PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
02 JUL 2020 6:21PM by PIB Hyderabad
పత్రికా సమాచార సంస్థ
సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం



(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: 60కి చేరువగా కోలుకునేవారి శాతం; యాక్టివ్‌తో పోలిస్తే కోలుకున్నవారి సంఖ్య 1,32,912 అధికం

దేశంలో కోవిడ్-19 నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య చికిత్స పొందుతున్న వారికన్నా 1,32,912 మేర అధికంగా నమోదైంది. సకాల వైద్య నిర్వహణవల్ల నిత్యం 10,000 మందికిపైగా కోలుకుంటున్నారు. ఈ మేరకు గడచిన 24 గంటల్లో 11,881 మంది కోలుకోగా ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 3,59,859కి పెరిగి, కోలుకునేవారి శాతం 59.52కు చేరింది. ప్రస్తుతం 2,26,947 మంది కోవిడ్ బాధితులు చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత 24 గంటల్లో 2,29,588 కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, నేటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య 90,56,173కు పెరిగింది. కోవిడ్ ప్రత్యేక ప్రయోగశాలల సంఖ్య 1065కు చేరగా- 768 ప్రభుత్వ రంగంలో, 297 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. మరిన్ని వివరాలకు
ఆటంకాల తొలగింపుతో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరుగుదల; ఇకపై నమోదిత ప్రైవేటు వైద్యుల సిఫారసు చీటీపైనా పరీక్షకు మార్గం సుగమం
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యతో దేశంలో ఇకపై ప్రభుత్వ వైద్యులు మాత్రమేగాక నమోదిత ప్రైవేటు వైద్యుల సిఫారసు చీటీపైనా కోవిడ్-19 రోగ నిర్ధారణ పరీక్షకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రోగ లక్షణాలకు సంబంధించి ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ వ్యక్తికైనా కోవిడ్ పరీక్ష సిఫారసు చేసేందుకు అర్హతగల వైద్యులందరినీ అనుమతిస్తూ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. సకాల “పరీక్ష-అన్వేషణ-చికిత్స” వ్యూహంతోనే రోగులను త్వరగా గుర్తించి, వ్యాధి వ్యాప్తిని నియంత్రించడం సాధ్యం కాగలదని కేంద్రం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. దీనికి తగినట్లుగా ఆయా ప్రాంతాల్లోని కోవిడ్-19 పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలల సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఆ మేరకు ముఖ్యంగా ప్రజలకు ప్రయోజనం కలిగేవిధంగా ప్రైవేటు ప్రయోగశాలలను పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరింది. మరిన్ని వివరాలకు
కోవిడ్ పరీక్షలపై అవరోధాలన్నీ తొలగించిన కేంద్రం; పరీక్షల వేగం పెంచాలని రాష్ట్రాలకు సూచన
దేశంలో కోవిడ్ నిర్ధారణ సౌకర్యాలను పెంచడంతోపాటు పరీక్షల సంఖ్యను పెంచేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కుమారి ప్రీతి సుడాన్, భారత వైద్య పరిశోధన మండలి (ICMR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ కోరారు. సకాల “పరీక్ష-అన్వేషణ-చికిత్స” వ్యూహంతోనే రోగులను త్వరగా గుర్తించి, మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడం సాధ్యం కాగలదని వారు పునరుద్ఘాటించారు. కొన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్ష సదుపాయాలను... ప్రత్యేకించి ప్రైవేటు ప్రయోగశాలల సామర్థ్యాన్ని అరకొరగానే వాడుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోగ లక్షణాలకు సంబంధించి ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ వ్యక్తికైనా కోవిడ్ పరీక్ష సిఫారసు చేసేందుకు ప్రైవేటు డాక్టర్లుసహా అర్హతగల వైద్యులందరినీ అనుమతిస్తూ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. కోవిడ్-19 నిర్ధారణకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష పూర్తి ప్రామాణికమైనది కాగా, రోగులను త్వరగా గుర్తించడంలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ వినియోగానికీ ఐసీఎంఆర్ ఇటీవల అనుమతించినట్లు పేర్కొన్నారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సులభతరం చేసేదిశగా కేసుల సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉద్యమ తరహాలో ప్రత్యేక శిబిరాల ఏర్పాటు, సంచారవాహన వినియోగం తదితర చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. తద్వారా వ్యాధి లక్షణాలున్న వ్యక్తులుసహా వారితో పరిచయాలున్నవారి నమూనాల సేకరణకు వీలుంటుందని తెలిపారు. ఈ నమూనాలను ర్యాపిడ్ యాంటిజెన్ విధానంలో పరీక్షించి ఫలితాలు త్వరగా తేల్చవచ్చునని పేర్కొన్నారు. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంపుతోపాటు వైరస్ వ్యాప్తి నిరోధంలో కీలకమైన రోగి ‘పరిచయస్తుల జాడ తీయడం’పైనా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన శ్రద్ధ చూపాలని కోరారు. మరిన్ని వివరాలకు
ఒడిషా ఆశా కార్యకర్తలు: కోవిడ్ సంబంధిత వివక్ష తొలగింపులో ముందంజ; కోవిడ్-19పై పోరులో స్థానిక సమాజాలతో సన్నిహితంగా కృషి
ఒడిషాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19పై పోరులో 46,627 మంది ఆశా (ASHA) కార్యకర్తలు స్థానికుల ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీరుస్తూ పోరాట యోధులుగా ఆవిర్భవించారు. ఈ మేరకు గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తల వ్యవస్థ అనుబంధిత గ్రామ సంక్షేమ సమితులు, మహిళా ఆరోగ్య సమితులతో వారు సన్నిహితంగా పనిచేశారు. కోవిడ్ నివారణ దిశగా బహిరంగ ప్రదేశాలలో మాస్కుల వాడకం, తరచూ చేతులు కడుక్కోవటం, భౌతిక దూరం పాటించటం, కోవిడ్ లక్షణాలను గుర్తించటం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన పెంచటంలో అవిరళ కృషి చేశారు. అంతేకాకుండా ప్రజలలో అవగాహన కలిగించే దిశగా కోవిడ్ సంబంధిత కరపత్రాల పంపిణీ, పోస్టర్లతో ప్రచారం, గ్రామీణ స్థాయిలో గోడమీద రాతల (స్వాస్థ్యకాంత) వంటి పనుల్లోనూ ఆశా కార్యకర్తలు చురుకైన పాత్ర పోషిస్తూ విస్తృత అవగాహన కల్పించారు. మరిన్ని వివరాలకు
పల్స్ ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్ల ధరల పెరుగుదలపై ఎన్‌పీపీఏ పర్యవేక్షణ; ఈ రెండు పరికరాలు తగిన సంఖ్యలో లభ్యమయ్యేలా చర్యలు
దేశంలో కోవిడ్ -19 వైద్య నిర్వహణకు అవసరమైన కీలక వైద్య పరికరాలు తగు పరిమాణంలో లభించేలా ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సదరు కీలక వైద్య పరికరాల జాబితాను రూపొందించి, దేశంలో వాటి సులభ లభ్యత దిశగా చర్యలు తీసుకోవాలని జాతీయ ఔషధ ధరల నియంత్రణ ప్రాధికార సంస్థ (NPPA)ను కోరింది. ప్రాణరక్షక మందులు/పరికరాలు సరళ ధరలకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, వాటన్నిటినీ ఔషధాల జాబితాలో చేర్చి నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తెచ్చింది. దీనికి అనుగుణంగా (i) పల్స్ ఆక్సీమీటర్ (ii) ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్ వంటి కీలక వైద్య పరికరాల ధరల సమాచారం అందజేయాలని వాటి తయారీ/దిగుమతిదారులను ఎన్‌పీపీఏ ఆదేశించింది. ఆ మేరకు 2020 ఏప్రిల్ 1నాటికిగల సదరు పరికరాల ధరలను ఏడాది వ్యవధిలో 10 శాతానికి మించి పెంచకుండా నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైద్య పరికరాల పరిశ్రమల సంఘాలు, పౌర సమాజ బృందాల వంటి భాగస్వాములతో 2020జూలై 1న ఎన్‌పీపీఏ ఒక సంప్రదింపుల సమావేశం నిర్వహించింది. కీలక వైద్య పరికరాల తయారీ/దిగుమతిదారులంతా దేశంలో వాటి లభ్యతకు కొరత లేకుండా చూడాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అలాగే సదరు కీలక వైద్య పరికరాల చిల్లర ధరలను తగ్గించాలని ఆ పరిశ్రమ సంఘాలను కోరింది. మరిన్ని వివరాలకు
భారత ప్రధానమంత్రి-రష్యా అధ్యక్షుల మధ్య టెలిఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 జూలై 2న రష్యా అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి ప్రభావిత ప్రతికూల పరిణామాల పరిష్కారానికి రెండు దేశాల్లో తీసుకున్న సమర్థ చర్యల గురించి వారు పరస్పరం తెలుసుకున్నారు. ఆ మేరకు కోవిడ్-19 అనంతర ప్రపంచంలో మహమ్మారి సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొనే దిశగా భారత-రష్యా సంబంధాలకుగల ప్రాముఖ్యాన్ని దేశాధినేతలిద్దరూ గుర్తించారు. ఈ ఏడాదిలో భారత్ నిర్వహించనున్న ద్వైపాక్షిక శిఖరాగ్ర సదస్సుకు సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలు, సంప్రదింపులను ప్రస్తుత వేగంతో కొనసాగించడానికి వారు అంగీకరించారు. ఈ ద్వైపాక్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధానమంత్రి సాదరంగా ఆహ్వానం పలికారు. మరిన్ని వివరాలకు
ఔషధాన్వేషణ హ్యాకథాన్-2020ని సంయుక్తంగా ప్రారంభించిన కేంద్ర హెచ్‌ఆర్‌డి, ఆరోగ్యశాఖ మంత్రులు
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ; శాస్త్ర-సాంకేతిక శాఖల మంత్రులు శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’, డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ ‘ఔషధాన్వేషణ హ్యాకథాన్-2020ని ఆన్‌లైన్ వేదికద్వారా ప్రారంభించారు. ఎంహెచ్‌ఆర్‌డి, ఏఐసీటీఈ, సీఎస్‌ఐఆర్ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తుండగా సీడాక్, మైగవ్, ష్రోడింగర్, షెమాక్షన్ అవసరమైన తోడ్పాటునందిస్తున్నాయి. ఈ హ్యాకథాన్ ప్రధానంగా ఔషధాన్వేషణలో కంప్యుటేషనల్ అంశాలపై 3 అంకాలుగా దృష్టి సారిస్తుంది. ఈ మేరకు మొదటి అంకం కింద ఔషధ స్వరూపంపై కంప్యుటేషనల్ నమూనా అంశాన్ని లేదా ప్రస్తుత సమాచార నిధి నుంచి సార్స్-సీవోవీ2 వైరస్‌ను నిర్వీర్యంచేసే సామర్థ్యంగల ప్రధాన సమ్మేళనాలను పర్యవేక్షిస్తారు. రెండో అంకం కింద కృత్రిమ మేధస్సు/ఎంఎల్ విధానాలతోపాటు డేటా విశ్లేషణ సాయంతో కనిష్ఠ విషప్రభావం-గరిష్ఠ నిర్దిష్టతగల ఔషధాల తరహా సమ్మేళనాలను అంచనా వేయగల కొత్త ఉపకరణాలు, అల్గరిథమ్‌లను రూపొందించేలా భాగస్వాములను ప్రోత్సహిస్తారు. ఇక మూడో అంకం కింద ఈ రంగంలో నవ్య, విభిన్న ఆలోచనలతో ముందుకు సాగే అనూహ్య ఫలితాన్వేషణ విధానాన్ని అనుసరిస్తారు. మరిన్ని వివరాలకు
వాణిజ్య సౌలభ్యానికి భరోసా ఇచ్చేలా జీఎస్టీ పన్ను వ్యవస్థ సరళీకరణకు కృషిచేయాలి: ఆర్థికశాఖ మంత్రి
వస్తుసేవల పన్ను (GST) వ్యవస్థ మూడో వార్షికోత్సవం లేదా ‘జీఎస్టీ దినోత్సవం-2020’ నేపథ్యంలో 2020 జూలై 1న కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (CBIC) ప్రధాన కార్యాలయంసహా దేశంలోని అన్ని క్షేత్రస్థాయి ఆఫీసులలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సందేశమిచ్చారు. దేశంలోని భాగస్వాముల నుంచి సమాచార స్వీకరణద్వారా జీఎస్టీ పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడంలో ఎంతో కృషి జరిగిందని ఆమె ప్రముఖంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి సందేశంలో ముఖ్యాంశాలు: “స్వయం సమృద్ధ భారతం దిశగా గౌరవనీయులైన ప్రధాని మేలుకొలుపుపై దృష్టి సారించాలి. వాణిజ్య సౌలభ్యం దిశగా పన్ను చెల్లింపుదారుల కోసం జీఎస్టీ పన్ను వ్యవస్థలను మరింత సరళీకరించేందుకు కృషిచేయాలి. తదనుగుణంగా వ్యాపార సమాజానికి ఎదురయ్యే సమస్యలపై అంచనాద్వారా ముందుచూపుతో పరిష్కారాలను సిద్ధం చేసుకోవాలి.” ప్రస్తుత కోవిడ్-19 పరీక్షా సమయంలో ప్రశంసనీయంగా విధులు నిర్వర్తించినందుకు, పరిధికిమించి పన్ను చెల్లింపుదారులకు చేయూతనిచ్చినందుకుగాను సీబీఐసీ అధికారులను ఆర్థికశాఖ మంత్రి అభినందించారు. దీంతోపాటు ఈ కష్టకాలంలో పన్ను చెల్లింపుదారులకు ద్రవ్యలభ్యత దిశగా రికార్డు స్థాయిలో పన్ను వాపసు సొమ్ములు చెల్లించడాన్ని కొనియాడారు. మరిన్ని వివరాలకు
మునుపటి కోటాలోని ఆహారధాన్యాలను తీసుకెళ్లి, లబ్ధిదారులకు పంపిణీ వేగిరం చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు శ్రీ రామ్‌విలాస్ పాశ్వాన్ సూచన
కేంద్ర వినియోగదారు వ్యవహారాలు-ఆహార-ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్‌విలాస్ పాశ్వాన్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. జాతీయ ఆహార భద్రత చట్టం (NFSA) నిబంధనల మేరకు లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థకు కిందకు వచ్చే (ప్రత్యక్ష లబ్ధి బదిలీ కిందగలవారుసహా) దేశంలోని (ఏఏవై, పీహెచ్‌హెచ్) లబ్ధిదారులందరికీ నెలకు తలా 5 కిలోల వంతున అదనంగా ఆహారధాన్యాల పంపిణీకి సంబంధించి తమశాఖ తీసుకున్న కేటాయింపు, సన్నద్ధత తదితర అవసరమైన చర్యల గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ పథకాన్ని నవంబరుదాకా పొడిగించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితుల నడుమ రాబోయే వర్షాకాలంతోపాటు పండుగల సమయంలో పేదలు ఆకలిబాధకు గురికాకుండా ఉచిత రేషన్ లభిస్తుందని పేర్కొన్నారు. తదనుగుణంగా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలోకి వచ్చే 20 కోట్ల కుటుంబాల్లోని 80 కోట్లమంది లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయడం కోసం 200 లక్షల టన్నుల ఆహారధాన్యాలు, 9.78 లక్షల టన్నుల పప్పుదినుసులను కేటాయించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు
ఆపరేషన్ సముద్ర సేతు- ఇరాన్ నుంచి 687 మంది భారతీయులను స్వదేశం చేర్చిన ‘ఐఎన్‌ఎస్ జలాశ్వ’
‘ఆపరేషన్ సముద్ర సేతు’ పేరిట భారత నావికాదళం చేపట్టిన కార్యక్రమం కింద ‘ఐఎన్‌ఎస్ జలాశ్వ’ నౌక ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ రేవునుంచి 687 మంది భారతీయులతో బయల్దేరి నిన్న తమిళనాడులోని ట్యుటికోరిన్ రేవుకు చేరింది. దీంతో భారత నావికాదళ నౌకలు ఇరాన్ నుంచి తీసుకొచ్చిన భారత పౌరుల సంఖ్య 920కి చేరింది. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితుల నడుమ మాల్దీవ్స్, శ్రీలంక, ఇరాన్‌లనుంచి భారత నావికాదళ నౌకలు ఇప్పటిదాకా మొత్తం 3,992 మంది భారత పౌరులను స్వదేశం చేర్చాయి. మరిన్ని వివరాలకు
‘మీటీ’ ఐదేళ్ల డిజిటల్ భారతం వేడుకలు: డిజిటల్ పయనంలో సాధికారత, సార్వజనీనత, డిజిటల్ పరివర్తనాత్మకతలపై దృష్టి; భారత పౌరుల జీవితాల్లోని అన్ని అంశాల్లోనూ కనిపిస్తున్న సానుకూల ప్రభావం: రవిశంకర్ ప్రసాద్
డిజిటల్ కార్యకలాపాల దిశగా భారత్ పయనంలో సాధికారత, సార్వజనీనత, డిజిటల్ పరివర్తనలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ-కమ్యూనికేషన్లు (మీటీ), లా-జస్టిస్ శాఖల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. దీనివల్ల పౌరుల జీవితాల్లోని అన్ని అంశాల్లోనూ దీని సానుకూల ప్రభావం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా కార్యక్రమం’ ఐదేళ్ల పయనాన్ని పురస్కరించుకుని నిన్న నిర్వహించిన వార్షికోత్సవాల సందర్భంగా దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఆయన ప్రసంగించారు. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితుల డుమ జన్‌ధన్, ఆధార్, మొబైల్ (JAM) మూడింటి సమ్మేళనంతో ప్రజల్లో అధికశాతం ఇళ్లనుంచే పనిచేయగలుగుతున్నారని తెలిపారు. అలాగే ఇంటినుంచే డిజిటల్ మార్గంలో చెల్లింపులు చేయగలుగుతున్నారని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులు టీవీలు, మొబైల్, ల్యాప్‌టాప్‌ల సాయంతో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారని గుర్తుచేశారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు దూరవాణిద్వారా వైద్యసేవలు పొందగలుగుతున్నారని, దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని రైతులకు ‘పీఎం-కిసాన్’ పథకం కింద నేరుగా వారి ఖాతాల్లోకి లబ్ధి బదిలీ అవుతున్నదని పేర్కొన్నారు. అలాగే కోవిడ్-19 పరిస్థితుల్లో ఆరోగ్యసేతు, ఈ-సంజీవని, మైగవ్‌ద్వారా, సామాజిక మాధ్యమాలద్వారా అవగాహన కల్పన తదితరాల్లోనూ డిజిటల్ ఇండియా సేవలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు
కోవిడ్-19 నేపథ్యంలో నిత్యావసరాల సరఫరా కోసం 2,266 ట్రిప్పుల పార్శిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపిన ‘ఎస్‌ఈఆర్’
ప్రస్తుత జాతీయ సంక్షోభ సమయంలో ఆగ్నేయ రైల్వే (SER) ఇప్పటిదాకా 2,266 కాలపట్టిక ఆధారిత పార్శిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లద్వారా నిత్యావసరాలను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసింది. ఈ మేరకు 2020 ఏప్రిల్ 2 నుంచి జూన్ 30దాకా ఆహార పదార్థాలు, కిరాణా సరకులు, మందులు, వైద్య పరికరాలు, చేపలు, పండ్లు, వస్తు వస్తువులు, గోనెసంచులు, కూరగాయలు, ఉల్లి, అల్లం, వెల్లుల్లి తదితర నిత్యావసరాలను చేరవేసింది. తదనుగుణంగా 13,73,645 పార్శిళ్లద్వారా 36,532 టన్నుల నిత్యావసరాలను ఎస్‌ఈఆర్ రవాణాచేసింది. మరిన్ని వివరాలకు
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
రాష్ట్రంలోని ఎర్నాకుళం మార్కెట్‌లో కోవిడ్-19 సంక్రమణ నేపథ్యంలో కొచ్చిలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యవసాయశాఖ మంత్రి వి.ఎస్.సునీల్ కుమార్ చెప్పారు. అయితే, ప్రస్తుతం ఎర్నాకుళం జిల్లాలో సామాజిక సంక్రమణ లేదని, వ్యాధి లక్షణాలను గోప్యంగా ఉంచి నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కువైట్ నుంచి తిరిగివచ్చి ఈ జిల్లాలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, నిన్న రోగ నిర్ధారణ అయిన 12 మందిలో 8 మందికి రోగులతో పరిచయంవల్ల వ్యాధి సోకినట్లు తేలింది. మార్కెట్లో ఒక ఉద్యోగికి వ్యాధి నిర్ధారణ కావడంతో అక్కడి మరో 26 మంది నమూనాలను అధికారులు సేకరించారు. ఢిల్లీలో కేరళ సన్యాసిని ఒకరు కోవిడ్-19కు బలయ్యారు. రాష్ట్రంలో నిన్న 151 కొత్త కేసులు నమోదవగా, 132మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 2,130 మంది చికిత్స పొందుతున్నారు.
పుదుచ్చేరిలో 63 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం 459మంది చికిత్స పొందుతున్నారు. తమిళనాడులోని వివిధ జిల్లాల పరిధిలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కోవిడ్ పరిస్థితులవల్ల వీలుకానందున ఇప్పటికే జూన్ 30దాకా పొడిగించిన ప్రత్యేక అధికారుల పదవీకాలాన్ని డిసెంబరు 31వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో ఆర్డినెన్స్ జారీచేసింది. రాష్ట్రంలో నిన్న 3882 కొత్త కేసులు నమోదవగా 2852 మంది కోలుకున్నారు; 63 మరణాలు సంభవించాయి. ఇప్పటిదాకా మొత్తం కేసులు: 94049, యాక్టివ్ కేసులు: 39856, మరణాలు: 1264, చెన్నైలో యాక్టివ్ కేసులు: 22777గా ఉన్నాయి.
రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలో భాగంగా ఎస్‌ఎస్‌ఎల్‌సి (10వ తరగతి) పరీక్షలు పూర్తయ్యాక జూలై 7 నుంచి నియంత్రణ జోన్లలో దిగ్బంధం విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, విధివిధానాలు పాటించకుండా కోవిడ్ మృతుల ఖననం నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇందుకోసం నగరాల వెలుపలగల ప్రాంతాలను గుర్తించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కర్ణాటకలో నిన్న 1272 కొత్త కేసులు నమోదవగా, 145 మంది డిశ్చార్జి అవడంతోపాటు 7 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు: 16,514, యాక్టివ్ కేసులు: 8194, మరణాలు: 253 డిశ్చార్జి అయినవారు: 8063 మంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని జిహెచ్ఎంసి పరిధితోపాటు ఏపీ సరిహద్దునగల కొన్ని జిల్లాల్లో 15 రోజుల దిగ్బంధం విధిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినవారు హడావుడిగా తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. దీంతో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు వెంబడి అనేకచోట్ల భారీగా వాహనాలు నిలిచిపోయి కనిపిస్తున్నాయి. కొన్ని కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులుతీరాయి. కాగా, 2020 ఆగస్టు 3 నుండి 2021 మే రెండో వారంవరకూ విద్యా సంవత్సరం కుదింపుతోపాటు పాఠ్యప్రణాళికలను 30 శాతం మేర, పనిదినాలను 180స్థాయికి తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో 24 గంటల్లో 14,285 నమూనాలను పరీక్షించగా, 845 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 281మంది డిశ్చార్జ్ కాగా, 5 మరణాలు సంభవించాయి. కొత్త కేసులలో 29 అంతర్రాష్ట్ర వాసులకు చెందినవి కాగా, 4 విదేశాలనుంచి వచ్చినవారికి సంబంధించినవి. మొత్తం కేసులు: 16,097, యాక్టివ్: 8586, డిశ్చార్జ్: 7313, మరణాలు: 198గా ఉన్నాయి.
కోవిడ్-19 రోగులకు చికిత్స దిశాగా ప్రభుత్వ అనుమతి కోసం ప్రైవేట్ ఆసుపత్రులు వరుసకడుతున్నాయి. కాగా, కోవిడ్-19 రోగులకు చికిత్స కోసం 100 పడకల సామర్థ్యంగల ఆస్పత్రులకు అనుమతిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. రాష్ట్రంలో నిన్న 1018 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక 788మంది కోలుకోగా, 7 మరణాలు సంభవించాయి. నిన్నటిదాకా మొత్తం కేసులు: 17357, యాక్టివ్: 9008, మరణాలు: 267, డిశ్చార్జి: 8082గా ఉన్నాయి.
రాష్ట్రంలో 5537 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 180298కి చేరాయి. ఇక బుధవారం 2243 మంది కోలుకోగా ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 93154కు చేరింది. ప్రస్తుత యాక్టివ్ రోగుల సంఖ్య 79075గా ఉంది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 675 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 33,318కి పెరిగాయి. అలాగే, గుజరాత్‌లో మహమ్మారికి 21 మంది బలికావడంతో మొత్తం మృతుల సంఖ్య 1,869కి పెరిగింది.
రాష్ట్రంలో ఇవాళ 115 కొత్త కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,427కు చేరింది. రాష్ట్రంలో ఇప్పుడు 3358 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటిదాకా 14,643 మంది కోలుకున్నారు. కొత్త కేసులకు సంబంధించి ఉదయపూర్‌లో గరిష్టంగా- 21, బికనేర్ 12, రాజ్‌సమంద్, ధోల్‌పూర్‌లలో 10 వంతున నమోదయ్యాయి.
రాష్ట్రంలో బుధవారం 268 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 13,861కి చేరింది. ప్రస్తుతం 2625 యాక్టివ్ కేసులుండగా కోలుకున్నవారి సంఖ్య 10655గా ఉంది. ఇక ఇప్పటిదాకా 581 మంది మరణించారు. హాట్‌స్పాట్ ఇండోర్‌లో బుధవారం 25 కొత్త కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కేసులు 4734కు చేరాయి. అలాగే రాజధాని భోపాల్‌లో బుధవారం 41 కొత్త కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. ఇక్కడి మొత్తం కేసులు 2830గా ఉన్నాయి. మొరెనా జిల్లాలో గరిష్టంగా 73 కొత్త కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. గ్వాలియర్‌లో 25, భింద్‌లో 22 వంతున కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో బుధవారం 81 కొత్త కేసుల నమోదుతోపాటు 53మంది కోలుకోగా ఒక మరణం సంభవించింది. ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 2940 కాగా, 623 యాక్టివ్ కేసులన్నాయి.
గోవాలో బుధవారం 72 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1387కు పెరిగింది. ప్రస్తుతం 713 యాక్టివ్ కేసులుండగా 74 మంది కోలుకోవడంతో వ్యాధి నయమైనవారి సంఖ్య 670కి పెరిగింది. ఇతర అనారోగ్యాలున్న కోవిడ్ రోగి ఒకరి మృతితో మరణాల సంఖ్య 4కు చేరింది.
రాష్ట్రంలో ఇప్పటిదాకా మొత్తం 24,856 నమూనాలు సేకరించగా వాటిలో 1669కి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం 128 యాక్టివ్ కేసులుండగా 66 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. వ్యాధి వ్యాప్తిని కనీస స్థాయికి తగ్గించే లక్ష్యంతో అరుణాచల్ ప్రదేశ్‌లోని దోయిముఖ్ బజార్ కమిటీ జూలై 5 వరకు నాలుగు రోజులపాటు మార్కెట్‌లోని అన్ని వ్యాపార సంస్థలను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో ఇవాళ ఇద్దరు కోవిడ్-19 పీడితులు మరణించినట్లు అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలోని చురచంద్‌పూర్ కోవిడ్-19 సంరక్షణ కేంద్రాన్ని మణిపూర్‌లోని NIELIT చురాచంద్‌పూర్ ఎక్స్ టెన్షన్ సెంటర్‌లో ప్రారంభించారు. ఈ కేంద్రంలో 50 పడకలు ఉండగా దీన్ని ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. ఇప్పటిదాకా సేకరించిన నమూనాలకుగాను 382 ప్రతికూల ఫలితం రాగా, మరో 15 నమూనాల ఫలితాలు అందాల్సి ఉంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 37కాగా, 123మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 160గా ఉన్నాయి.
రాష్ట్రంలో 34 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 535కు చేరింది. వీటిలో 353 యాక్టివ్ కేసులు కాగా, ఇప్పటివరకు 182మంది కోలుకున్నారు. హుయాన్‌త్సాంగ్ వద్ద బిఎస్ఎల్-2 ప్రయోగశాల ఏర్పాటుకు తొలిదశ పరికరాలు అందాయని, యుద్ధ ప్రాతిపదికన సాంకేతిక పనులు సాగుతాయని నాగాలాండ్ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు.
నగరంలో నమోదయ్యే జ్వరం, ILI, SARI, SARS, దోమకాటువల్ల వ్యాపించే కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఈ కేసుల ఆధారంగా కోవిడ్ అనుమానిత రోగుల జాడ తీయాలని నగర పాలనాధికారి ఆదేశించారు. ఇరుగుపొరుగున అనుమానిత కేసులు గమనిస్తే తక్షణం అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అలాగే వెంటనే వైద్యబృందాన్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. దేశీయాంగ శాఖ జారీచేసిన దిగ్బంధ విముక్తి రెండోదశ మార్గదర్శకాలను చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో అమలు చేయడానికి ఆమోదించామని ఆయన పేర్కొన్నారు. మాస్కుధారణతోపాటు బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించడం వంటివి కఠినంగా అమలవుతాయని తెలిపారు. ఆ మేరకు మార్గదర్శకాలు/ఆదేశాలను ఉల్లంఘించే వారికి జరిమానా విధించబడుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తితో ప్రభుత్వ ఆస్పత్రులలో కేసుల భారం పెరుగుతుండటంతో రాష్ట్ర పంజాబ్ ఆరోగ్యశాఖలో 3,954 రెగ్యులర్ ఉద్యోగ ఖాళీల భర్తీకి మంత్రిమండలి నిర్ణయించింది. దీంతోపాటు వైద్యవిద్య-పరిశోధన విభాగంలో 291 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.
రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నడుమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మాత్రమే మనుగడ సాగించగలిగిందని ముఖ్యమంత్రి అన్నారు. “ముఖ్యమంత్రి గ్రామ కౌశల్ యోజన” లబ్ధిదారులతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ముచ్చటించిన సందర్భంగా ఈ మేరకు పేర్కొన్నారు. దీన్నిబట్టి ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనగల బలమైన పునాది ఈ ప్రాంతాలకు ఉందని రుజువైందని చెప్పారు. యువతకు లబ్ధి చేకూరేవిధంగా గ్రామీణాభివృద్ధి ప్రాధాన్య పథకాలను ప్రారంభించేందుకు యత్నించాలని, దీనివల్ల ఉపాధికోసం పట్టణ ప్రాంతాలకు వలసవెళ్లే దుస్థితి ఉండదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల మధ్య గర్భిణులకు సురక్షిత, నిరంతరాయ ప్రసూతి సదుపాయాల కల్పనకు హర్యానా ప్రభుత్వం ప్రభుత్వ-ప్రైవేట్ ఆరోగ్య సంస్థలలో సంబంధిత సౌకర్యాల బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు కోవిడేతర ఆస్పత్రులలో ప్రత్యేక ‘ఎల్‌డిఆర్” గది (ప్రసవవేదన, ప్రసవం, స్వస్థత) సదుపాయం కల్పించబడింది. ఇక కోవిడ్ బారినపడిన గర్భిణులను సంబంధిత ప్రత్యేక ఆస్పత్రులకు పంపడం సాధ్యంకాని సందర్భాల్లో ప్రసూతి సదుపాయ కల్పనలో భాగంగా ఒక ఏకాంత చికిత్స వార్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


********
(Release ID: 1636043)