ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ పరీక్షల అవరోధాలన్నీ తొలగించిన కేంద్రం


పరీక్షల వేగం పెంచాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి

Posted On: 01 JUL 2020 8:32PM by PIB Hyderabad

కోవిడ్ పరీక్షలకు అవరోధంగా ఉన్న అన్ని నిబంధనలనూ తొలగించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాలను పరీక్షల వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం  కోరింది. ఆరోగ్య కార్యదర్శి కుమారి ప్రీతి సుడాన్, భారత వైద్య పరిశోధనామండలి  ఐ సి ఎం ఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భగత్ ఈ మేరకు రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. పరీక్షించటం, సోకేవారిని గుర్తించటం, చికిత్స అందించటం అనే కీలకమైన త్రిముఖ వ్యూహం ద్వారా సకాలంలో గుర్తించి ఈ సంక్షోభాన్ని  కట్టడి చేయవచ్చునని పునరుద్ఘాటించారు.

కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్షల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవటాన్ని వారు ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా ప్రైవేటు రంగంలో ఈ పరిస్థితి కనబడుతోందన్నారు. అందుకే రాష్ట్రాలు ఈ విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకొని కోవిడ్ పరీక్షల లాబ్ లను పూర్తి స్థాయిలో వాడుకోవాలని సూచించారు.

అర్హత పొందిన వైద్య సిబ్బంది వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. ఇందుకోసం  ప్రైవేట్ వైద్యుల సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు. ఎవరికి పరీక్షలు చేయించాలో భారత వైద్య పరిశోధనామండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రైవేటు వైద్యులు కూడా సిఫార్సు చేసే అవకాశం కల్పించాలని కోరారు.

భారత్ వైద్య పరిశోధనామండలి మార్గదర్శకాల ప్రకారం లాబ్ లు ఎవరికైనా స్వేచ్ఛగా పరీక్షలు నిర్వహించవచ్చునని మండలి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తొలిదశలోనే వైరస్ బైటపడితే ప్రాణాలు కాపాడే అవకాశం మెరుగ్గా ఉంటుంది కాబట్టి అలా పరీక్షలు చేయించుకునే వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోగూడదని స్పష్టం చేసింది. కోవిడ్ నిర్థారణకు ఆర్ టి - పిసిఆర్ పరీక్ష అత్యుత్తమ ప్రమాణం గనుక ఈ మధ్యనే మండలి కంటెయిన్మెంట్ జోన్లతోబాటు అస్పత్రులలో కూడా రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ను సిఫార్సు చేసింది.  ఈ పరీక్ష సులువైనది, సురక్షితమైనది, వేగవంతమైనది కాబట్టి ఎక్కువగా వాడాలని కూడా కోరింది. పౌరులకు అందుబాటులో ఉండేలా అలాంటి కిట్లు అధికంగా సిఫార్సు చేస్తోంది.  ఇప్పటివరకు కోవిడ్ పరీక్షలకోసం 1,056 లాబ్ లను అనుమతించగా వాటిలో 764 ప్రభుత్వ రంగంలోను, 292 ప్రైవేటు రంగంలోను ఉన్నాయి.

కోవిడ్ పరీక్షలు సులభతర చేసేందుకు ఎక్కువ కేసుల సాంద్రత ఉన్నచోట్ల ప్రచారోద్యమం తరహాలో ప్రత్యేక శిబిరాల ఏర్పాటు, మొబైల్ వాహనాల  వాడకం లాంటి చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. లక్షణాలున్న వారితోబాటు వారి ద్వారా సంక్రమించే అవకాశమున్నవారి శాంపిల్స్ కూడా సేకరించి పరీక్షించాలని సూచించింది. అలాంటి శాంపిల్స్ ను రాపిడ్ యాంటిజెన్ టెస్టుల ద్వారా నిర్థారణకు పూనుకోవాలని చెప్పింది. పాజిటివ్ గా తేలినవారికి చికిత్సా మార్గదర్శకాలకు అనుగుణంగా చికిత్స చేయాలని, నెగటివ్ గా తేలినవారికి ఆర్ టి- పిసిఆర్ పరీక్షలు జరపాలని సూచించింది. ప్రైవేట్ లాబ్ లలో జరిపే ఈ పరీక్షల ధరలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఖరారు చేయాలని కూడా కోరింది. అన్ని లాబ్ లూ తప్పనిసరిగా పరీక్షల సమాచారాన్ని భారత వైద్య పరిశోధనామండలి వారి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయటంతోబాటు వివరాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, జిల్లా అధికారులకు, నగర అధికారులకు అందేలా చూడటం ద్వారా నిఘాకు, సోకే అవకాశం ఉన్నవారిని గుర్తించేందుకు వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. . 

కోవిడ్ పరీక్షల వేగం, సంఖ్య పెంచటంతోబాటుగా వైరస్ సోకే అవకాశమున్నవారిని గుర్తించటంలో కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చొరవ చూపాలని, అప్పుడే వైరస్ ను సమర్థంగా నియంత్రించటం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. గట్టి నిఘా కొనసాగిస్తూ కోవిడ్ ను అరికట్టటంలో అన్ని చర్యలూ తీసుకోవాలని ప్రభుత్వం కోరింది.

 

 

************


(Release ID: 1635775) Visitor Counter : 315