ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ మరణాల తగ్గింపులో కేంద్రం చేయూత: రాష్ట్రాల డాక్టర్లకు టెలి-కన్సల్టేషన్ సాయం
తొలి సెషన్ లో వెయ్యికిపైగా పడకలున్న 10 ఆస్పత్రులు
మంగళ, శుక్రవారాల్లో వారానికి రెండు సార్లు టెలి-కన్సల్టేషన్
Posted On:
08 JUL 2020 1:59PM by PIB Hyderabad
కోవిడ్ సంక్షోభ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరణాల తగ్గింపుకు తీవ్రంగా కృషి చేస్తోంది. పాజిటివ్ గా నమోదై చికిత్స పొందుతున్నవారికి అందాల్సిన వైద్యం విషయంలో రాష్ట్రాలలోని డాక్టర్లకు సూచనలిచ్చేందుకు కూడా సిద్ధమైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇప్పుడు ప్రత్యేకంగా ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లలో మార్గదర్శనం చేయించేందుకు, వారి అనుభవాన్ని రాష్ట్రాలలోని ఐసియు ఆస్పత్రులలో పనిచేసే డాక్టర్లకు పంచేందుకు పథక రచన చేసింది.
కోవిడ్ చికిత్సా విధానంలో కీలకమైన టెలి-కన్సల్టేషన్ ప్రక్రియను ఇలా వాడుకోబోతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ లోని నిపుణులైన డాక్టర్ల ప్రత్యేక బృందం వివిధ రాష్ట్రాలలో ఐసియు లో చికిత్స పొందుతున్న బాధితుల చికిత్సకు టెలి/వీడియో కన్సల్టేషన్ ద్వారా మార్గదర్శనం చేస్తుంది. ఆ విధంగా బాధితుల మరణాల రేటును తగ్గించగలిగేలా ప్రత్యేకంగా సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ విధంగా సకాలంలో నిపుణుల సలహాలు వారానికి రెండు సార్లు అందటం కోసం ప్రతి మంగళ, శుక్ర వారాలను ఎంపిక చేశారు.
ఇందులో భాగంగా మొదటి సెషన్ ఈ రోజు సాయంత్రం 4.30 కి మొదలైంది. మహారాష్ట్రలోని ముంబై నగరానికి చెందిన తొమ్మిది ఆస్పత్రులు, గోవాలోని ఒక ఆస్పత్రి ఈ మొదటి రోజుకు ఎంచుకున్నారు. నెస్కో జంబో, సిడ్కో ములుంద్, మలద్ ఇన్ఫినిటీ మాల్, జియో కన్వెన్షన్ సెంటర్, నాయర్ హాస్పిటల్, ఎం సి జి ఎమ్ సెవెన్ హిల్స్, ఎమ్ ఎమ్ ఆర్ డి ఎ బికెసి, ఎమ్ ఎమ్ ఆర్ డి ఎ బికెసి, ముంబయ్ మెట్రో దహిసార్, గోవా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రి ఈ రోజు మార్గదర్శనం అందుకున్నాయి.
ఈ ఆస్పత్రులన్నిటిలో వెయ్యికి పైగా పడకలున్నాయి. అందులో ఐసొలేషన్ పడకలు, ఆక్సిజెన్ ఆధారిత పడకలు, ఐసియు పడకలు కూడా ఉన్నాయి. ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన పల్మొనరీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆనంద్ మోహన్ ఈ రోజు కన్సల్టేషన్ లో పాల్గొన్నారు.
ఈ టెలీమెడిసిన్ కన్సల్టేషన్ సేవలు త్వరలో మరో 61 ఆస్పత్రులకు విస్తరిస్తారు. వాటి పడకల సామర్థ్యం 500-1000 మధ్య ఉంటుంది. వీటికి కూడా వారానికి రెండు సార్లు కన్సల్టేషన్ ఉంటుంది. జులై 31 వరకు ఈ సౌకర్యం అందించటానికి తేదీలు ఖరారు చేశారు. మొత్తం 17 రాష్ట్రాలను ఇందుకోసం ఎంపిక చేశారు. వాటిలో ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, బీహార్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, హర్యానా, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, మహారాష్ట్ర ఉన్నాయి. ఆయా రాష్ట్రాల ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ తోబాటు ఇద్దరేసి డాక్టర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు
****
(Release ID: 1637229)
Visitor Counter : 228
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Malayalam