ప్రధాన మంత్రి కార్యాలయం
జాతి నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, "ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన" పధకాన్ని పొడిగించినట్లు ప్రకటించారు
ఈ పథకం దీపావళి, చాత్ పూజ వరకు అంటే నవంబర్ చివరి వరకు పొడిగించబడింది : ప్రధానమంత్రి
ఒక్కో కుటుంబానికీ ఒక కిలో శనగలు తో పాటు, ఒక కుటుంబంలోని ప్రతి సభ్యునికి 5 కిలోల చొప్పున గోధుమలు లేదా బియ్యం, మొత్తం 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ప్రతీ నెలా, ఉచితంగా అందించబడుతుంది
ఈ పథకాన్ని సాధ్యం చేసినందుకు, కష్టపడి పనిచేసే రైతులు మరియు నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులను ప్రధానమంత్రి అభినందించారు
కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాటం అన్ లాక్ 2 దశకి మారినందున, లాక్ డౌన్ సమయంలో పాటించినంత తీవ్రతతో నిబంధనలను పాటించాలని ప్రధానమంత్రి ప్రతి ఒక్కరినీ కోరారు
Posted On:
30 JUN 2020 4:24PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ, "ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన" పధకాన్ని నవంబరు చివరి వరకు పొడిగించినట్లు ప్రకటించారు.
పేదలకు చేయూత
లాక్ డౌన్ సమయంలో అవసరమైన వారికి ఆహారాన్ని అందించడం దేశం యొక్క ప్రధమ ప్రాధాన్యత అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే, ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను తీసుకువచ్చింది, దీని కింద పేదలకు 1.75 లక్షల కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజీని ప్రకటించింది.
గత మూడు నెలల్లో దాదాపు 20 కోట్ల పేద కుటుంబాల జన ధన్ ఖాతాల్లో 31 వేల కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లు ఆయన చెప్పారు. 9 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాలకు 18 వేల కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లు చెప్పారు. ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన నవంబర్ వరకు పొడిగింపు :
80 కోట్లకు పైగా ప్రజలకు మూడు నెలల పాటు ఉచిత రేషన్ అందించే నిర్ణయం యొక్క తీవ్రత, అంటే కుటుంబంలోని ప్రతి సభ్యునికి 5 కిలోల ఉచిత బియ్యం / గోధుమలను అందించడంతో పాటు, ప్రతి కుటుంబానికి 1 కిలోల పప్పులను నెలకు అందించడం, మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉచిత రేషన్ అందుకున్న వారి సంఖ్య అనేక పెద్ద దేశాల జనాభా కంటే చాలా రెట్లు ఎక్కువ అని ఆయన అన్నారు.
వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యవసాయ రంగంలోనే ఎక్కువ పనులు జరుగుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే, గురు పూర్ణిమ, రక్షాబంధన్, శ్రీ కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, ఓనం, దసరా, దీపావళి, చ్ఛాత్ పూజలతో పాటు అనేక పండుగలు ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. ఈ సమయంలో పెరిగే అవసరాలు, ఖర్చులను దృష్టిలో ఉంచుకుని, "ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన" పధకాన్ని దీపావళి మరియు చాత్ పూజ వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు, ఆయన ప్రకటించారు, అంటే, జూలై నుండి నవంబర్ చివరి వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. ఈ ఐదు నెలల కాలంలో 80 కోట్ల మందికి పైగా ప్రజలకు నెలకు 5 కిలోల గోధుమలు లేదా బియ్యం ఉచితంగా అందించబడుతుంది. ఒక కుటుంబంలోని ప్రతి సభ్యునికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం లేదా గోధుమలను అందించడంతో పాటు, ప్రతి కుటుంబానికి నెలకు 1 కిలో శనగలు కూడా ఉచితంగా అందించబడుతుంది.
ఈ పథకం పొడిగింపు కోసం ప్రభుత్వం 90,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. దీనికి, గత మూడు నెలల్లో ఖర్చు చేసిన మొత్తాన్ని కలిపితే, ఈ పథకం కోసం మొత్తం 1.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అవుతుందని ప్రధానమంత్రి తెలియజేశారు. ఉచిత ఆహార ధాన్యాలు సేకరించడం, పంపిణీ చేయడం, ప్రభుత్వం వల్ల సాధ్యపడిందంటే ఆ ఘనత, కష్టపడి పనిచేసే రైతులకు, నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు చెందుతుందని పేర్కొంటూ, ప్రధానమంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పేదలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ‘ఒక దేశం, ఒక రేషన్ కార్డు’ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.
అన్ లాక్ - 2 సమయంలో మరింత సురక్షితంగా ఉండాలి :
కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాటం అన్ లాక్ 2 దశకు మారే సమయంలో వాతావరణంలో కూడా మార్పు వస్తోందనీ, దీనివల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందనీ, ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని, ఆయన కోరారు. లాక్ డౌన్ వంటి నిర్ణయాలను సకాలంలో తీసుకోవడం వల్ల లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడ గలిగామనీ, మన దేశంలో మరణాల రేటు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే చాలా తక్కువగా ఉందని ఆయన చెప్పారు. అయితే, అన్ లాక్-1 సమయంలో బాధ్యతా రహితమైన మరియు నిర్లక్ష్య ప్రవర్తన పెరిగిందని ఆయన అన్నారు. ఇంతకు ముందు ప్రజలు, మాస్క్ ధరించడం, పగటిపూట ఎక్కువ సార్లు 20 సెకన్ల కన్నా ఎక్కువ సేపు చేతులు కడుక్కోవడంతో పాటు "దో గజ్ దూరీ" ని ఖచ్చితంగా పాటించి, మరింత జాగ్రత్తగా ఉండేవారని, ఆయన చెప్పారు. మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్న ఈ సమయంలో, నిర్లక్ష్యం పెరగడం ఆందోళన కలిగించే విషయమని, ఆయన నొక్కి చెప్పారు.
లాక్ డౌన్ సమయంలో, ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్లలో ఏ తీవ్రతతో నిబంధనలు పాటించామో, ఇప్పుడు కూడా అదే అప్రమత్తత తో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి నియమ నిబంధనలను పాటించని వారికి అవగాహన కల్పించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశంలో మాస్క్ ధరించనందుకు ఒక దేశ ప్రధానమంత్రికి 13,000 రూపాయల జరిమానా విధించిన ఉదాహరణను వారికి చెప్పాలని సూచించారు. భారతదేశంలో స్థానిక పరిపాలన అదే హెచ్చరికతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ప్రధానమంత్రితో సహా ఎవరూ చట్ట నియమాలకు అతీతులు కారని ఆయన పేర్కొన్నారు.
ముందు చూపుతో
రాబోయే కాలంలో పేదలు మరియు ఇతర అవసరాలున్న వారికి సాధికారత కల్పించడానికి, ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆర్థిక కార్యకలాపాలను కూడా మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. ఆత్మ నిర్భర్ భారత్ వైపు పనిచేయాలనీ, స్థానికత కోసం మాట్లాడాలని ప్రతిజ్ఞ చేయాలనీ ఆయన పునరుద్ఘాటించారు, అదే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, మాస్క్ లేదా ఫేస్ కవర్ ఉపయోగించదాంతో పాటు "దో గజ్ దూరీ" పాటించే మంత్రాన్ని అనుసరించాలనీ, ఆయన ప్రజలను కోరారు.
*****
(Release ID: 1635482)
Visitor Counter : 405
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam