ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అవరోధాల తొలగింపుతో కోవిడ్ పరీక్షల వేగవంతం


ఇప్పుడు ప్రైవేట్ డాక్టర్లు సైతం కోవిడ్ పరీక్షలకు సిఫార్సు చేయవచ్చు

త్వరలో కోటికి చేరనున్న పరీక్షలు

Posted On: 02 JUL 2020 2:44PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య త్వరలో కోటికి చేరుకోబోతోంది. పరీక్షల  విషయంలో ఉన్న అన్ని అవరోధాలనూ తొలగించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించటంతో ఇది సాధ్యమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా కోవిడ్ పరీక్షలకు మార్గం సుగమమవుతోంది.

ఇప్పటివరకూ 90,56,173 పరీక్షలు జరిగాయి. పరీక్షల ద్వారా నిర్థారణ జరిపే నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 1065 టెస్టింగ్ లాబ్ లు ఉండగా అందులో768 ప్రభుత్వ రంగంలోను, 297 ప్రైవేట్ రంగంలోను ఉన్నాయి. రోజువారీ పరీక్షల సామర్థ్యం కూడా పెరుగుతూ వస్తోంది. నిన్న ఒక్కరోజే 2,29,588 మందికి  కోవిడ్ పరీక్షలు జరిగాయి.

ఇప్పుడు కేంద్ర తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం ఫలితంగా ఇకమీదట కోవిడ్ పరీక్షలకు రిజిస్టర్డ్ డాక్టర్లు ఎవరైనా సిఫార్సు చేయవచ్చు. ఇప్పటిదాకా ప్రభుత్వ డాక్టర్లకు మాత్రమే అవకాశం కల్పించారు. ఈ విషయంలో తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రప్రభుత్వం ఆదేశించింది.  ప్రైవేట్ వైద్యులతో సహా  అర్హులైన వైద్యులందరి ప్రిస్క్రిప్షన్ నూ లెక్కలోకి తీసుకుంటూ  భారత వైద్య పరిశోధనామండలి మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ పరీక్షలు వేగవంతం చేయాలని కోరింది.

పరీక్షించటం, గుర్తించటం, చికిత్స చేయటం అనే త్రిముఖ సూత్రం ద్వారా త్వరగా ఈ సంక్షోభాన్ని నివారించాలని కేంద్ర ప్రభుత్వం మరోమారు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఇందుకోసం కోవిడ్ పరీక్షల లాబ్ లను పూర్తి స్థాయిలో వాడుకోవాలని, ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో దీన్ని పూర్తిగా అమలు జరిగేట్టు చూడాలని  కోరింది. అప్పుడే ప్రజలకు ప్రయోజనాలు చేకూరతాయని అభిప్రాయపడింది.

లాబ్ లు ఏ ఒక్క వ్యక్తికీ పరీక్షలు జరపటంలో ఎంతమాత్రమూ వెనుకంజ వేయకూడదన్న భారత వైద్య పరిశోధనామండలి ఆదేశాల ఫలితం ఎంతగానో ఉండబోతోంది. రాష్ట్రాలు ఎవరికీ ఈ అవకాశం కాదనకూడదని అప్పుడే తొలిదశలోనే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టే వీలుంటుందని మండలి చెప్పటం గమనార్హం.

ఆర్ టి- పిసిఆర్ తో బాటుగా రాపిడ్ యాంటిజెన్ పాయింట్ ఆఫ్ కేర్  పరీక్షల ద్వారా గుర్తించటం పెద్ద ఎత్తున చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం మరోమారు రాష్ట్రాలను కోరింది. రాపిడ్ యాంటిజెన్ పరీక్ష సులువైనది, వేగవంతమైనది, సురక్షితమైనది అని మరోమారు గుర్తు చేసింది. అందుకే కంటెయిన్మెంట్ జోన్లలో వాడాలని భారత వైద్య పరిశోధనామండలి చెప్పటాన్ని ప్రస్తావించింది. ఆ విధంగా ఐ సి ఎం ఆర్ ధ్రువీకరించిన కిట్స్ ఎక్కువగా అందుబాటులో ఉండేట్టు చూడాలని కూడా రాష్ట్రాలకు సూచించింది.

పరీక్షా శిబిరాలు, సంచార వాహనాలు ఏర్పాటు చేయటం ద్వారా ప్రచారోద్యమ తరహాలో పరీక్షలు చేపట్టాలని కూడా కేంద్ర రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. దీనివలన పరీక్షా సౌకర్యం ప్రజల గుమ్మందగ్గరికే వె:ళ్ళినట్టవుతుందని అభిప్రాయపడింది. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా శాంపిల్స్ సేకరణకు, వ్యాధి వ్యాప్తి నివారణకు, పాజిటివ్ అని తేలితే వారినుంచి సంక్రమించే అవకాశమున్నవారిని గుర్తించేందుకు వీలవుతుందని చెప్పింది.

****


(Release ID: 1635996) Visitor Counter : 288