కు చెందిన ప్రత్యేక వైద్య నిపుణుల అనుభవాన్ని అందుబాటులోకి తెస్తూ కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి చర్యలు చేపట్టింది. ఈ మేరకు కోవిడ్ చికిత్స విధానంలో కీలకమైన టెలి-కన్సల్టేషన్ ప్రక్రియను వినియోగిస్తారు. ఢిల్లీ ఎయిమ్స్‌లోని నిపుణులైన డాక్టర్ల ప్రత్యేక బృందం వివిధ రాష్ట్రాల్లోగల ఆస్పత్రుల్లోని ఐసీయూలలో వ్యాధి పీడితుల చికిత్సకు సంబంధించి టెలి/వీడియో కన్సల్టేషన్ ద్వారా మార్గదర్శనం చేస్తుంది. ఆ విధంగా బాధితుల మరణాల శాతాన్ని తగ్గించగలిగేలా ప్రత్యేక సూచనలు, సలహాలతో డాక్టర్లను నడిపిస్తుంది. ఈ విధంగా సకాలంలో నిపుణుల సలహాలు అందించేందుకు వీలుగా వారానికి రెండు సార్లు... ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తొలి కసరత్తు ఇవాళ ప్రారంభం కాగా, ముంబై (మహారాష్ట్ర)లో 9, గోవాలో 1 వంతున ఆస్పత్రులను ఎంపిక చేసి, అక్కడి డాక్టర్లకు సలహాలు, సూచనలు అందించారు. మరిన్ని వివరాలకు
దేశంలో ప్రతి 10 లక్షల జనాభా ప్రాతిపదికన ప్రస్తుత కేసులతో పోలిస్తే చురుగ్గా పెరుగుతున్న కోలుకునే రోగుల సంఖ్య
దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు కోవిడ్ రోగుల సంఖ్యను మించి కోలుకునేవారి సంఖ్య పెరిగే దిశగా కేంద్ర ప్రభుత్వంతోపాటు కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. రోగుల సత్వర గుర్తింపు, సమర్థ వైద్య నిర్వహణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. దీంతో నమోదయ్యే కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా కోలుకునేవారి సంఖ్య వేగంగా పెరుగుతూ చికిత్స పొందే రోగులు తగ్గుతున్నారు. అలాగే కోవిడ్ ప్రత్యేక వైద్య సంరక్షణ కేంద్రాలపై కేసుల ఒత్తిడీ తగ్గుతోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి 10 లక్షల మందిలో కోలుకుంటున్నవారి సంఖ్య 315.8 కాగా, చురుకైన కేసుల సంఖ్య అతి తక్కువగా 186.3గా ఉంది. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రాల్లో రోగ నిర్ధారణ పరీక్షల సదుపాయాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తదనుగుణంగా ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ వంటి పరీక్షలు నిర్వహిస్తూ కేసులను త్వరగా గుర్తించి వైద్య నిర్వహణ చేపడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రాలు అనేక మొబైల్ యాప్‌లు రూపొందించి వృద్ధులు, ఇతరత్రా వ్యాధుల పీడితులు, గర్భిణులు, పిల్లలు వంటి అధిక ముప్పుగల జనాభాపై నిఘా పెట్టాయి. అలాగే స్థానిక ప్రభుత్వాల స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు సామాజిక స్థాయిలో భాగస్వాములై సమర్థంగా నిఘా కొనసాగించారు. మరిన్ని వివరాలకు
‘వ్యవసాయ మౌలిక వసతుల నిధి’ కింద ఆర్థిక సహాయం కోసం కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకానికి మంత్రిమండలి ఆమోదం
సరికొత్త దేశవ్యాప్త కేంద్ర ప్రభుత్వరంగ వ్యవసాయ మౌలిక వసతుల నిధి ఏర్పాటుకు ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద పంటకోతల అనంతర నిర్వహణ ఆచరణీయ మౌలిక వసతుల ప్రాజెక్టులతోపాటు సామాజిక వ్యవసాయ ఆస్తులపై పెట్టుబడుల కోసం వడ్డీరాయితీ, ఆర్థిక మద్దతులో భాగంగా మధ్య-దీర్ఘకాలిక రుణ సదుపాయం లభిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రుణ పంపిణీ కోసం రూ.10,000 కోట్లు మంజూరు చేయగా, రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.30,000 కోట్ల వంతున రుణ వితరణ చేయనున్నారు. మరిన్ని వివరాలకు
పీఎంజీకేవై/స్వయం సమృద్ధ భారతం కింద 2020 జూన్ నుంచి ఆగస్టుదాకా 24 శాతం ఈపీఎఫ్ చెల్లింపును పొడిగించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం
కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (PMGKY)/స్వయం సమృద్ధ భారతం కింద ఉద్యోగుల భవిష్యనిధికి యాజమాన్యాలు, ఉద్యోగులు చెరో 12 శాతం వంతున జమచేయాల్సిన చందా మొత్తం 24 శాతాన్నీ మరో మూడు నెలలపాటు అంటే- 2020 జూన్ నుంచి ఆగస్టు వరకు కేంద్రమే చెల్లించే ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది 2020 మార్చి నుండి మే వరకు వేతన నెలలకుగాను 15.04.2020న ప్రకటించిన పథకానికి అదనం. ఈ పొడిగింపువల్ల రూ.4,860 కోట్లు అదనంగా వ్యయం కాగలదని అంచనా. దీనివల్ల 3.67 లక్షల సంస్థల్లో పనిచేసే 72 లక్షలమంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. మరిన్ని వివరాలకు
పట్టణ పేదలు/వలస కార్మికుల కోసం అందుబాటు అద్దెగృహ ప్రాంగణాల అభివృద్ధికి మంత్రిమండలి ఆమోదం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY–U) కింద ఉప-పథకంగా పట్టణ పేదలు/వలస కార్మికుల కోసం అందుబాటు అద్దెగృహ సముదాయాల (ARHC) అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వ నిధులతో నిర్మించి ప్రస్తుతం ఖాళీగా ఉన్న నివాస సముదాయాలను 25 సంవత్సరాల రాయితీ ఒప్పందం ద్వారా ఏఆర్‌హెచ్‌సీలుగా మారుస్తారు. మరిన్ని వివరాలకు
ఉజ్వల యోజన లబ్ధిదారులకు మరో మూడు నెలలపాటు ఉచిత వంటగ్యాస్ సిలిండర్ పంపిణీ కొనసాగింపునకు మంత్రిమండలి ఆమోదం
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (PMGKY) కింద ఉజ్వల యోజన లబ్ధిదారులకు 01.07.2020 నుంచి మరో మూడు నెలలపాటు వంటగ్యాస్ సిలిండర్ల ఉచిత పంపిణీని పొడిగించాలని కోరుతూ పెట్రోలియం-సహజవాయువు మంత్రిత్వశాఖ సమర్పించిన ప్రతిపాదనను ఇవాళ మంత్రిమండలి సమావేశం ఆమోదించింది. మరిన్ని వివరాలకు
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ విస్తరణ- ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద జూలై నుంచి నవంబరుదాకా మరో 5 నెలలు ముడి శనగల ఉచిత పంపిణీ పొడిగింపునకు మంత్రిమండలి ఆమోదం
కోవిడ్-19 ఆర్థిక ప్రతిస్పందన చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)ని 2020 జూలై నుంచి నవంబరుదాకా మరో ఐదునెలలపాటు పొడిగించేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని లబ్ధిదారులకు 9.7 లక్షల టన్నుల శుద్ధిచేసిన ముడి శనగల ఉచిత పంపిణీని ప్రతినెలా ఇంటికి కిలో వంతున ఈ నెలారంభం నుంచి నవంబరుదాకా మరో ఐదు నెలలు కొనసాగిస్తారు. ఇందుకోసం అదనంగా రూ.6,894.24 కోట్లు ఖర్చుకాగలదని అంచనా. మరిన్ని వివరాలకు
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద జూలై నుంచి నవంబరుదాకా మరో 5 నెలలపాటు అదనపు ఆహారధాన్యాల కేటాయింపులకు మంత్రిమండలి ఆమోదం
కోవిడ్-19 ఆర్థిక ప్రతిస్పందన చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను 2020 జూలై నుంచి నవంబరుదాకా మరో ఐదునెలలపాటు పొడిగించేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కేంద్ర నిల్వల నుంచి అదనపు ఆహారధాన్యాలను ప్రభుత్వం కేటాయించనుంది. మరిన్ని వివరాలకు
కోవిడ్-19పై పోరాటంలో భాగంగా ఈసీహెచ్‌ఎస్ కింద ప్రతి విశ్రాంత సైనికుని కుటుంబానికీ ఒక పల్స్ ఆక్సీమీటర్ కొనుగోలుకు ఆర్థిక సహాయం
కోవిడ్-19 రోగుల ఆరోగ్య పరిస్థితి అంచనాలో ప్రాణవాయు సంతృప్త కొలమానం అత్యంత అవసరం కావడంవల్ల విశ్రాంత సైనికులకు ఈ దిశగా ఊరట కల్పించాలని రక్షణ మంత్రిత్వశాఖ, మాజీసైనికుల సంక్షేమ విభాగం నిర్ణయించాయి. ఈ మేరకు ‘ఎక్స్-సర్వీస్ మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్‌ఎస్) కింద లబ్ధిదారులకు కుటుంబానికి ఒకటి వంతున ప్రాణవాయు సంతృప్తతను కొలిచే పల్ ఆక్సీమీటర్ కొనుగోలు మొత్తం రూ.1200కు మించకుండా వాపసు చేయబడుతుంది. మరిన్ని వివరాలకు
లక్సాయ్ సైన్సెస్ భాగస్వామ్యంతో యాంటీవైరల్-హోస్ట్-డైరెక్ట్ థెరపీల సమ్మేళనంగా కోవిడ్-19 రోగులపై వైద్య ప్రయోగ పరీక్షల నిర్వహణకు నియంత్రణానుమతి కోరనున్న సీఎస్ఐఆర్
హైదరాబాద్‌లోని లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో సంయుక్తంగా ‘నాలుగు విభాగాల యాదృచ్ఛిక నియంత్రిత విధానంలో మూడోదశ ప్రయోగాత్మక వైద్య పరీక్ష’ల నిర్వహణకు భారత శాస్త్ర-సాంకేతిక పరిశోధన మండలి (CSIR) అనుమతి కోరనుంది. ఈ ప్రయోగ పరీక్షలకు ‘మ్యూకోవిన్’ (MUCOVIN)గా పేరుపెట్టారు. మేదాంత మెడిసిటీ ఇందులో పాలుపంచుకోనుండగా, మొత్తం 300 మంది కోవిడ్ రోగులను 75 మంది వంతున నాలుగు బృందాలుగా విభజించి 17 నుంచి 21 రోజులపాటు ప్రయోగాత్మక తనిఖీ-చికిత్స అందిస్తారు. మరిన్ని వివరాలకు
సీబీఎస్ఈ 9 నుంచి 12 తరగతులవరకూ 2020-21 విద్యా సంవత్సరానికిగాను సవరించిన పాఠ్యప్రణాళికను ప్రకటించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి
జాతీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న అసాధారణ పరిస్థితుల రీత్యా 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం పాఠ్యాంశాల భారాన్ని తగ్గించాలని కేంద్ర మాధ్యమిక విద్యాబోర్డు (CBSE)కు సూచించినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ చెప్పారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా 2020-21 విద్యా సంవత్సరానికిగాను పాణ్య ప్రణాళికను సీబీఎస్ఈ సవరించిందని మంత్రి ప్రకటించారు. మరిన్ని వివరాలకు
చలనచిత్ర నిర్మాణం పునఃప్రారంభంపై ప్రామాణిక విధాన ప్రక్రియలను ప్రభుత్వం ప్రకటించనుంది: ప్రకాష్ జావడేకర్
దేశంలో ప్రస్తుతం దిగ్బంధ విముక్తి దశ కొనసాగుతున్నందున చలనచిత్ర నిర్మాణం పునఃప్రారంభంపై ప్రభుత్వం త్వరలో ప్రామాణిక విధాన ప్రక్రియలను ప్రకటిస్తుందని కేంద్ర సమాచార-ప్రసారశాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్ తెలిపారు. దీంతోపాటు వినోద రంగంలోని సినిమా, టీవీ, సహనిర్మాణం, యానిమేషన్, గేమింగ్ తదితరాలకూ కొన్ని ప్రోత్సాహకాలను కూడా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. మరిన్ని వివరాలకు
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
రాష్ట్రంలో కోవిడ్ నిర్వహణ-సంరక్షణ వ్యూహం ముమ్మర అమలులో భాగంగా ఆరోగ్య-వైద్యవిద్య-పరిశోధన సలహాదారు డాక్టర్ కె.కె.తల్వార్ పర్యవేక్షణ, మార్గనిర్దేశం కింద పంజాబ్ ప్రభుత్వం రెండు ‘నిపుణుల సలహా కమిటీ’లను ఏర్పాటు చేసింది. పాటియాలా, అమృతసర్ నగరాల్లోని వైద్య కళాశాలల ఆస్పత్రులలో వివిధ కోవిడ్ సంరక్షణ సంబంధిత అంశాలను మెరుగ్గా నిర్వహించడం లక్ష్యంగా ఈ కమిటీలను నియమించింది.
రాష్ట్రంలో సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల రంగం కింద యూనిట్లను ఏర్పాటు దిశగా యువ పారిశ్రామికవేత్తలకు అన్నివిధాల సహాయ-సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 22 జిల్లాల్లో వివిధ విభాగాలకింద 56 సముదాయాలను ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. తద్వారా 70,000 ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నడుమ పర్యాటకరంగ బలోపేతానికి, ఉపశమనం కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆతిథ్య రంగానికి నిర్వహణ మూలధన రుణంపై వడ్డీ తగ్గింపు దిశగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 5,134 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 2,17,121కు చేరింది. కాగా, ముంబైలో కొత్త కేసుల నమోదు తగ్గిన నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం 806 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక ఇప్పటిదాకా మహారాష్ట్రలో 1,18,558 మంది కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 89,294గా ఉంది. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల మేరకు ముంబైలో హోటళ్లు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించాయి. అయితే, నియంత్రణ మండలాల వెలుపలి దుకాణాలు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటలదాకా తెరచి ఉంచవచ్చు.
రాష్ట్రంలో 778 కొత్త కేసులు, 17 మరణాలు నమోదవగా 26,744 మంది కోలుకున్నారు. ఈ గణాంకాల నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 37,636కు చేరగా, మృతుల సంఖ్య 1,979కు పెరిగింది. ఇక కోలుకునేవారి శాతం 71.41కి చేరింది.
రాష్ట్రంలో ఈ ఉదయందాకా 173 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 21,577కు పెరిగింది. ఇవాళ ఆల్వార్ జిల్లాలో గరిష్ఠంగా 81 కేసులు నమోదవగా, 34 కేసులతో జైపూర్, 12 కేసులతో కోట తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్‌లో కోలుకునేవారి శాతం 77.43 కాగా, పెద్ద రాష్ట్రాల స్థాయిలో ఇదే అత్యధికం కావడం విశేషం.
రాష్ట్రంలో 543 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 15,627కు పెరిగింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో 3,237 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకూ 11,768 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటిదాకా 622 మంది మరణించారు.
రాష్ట్రంలో మంగళవారం 99 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 3,415కు చేరింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో యాక్టివ్ రోగుల సంఖ్య 673గా ఉంది.
కర్ణాటకలోని హుబ్లి నుంచి కేరళకు వచ్చిన 53 ఏళ్ల కాసర్‌గోడ్ నివాసి మృతితో రాష్ట్రంలో 29వ కోవిడ్ మరణం నమోదైంది. మరోవైపు రాజధాని తిరువనంతపురం శివార్లలోని పూంతురా మత్స్యకారుల కుగ్రామం మహమ్మారికి కేంద్రంగా మారుతోంది. ఈ మేరకు గత 5 రోజులలో 600 నమూనాలను పరీక్షించగా 119 మందికి రోగ నిర్ధారణ అయింది. ఇక కోవిడ్ మహమ్మారితో ఒమన్‌లో కేరళవాసి మరొకరు మరణించడంతో గల్ఫ్ ప్రాంతంలో కేరళ మృతుల సంఖ్య 307కు పెరిగింది. ఇక కేరళలో 272 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం 2,411 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 1,86,576 మంది నిర్బంధ పరిశీలనలో ఉన్నారు.
పుదుచ్చేరిలోని రాజ్ నివాస్‌లో ఒక నౌకరుకు రోగ నిర్ధారణ కావడంతో రెండు రోజులు కార్యాలయాన్ని మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కూ కోవిడ్-19 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో నమూనాల సేకరణను ముమ్మరం చేయడంతో కేసుల సంఖ్య అధికంగా నమోదవుతోంది. ఈ మేరకు 112 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1151కి పెరిగింది. కాగా, తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పి.తంగమణికి బుధవారం కోవిడ్ నిర్ధారణ అయింది. ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పి.అన్బళగన్ వ్యాధి బారినపడిన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలకు కూడా వ్యాధి సోకింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులు జూలై 13 నుంచి ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి చెప్పారు. రాష్ట్రంలో నిన్న 3616 కొత్త కేసులు నమోదవగా 4545 మంది కోలుకున్నారు; 61 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,18,594 యాక్టివ్ కేసులు: 45,839 మరణాలు: 1571 డిశ్చార్జెస్: 71,116 చెన్నైలో యాక్టివ్ కేసులు: 22,374గా ఉన్నాయి.
రాష్ట్రంలో ఎల్‌కేజీ నుంచి 5వ తరగతివరకూ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంమీద కర్ణాటక హైకోర్టు స్టే ఉత్తర్వులిచ్చింది. మరోవైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య 25వేల స్థాయిని దాటిన నేపథ్యంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వం వ్యూహాలపై వివిధ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్రంలో నిన్న 1498 కొత్త కేసులు నమోదవగా, 571మంది కోలుకున్నారు; 15 మంది మరణించారు. ఇక మొత్తం కేసుల సంఖ్య: 26,815 యాక్టివ్ కేసులు: 15,297 మరణాలు: 416 డిశ్చార్జి: 11,098గా ఉన్నాయి.
రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన ప్రభుత్వ వైద్యుడొకరు కోవిడ్-19కు బలికాగా, మునిసిపల్ కమిషనర్ స్థాయి అధికారికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, రాష్ట్రంలో ప్రస్తుత 20 సంచార పరీక్ష వాహనాలకు అదనంగా వివిధ ప్రాంతాలకు మరో 50 వాహనాలను సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 27,643 నమూనాలను పరీక్షించగా 1062 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు 1332 మంది కోలుకోగా, 12 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 22,259, యాక్టివ్ కేసులు: 10,894 డిశ్చార్జ్: 11,101, మరణాలు: 264గా ఉన్నాయి.
రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ తరహా పరీక్షలు నిర్వహించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరనుంది. ఈ మేరకు లక్షకుపైగా యాంటిజెన్ టెస్ట్ కిట్ల సేకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అయితే ఈ పరీక్షలు ఎప్పటినుంచి మొదలయ్యేదీ ఇంకా వెల్లడి కాలేదు. నిన్నటిదాకా రాష్ట్రంలో మొత్తం కేసులు: 27,612 యాక్టివ్ కేసులు: 11,012; మరణాలు: 313 డిశ్చార్జి అయినవారు: 16,287 మంది.
రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిపై ముఖ్యమంత్రి శ్రీ పెమాఖండూ సీనియర్ అధికారులతో చర్చించారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలతోపాటు పరీక్షల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
రాష్ట్రంలోని జిరిబామ్‌లో 5 పిహెచ్‌ఇడి ప్రాజెక్టులు, 1 సీఎఎఫ్-పీడీ ప్రాజెక్టుతోపాటు 1 రాపిడ్ యాంటిజెన్ పరీక్షల కేంద్రాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.బీరేన్ సింగ్ ప్రారంభించారు.
మేఘాలయలోని నైరుతి గారో పర్వతజిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఇవాళ కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 45కు చేరగా, ప్రస్తుతం 52 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో ఇవాళ మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 201కి చేరగా, ప్రస్తుతం 58 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలోని పెరెన్ జిల్లాలో పరిస్థితిపై పరిశీలన దిశగా నాగాలాండ్ ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కోవిడ్ మహమ్మారి సామాజిక స్థాయి వ్యాప్తి సమర్థ నిరోధం, నియంత్రణ దిశగా పటిష్ఠ వ్యూహంపై ఈ సందర్భంగా చర్చించారు. కాగా, రాష్ట్రంలో 12 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 656కు చేరింది. ఇక ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 353 కాగా, కోలుకున్నవారి సంఖ్య 303గా ఉంది.
*****
(Release ID: 1637432)
Visitor Counter : 241
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam