ఆర్థిక మంత్రిత్వ శాఖ

సులభతర వ్యాపారం కోసం జి.ఎస్.టి. పన్ను నిర్వహణ సరళీకరణకు కృషి చేయండి : ఆర్ధిక మంత్రి

Posted On: 01 JUL 2020 7:34PM by PIB Hyderabad

జి.ఎస్.టి. దినోత్సవం, 2020 లేదా జి.ఎస్.టి ప్రవేశపెట్టి, మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, 2020 జూలై 1వ తేదీన దేశవ్యాప్తంగా సి.బి.ఐ.సి. మరియు దానికి సంబంధించిన క్షేత్ర స్థాయి కార్యాలయాలన్నింటిలో వార్షికోత్సవ కార్యక్రమాలు జరిగాయి.    ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి అవరోధాలను అధిగమించడంలో మరియు "వన్ నేషన్ వన్ టాక్స్ వన్ మార్కెట్" నినాదాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో జి.ఎస్.టి. కీలక పాత్ర పోషించింది.  కోవిడ్ మహమ్మారి నిబంధనల నేపథ్యంలో, ఈ రోజు ను గుర్తుచేస్తుకుంటూ, సంబంధిత భాగస్వాములతో పరస్పర చర్చలు చాలా భాగం డిజిటల్ వేదికల ద్వారా, ఆన్ లైన్ లో జరిగాయి.  

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, జి.ఎస్.టి. దినోత్సవం-2020 సందర్భంగా, ఒక సందేశం ఇస్తూ, వాటాదారుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా జి.ఎస్.టి. పన్ను నిర్వహణను సరళీకృతం చేయడంలో జి.ఎస్.టి. చాలా కృషి చేసిందని పేర్కొన్నారు.  అయితే, పన్ను అమలును సులభతరం చేయడానికి, మరింత కృషి చేయవలసిన అవసరం ఉందని, ఆమె సూచించారు. 

ఆర్ధిక మంత్రి సందేశం లోని ముఖ్య అంశాలు:

  • ఆత్మ నిర్భర్ భారత్ కోసం గౌరవ ప్రధానమంత్రి ఇచ్చిన స్పష్టమైన పిలుపు పై దృష్టి పెట్టాలి.
  • సులభంగా వ్యాపారం చేయడానికి అనువుగా, పన్ను చెల్లింపుదారులకు పన్ను నిర్వహణ సులభతరం చేయడానికి కృషి చేయాలి.
  • వ్యాపార సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ఊహించి, వాటిని ముందుగానే పరిష్కరించాలి.

కోవిడ్-19 యొక్క ఈ పరీక్షా సమయాల్లో, ప్రశంసనీయమైన పనిచేసినందుకు, తమ పరిధికి మించి పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు, సి.బి.ఐ.సి. అధికారులను ఆర్థిక మంత్రి అభినందించారు.   అలాగే, ఈ సమయంలో, పన్ను చెల్లింపుదారులకు నగదు అందుబాటులో ఉండే విధంగా రికార్డు మొత్తంలో పన్ను రిఫండ్ చేసినందుకు కూడా ఆమె సంబంధిత అధికారులను ప్రశంసించారు.

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, ఈ సందర్భంగా ఒక సందేశం ఇస్తూ, రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేయాల్సిన అవసరం ఉందనీ, రిటర్న్ యొక్క ప్రాసెసింగ్ మరియు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందనీసూచించారు.   లాక్ డౌన్ సమయంలో, ఆన్ లైన్ విధానం ద్వారా, జి.ఎస్.టి. రిఫండ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలను సమర్ధవంతం వినియోగించి, పన్ను చెల్లింపుదారులకు నగదు అందుబాటులో ఉండే విధంగా, సి.బి.ఐ.సి. అధికారులు చేసిన కృషిని శ్రీ ఠాకూర్ ప్రశంసించారు. కోవిడ్-19 సమయంలో, ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేసిన సి.బి.ఐ.సి. క్షేత్ర స్థాయి అధికారుల సామాజిక సేవా కార్యకలాపాలను కూడా ఆయన ప్రశంసించారు.

జి.ఎస్.టి. దినోత్సవ సందర్భంగా, శాఖా పరంగా ఆన్ లైన్ ద్వారా జరిగిన ఒక కార్యక్రమంలో, సి.బి.ఐ.సి. చైర్మన్ శ్రీ ఎమ్.అజిత్ కుమార్ మాట్లాడుతూ, పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడం మరియు వారి ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని, ఆర్ధికమంత్రి తమ సందేశంలో పేర్కొన్న, సులభతర వ్యాపారం విషయాన్ని గౌరవించాలని, ఆయన కోరారు.

 

*****


(Release ID: 1635788) Visitor Counter : 307