PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
30 JUN 2020 6:23PM by PIB Hyderabad
పత్రికా సమాచార సంస్థ
సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం


(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)



ప్రధానమంత్రి అధ్యక్షతన కోవిడ్-19కు టీకా దిశగా ప్రణాళిక, సన్నద్ధతపై సమీక్ష సమావేశం
కోవిడ్-19 మహమ్మారి నిర్మూలనకు టీకా అందుబాటులోకి రాగానే తదనుగుణంగా ప్రణాళికల రూపకల్పన, సన్నాహకాలపై ప్రధానమంత్రి తన అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. దేశంలోని విస్తృత వైవిధ్య జనాభా దృష్ట్యా ఈ జాతీయ టీకాల కార్యక్రమంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఆ మేరకు వైద్య సరఫరా శృంఖలాల నిర్వహణ, ముప్పు అధికంగా గలవారికి ప్రాధాన్యం, ఈ ప్రక్రియలో భాగం పంచుకునే వివిధ సంస్థల మధ్య సమన్వయంసహా ప్రైవేటురంగం, పౌర సమాజం పాత్ర తదితరాలను కూడా గమనంలో ఉంచుకోవాలని చెప్పారు. జాతీయ స్థాయిలో సాగాల్సిన ఈ కృషికి పునాది వేసే నాలుగు మార్గదర్శక సూత్రాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. మొదటిది... దుర్బలవర్గాలను గుర్తించి టీకాలు త్వరగా వేయడానికి ప్రాధాన్యమివ్వాలి. ఉదాహరణకు॥ వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ముందువరుసలోని వైద్యేతర కరోనా యోధులతోపాటు సామాన్య ప్రజానీకంలో దుర్బలవర్గాలకు అగ్రప్రాధాన్యం ఉండాలి; రెండోది... ప్రాంతాలు-పరిమితులతో నిమిత్తం లేకుండా “ఎవరికైనా, ఎక్కడైనా” టీకాలు వేయడం; మూడోది... టీకాను సరసమైనదిగా, సార్వత్రికంగా ఏ వ్యక్తినీ మినహాయించకుండా అందుబాటులో ఉంచడం; నాలుగోది... ఉత్పత్తి నుంచి టీకా వేసేదాకా వరకు మొత్తం ప్రక్రియపై సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో సకాల పర్యవేక్షణ కొనసాగించడం. మరిన్ని వివరాలకు
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం: 60 శాతాన్ని సమీపిస్తున్న కోలుకునేవారి సంఖ్య; కోలుకున్న-యాక్టివ్ కేసుల తేడా 1.20 లక్షలకు చేరిక
దేశంలో కోవిడ్-19 నియంత్రణ, నిర్వహణ దిశగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా కోలుకుంటున్నవారి సంఖ్య 60 శాతానికి చేరువవుతోంది. ఈ మేరకు చికిత్స పొందుతున్న వారికన్నా కోలుకున్నవారి సంఖ్య ఇవాళ 1,19,696 అధికంగా నమోదవడం ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం 2,15,125 మంది కోవిడ్ బాధితులు చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 3,34,821కి చేరడంతో కోలుకునేవారి శాతం 59.07కు పెరిగింది. వ్యాధి నయమయ్యేవారి సంఖ్య పెరుగుతుండగా గడచిన 24 గంటల్లో 13,099 మంది కోలుకున్నారు. మరోవైపు భారత్‌లో కోవిడ్ ప్రత్యేక ప్రయోగశాలల సంఖ్య 1049కి చేరగా- 761 ప్రభుత్వ రంగంలో, 288 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. మరిన్ని వివరాలకు
దిగ్బంధ విముక్తి 2.0పై దేశీయాంగ శాఖ కొత్త మార్గదర్శకాలు
దేశవ్యాప్తంగా దిగ్బంధం విముక్తి రెండో దశపై దేశీయాంగ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఇందులో భాగంగా నియంత్రణ మండళ్ల వెలుపల అదనంగా కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. కొత్త మార్గదర్శకాలు 2020 జూలై 1 నుంచి అమలులోకి రానుండగా నియంత్రణ మండళ్ల పరిధిలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అందులో నిర్దేశించింది. వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందిన అభిప్రాయాలతోపాటు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలతో విస్తృత సంప్రదింపుల అనంతరం నిన్న ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కాగా, 2020 మే 30న దిగ్బంధం విముక్తి తొలిదశ ఉత్తర్వులు-మార్గదర్శకాలు జారీఅయ్యాయి. వీటికింద నియంత్రణ మండళ్ల వెలుపల ఆధ్యాత్మిక-ప్రార్థన స్థలాలు, హోటళ్లు-రెస్టారెంట్లు ఇతర ఆతిథ్య రంగ సేవలు, షాపింగ్ మాల్స్ వంటివి జూన్ 8 నుంచి తిరిగి తెరవడానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. ఈ నేపథ్యంలో విభిన్న సంస్థల కార్యకలాపాల దిశగా ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ (SOP)లను కూడా నిర్దేశించింది. దేశీయ విమాన-ప్రయాణిక రైళ్ల పరిమిత నిర్వహణకు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఇకపై వాటి రాకపోకలను దశలవారీగా మరింత పెంచుతారు. రాత్రి కర్ఫ్యూ వేళలను మరింత సడలించి రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని శిక్షణ సంస్థలు జూలై 15 నుంచి పని చేసేందుకు అనుమతిస్తారు. దీనికి సంబంధించి కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వశాఖ ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ (SOP)లను జారీచేయనుంది. ఇక రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో విస్తృతంగా చర్చించిన మేరకు- పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్ల మూసివేతను జూలై 31వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, నియంత్రణ మండళ్ల పరిధిలో మాత్రం 2020 జూలై 31వరకూ దిగ్బంధం యథాతథంగా కొనసాగుతుంది. మరిన్ని వివరాలకు
కోవిడ్ యోధులు: పోరులో ముందువరుసన 1.6లక్షల మంది ఆశా కార్యకర్తలు; ఉత్తరప్రదేశ్‌కు తిరిగివచ్చిన 30.43 లక్షల వలసకార్మికులపై పర్యవేక్షణ
దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల ఒకవైపు, తీవ్ర ముప్పున్న ప్రాంతాల నుంచి సొంత రాష్ట్రాలకు వెల్లువెత్తే వలస కార్మికులు మరోవైపు... ఈ పరిస్థితుల నడుమ వారందరి ఆరోగ్య సంరక్షణ అవసరాలు చూడటంతోపాటు గ్రామీణ జనాభాలో వ్యాధి వ్యాప్తి నిరోధం ఉత్తరప్రదేశ్‌లో పెనుసవాలుగా మారింది. అయితే, కోవిడ్-19 నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ కృషికితోడు ఈ సంక్షోభ సమయంలో ఆశా (ASHA) కార్యకర్తలు కీలకపాత్ర పోషించారు. తదనుగుణంగా మొత్తం 1.6 లక్షల మంది రెండు దశల్లో 30.43 లక్షల మంది వలసకార్మికులను పర్యవేక్షించారు. ఈ మేరకు తొలిదశకింద 11.24 లక్షల మంది, రెండో దశలో 19.19 లక్షల మందిని పర్యవేక్షించారు. తద్వారా రోగులతో సంబంధాలున్నవారి అన్వేషణ, వ్యాధి సామాజిక వ్యాప్తి నియంత్రణలో ఎంతగానో తోడ్పడ్డారు. మరిన్ని వివరాలకు
జాతినుద్దేశించి ఇవాళ ప్రధాని ప్రసంగం; ‘ప్రధానమంత్రి గరీబ్‌కల్యాణ్ అన్న యోజన’ను నవంబరు చివరిదాకా పొడిగిస్తున్నట్లు ప్రకటన
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా- ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న (ఆహార) యోజన’ను నవంబరు చివరిదాకా పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దిగ్బంధం సమయంలో పేదలకు ఆహార కొరత లేకుండా చూడటానికి దేశం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధాని నొక్కి చెప్పారు. ఆ మేరకు దిగ్బంధం విధింపు ప్రకటన జారీచేయగానే ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ను అమలులోకి తెచ్చిందని గుర్తుచేశారు. దీనికింద పేదల కోసం రూ.1.75 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించామని పేర్కొన్నారు. తదనుగుణంగా గడచిన మూడు నెలల్లో దాదాపు 20 కోట్ల మంది పేద కుటుంబాల జన ధన్ ఖాతాల్లో రూ.31 వేల కోట్లు, 9 కోట్ల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.18 వేల కోట్లు బదిలీ అయ్యాయని తెలిపారు. అలాగే ‘పీఎం గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన’ కింద రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ మేరకు ఉపాధి అవకాశాల కల్పన ఇప్పటికే మొదలైందని ఆయన వివరించారు. మరిన్ని వివరాలకు
జాతినుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
మరిన్ని వివరాలకు
‘ఈసీఎల్‌జీఎస్’ కింద రూ.లక్ష కోట్ల విలువైన రుణమంజూరు
ప్రభుత్వ పూచీకత్తుగల ‘వందశాతం అత్యవసర రుణవసతి హామీ పథకం (ECLGS) కింద ప్రభుత్వ-ప్రైవేటురంగ బ్యాంకులు 2020 జూన్ 26దాకా దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన రుణాలను మంజూరు చేశాయి. ఇందులో రూ.45,000 కోట్లకుపైగా మొత్తం ఇప్పటికే రుణగ్రహీతలకు విడుదలైంది. దీనివల్ల దిగ్బంధం వల్ల మూతపడిన ఎంఎస్‌ఎంఈ సంస్థలుసహా ఇతర వ్యాపార యాజమాన్యాలు తమ కార్యకలాపాలను పునఃప్రారంభించే వీలు కలుగుతుంది. మరిన్ని వివరాలకు
కోవిడ్-19 పరీక్ష కోసం ఎన్‌బీఆర్‌ఐ అత్యాధునిక వైరాలజీ ప్రయోగశాల ఏర్పాటు
కోవిడ్-19 నమూనాల పరీక్షల కోసం లక్నోలోని ‘నేషనల్ బొటానికల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్’ (NBRI) ‘అత్యాధునిక వైరాలజీ ప్రయోగశాల’ను ఏర్పాటు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, భారత వైద్య పరిశోధన మండలి (ICMR) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రయోగశాల ఏర్పాటైంది. ఇది ‘బయోసేఫ్టీ లెవెల్’ (BSL) మూడోస్థాయి ప్రయోగశాల కావడం గమనార్హం. ఈ అత్యాధునిక ప్రయోగశాల ‘ప్రతికూల బలం’ ప్రధానంగా పనిచేస్తుంది. ఈ మేరకు గాలిలోని అతిసూక్ష్మ పరమాణువులను కూడా ఇది పీల్చుకుని వడపోత ఉపకరణాలద్వారా పంపుతుంది. చివరకు వైరస్, బ్యాక్టీరియాలను కూడా వడపోయగలిగే సామర్థ్యం ఉన్నందున కోవిడ్-19 పరీక్షల్లో ఈ ప్రయోగశాల వినియోగం అత్యంత సురక్షితమని చెప్పవచ్చు. ఆ మేరకు వైరస్ వృద్ధి ప్రయోగాల సమయంలో వ్యాధి సంక్రమణ ముప్పును ఇది తగ్గిస్తుంది. మరిన్ని వివరాలకు
‘స్వయం సమృద్ధ భారతం, గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన’కు నైపుణ్యాభివృద్ధి వెన్నెముక వంటిది: డాక్టర్ మహేంద్రనాథ్ పాండే
కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే నిన్న ఒక వెబినార్‌లో ప్రసంగించారు. భారత కార్మికశక్తికి నైపుణ్య కల్పన- ఉన్నతీకరణ, పునఃనైపుణ్య సాధనలే ప్రభుత్వం నిర్దేశించుకున్న దార్శనిక పథకాలు ‘స్వయం సమృద్ధ భారతం’, ఇటీవలే ప్రకటించిన ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన’ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. “కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి నేపథ్యంలోఓ మనం వినూత్న పద్ధతులతో ముందుకెళ్లాలి. ప్రత్యేకించి పారిశ్రామిక రంగంలో సార్వజనీన ఆలోచనధోరణిసహా వ్యాపార నిర్వహణలో భారీ సానుకూల మార్పులు చేసుకోవడం అత్యవసరం. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానానికి మనం అధిక ప్రాముఖ్యం ఇస్తున్నందున ఈ దిశగా ముందడుగు వేయాలి” అని మంత్రి అభిప్రాయపడ్డారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1635180
కోవిడ్-19 అనంతర ఆర్థిక పునరుత్తేజానికి పరిశుభ్రత ఇంధనం ఆలంబన
“పరిశుభ్ర ఇంధన ఆర్థికవ్యవస్థ: ఈ దిశగా భారత ఇంధన-వాహన రంగాల్లో కోవిడ్-19 అనంతర అవకాశాలు” పేరిట నీతి ఆయోగ్, రాకీ మౌంటెయిన్ ఇన్‌స్టిట్యూట్ (RMI) ఒక నివేదికను విడుదల చేశాయి. భారతదేశం కోసం చౌకైన, ప్రతినిరోధక, పరిశుభ్ర ఇంధన భవిష్యత్ నిర్మాణంవైపు కృషికి తగిన ఉద్దీపన, పునరుత్తేజం అవసరాన్ని ఈ నివేదిక సూచిస్తోంది. ఈ మేరకు విద్యుత్ వాహనాలు, ఇంధనశక్తి నిల్వ, పునరుపయోగ విద్యుత్ కార్యక్రమాలు వంటివి ఇందులో భాగంగా ఉంటాయని పేర్కొంది. భారతదేశంలో పరిశుభ్ర ఇంధన పరివర్తనపై కోవిడ్-19 ప్రభావం- ప్రత్యేకించి... రవాణా, విద్యుత్ రంగాలపై ఏ మేరకు ఉంటుందో ఈ నివేదిక అంచనా వేసింది. అలాగే ఆర్థిక పునరుత్తేజ సాధన దిశగా దేశాన్ని నడపడంతోపాటు పరిశుభ్ర ఇంధన ఆర్థిక వ్యవస్థవైపు వేగాన్ని కొనసాగించడంలో దేశ నాయకులకుగల వ్యూహాత్మక అవకాశాలు, సూత్రాలను సిఫారసు చేసింది. అంతేకాకుండా ద్రవ్యలభ్యతకు ఆటంకాలు, సరఫరా కొరతల నుంచి వినియోగదారు అభిరుచులు, గిరాకీలో మార్పులదాకా భారత రవాణా, విద్యుత్ రంగాల్లో గిరాకీ-సరఫరావైపు ఎదురయ్యే సవాళ్లను కోవిడ్-19 ప్రస్ఫుటం చేసిందని పేర్కొంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1635298
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖతో 15వ ఆర్థిక సంఘం సమావేశం
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖతో శ్రీ ఎన్.కె.సింగ్ అధ్యక్షతనగల ఆర్థిక సంఘం విస్తృత సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల నడుమ విద్యారంగంలో ఇతర సాంకేతికతల వినియోగం, ఆన్‌లైన్ తరగతులుసహా కొత్త బోధనోపకరణాల ప్రభావంపై ప్రధానంగా చర్చించింది. ప్రత్యేకించి కోవిడ్-19 నేపథ్యంలో 2020-21 నుంచి 2025-26వరకూ విద్యారంగ అంశంపై తన నివేదికలో సిఫారసులను పొందుపరచడం కోసం ఆర్థిక సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాలకు
‘పీఎం స్వానిధి’ (ప్రయోగాత్మక) పోర్టల్ ప్రారంభం
‘ప్రధానమంత్రి వీధి వ్యాపారుల స్వావలంబన నిధి’ (PMSVANidhi) కి సంబంధించిన ప్రయోగాత్మక పోర్టల్‌ను కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ దుర్గాశంకర్ మిశ్రా నిన్న ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రత్యక్షంగా ప్రయోజనం పొందడానికి వీలుగా డిజిటల్ సాంకేతిక పరిష్కారాల సాయంతో పనిచేసే ఈ సమాచార సాంకేతిక పోర్టల్ లబ్ధిదారులకు తోడ్పడుతుంది. మరిన్ని వివరాలకు
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
రాష్ట్రంలో గత 24 గంటల్లో 5,257 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1,69,883కు పెరిగింది. కాగా, సోమవారం 21 మరణాలు సంభవించగా, 391మంది కోలుకోవడంతో ఇప్పటివరకూ వ్యాధి నయమైన వారి సంఖ్య 88,960కి చేరింది. ప్రస్తుతం 73,298 మంది చికిత్స పొందుతున్నారు. ఇక గ్రేటర్ ముంబై ప్రాంతంలో 1,247 కొత్త కేసులతో మొత్తం కేసులు 76,294కు పెరిగాయి. మరోవైపు వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు/సంస్థలు, హైకోర్టు, ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులను శివారు రైళ్లలో ప్రయాణానికి అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖను కోరింది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 626 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 32,023కు చేరింది. అలాగే 19మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 1,828కి పెరిగింది. గుజరాత్‌లో జూలై్ 1 నుంచి రాత్రి 8 గంటలవరకు దుకాణాలను తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే హోటళ్లు-రెస్టారెంట్లు రాత్రి 9 గంటలవరకు తెరిచి ఉంటాయి. రాష్ట్రంలోని దిగువ కోర్టులు రేపటినుంచి పని ప్రారంభించనుండగా దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా మాత్రమే విచారణ జరుగుతుంది.
రాష్ట్రంలో ఇవాళ 94 కొత్త కేసులు నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 17,753కు పెరిగింది. యాక్టివ్ కేసులు 3,397గా ఉన్నాయి. రాజస్థాన్‌లో ఇప్పటిదాకా 13,948 మంది కోలుకోగా 409 మరణాలు సంభవించాయి. ఇవాళ్టి కొత్త కేసుల్లో అధికశాతం సికార్ జిల్లా (33)లో నమోదవగా, అల్వార్ జిల్లా (22) రెండోస్థానంలో ఉంది.
రాష్ట్రంలో నిన్న 184 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 13,370కి చేరింది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం 2607 యాక్టివ్ కేసులుండగా కోలుకున్న రోగుల సంఖ్య 10,199గా ఉంది. కొత్త కేసులలో 24 మొరెనా జిల్లాలో, 19 సాగర్ జిల్లాలో నమోదయ్యాయి.
రాష్ట్రంలో సోమవారం 101 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 2,795కు చేరాయి. వీటిలో 632 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసులలో అత్యధికంగా దుర్గ్ (30), జాష్పూర్ (25) జిల్లాల్లో నమోదవగా 10 కేసులతో రాయ్‌పూర్ మూడో స్థానంలో ఉంది.
గోవాలో 53 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,251కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 724 యాక్టివ్ కేసులున్నాయి. సోమవారం 46 మంది కోలుకోగా, ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 524కు పెరిగింది.
రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో 76 ఏళ్ల వ్యక్తి శనివారం వైద్యకళాశాల ఆస్పత్రిలో తుదిశ్వాస విడవడంతో కేరళలో కోవిడ్-19కు మరొకరు బలయ్యారు. ముంబై నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు వైరస్ బారినపడిన నేపథ్యంలో ఇవాళ వెలువడిన రోగ నిర్ధారణ పరీక్ష ఫలితాల్లో వ్యాధి నయమైనట్లు తేలింది. ఇది రాజధానిలో నాలుగో కోవిడ్ మరణం కాగా, రాష్ట్రంలో 24వది కావడం గమనార్హం. దిగ్బంధంవల్ల నిలిపివేసిన అభ్యసన డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను రేపటినుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. రాష్ట్రంలో నిన్న 121 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం 2,057 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 1,80,617 మంది నిఘాలో ఉన్నారు.
రాష్ట్ర రాజధాని చెన్నైతోపాటు మదురై నగరంలో జూలై 5వరకు దిగ్బంధాన్ని కఠినంగా అమలు చేస్తారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల మేరకు ప్రస్తుత సడలింపులు- ఆంక్షలు జూలై 31వరకు అమలవుతాయి. కాగా, ఐసీఎంఆర్ సూచించిన సత్వర-యాంటిజెన్ పరీక్షా సామగ్రి సున్నితత్వం తక్కువగా ఉన్నందున దాన్ని వినియోగించరాదని, రోగ నిర్ధారణకు ఆర్టీ-పీసీఆర్ పద్ధతినే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నిన్న 3949 కొత్త కేసుల నమోదుతోపాటు 2212 మంది కోలుకోగా 62 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు: 86224, యాక్టివ్ కేసులు: 37331, మరణాలు: 1141, డిశ్చార్జెస్: 45537, చెన్నైలో యాక్టివ్ కేసులు: 21681గా ఉన్నాయి.
ఉద్యోగార్థులకు తోడ్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం 'స్కిల్ కనెక్ట్' ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది; దీంతోపాటు మహమ్మారివల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి సహాయపడే దిశగా జూలై 7న ప్రభుత్వం కూడా ఆన్‌లైన్ ఉద్యోగ మేళాను నిర్వహించనుంది. కాగా, కోవిడ్ రోగులకు చికిత్స కోసం బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రులలో 50 శాతం (4500)పడకలు కేటాయించేందుకు యాజమాన్యాలు అంగీకరించినట్లు వారితో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులకు వివరించారు. మరోవైపు రాష్ట్రంలో వరుసగా రెండోరోజు నిన్న 1000కిపైగా... అంటే 1105 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 176మంది డిశ్చార్జి కాగా, 19మంది మరణించారు. మొత్తం కేసులు: 14295, యాక్టివ్ కేసులు: 6382, మరణాలు: 226, డిశ్చార్జి అయినవి: 7684గా ఉన్నాయి.
కర్ణాటక, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ మార్గాల్లో పన్ను మాఫీ చేయాలని, పూర్తి బీమా ప్రీమియం చెల్లించాలని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కోవిడ్-19 నేపథ్యంలో దిగ్బంధంవల్ల తాము త్రైమాసిక (ఏప్రిల్-జూన్) పన్ను చెల్లించలేని స్థితిలో ఉన్నామని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 18,114 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో 704 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు 258 మంది డిశ్చార్జ్ కాగా, ఏడుగురు మరణించారు. కొత్త కేసులలో 51 అంతర్రాష్ట్ర వాసులుకాగా, ఐదు విదేశాల నుంచి వచ్చినవారికి చెందినవి. మొత్తం కేసులు: 14,595, యాక్టివ్ కేసులు: 7897, మరణాలు: 187, డిశ్చార్జ్: 6511గా ఉన్నాయి.
హైదరాబాద్ పాత నగరంలోని అనేక ప్రాంతాల్లో స్వీయ-నిర్బంధవైద్య పరిశీలనపై మిశ్రమ స్పందన కనిపించింది. వైరస్ కట్టడిదిశగా ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. తెలంగాణలో నిన్నటిదాకా నమోదైన మొత్తం కేసులు: 15394, యాక్టివ్ కేసులు: 9559, మరణాలు: 253, డిశ్చార్జి కేసులు: 5582గా ఉన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 49,882 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా, 1227 కొత్త కేసులు నమోదయ్యాయి. మణిపూర్‌లోని హియాంగ్లాం-వాబగై టెరాపిషక్ కీథెల్వద్ద మాదక ద్రవ్యాలు-ఆల్కహాల్ వ్యతిరేక ఉద్యమ కూటమి (CADA) కోవిడ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది.
అసోం(గువహటి) నుంచి రాష్ట్రానికి వచ్చిన మరో వ్యక్తికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 52కు చేరగా, ప్రస్తుతం 9 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసులలో 80శాతానికిపైగా కోలుకున్నారు. మిజోరంలో ప్రస్తుతం 29 యాక్టివ్ కేసులుండగా కోలుకున్నవారిలో 61మంది ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇవాళ 8 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 459కి చేరాయి. వీటిలో 291 యాక్టివ్ కేసులుండగా 168 మంది కోలుకున్నారు. కాగా, నాగాలాండ్‌లోని మోకోక్చుంగ్ జిల్లాలో ఇవాళ తొలి కేసు నమోదైంది.


********
(Release ID: 1635518)
Visitor Counter : 287