ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనపై, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
30 JUN 2020 4:28PM by PIB Hyderabad
ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం!
మనం కరొనా మహమ్మారిపై పోరాటంలో ఇప్పుడు అన్‌లాక్ - రెండో దశలోకి ప్రవేశిస్తున్నాం. అలాగే మనం దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలుగల వారి సంఖ్య పెరిగే సీజన్‌లోకీ ప్రవేశిస్తున్నాం. అందువల్ల మీ గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిందిగా నేను మిమ్మలనందరినీ కొరుకుంటున్నాను.
మిత్రులారా,
కరోనా మరణాల రేటును పరిశీలించి చూసినపుడు , ప్రపంచంలోని ఎన్నో ఇతర దేశాల కంటే మనదేశం మెరుగైన పరిస్థితిలో ఉంది.సకాలంలో లాక్‌డౌన్ విధించడం, ప్రభుత్వం తీసుకున్న పలు ఇతర నిర్ణాయాలు, లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయి. అయితే అన్‌లాక్ -1 నుంచి , వ్యక్తిగత స్థాయిలో , సామాజిక ప్రవర్తనలో నిర్లక్ష్యం పెరిగిపొతుండడాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం. ఇంతకు ముందు మనం మాస్క్‌లు ధరించే విషయంలో, సామాజిక దూరం పాటించడంలో , 20 సెకన్ల పాటు చేతులు శుభ్రంగా కడుగుకోవడంలో ఎంతో జాగ్రత్తగా ఉండేవాళ్లం. కానీ ఇవాళ, మనం మరింత జాగ్రత్తగా ఉండవలసిన సమయంలో , పెరుగుతున్న నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోంది.
మిత్రులారా,
లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు చాలా ఖచ్చితంగా పాటించారు. ప్రస్తుతం ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, పౌరులు అలాంటి అప్రమత్తతనే చూపాల్సి ఉంది. ప్రత్యేకించి మనం కంటైన్‌మెంట్ జోన్లపై మరింత దృష్టిపెట్టాలి. నిబంధనలు పాటించని వారిని ఆపి వారిని హెచ్చరించాల్సి ఉంది. మీరు వార్తలలో చూసే ఉంటారు. బహిరంగ ప్రదేశంలో మాస్క్ ధరించనందుకు ఒక దేశ ప్రధానమంత్రికి 13 వేల రూపాయల జరిమానా విధించిన వార్త. ఇండియాలో కూడా స్థానిక పాలనా యంత్రాంగాలు ఇలాంటి స్ఫూర్తితో పనిచేయాలి. 130 కోట్ల మంది దేశ ప్రజల ప్రాణాలు పరిరక్షించేందుకు చేపడుతున్నకార్యక్రమం ఇది . గ్రామప్రధాన్ కానీ లేదా ప్రధానమంత్రి కానీ ఇండియాలో చట్టానికి ఎవరూ అతీతులు కారు.
మిత్రులారా,
లాక్‌డౌన్ సమయంలో దేశం ముందున్న ప్రాధాన్యత, ఎవరూ ఆకలితో ఉండరాదన్నది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు, పౌరసమాజం తమ శక్తిమేరకు ఎవరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడకుండా కృషి చేశాయి.దేశం కాని, వ్యక్తిగాని తగిన సమయంలో , సరైన నిర్ణయాలు తీసుకుంటే అది సంక్షోభాలను ఎదుర్కోవడంలో మన శక్తిని మరింత పెంచుతుంది. లాక్‌డౌన్ విధించిన వెంటనే ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద పేదలకు రూ 1.75 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది.
మిత్రులారా,
గత మూడు నెలల్లో, 20 కోట్ల కుటుంబాలు ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ 31 ,000 కోట్ల రూపాయలు అందుకున్నాయి. ఈ సమయంలోనే 9 కోట్ల మంది రైతుల ఖాతాలలో రూ 18,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ పథకాన్ని వెంటనే ప్రారంభించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలోని శ్రామికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకం కింద రూ 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది.
మిత్రులారా,
ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరచిన మరో పెద్ద విషయం ఒకటి ఉంది. అదేమంటే, దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు మూడు నెలల పాటు ఉచితంగా రేషన్ ఇవ్వడం జరిగింది. అంటే కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 5 కిలోల గోధుమలు లేదా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దానికి తోడు ప్రతి కుటుంబానికి నెలకు ఒక కిలొ పప్పు ధాన్యాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా అమెరికా జనాభాకు 2.5 రెట్ల జనాభాకు, యునైటెడ్ కింగ్‌డమ్ జనాభాకు 12 రెట్లు, యూరోపియన్ యూనియన్ జనాభాకు రెట్టింపు జనాభాకు మన ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందజేసింది.
మిత్రులారా,
ఈరోజు నేను దీనికి సంబంధించి ఒక పెద్ద ప్రకటన చేయబోతున్నాను. మిత్రులారా , మన దేశంలో వర్షాకాలంలో , ఆ తర్వాత వ్యవసాయ రంగంలో ఎన్నో కార్యకలాపాలు సాగుతుంటాయి. ఇతర రంగాలలో పెద్దగా కార్యకలాపాలు ఉండవు.జులై నెల పండగలు ప్రారంభమయ్యే నెల కూడా. జూలై 5న గురుపూర్ణిమ, శ్రావణ మాసం కూడా ప్రారంభం కాబోతోంది. ఆగస్టు 15 వస్తోంది. రక్షాబంధన్, శ్రీ కృష్ణ జన్మాష్టమి, గణేశ్ చతుర్థి, ఓనమ్ ఇలా పండుగలు రానున్నాయి. ఆ తర్వాత కటిబిహు, నవరాత్రి, దుర్గా పూజ రానున్నాయి. అటునుంచి దశరా, దీపావళి, చాత్ రానున్నాయి.పండగ సీజన్ లో అవసరాలు,ఖర్చులు పెరుగుతాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన ను దీపావళి , ఛాత్‌పూజ, నవంబర్ ఆఖరు వరకు పొడిగించాలని నిర్ణయించడం జరిగింది.
అంటే, ఈ పథకం కింద దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉచిత రేషన్ పొందుతారు. ప్రభుత్వం పేద సోదర, సోదరీమణులకు ఉచితంగా 5 నెలల పాటు ఉచిత రేషన్ ను అందజేస్తుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ 5 కిలొల గోధుమలు లేదా బియ్యం పొందుతారు. అంతేకాదు, ప్రతి కుటుంబం ఒక కిలో శనగలు ప్రతినెలా ఉచితంగా పొందుతుంది.
మిత్రులారా, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం పొడిగింపుపై 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ పథకంపై గత మూడు నెలలుగా పెట్టిన ఖర్చును కూడా కలుపుకున్నట్టయితే అది సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయల వరకూ ఉంటుంది.
మనం, దేశం మొత్తం కోసం ఒక కలగన్నాం. కొన్ని రాష్ట్రాలు ఇందుకు అద్భుతంగా పని చేశాయి. దీనిని మరింత ముందుకు తీసుకు వెళ్ళాల్సిందిగా మిగతా రాష్ట్రాలను కూడా కోరుతున్నాము. ఇంతకీ అదేమిటంటారు, ఇప్పుడు ఒక దేశం, ఒక రేషన్ కార్డు కార్యక్రమం కూడా అమలు జరుగుతున్నది. దీనివల్ల ప్రధానంగా లబ్ధి పొందేది ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు.
మిత్రులారా, ప్రభుత్వం పేదలకు,అవసరం ఉన్నవారికి ఉచితంగా రేషన్ అందజేయగల స్థితిలో ఉందంటే, ఆ గొప్పతనం రెండు వర్గాల వారికి వెళుతుంది. మొదటిది- దేశంలో కష్టపడి పనిచేస్తున్న రైతులకు, ఇక రెండవది- దేశంలో నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు. మీ కఠోర శ్రమ, చిత్తశుద్ది వల్లే దేశం ఈ పని చేయగలుగుతోంది.మీరు దేశ ధాన్యాగారాలను నింపారు.అందువల్ల పేదలు, శ్రామికుల వంటగదులలో ఆహారం ఉంది. మీరు నిజాయితీగా పన్నులు చెల్లించారు. మీ బాధ్యతను మీరు నెరవేర్చారు. అందువల్ల దేశంలోని పేద ప్రజలు ఇంతటి పెద్ద సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కొగలుగుతున్నారు.. దేశంలోని పేద ప్రజలందరి తరఫున నేను పన్ను చెల్లింపుదారులకు, రైతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారికి శాల్యూట్ చేస్తున్నాను.
మిత్రులారా! రాగల రోజులలో మనం మన కృషిని మరింత బలోపేతం చేస్తాం, అలాగే పేదలు, సమాజంలోని అణగారినవారు, అట్టడుగు వర్గాల వారికి సాధికారత కల్పించేందుకు కృషి కొనసాగిస్తాం. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ మన ఆర్థిక కార్యకలాపాలను మరింత విస్తరిస్తాం. ఆత్మనిర్భర భారత్ సాధనకు మనం నిరంతరాయంగా పనిచేస్తాం. మనం స్థానిక వస్తువుల వినియోగ ఆవశ్యకత గురించి, ఓకల్ ఫర్ లోకల్ ను బలంగా వినిపిస్తాం. ఈ రకమైన ప్రతిజ్ఞ పట్టుదలతో దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు కలసికట్టుగా కృషిచేస్తూ సమష్టిగా ముందుకు సాగవలసి ఉంది.
నేను మీ అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మీ కోసం ప్రార్థిస్తున్నాను, మీ అందరినీ కోరుతున్నాను, మీరంతా ఆరోగ్యంగా ఉండండి, రెండు గజాల దూరం పాటించండి, ఎల్లప్పుడూ గమ్చాను వాడండి , ముఖానికి తొడుగు, మాస్క్ ధరించండి ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి ఈ విజ్ఞాపన చేస్తూ , మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను!
*****
(Release ID: 1635464)
Visitor Counter : 394
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam